శ్రీలంక వద్దంటోంది.. చైనా తిరిగి తీసుకోనంటోంది - సేంద్రియ ఎరువుల నౌక వివాదం ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంబరీసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా నుంచి ఆర్గానిక్ ఎరువులను తీసుకొచ్చిన కార్గో షిప్ ఇంకా శ్రీలంక సముద్ర జలాల్లోనే ఉంది. శ్రీలంక నుంచి వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ అది అక్కడి నుంచి కదలడం లేదు. ఎందుకు?
ఆ షిప్ తీసుకొచ్చిన ఆర్గానిక్ ఎరువుల్లో పెద్ద తప్పు జరగడమే ఈ సమస్యకు ప్రధాన కారణం.
రెండు సన్నిహిత మిత్ర దేశాల మధ్య ఈ షిప్ ఇప్పుడొక అరుదైన దౌత్య వివాదంగా మారింది.
ఇది ఒక బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికి కారణమైంది. అలాగే, కొందరు శాస్త్రవేత్తలు, శ్రీలంక రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.
ఈ నౌక పేరు హిప్పో స్పిరిట్. 20వేల టన్నుల సేంద్రియ ఎరువులతో ఇది గత సెప్టెంబర్‌లో చైనా నుంచి బయలుదేరింది.
ఈ సేంద్రియ ఎరువులు శ్రీలంకకు చాలా అవసరం. రసాయన ఎరువుల వాడకాన్ని మే నెలలో శ్రీలంక ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇకపై రైతులందరూ సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వం చైనా నుంచి ఈ సేంద్రియ ఎరువులకు ఆర్డర్ ఇచ్చింది.
చైనాకు చెందిన షిన్‌డావో సీవిన్ బయో టెక్ గ్రూప్ నుంచి 369 కోట్ల రూపాయల విలువైన 99వేల టన్నుల ఆర్గానిక్ ఎరువులను కొనాలని శ్రీలంక నిర్ణయించింది. అందులో భాగంగా ఆ కంపెనీ తొలి షిప్‌మెంట్ పంపించింది.
శ్రీలంకకు ఇంత అవసరం ఉన్నప్పటికీ.. చైనా నుంచి వచ్చిన ఈ సేంద్రియ ఎరువులను ఎందుకు తీసుకోవడం లేదు? దీనిలో అసలు వివాదం ఏమిటి?
'విషం, చెత్త, కాలుష్యం'
ఇక్కడ అసలు సమస్య చైనా నుంచి వచ్చిన ఎరువుల నాణ్యతే.
ఆ ఎరువులు మొక్కలు, పంటలకు సాయం చేయకపోగా.. కీడు చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చైనా నుంచి వచ్చిన సేంద్రియ ఎరువులు క్రిమిరహితం కాదని ఆ శాంపిల్స్‌పై తాము చేసిన పరీక్షల్లో తేలిందని శ్రీలంక వ్యవసాయ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజంత డి సిల్వా బీబీసీతో చెప్పారు.
అందులో బ్యాక్టీరియాను గుర్తించామని, క్యారెట్లు, బంగాళదుంపలు వంటి పంటలకు అది నష్టం కలిగిస్తుందని డాక్టర్ డి సిల్వా వివరించారు.
ఇది దేశ జీవ భద్రతకు (బయో సెక్యూరిటీ)కి సంబంధించిన అంశమని, అందుకే ఆ షిప్పులో ఉన్న సేంద్రియ ఎరువులను తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
ఈ నిర్ణయం షిన్‌డావో సీవిన్ కంపెనీకి ఆగ్రహం తెప్పించింది.
సేంద్రియ ఎరువులను ఉద్దేశించి 'విషం, చెత్త, కాలుష్యం' వంటి అవమానకర పదాలను వాడుతున్నారంటూ శ్రీలంక మీడియాపై ఆరోపణలు చేసింది.
చైనా కంపెనీలు, చైనా ప్రభుత్వ పేరును చెడగొట్టడానికే ఇలా చేస్తున్నారని విమర్శించింది.
శ్రీలంక నేషనల్ ప్లాంట్ క్వారంటైన్ సర్వీస్ - ఎన్‌పీక్యూ పాటించిన అశాస్త్రీయ గుర్తింపు పద్ధతి అంతర్జాతీయ యానిమల్ అండ్ ప్లాంట్ క్వారంటైన్ కన్వెన్షన్ నిబంధనలకు అనుగుణంగా లేదని చైనా కంపెనీ ఆరోపించింది.
ఈ వివాదం మరింత ముదరడంతో చైనా కంపెనీకి చెల్లించాల్సిన 67 కోట్ల రూపాయలను ఆపేయాలని శ్రీలంక ప్రభుత్వ రంగ బ్యాంకును కోర్టు ఆదేశించింది.
దీనికి ప్రతిచర్యగా కొలంబోలోని చైనా ఎంబసీ శ్రీలంక బ్యాంకును బ్లాక్ లిస్టులో పెట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ వివాదం కారణంగా తమ పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని, దానికి పరిహారంగా 60 కోట్ల రూపాయలు ఇవ్వాలని చైనా కంపెనీ శ్రీలంకకు చెందిన నేషనల్ ప్లాంట్ క్వారంటైన్ సర్వీస్‌ను డిమాండ్ చేసింది.
ఈ వివాదమంతా షిప్పు చైనా నుంచి శ్రీలంక తీరానికి వచ్చిన తర్వాత జరిగింది. ఆ నౌక ఇంకా శ్రీలంక సముద్ర జలాల్లోనే ఉంది.
ఆ నౌకలో ఉన్న సేంద్రియ ఎరువులను దింపేందుకు అక్టోబర్‌లో శ్రీలంక అధికారులు అనుమతి ఇవ్వలేదు. దాంతో హిప్పో స్పిరిట్ నౌక కొలంబో హర్బర్‌కు దూరంగా వెళ్లింది. అది దక్షిణ తీరంలోని హంబన్‌తోటా రేవు తీరంలోని సముద్ర జలాల్లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ నౌక శ్రీలంక నైరుతి తీరానికి దగ్గరగా ఉందని మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్‌లోని తాజా చిత్రాలు చెబుతున్నాయి. ఇది కొలంబోకు దగ్గరగానే ఉంటుంది.
సేంద్రియ ఎరువులను వెనక్కి తీసుకెళ్లే ప్రసక్తే లేదని దీని ద్వారా చైనా కంపెనీ స్పష్టమైన సంకేతాలు పంపిస్తోంది.
తాజా శాంపిల్‌ను థర్డ్ పార్టీ ల్యాబ్‌లో మరోసారి పరీక్షించేందుకు ఒప్పుకున్నామని చైనా ఎంబసీ అధికారులతో ఇటీవల జరిగిన చర్చల తర్వాత శ్రీలంక మంత్రి శశీంద్ర రాజపక్సా చెప్పారు.
ఇలా చేయమని మాపై ఎవరూ ఒత్తిడి తేలేదు. వాళ్లు (చైనా) కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశారని ఆయన వివరించారు.
అయితే, ఇప్పటికే శ్రీలంకకు వచ్చిన షిప్‌మెంట్‌ను తీసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్గో చైనాకు తిరిగి వెళ్తే షిన్‌డావో సీవిన్ కంపెనీకి, చైనా ప్రభుత్వానికి నష్టం వస్తుంది.
ఆస్ట్రేలియా, అమెరికా సహా 50 దేశాలకు తాము సేంద్రియ ఎరువులను ఎగుమతి చేస్తుంటామని ఆ కంపెనీ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, చైనా ఒత్తిడి వ్యూహాలను శ్రీలంక ప్రభుత్వం తట్టుకోగలదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు.
'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' పథకంలో భాగంగా, శ్రీలంకకు వేల కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చింది చైనా. అయితే, అన్ని నిధులు శ్రీలంకకు అనుకూలంగానే పని చేయలేదు.
ఉదాహరణకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైన హంబన్‌తోటా పోర్టు నిర్మాణానికి తీసుకున్న అప్పును శ్రీలంక తిరిగి చెల్లించకపోవడంతో 2017లో ఆ పోర్టులో మెజారిటీ భాగాన్ని చైనా మర్చెంట్స్ పోర్ట్ హోల్డింగ్స్ చేజిక్కించుకుంది.
చైనా పన్నిన అప్పుల ఊబిలో శ్రీలంక చిక్కుకుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే, చైనాకు ఎంత ఆర్థిక బలం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువులను దేశంలోకి అనుమతించే ప్రసక్తే లేదని శ్రీలంక అధికారులు స్పష్టం చేస్తున్నారు.
"ఈ సరకును తిరికి చైనాకు తీసుకెళ్లమని మేం ఆ కంపెనీకి చెప్పాం. మరో బ్యాచ్‌కు చెందిన కొత్త శాంపిల్స్ పంపించమని అడిగాం. కొత్త శాంపిల్స్ మా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే అప్పుడు వాళ్లు సేంద్రియ ఎరువులను పంపించొచ్చు" అని డాక్టర్ డి సిల్వా చెప్పారు.
సేంద్రియ ఎరువుల విషయంలో ఇరు దేశాలకు చెందిన అధికారులు మాటల యుద్ధం చేస్తుంటే.. సరైన ఎరువులు లేక వేలాది మంది శ్రీలంక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
శ్రీలంక ప్రభుత్వం రసాయన ఎరువులు, పురుగు మందులను ఉన్నట్టుండి ఒక్కసారిగా నిషేధించడంతో రైతులపై తీవ్ర ప్రభావం పడిందని మొనరాగల జిల్లాకు చెందిన ఆర్ఎం రత్నాయక అనే వరి పండించే రైతు అన్నారు.
"రసాయన ఎరువులు వాడటం పూర్తిగా ఆపేసి, ఒక్కసారిగా సేంద్రియ ఎరువులు వాడమంటే ఎలా? సహజ ఎరువులు వాడటం మంచిదే అయినప్పటికీ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మాత్రం సరికాదు" అని ఆయన బీబీసీతో అన్నారు.
దేశంలో దశలవారిగా ఆర్గానిక్ వ్యవసాయం అమలు చేయాలని ఆయన సూచించారు.
ఒక్కసారిగా సేంద్రియ వ్యవసాయానికి మారడం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ పెరడేనియా ప్రొఫెసర్ బుద్ధి మరాంబే చెప్పారు. వరి లాంటి పంటల దిగుబడి భారీగా తగ్గిపోతుందని హెచ్చరించారు.
సేంద్రియ వ్యవసాయం ద్వారా పూర్తిస్థాయి ఆహార భద్రత సాధించలేమని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Chaminda Dissanayaka
శ్రీలంకకు చెందిన ప్రముఖ సిలోన్ టీకి ప్రమాదం పొంచి ఉందన్న నివేదికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టారు. దాంతో కొంతవరకు సింథటిక్ ఎరువులు వాడేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే తమ ప్రభుత్వం వాటి దిగుమతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్సా ఇటీవల ముగిసిన తాజా కాప్26 సదస్సులో చెప్పారు.
అయితే, ఖరీదైన దిగుమతులను తగ్గించుకోవడం కోసమే రసాయన ఎరువులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
శ్రీలంక విదేశీ మారక నిల్వలు అక్టోబర్ చివరి నాటికి సుమారు 2.3 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఇతర వస్తువుల దిగుమతులపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
రసాయన ఎరువులపై నిషేధం విధించడానికి కారణం ఏదైనప్పటికీ.. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం మాత్రం అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోందని కొందరు చెబుతున్నారు.
శ్రీలంకపై చైనా కోపంగా ఉంది. ఇటు స్వదేశంలోని రైతులు, శాస్త్రవేత్తలు కూడా లంక ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
- ఆఫీస్ టైమ్ ముగిశాక ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు పంపటానికి వీల్లేదు.. అమల్లోకి కొత్త చట్టం
- గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే
- డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యమేనా?
- తేళ్లు కుట్టడంతో ముగ్గురు మృతి, వందల మంది ఆస్పత్రి పాలు - Newsreel
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















