డయాబెటిస్ పూర్తిగా నియంత్రించడం సాధ్యమేనా? ఎవరికి తగ్గుతుంది

టాబ్లెట్ వేసుకుంటున్న భారతీయ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జ్యోతికి ఆరు నెలల క్రితం డయాబెటిస్ వచ్చినట్లు నిర్ధరణ అయింది. ఆమె ఒక గృహిణి. 35 ఏళ్లకే డయాబెటిస్ రావడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు.

"నాకు డయాబెటిస్ వచ్చిందంటే నమ్మలేకపోయాను. మా అమ్మగారికి, నాన్నగారికి కూడా డయాబెటిస్ ఉండేది. వారిద్దరూ మధుమేహంతోనే మరణించారు" అని బీబీసీకి చెప్పారు.

ఆమె ప్రస్తుతం మధుమేహానికి చికిత్స తీసుకుంటున్నారు.

డాక్టర్ అనూప్ మిశ్రా

ఫొటో సోర్స్, ANOOP MISRA/TWITTER

ఫొటో క్యాప్షన్, డాక్టర్ అనూప్ మిశ్రా

మధ్యవయస్కులలో డయాబెటిస్ ఎందుకు పెరుగుతోంది?

ఆధునిక కాలంలో జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి డయాబిటిస్ రావడానికి ప్రధాన కారణాలని డయాబెటిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ అనూప్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఆయన ఈ-మెయిల్ ద్వారా బీబీసీతో మాట్లాడారు.

అధిక మద్యపాన సేవనం, పొగ తాగడం కూడా డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలని ఆయన అన్నారు.

జ్యోతి లాంటి వారికి మధ్య వయసులోనే డయాబెటిస్ ఎందుకు వస్తోంది? ఆమెకు ఫ్యామిలీ హిస్టరీలో ఉండటం వల్ల వచ్చిందా, లేదా లైఫ్ స్టైల్ కారణంగానా?

ఫ్యామిలీ హిస్టరీకి, లైఫ్ స్టైల్ అలవాట్లు తోడైనప్పుడు డయాబెటిస్ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని డాక్టర్ మిశ్రా అంటారు.

జ్యోతి ఇంట్లో వండే వంటల గురించి ప్రశ్నించినప్పుడు తమ ఇంట్లో ఎక్కువగా నూనెలో వేపిన ఆలూ పూరీలు, పనీర్, చికెన్, బిరియాని, పాస్తా, నూడుల్స్ ఉంటాయని చెప్పారు.

మరి డయాబెటిస్ సోకినట్లు తెలిసిన తర్వాత డైట్ అలవాట్లను మార్చుకున్నారా లేదా అని ప్రశ్నించినప్పుడు.....

"మా ఆహారపు అలవాట్లను మేమేమి మార్చుకోలేదు. ఇంట్లో అందరికీ రకరకాల వంటకాలంటే ఇష్టం. అవి తినడం మానేస్తే జీవించడమెందుకు? అందుకే మందులు వేసుకుంటూ నాకు కావల్సినవన్నీ తింటున్నాను" అని చెప్పారు.

మందులు వేసుకుంటున్నంత మాత్రాన ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకోకపోతే, డయాబెటిస్ నియంత్రణ కష్టమేనంటారు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఎండో క్రైనాలజీ మేనేజింగ్ డైరెక్టర్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి లావణ్య ఆలపాటి.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొందరు ఊబకాయులు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారని అధ్యయనంలో వెల్లడైంది

భారతదేశం డయాబిటిక్ క్యాపిటల్‌గా మారుతోందా?

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 మంది వయోజనుల్లో కనీసం ఒకరికి మధుమేహం ఉంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా (537 మిలియన్) 50.37 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2019తో పోలిస్తే, ఇది 16 శాతం ఎక్కువ.

భారతదేశంలో 7.7 కోట్ల మంది వయోజనులు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు అంచనా. ఈ సంఖ్య 2045 నాటికి 13.4 కోట్లకు చేరుతుందని అంచనా.

భారతదేశంలో 25 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి (25.3 %) అడల్ట్ ఆన్‌సెట్ టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ )యూత్ డయాబెటిస్ రిజిస్ట్రీ చెబుతోంది.

కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేశంలో డయాబెటిస్ కేసులు పెరిగినట్లు అధ్యయనాలు వెలువడ్డాయి.

అధిక పని గంటలు, వివిధ షిఫ్టులలో పని చేయడం కూడా ఒత్తిడికి దారి తీస్తాయని అంటూ, ఇవి కూడా మధుమేహం రావడానికి కారణాలుగా పని చేస్తాయని డాక్టర్ మిశ్రా చెప్పారు.

"ఫ్యామిలీ హిస్టరీలో ఉందని తెలుసు కానీ నాకింత తొందరగా వస్తుందని ఊహించలేదు" అని జ్యోతి బీబీసీతో అన్నారు.

మధుమేహం వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం పొరపాటు అని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ఇది ఏ వయసులో వారికైనా రావచ్చని అన్నారు.

ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లలలో కూడా మార్పులు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లలలో కూడా మార్పులు మొదలయ్యాయి.

యువకులలో మధుమేహం

యువతీ యువకులలో డయాబెటిస్ కనిపించడం 2000 సంవత్సరం నుంచీ ఎక్కువయిందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు.

ఈ మేరకు అనేక అధ్యయనాలు కూడా వెలువడినట్లు వివరించారు. ఈ అధ్యయనాల్లో ముఖ్యంగా నగరాల్లో యువతకు అత్యధికంగా డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు.

30 ఏళ్లు పైబడిన వారందరూ తరచుగా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని భారతదేశంలో డయాబెటిస్‌కు సంబంధించిన నియమావళి సూచిస్తోంది.

2015-16 మధ్యలో 1.29 కోట్ల మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించగా, అందులో 8 శాతం మందికి మధుమేహం, 12 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో భారతదేశంలో 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ డయాబెటిస్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్ అనూప్ మిశ్రా సూచిస్తున్నారు.

1980లో ప్రపంచవ్యాప్తంగా 10.8 కోట్ల మంది డయాబెటిస్ రోగులు ఉండగా, 2014 నాటికి వారి సంఖ్య 422 మిలియన్ (40.22 కోట్లు)కు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ సంఖ్య మధ్య ఆదాయ దేశాలు, అల్పాదాయ దేశాల్లో మరింత పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది.

మధుమేహ పరీక్ష

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మధుమేహ పరీక్ష

డయాబెటిస్ వచ్చినట్లు ఎలా నిర్ధరిస్తారు?

శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఫాస్టింగ్‌లో అంటే పొద్దున ఏమీ తినక ముందు 70 - 100 రేంజ్ లో ఉంటే అది సాధారణ స్థాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ రేంజ్ 100 - 125 మిల్లీగ్రాములకు చేరితే, ప్రీ డయాబెటిస్ అని, 126 ఆ పైన ఉంటే మధుమేహం ఉన్నట్లని సూచిస్తోంది.

అయితే, ఫార్మా సంస్థల లాభాల కోసం ఈ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నారని కొంత మంది నిపుణులు ఆరోపిస్తున్నారు. మెడిసిన్ ప్రొఫెసర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ బిఎం హెగ్డే లాంటి వారు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఇటీవల భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధరించిన స్థాయిలే భారతదేశంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపించడానికి కారణమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధరించిన డయాబెటిస్ స్థాయిలు అన్ని దేశాలకూ వర్తిస్తాయని డాక్టర్ లక్ష్మి లావణ్య ఆలపాటి అన్నారు. ఈ స్థాయిలు వివిధ దేశాలకు వివిధ రకాలుగా ఉండవని అన్నారు.

కోవిడ్ సమయంలో స్వీయ చికిత్స చేసుకోవడం ఎక్కువయింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ సమయంలో స్వీయ చికిత్స చేసుకోవడం ఎక్కువయింది

ఫార్మా సంస్థల లాభాల కోసమే హైడోస్ మందులు ఇస్తున్నారా?

"అది అపోహ మాత్రమే. నిజానికి వైద్యులు కూడా రోగికి మందులతో పాటు లైఫ్ స్టైల్ మార్పులను కూడా సూచించాలి" అని అంటారు డాక్టర్ లక్ష్మి.

"ముందుగా తక్కువ మోతాదులో మెడిసిన్ ఇస్తూ, చికిత్స మొదలుపెట్టాలి. ఎప్పటికప్పుడు మధుమేహ స్థాయిలు చెక్ చేయించుకుంటూ మందుల డోస్ మారుస్తూ, అవసరానికి అనుగుణంగా తగ్గించడం కానీ, పెంచడం కానీ చేస్తూ ఉండాలి" అని చెప్పారు.

2019లో 10.5 లక్షల మంది.... నేరుగా మధుమేహం వల్లే చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ఈ నేపథ్యంలోనే, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర వైద్య సంస్థలు కూడా ఎర్లీ స్క్రీనింగ్‌ను సూచిస్తున్నాయని డాక్టర్ లక్ష్మి అంటారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత భారతదేశంలో డయాబెటిస్ సోకిన వారి సంఖ్య మరింత పెరిగినట్లు, డాక్టర్ అనూప్ మిశ్రా తెలిపారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత డయాబిటిస్ సోకిన వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా సాధారణ మధుమేహ రోగ గ్రస్థుల కంటే ఎక్కువగా కనిపించినట్లు ఒక అధ్యయనంలో తేలినట్లు డాక్టర్ అనూప్ మిశ్రా బీబీసీతో చెప్పారు.

కోవిడ్ మహమ్మారి కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి ఒక కారణమని ఆయన అన్నారు.

డయాబెటిస్ చరిత్ర

వైద్య చరిత్రలో డయాబెటిస్ కొన్ని వేల ఏళ్లుగా ఉందని 'ది డయాబెటిస్ కోడ్ ' అనే పుస్తకంలో డాక్టర్ జ్యాసన్ ఫాంగ్ పేర్కొన్నారు.

క్రీస్తు పూర్వం 1550లో ఎబెర్స్ పాపిరస్ అనే ప్రాచీన ఈజిప్టు వైద్య గ్రంధంలో, ప్రాచీన హిందూ గ్రంధాల్లో కూడా మధుమేహం గురించి ప్రస్తావన కనిపిస్తుంది.

డయాబెటిస్ అనే పేరెలా వచ్చింది?

మెంఫిస్ కు చెందిన గ్రీసు వైద్యుడు అపోలోనియస్ క్రీస్తు పూర్వం 250లో డయాబెటిస్ అనే పేరును పెట్టారు. అధికంగా మూత్రవిసర్జన జరగడమే దీనర్ధం. 1675లో థామస్ విల్లిస్ అనే వ్యక్తి డయాబెటిస్‌కు మెల్లిటస్ (తేనె) అనే పదాన్ని చేర్చారు.

అయితే, 1797 వరకూ డయాబెటిస్‌కు ఎవరూ సరైన చికిత్సను కనిపెట్టలేదు. స్కాటిష్ మిలిటరీ సర్జన్ జాన్ రోలో తొలిసారిగా కార్బోహైడ్రేట్లను ఆహారంలో తగ్గించి తీసుకోవడాన్ని ప్రయోగించి చూశారు.

అపోలి నైర్ బౌ‌హర్డ్ట్ (1806-1886) అనే వైద్యుడు తొలిసారిగా మధుమేహానికి సమగ్రమైన డైట్ ప్రణాలికను రూపొందించారు.

మధుమేహానికి ఇన్సులిన్ లోపమే కారణమని 1910లో సర్ ఎడ్వర్డ్ షార్పీ స్కేఫర్ కనిపెట్టారు.

ఇన్సులిన్ అనే పదం లాటిన్ పదం ఇన్సులా (దీవి) నుంచి పుట్టింది. పాంక్రియాస్‌లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ కణాల్లో ఇన్సులిన్ ఉత్పత్తి జరగడం వల్ల దీనికా పేరు వచ్చింది.

టొరంటో యూనివర్సిటీకి చెందిన ఫ్రెడ్‌రిక్ బ్యాంటింగ్, చార్లెస్ బెస్ట్, జాన్ మెక్‌లియాడ్ 1921లో ఇన్సులిన్ ను కనిపెట్టారు. బ్యాంటింగ్ మెక్‌లియాడ్‌లకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి లభించింది.

డయాబెటిస్

ఫొటో సోర్స్, AFP

డయాబెటిస్ లక్షణాలేంటి?

అధికంగా దాహం వేయడం, రాత్రి పూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవడం, విపరీతమైన అలసట , ఎటువంటి ప్రయత్నమూ లేకుండానే బరువు కోల్పోవడం, కంటి చూపు మందగింపు, గాయాలు మానకపోవడం డయాబెటిస్ లక్షణాలని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంటోంది.

అయితే, లక్షణాలేవీ కనిపించకుండా కూడా డయాబెటిస్ రావచ్చని డాక్టర్ లక్ష్మి లావణ్య అంటారు.

దీని వల్ల వచ్చే సమస్యలేంటి?

రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బ తినే అవకాశం ఉంది.

కంటి చూపు కోల్పోవడం, పాదాలకు ఇన్ఫెక్షన్ కూడా సోకే ప్రమాదం ఉంది.

అంధత్వానికి, మూత్ర పిండాలు పని చేయకపోవడానికి, గుండె పోటు వంటి అనారోగ్య సమస్యలకు డయాబెటిస్ ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది.

కోవిడ్ చికిత్స

ఫొటో సోర్స్, AFP

డయాబెటిస్ రివర్సల్ సాధ్యమేనా?

ఇటీవల కాలంలో డయాబెటిస్ రివర్స్ చేస్తాం అంటూ, వివిధ సంస్థల ప్రకటనలు ఆన్‌లైన్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా వారి సంస్థ చెప్పిన సూచనలను పాటిస్తూ, డయాబెటిస్ స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్న వారి అనుభవాలను కూడా షేర్ చేస్తున్నాయి.

వందల్లో వెల్‌నెస్ సెంటర్లు, సాత్విక ఆహార ప్రచారకులు, లోజిఐ (గ్లైసెమిక్ ఇండెక్స్) తో కూడిన ఆహారం అమ్ముతున్న ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ విపరీతంగా పెరిగాయి.

ఇవన్నీ దేశంలో మధుమేహ బాధితులు పెరిగారనడానికి సంకేతమని చెప్పవచ్చు.

డైట్, వ్యాయామం ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని డాక్టర్ బిఎం హెగ్డే అంటారు.

"దురదృష్టవశాత్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డయాబిటిస్ సంస్థలన్నీ కలిపి మధుమేహాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు జీవితాంతం మందులు వాడాల్సిందేనని తీర్మానించాయి" అని డాక్టర్ జ్యాసన్ ఫాంగ్ పేర్కొన్నారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఆహారమే ఔషధం

"ఆహారమే ఔషధం" అంటారు విశాఖపట్నానికి చెందిన ప్రజ్ఞానంద్.

ప్రజ్ఞానంద్‌కు 44 సంవత్సరాల వయసులో మధుమేహ లక్షణాలు కనిపించాయి. అయితే, ప్రస్తుతం ఆయనకు మందులు లేకుండానే డయాబెటిస్ నియంత్రణలోకి వచ్చినట్లు బీబీసీకి చెప్పారు.

"ఒక రోజు స్వీట్లు తినగానే కళ్ళు తిరిగి, ఊపిరి కూడా అందకపోవడంతో, ఏమి జరిగిందో అర్ధం కాలేదు. వెంటనే ల్యాబ్ కు వెళ్లి రక్త పరీక్ష చేయించుకోగా, ఫాస్టింగ్ షుగర్ 280, తిన్న తర్వాత 400 కు పైగా మధుమేహ స్థాయిలు ఉన్నట్లు తెలిసింది" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే అలోపతి వైద్యంతో పాటు, ఆయుర్వేద మందులను కూడా వాడటం మొదలుపెట్టినట్లు చెప్పారు.

ఒక సంవత్సరం పాటు ఈ మందులు వాడిన తర్వాత హోమియో వైద్యం మొదలుపెట్టినట్లు చెప్పారు. తనకు హోమియో మందులు బాగా పని చేసినట్లు చెప్పారు.

అయితే, ఆయన అంతటితో ఆగలేదు.

ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్.ఏ యోగ కోర్సులో చేరి, ప్రతీ రోజూ సైక్లింగ్, యోగా, ధ్యానం చేస్తూ మందులు కూడా తీసుకున్నట్లు చెప్పారు.

డైట్ విషయంలో వైద్య నిపుణులను సంప్రదించి ఆహారంలో చిరుధాన్యాలను చేర్చాను.

కార్బోహైడ్రేట్ల మెటాబాలిజమ్ నియంత్రణ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐ‌ఆర్) అందుబాటులోకి తెచ్చిన ఔషధాన్ని కూడా వాడినట్లు చెప్పారు.

తనకు విజయవంతమైన ఈ ప్రయోగంతో ఫుడ్ థెరపిస్ట్‌గా మారి అవినాష్ హెల్త్ అండ్ వెల్ నెస్ ఇన్స్టిట్యూట్ స్థాపించినట్లు చెప్పారు.

దాదాపు నాలుగున్నర సంవత్సరాల పరిశోధన జరిపి చిరుధాన్యాలు, కొన్ని మూలికలు కలిపి సునాయాసంగా తయారుచేసుకునే విధంగా, కొన్ని రకాల ఆహార పదార్ధాలను తయారు చేసినట్లు బీబీసీకి తెలిపారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, హైదరాబాద్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు తన స్టార్టప్ ఫర్మ్ అవినాష్ ఎంపికయినట్లు తెలిపారు.

డాక్టర్ లక్ష్మి లావణ్య ఆలపాటి

ఫొటో సోర్స్, DR LAKSHMI LAVANYA ALAPATI

ఫొటో క్యాప్షన్, డాక్టర్ లక్ష్మి లావణ్య ఆలపాటి

డయాబెటిస్ రివర్సల్ అందరికీ వీలవుతుందా?

డైట్ పాటిస్తూ కచ్చితంగా వ్యాయామం చేస్తే కొన్ని రకాల డయాబెటిస్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ లక్ష్మి అన్నారు.

డయాబెటిస్ రావడానికి చాలా కారణాలుంటాయని అంటారు ఆమె.

"డయాబెటిస్ కొన్నిసార్లు స్టెరాయిడ్లు వాడటం వల్లో లేదా కోవిడ్ సోకినందు వల్లనో, లేదా మహిళల్లో గర్భం దాల్చిన సమయంలోనో కూడా సోకుతుంది. అలా వచ్చినప్పుడు జీవనశైలిని సరి చేసుకుని, డైట్ పాటిస్తూ మందులు వాడటం ద్వారా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు" అని డాక్టర్ లక్ష్మి అన్నారు. .

"కానీ, శరీరంలో బీటాకణాలు దెబ్బ తిని వాటి పని తీరు మందగిస్తే మాత్రం మధుమేహ నియంత్రణ జరగదు" అని అన్నారు.

అలాగే, ఇన్సులిన్ లోపం పూర్తిగా ఏర్పడిన వారిలో మాత్రం డయాబెటిస్ రివర్సల్ సాధ్యమయ్యే పని కాదని చెప్పారు.

ఒక సారి మధుమేహ స్థాయిలు తగ్గాయి కదా అని షుగర్ పరీక్షలు చేయించుకోవడం ఆపకూడదని, తరచుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ మధుమేహ స్థాయిలు తెలుసుకోవాలని అన్నారు. ఇదంతా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలని, సొంత చికిత్స చేసుకోకూడదని సూచించారు.

నోటి ద్వారా వేసుకునే మాత్ర

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్ రివర్సల్ చేస్తామనే ప్రచారాలు

"కేవలం వెల్‌నెస్ కేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల నియంత్రణలోకి వస్తుందని చెప్పలేం. డైట్, వ్యాయామంతో పాటు మధుమేహానికి డాక్టర్ సూచించిన మందులు కూడా వాడటం ముఖ్యం" అని ఆమె అంటారు.

మధుమేహ వ్యాధిగ్రస్థులందరికీ ఒకే ఔషధం, ఒకే డైట్ ప్లాన్ పని చేయవని, అవి వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు, శారీరక నిర్మాణం దృష్ట్యా సూచించాలని చెప్పారు.

ఇదే అభిప్రాయాన్ని ప్రజ్ఞానంద్ కూడా వ్యక్తం చేశారు.

యోగ, ప్రాణాయామం, ఆహారపు అలవాట్లలో చేసుకున్న మార్పుల ద్వారా తనకు డయాబెటిస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్లు ప్రజ్ఞానంద్ చెప్పారు.

టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు వ్యాయమం, ఆహార నియమాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు వ్యాయమం, ఆహార నియమాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు

ఎటువంటి డైట్ పని చేస్తుంది?

శరీరం కార్బో హైడ్రేట్లను గ్రహించే స్థాయిని కోల్పోవడమే మధుమేహానికి సంకేతమని 1923లో సర్ విలియం ఆస్లర్ రాసిన వైద్య పత్రంలో పేర్కొన్నారు.

"కానీ, ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో, కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మరింత పెరిగింది" అని జ్యాసన్ ఫాంగ్ అంటారు.

ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర స్థాయిలు తగ్గించడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలు తగ్గించుకోవచ్చని సూచించారు.

ఉపవాసం, మితాహారం, పోషకాహారం టైప్ 2 డయాబిటిస్ నియంత్రణకు ఉత్తమంగా పని చేస్తాయని డయాబెటిస్ ఎడ్యుకేటర్, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శుభ శ్రీ రే చెప్పారు.

అధిక పీచుతో కూడిన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుతో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చని ఆమె చెప్పారు.

కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్, పుచ్చకాయ, పీచ్, జామ వంటి పళ్ళు, ప్రోటీన్ ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు, కొవ్వు తక్కువగా ఉండే చికెన్, టోఫు, చేపలు తీసుకోవచ్చని చెప్పారు.

పండ్లు, తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి దోహదపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పండ్లు, తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించటానికి దోహదపడతాయి.

ఆకుకూరలు, చిరుధాన్యాలు, ఓట్స్, దంపుడు బియ్యం, బాదాం, వాల్‌నట్ , పిస్తా, జీడిపప్పు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు.

ఆలివ్ నూనె, నేయి, కొబ్బరి నూనె లాంటివి ఆహారంలో వాడవచ్చని చెప్పారు.

చక్కెరతో చేసిన స్వీట్లు, సోడా, బిస్కట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, కేకులు, ఎక్కువ నూనెలో వేపిన పదార్ధాలు ఇతర ప్రొసెస్డ్ ఆహారానికి మాత్రం ' నో ' చెప్పాలని అన్నారు.

డయాబెటిస్ ఉన్న వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవచ్చని సూచించారు. వీటి వల్ల రక్తంలో చక్కర స్థాయిలు అమాంతం పెరగవని శుభశ్రీ అన్నారు.

వారానికి రెండు సార్లు ఉపవాసం చేయడం కూడా ఉత్తమమైన థెరపీ అని జ్యాసన్ ఫాంగ్ అంటారు. ఇది కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్న అలవాటు అని ఆయన అన్నారు.

"డయాబెటిస్ నియంత్రణలోకి వచ్చినంత మాత్రాన జీవనశైలిలో చేసిన మార్పులను విస్మరిస్తే మాత్రం డయాబెటిస్ స్థాయిలు పెరగడం తప్పదు" అని ప్రజ్ఞానంద్ అంటారు.

వీడియో క్యాప్షన్, డయాబెటిస్ అంటే ఏంటి? టైప్-1, టైప్-2 మధుమేహాల మధ్య తేడాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)