Marijuana: గంజాయిని బహిరంగంగా అమ్మేందుకు రంగం సిద్ధమవుతోందా?

గంజాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, మాన్సీ దాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గంజాయి వాడకాన్ని ఇప్పుడు అనేక దేశాల్లో చట్టబద్ధం చేస్తున్నారు.

గంజాయి వాడకాన్ని నేరాల జాబితా నుంచి తొలగించే ఒక ముఖ్యమైన బిల్లును అమెరికా ఈ ఏడాది ప్రవేశపెట్టింది.

అమెరికాలో మారివానా ఆపర్చ్యునిటీ రీఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పంజ్మెంట్ (మోర్) చట్టం కింద తొలిసారిగా జాతీయ స్థాయిలో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసే బిల్లును 2020 డిసెంబర్‌లో కాంగ్రెస్ (అమెరికా పార్లెమెంటు)లో ప్రవేశపెట్టారు.

అయితే, దీనికి సెనేట్ ఆమోదముద్ర లభించలేదు.

ఇటీవల మెక్సికోలో వినోదపరమైన అవసరాలకు గంజాయి వాడకాన్ని చట్టవిరుద్ధమైన నేరాల జాబితా నుంచి తొలగించారు.

ఉరుగ్వే 2013లో, దక్షిణాఫ్రికా 2018లో, కెనడా 2020లో గంజాయి వాడాన్ని ఆమోదించాయి.

న్యూజిలాండ్‌లో చర్చలు జరుగుతున్నాయి. లెసోతో గంజాయి సాగుకు అనుమతి ఇచ్చింది. మొరాకో వైద్యపరమైన వినియోగానికి ఆమోద ముద్ర వేసింది.

మరో పక్క, గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయకూడదంటూ కొందరు వాదిస్తున్నారు. అలా చేస్తే మాదకద్రవ్యాల వ్యసనాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని, వీటి వాడకం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

అయితే, ఇవాళ మనం గంజాయి 'వ్యాపారం' గురించి మాత్రమే చర్చిద్దాం.

ఒకదాని తరువాత ఒకటిగా దేశాలన్నీ గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తే, ప్రపంచవ్యాప్తంగా గంజాయి లభ్యత పెరుగుతుందా? ఇది ఎక్కడైనా సులభంగా దొరుకుతుందా?

దీనికి జవాబు తెలుసుకోవడం కోసం మేం కొంతమంది నిపుణలతో మాట్లాడాం.

గంజాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

గంజాయి వ్యాపారం ఒక క్లిష్టమైన వ్యవహారం

గత పదేళ్లల్లో 17 అమెరికా రాష్ట్రాలు వినోదానికి, 36 రాష్ట్రాలు ఔషధంగా గంజాయి వాడకాన్ని ఆమోదించాయి. అంటే ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రజలు గంజాయిని సులభంగా కొనుక్కోవచ్చు.

గంజాయి వ్యాపారాన్ని సులభతరం చేయడంలో కాలిఫోర్నియా ముందుంది. అక్కడ 1996లో ఔషధంగా, 2016లో వినోదానికి గంజాయిని అనుమతించారు.

కాలిఫోర్నియాలో వినోదానికి గంజాయి వాడకాన్ని "పెద్దలకు" మాత్రమే అంటూ అనుమతిచ్చారుగానీ, ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో వివరించలేదని అమెరికాలోని బర్కిలీ కానబిస్ రిసెర్చ్ సెంటర్ కో-ఆర్డినేటర్ వాన్ బట్సిక్ అన్నారు.

"దీనర్థం ఏమిటంటే కాలిఫోర్నియాలో నివసిస్తున్న వారిలో 21 ఏళ్లు దాటిన వాళ్లందరికీ గంజాయి చట్టబద్ధంగా లభిస్తుంది. కానీ, ఇళ్లల్లో మాత్రమే దాన్ని వినియోగించాలి. బహిరంగ స్థలాల్లో నిషేధం. గంజాయి ఉత్పత్తి, అమ్మకం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి."

కానీ అనుమతి లభించడం అంత సులభం కాదు. రాష్ట్రంలోని ఏదైనా నగరంలో గంజాయిని బహిరంగంగా విక్రయించకూడదనుకుంటే, దాని ఉత్పత్తి, అమ్మకంపై ఆ మేరకు నిషేధం విధించవచ్చు.

గంజాయి చట్టబద్ధం చేస్తారా

ఫొటో సోర్స్, Getty Images

అంటే చాలా చోట్ల గంజాయి సులువుగా దొరుకుతుందిగానీ ఇంకా చాలా చోట్ల దీనిపై నిషేధం కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితిల్లో ప్రజలు గంజాయి ఎలా కొనుక్కుంటారు?

చట్టవిరుద్ధంగా కాకుండా చట్టబద్ధంగా గంజాయి కొనుక్కోవడంలో లాభం ఏమిటి?

"కాలిఫోర్నియాలో గంజాయి మార్కెట్‌ను రెగ్యులేటర్లు పర్యవేక్షిస్తుంటారు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లో చట్టబద్ధంగా కొనుక్కోవడమంటే మంచి నాణ్యత ఉన్న గంజాయిని కొనుక్కోవడం అన్నమాట. ఇందులో హానికారకమైన పదార్థాలు, పురుగుల మందులు లేవని అర్థం. స్వచ్ఛత, నాణ్యత పరీక్షించిన తరువాతే విక్రయిస్తున్నారని అర్థం" అని వాన్ బట్సిక్ వివరించారు.

ఇది వినియోగదారులకు సులభంగానే కనిపిస్తుందిగానీ అమ్మకపుదారులకు పెద్ద సమస్య. దేశం మొత్తం మీద అంటే అన్ని రాష్ట్రాల్లోనూ గంజాయి వ్యాపారానికి అనుమతి లేదు కాబట్టి బ్యాంకులు దీనికి కావలసిన రుణాలు ఇవ్వడానికి వెనకాడతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కాలిఫోర్నియా గంజాయి ఉత్పత్తిదారులు ఆ దేశానికి దక్షిణాన ఉన్న మెక్సికోలో మార్కెట్ వెతుక్కునే ప్రమాదం ఉంది.

జాతీయ స్థాయిలో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం మెక్సికో. కానీ అక్కడ మార్కెట్లలో అనేక సవాళ్లు ఉన్నాయి.

గంజాయిని చట్టబద్ధం చేస్తే వ్యసనంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఫొటో సోర్స్, REUTERS/HENRY ROMERO

ఫొటో క్యాప్షన్, గంజాయిని చట్టబద్ధం చేస్తే వ్యసనంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

మార్కెట్లపై నియంత్రణ

'మారివానా ఆఫీసియో క్రానికా డే అన్ ఎక్స్‌పెరిమెంటో ఉరుగ్వాయో' పుస్తకం రచయిత గియర్మో డ్రాపర్ ఉరుగ్వేలో గంజాయి విక్రయానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.

ఉరుగ్వేలో 1974లోనే గంజాయిని వ్యక్తిగత వాడకానికి అనుమతించినప్పటికీ దాన్ని ఇంట్లో పెంచడానికి వీల్లేదు. చట్టబద్ధంగా కొనుక్కునే వీల్లేదు.

లాటిన్ అమెరికాలో విస్తరిస్తున్న అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు 2013లో అప్పటి ఆ దేశ అధ్యక్షుడు హోసే ముహీకా దీన్ని చట్టబద్ధం చేయాలని నిర్ణయించారు.

"స్మగ్లర్ల చేతుల్లోంచి తుపాకులు లాక్కోవడం కాదు, డాలర్లతో వారిని ఎదుర్కోవాలి. వాళ్ల చేతుల్లోంచి మార్కెట్‌ను లాగేసుకుని చట్టబద్ధం చేయాలని ఆయన ఉద్దేశం. స్థానికంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సంబంధిత నేరాలను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నారు. దీనికి ప్రజల నుంచి మద్దతు లభించింది.

గంజాయిని ఎవరు పెంచుతారు? ఏ రకమైన గంజాయిని అమ్మకానికి పెట్టాలి? గంజాయి ఉత్పత్తుల ధర ఎంత? మొదలైన అంశాలన్నిటినీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దీన్ని ఔషధంగా వినియోగించే దుకాణాలు కూడా తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అంటే గంజాయికి ఉచిత మార్కెట్ లేదు. దీని వ్యాపారానికి సంబంధించిన ప్రతీ దశలోనూ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది" అని గియర్మో డ్రాపర్ తెలిపారు.

అంతే కాకుండా, గంజాయి ఉత్పత్తిదారులు, వ్యాపారులు దీని గురించి వాణిజ్య ప్రకటనలు చేయడానికి వీల్లేదు. అలాగే, అమ్మకంతో పాటూ, గంజాయి కొనుగోలుపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది.

గంజాయి చట్టబద్ధం చేస్తారా

ఫొటో సోర్స్, AFP/GETTY

"ఉరుగ్వేలో గంజాయి కొనడానికి మూడు మార్గాలు. ఇంట్లోనే గంజాయి సిగరెట్ తయారుచేసుకోవచ్చు. లేదా ఏదైనా ఉత్పత్తి సంఘంలో సభ్యులుగా చేరవచ్చు. లేదా మందుల షాపులో కొనుక్కోవచ్చు.

అయితే, వీటన్నిటికీ మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. మీ వేలిముద్రలు, గుర్తింపు పత్రాలు చూపించాలి. ఆ తరువాతే మందుల దుకాణం నుంచి గంజాయిని కొనుగోలు చేయవచ్చు. అది కూడా ఒకేసారి 40 గ్రాములకు మించి కొనుగోలు చేయకూడదు" అని గియర్మో చెప్పారు.

అయితే, దీని వ్యాపారానికి సంబంధించి ఉరుగ్వే, అమెరికా బ్యాకింగ్ వ్యవస్థలకు ఒకేలాంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఉరుగ్వే బ్యాంకులు నేరుగా అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి.

ఉరుగ్వేలో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసిన తొలిరోజుల్లో అంతా బాగానే సాగింది. కానీ ఆ తరువాత సమస్య మొదలైంది.

ఔషధాల దుకాణాలు గంజాయి అమ్మకాలను కొనసాగిస్తే తమ సేవలు అందవని బ్యాంకులు స్పష్టం చేశాయి. ఇది ఇప్పటికీ అక్కడ పెద్ద సమస్యే.

ఇలాంటి పరిస్థితుల్లో, గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయడం నిజంగానే దాని డిమాండ్‌పై ప్రభావం చూపించిందా లేదా అనేది స్పష్టంగా తెలీదు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం గంజాయి ఉత్పత్తుల మార్కెట్ పెరిగిందని గియర్మో తెలిపారు.

స్టాటిస్టా ప్రకారం, 2014లో ఈ మార్కెట్ విలువ 3.3 బిలియన్ డాలర్లు కాగా, 2020 నాటికి దీని విలువ 20.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024 నాటికి ఈ మార్కెట్ విలువ 42.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

ఉరుగ్వే గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసిన అయిదు సంవత్సరాల తరువాత కెనడా దీన్ని వినోదానికి వినియోగించేందుకు ఆమోదం తెలిపింది.

జీ 20 దేశాల్లో దీని వినియోగాన్ని చట్టబద్ధం చేసిన మొట్టమొదటి దేశం కెనడా.

గంజాయి చట్టబద్ధం చేస్తారా

ఫొటో సోర్స్, REUTERS/EDGARD GARRIDO

విస్తరిస్తున్న మార్కెట్.. అడ్డంకులు మిగిలే ఉన్నాయి

కెనడాలో హోల్‌సేల్ పంపిణీ, ఆన్‌లైన్ అమ్మకాలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని కెనడాకు చెందిన కెనపీ గ్రోత్ కార్పొరేషన్ అధిపతి రాడే కోవాచేవిచ్ తెలిపారు.

అలాగే, ఈ వ్యాపారంలో ప్రైవేటు రంగం విస్తరించడానికి అవకాశాలు కూడా అధికమే.

కెనడా, ఉరుగ్వేలలో గంజాయి అమ్మకం, కొనుగోలుకు సంబంధించి ఒకేలాంటి నిబంధనలు ఉన్నాయి.

అయితే, కెనడాలో దేశం మొత్తం మీద గంజాయి వాడకానికి అనుమతి ఉంది కాబట్టి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడవు. కానీ, అమెరికాలో ఆ పరిస్థితి లేదు.

ఈ మార్కెట్ పెరుగుతున్నప్పటికీ, సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ వ్యాపారంలో లాభాలు ఆర్జించడం ఇంకా సుదూర స్వపంగానే నిలిచి ఉంది. పైగా, కెనపీ గ్రోత్ లాంటి కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకోవాల్సి వస్తోంది.

గంజాయి చట్టబద్ధం చేస్తారా

ఫొటో సోర్స్, NASTASIC

అంతర్జాతీయ మార్కెట్ ఎలా ఉంది?

షార్లెట్ బోయెర్.. హాన్వే అసోసియేట్స్‌లో కన్సల్టింగ్ హెడ్‌గా ఉన్నారు. ఐరోపాలో గంజాయి కంపెనీలకు చట్టబద్ధమైన గంజాయి వ్యాపారం గురించి ఆమె సలహాలిస్తారు.

2018లో కెనడాలో గంజాయి విక్రయాన్ని చట్టబద్ధం చేసినప్పుడు అంతా చాలా ఉత్సాహపడ్దారని, 90ల చివర్లో డాట్ కాం బూమ్‌లాగ గంజాయి మార్కెట్ వృద్ధి చెందిందిగానీ అంతలోనే అనేక సవాళ్లు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.

గంజాయి వాడకానికి సంబంధించిన నిబంధనలను సడలించడానికి అనేక దేశాలు సుముఖంగా లేకపోవడమే అతి పెద్ద సవాలు అని షార్లెట్ అన్నారు.

2020లో యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ గంజాయిని ప్రమాదకరమైన మాదకద్రవ్యాల జాబితా నుంచి తొలగించింది. కానీ, వైద్యేతర (నాన్-మెడికల్), అశాస్త్రీయ (నాన్-సైంటిఫిక్) వినియోగాన్ని చట్టవిరుద్ధం చేసింది.

అలాంటప్పుడు, అంతర్జాతీయ చట్టం ప్రకారం గంజాయి వాడకాన్ని ఐరాస సభ్య దేశాలు చట్టబద్ధంగా గుర్తించలేవు.

"వినోదం కోసం గంజాయిని చట్టబద్ధం చేసిన దేశాలు ఒక విధంగా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టే లెక్క. ఇది సభ్య దేశాలకు పెద్ద సవాలే. ఆ దేశాలు ఐరాస నుంచి తమ సభ్యత్వం కోల్పోవలసి రావొచ్చు" అని షార్లెట్ బోయెర్ అన్నారు.

గంజాయి చట్టబద్ధం చేస్తారా

ఫొటో సోర్స్, REUTERS/CHALINEE THIRASUPA

ఉత్తర, దక్షిణ అమెరికాలు ఈ సమస్యకు పరిష్కార మార్గాలు వెతుకుతున్నాయి. కానీ, ఐరోపాలో దీని గురించి ప్రస్తుతం పెద్దగా ఏ ప్రయత్నాలూ జరగట్లేదు.

నెదర్లాండ్స్‌లో కొన్ని కాఫీ షాపుల్లో గంజాయి లభిస్తుందిగానీ, వారు దీన్ని బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో గంజాయి సాగు నిషిద్ధం.

ఇలాంటి నిబంధనలు అంతర్జాతీయ మార్కెట్‌పై పెద్ద ప్రభావమే చూపిస్తాయి.

"చాలా కంపెనీలు ఐరోపా మార్కెట్లోకి ప్రవేశించాలని ఆశపడుతున్నాయి. కానీ, ఇక్కడ అనేక దేశాల్లో వినోదానికి గంజాయి వాడకానికి అనుమతి లేదు. ఈ కంపెనీలు తమ మార్కెట్‌ను వేగంగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాయిగానీ పలు దేశాల్లో ఉన్న నిబంధనల కారణంగా అది సాధ్యపడట్లేదు" అని షార్లెట్ బోయెర్ అన్నారు.

పొగాకు, మద్యం కంపెనీలు కూడా గంజాయి కంపెనీలతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటికి ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారం చేసే అనుభవం ఉంది. కానీ మార్గం అంత సుగమం కాదు.

గంజాయి చట్టబద్ధం చేస్తారా

ఫొటో సోర్స్, REUTERS/MATTHEW HATCHER

కెనడా లానే ప్రపంచం మొత్తం గంజాయికి చట్టబద్ధమైన మార్కెట్ ఏర్పరిచేందుకు సిద్ధంగా ఉందా?

ఆ దిశలో చాలా దేశాలు పనిచేస్తున్నాయని షార్లెట్ తెలిపారు. నెదర్లాండ్స్‌లో చట్టబద్ధమైన గంజాయి వ్యాపారం సాధ్యమో కాదో తెలుసుకునేందుకు అక్కడి ప్రభుత్వం కొన్ని గంజాయి కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.

లక్సంబర్గ్ త్వరలో దీనికి చట్టబద్ధమైన అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో ప్రణాళికలపై పనిచేస్తున్నాయి.

మరోవైపు, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు గంజాయిని ఔషధ వినియోగానికి మాత్రమే అనుమతిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపే చూస్తున్నాయి. అక్కడ అన్ని రాష్ట్రాల్లోనూ గంజాయిని చట్టబద్ధం చేస్తారా? అదే జరిగితే, అంతర్జాతీయ స్థాయిలో గంజాయి మార్కెట్‌పై పెద్ద ప్రభావమే ఉంటుంది.

మరోవైపు, దీని వ్యతిరేకులు సారాలాగే గంజాయి కూడా భవిష్యత్తులో వ్యసనంగా మారిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)