డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? చాలాకాలంగా పేరు లేని ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?

ఫొటో సోర్స్, Sounds Fake But Okay
తాను 'డెమిసెక్సువల్' అని 2021 ప్రారంభంలో అప్పటి న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమోస్ కుమార్తె మిచెలా కెన్నెడీ కుమో ప్రకటించారు.
అప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కానీ కొందరు ఆమెను ఎగతాళి చేశారు. మరికొందరు 'డెమిసెక్సువల్' నిజమని అంగీకరించారు.
మంచి మానసిక బంధం ఏర్పడిన తర్వాతే డెమిసెక్సువల్ వ్యక్తులకు ఒకరిపై శృంగారపరంగా ఆకర్షణ కలుగుతుంది. అది స్వలింగ, ద్విలింగ సంపర్కులు కావొచ్చు లేదా వాళ్లు ఏ లింగ గుర్తింపునైనా కలిగి ఉండొచ్చు.
ఒకరితో మానసిక బంధం బలపడిన తర్వాతే సెక్యువల్ ఫీలింగ్ కలిగే వ్యక్తులను డెమిసెక్యువల్‌గా భావిస్తుంటారు.
'డెమిసెక్సువాలిటి' గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇది కూడా ఇతర లైంగిక ధోరణిల్లాంటిదే. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది.
'డెమిసెక్సువాలిటి' అనేది లైంగిక ఆసక్తి లేకపోవడం కిందికే వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే.. ఒక వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ముందు అతను/ఆమెతో మానసిక బంధం బలపడే వరకు డెమిసెక్సువల్ వ్యక్తులు ఎదురు చూస్తుంటారు.
అంటే అలాంటి మానసిక బంధం బలపడే వరకు వాళ్లు లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటారు. ఆ తర్వాత కూడా లైంగిక ఆకర్షణ ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
కానీ మిగతావాళ్లకు ఒకరిపట్ల లైంగిక ఆసక్తి కలగడానికి ఈ మానసిక బంధం ఏర్పడటం అనేది అంత ముఖ్యం కాదు. వాళ్లకు అది పెద్దగా అవసరం ఉండదు.
కెన్నెడీ కుమో ప్రకటన సానుకూల ప్రభావాలను కలిగి ఉందని 'సౌండ్స్ ఫేక్ బట్ ఓకే' పాడ్‌కాస్ట్ సహా సృష్టికర్త, డెమిసెక్సువల్ అయిన కైలా కజికా అన్నారు.
కెన్నెడీ కుమో ప్రకటన డెమిసెక్సువాలిటీ మీద కొందరు ప్రజల్లో చర్చను లేవదీసిందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Elle Rose
మరోవైపు, ఇలా విస్తృత చర్చ జరగడం వల్ల దీన్ని వ్యతిరేకించే వాళ్లూ పెరిగారు. తప్పుడు సమాచారం కూడా వ్యాప్తి చెందుతోంది.
డెమిసెక్సువాలిటీ అనే పదం ఎప్పటి నుంచో ఉంది. దానికి గురించి చాలామందికి తెలుసు. కానీ ఆ పదానికి సరైన నిర్వచనం చాలామందికి తెలియదని కైలా కజికా అన్నారు.
పైగా డెమిసెక్సువాలిటీ అనేది చాలా సహజమని చాలామంది కొట్టిపారేస్తుంటారు. దృఢమైన మానసిక బంధం ఏర్పడనంత వరకు ఒకరిపై మరొకరికి లైంగిక ఆకర్షణ కలగకపోవడం అనేది సహజమేనని చెబుతున్నారు.
కానీ అందరూ అలా ఉండరు కదా? అని కజికా ప్రశ్నించారు. అందుకే దీన్నిపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పారు.
డెమిసెక్సువల్‌గా చెప్పుకుంటున్న కజికాలాంటి వాళ్లు.. తమ లైంగిక ధోరణులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. డెమిసెక్సువల్ నిర్వచనంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలాకాలంగా అసలు పేరే లేని ఈ లైంగిక భావనను గురించి వివరించడం చాలా క్లిష్టమైన విషయం. దీని నిర్వచనం చాలామందిని అయోమయానికి గురి చేస్తుంది.
కానీ వీళ్ల కృషి వల్ల పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. గత ఏడేళ్ల నుంచి ఫేస్‌బుక్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలైంగిక (asexual) సంస్థలు డెమిసెక్సువాలిటీ గురించి చర్చిస్తున్నాయి.
'నేను దాన్ని చాలాకాలం వరకు ఒప్పుకోలేదు'
డెమిసెక్సువల్ అనే పదాన్ని 2006లో ఎసెక్సువల్ విజిబులిటి & ఎడ్యుకేషన్ నెట్‌వర్క్ ఫోరం - ఎవెన్ పోస్టులో మొదటిసారి వాడినట్లు చెబుతుంటారు.
కానీ డెమిసెక్సువల్ ధోరణితో పోలిస్తే ఇతరుల పట్ల లైంగిక ఆకర్షణ లేకపోవడం (asexuality) గురించి విస్తృతంగా చర్చిస్తారు.
ఎందుకంటే లైంగిక ఆకర్షణలు ఉన్న వారు ఎసెక్సువాలిటి గురించి అర్థం చేసుకోవడం సులభం. అలైంగిక వ్యక్తికి మరోవ్యక్తిపై ఎలాంటి లైంగిక ఆకర్షణలు ఉండవని కజికా చెప్పారు. ఈ ట్యాగ్ లైన్ ఉపయోగించడం సులభం. కానీ వారిలో ఒక బలమైన మానసిక బంధం ఏర్పడిన తర్వాత లైంగిక సంబంధాలపై ఆసక్తి ఏర్పడుతుందనే విషయం వింటే మిగతా లైంగిక భావనలు ఉన్న వాళ్లకు పెద్దగా అర్థం కాదని ఆమె అన్నారు.
కొన్ని సంవత్సరాల తర్వాత తన లైంగిక భావన గురించి ఒక స్నేహితుడికి వివరించిన తర్వాత అమెరికాలోని ఇండియానాలో ఉండే ఎల్లీ రోస్ తనను తాను డెమిసెక్యువల్‌గా చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఆమె నావైపు చూసి ఎల్లీ.. మీరు డెమిసెక్సువాలిటీ గురించి మాట్లాడుతున్నట్లు అనిపించిందని రోజ్ చెప్పారు. అసలు అదేంటో నాకు చాలా రోజుల వరకు అర్థం కాలేదని చెప్పారు. తాము డెమిసెక్సువల్ అని బహిరంగంగా చెబితే తమ డేటింగ్ జీవితం ఏమైపోతుందోననే భయంతో వాళ్లు ఆ విషయం బయటపెట్టలేదు. వాళ్లు తమను తాము 'పాన్‌సెక్సువల్' అని చెప్పుకున్నారు.

ఫొటో సోర్స్, Sounds Fake But Okay
జనం తమను తాము చూడగలుగుతున్నారు
అమెరికాలోని 'ప్యూర్ కల్చర్'కు డెమిసెక్సువాలిటీ పట్ల రోజ్ నిరాకరణ వైఖరులను పాక్షికంగా ఆపాదించారు. ఒకప్పుడు మీడియాలో మహిళలను బాగా లైంగికంగా చూపించారు. అదే సమయంలో మహిళలు వివాహం అయ్యే వరకు పవిత్రంగా ఉండాలని ఆశించారు. ఇది ఒకరకంగా ఒక వ్యక్తితో మానసిక బంధం ధృడపడే వరకు సెక్స్‌కు దూరంగా ఉండటంలాంటిదే. ఇదిప్పటికీ ఒక ప్రాధాన్యతగా ఉంది. దీన్ని డెమిసెక్సువల్స్ మాత్రం గుర్తించరు.
ఈ అవగాహన లోపం తరచూ ఒంటరితనానికి దారి తీస్తుంది. కెనడాలో ఉండే కైరో కెన్నడి కూడా నాతోటి వారిలాగే లైంగిక ఆకర్షణ లేకుండా పెరిగారు. ఇలా జరగడం గుండె పగిలినట్లు అనిపిస్తుందని ఆమె చెప్పారు. ఇదొక పెద్ద రహస్యంగా, అవమానానికి మూలంగా మారిందని ఆమె అన్నారు.
తన లైంగిక ధోరణికి కూడా ఒక పేరు ఉందని ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. అప్పుడు ఆమె చాలా సంతోషించింది. కానీ అప్పుడు దాని గురించి అంతగా సమాచారం లేదని ఆమె చెప్పారు. డెమిసెక్సువాలిటీ గురించి స్వయంగా అనుభూతి చెంది ఎవరూ పెద్దగా మాట్లాడేవారు కాదు. కానీ ఆమెకు కావాల్సిన సమాచారం ఎవెన్ పోస్టుల నుంచి లభించింది.
అది చదివిన తర్వాత 'ఓహ్.. ఇది నేను. కానీ ఇది ఎక్కువగా లేదు. నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు' అని ఆమె అనుకుంది.
ఆ ఖాళీని పూరించాలని కెన్నెడీ అనుకున్నారు. ఆమె డెమిసెక్సువల్ లైఫ్‌స్టైల్ బ్లాగ్ ప్రారంభించారు. దాని ద్వారా చాలామంది ఇతర డెమిసెక్సువల్స్ ఆమెను సంప్రదించారు. వారిలో టీనేజర్ల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా ఉన్నారు. వారిలో అమెరికా, యూరప్‌లలో ఉండేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. డెమెసెక్సువల్స్ ఇంత మంది ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయానని ఆమె చెప్పారు.
సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ఈ పదం చాలా పాపులర్ అయ్యిందని హవాయికి చెందిన హ్యూమన్ సెక్సువాలిటీ థెరపిస్ట్ జనెట్ బ్రిటో చెప్పారు.
2014లో అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసొటలో మెడిసిన్‌లో పీజీ చేస్తున్నప్పుడు తాను ఈ పదం మొదటిసారి విన్నానని ఆమె చెప్పారు.
ఇది లైంగిక భావన గురించి చెబుతున్నప్పటికీ.. ఈ పదం చాలాకాలంగా మనుగడలో ఉంది. ఈ డెమిసెక్సువాలిటీ అనేది అన్ని వయస్సుల వారిలో ఉందని బ్రిటో చెప్పారు. తాము డెమిసెక్సువల్ అని బహిరంగంగా చెప్పుకున్న ఆమె తొలి క్లయింట్స్ వయసు 20 ఏళ్ల వయసులో ఉన్నారని ఆమె తెలిపారు. వాళ్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారని, ఆ వేదికపై ఈ అంశంపై చర్చ ఆమోదయోగ్యమేనని ఆమె వివరించారు.
గతంలో వినిపించని అనేక గళాలకు సోషల్ మీడియా వేదిక అవుతోందని ఆమె అన్నారు. మొత్తానికి వాళ్లు తమకు తాము ప్రాతినిథ్యం వహిస్తున్నామని అనుకుంటున్నారని ఆమె వివరించారు.
ఐదేళ్ల క్రితం తన లైంగిక భావనకు పేరు పెట్టడానికి ఇంటర్నెట్ సాయం చేసిందని హెల్సెంకీ శివార్లలో ఉండే క్లాస్ రాబర్ట్స్ చెప్పారు.
చాలా విషయాల్లో ఫిన్లండ్ కాస్త వెనక ఉంటుంది. ఎందుకంటే తమది చాలా చిన్న దేశం అని ఆయన అన్నారు.
ఆయన ఎసెక్సువల్‌గా గుర్తించబడ్డారు. కానీ ఆన్‌లైన్ వేదికలపై పలు దేశాలకు చెందిన LGBTQ+ వ్యక్తులను కలిసిన తర్వాత తాను డెమిసెక్సువల్ అని ఆయన గ్రహించారు. డెమిసెక్సువల్ గురించి తెలిసిన వ్యక్తులకు, నేను దాని గురించి మాట్లాడినప్పుడు నా గురించి అర్థం చేసుకోవడం వారికి సులభం అవుతుందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Cairo Kennedy
లైంగికతను బాగా అర్థం చేసుకోండి
వివిధ రకాల లైంగిక ధోరణుల గురించి సమాచారం ఇవ్వడంలో ప్రధాన స్రవంతి సంస్థలు విఫలమవుతూ ఉంటాయి. అందుకే అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి ఆన్‌లైన్ వేదికలు కీలకంగా మారాయి.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్‌లో డిగ్రీ చేస్తున్న సమయంలో కజికా, ఆమె కో హోస్ట్ సారా కోస్టెల్లో తమ పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. అప్పట్లో వాళ్ల స్నేహితులు మాత్రమే విని వారికి సపోర్ట్ చేశారు. ఇవాళ వాళ్ల పాడ్‌కాస్ట్ ఇంగ్లిష్ మాట్లాడే దేశాలకు, యూరప్ వరకు విస్తరించింది.
సౌండ్స్ ఫేక్ బట్ ఓకే ఎపిసోడ్‌ను వారానికి ఏడు వేల మంది వింటారని కజికా అంచనా వేస్తున్నారు. కేవలం లైంగిక ఆకర్షణలేని వాళ్లు మాత్రమే కాదు.. వాళ్ల తల్లిదండ్రులు, భాగస్వాములు, స్నేహితులు కూడా విని, విజ్ఞానం పొందుతారని ఆమె చెప్పారు.
ఈ అవగాహన.. డెమిసెక్సువల్స్ డేటింగ్ లాంటి ఇతర వ్యాపకాలు పెట్టుకోవడానికి సాయం చేస్తోంది. డెమిసెక్సువల్ డేటింగ్‌ను కొన్ని యాప్స్ సులభతరం చేశాయని కజికా చెప్పారు. ఎందుకంటే ఆ యాప్స్‌లో మన ప్రొఫైల్‌లో మనం డెమిసెక్సువల్ అని స్పష్టంగా రాసుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల మొదటి డేటింగ్ సంభాషణను తేలిగ్గా మారుస్తుంది.
మొదటి డేట్ కాజువల్‌గా ఉండాలని ఆమె చెబుతారు. నా గుర్తింపు గురించి లోతుగా చర్చిద్దాం. అసలు అదేంటో మీకు వివరిస్తాను. ఎందుకంటే డెమిసెక్సువల్ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు.. ఇలా ఉండాలని ఆమె అన్నారు.
మొత్తానికి లైంగిక ఆకర్షణ లేని వ్యక్తుల కమ్యూనిటీలో ఉన్న వైవిధ్యం గురించి చర్చించడం, నేర్చుకోవడం చాలా కీలకమని పరిశోధనకారులు బొగెర్ట్ అన్నారు. లైంగిక మైనారిటీలను పరాయివారిగా చూసే భావనను తగ్గించడానికి ఇది చాలా అవసరమని చెప్పారు. అంతేకాదు..వారి లైంగికతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకు సాయం చేస్తుందని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువు
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- కోవిడ్ టీకా: రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?
- 18 రోజుల తర్వాత తాళం వేసి ఉన్న ఇంట్లో దొరికిన నాలుగేళ్ల చిన్నారి
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)















