1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం: ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1971 డిసెంబరు 4న, ఉదయం నాలుగు గంటలకు పంజాబ్ సరిహద్దుల్లోని ఆదమ్‌పూర్ వైమానిక స్థావరంలో సైనిక చర్యలపై సమాచారం కోసం 101 స్క్వాడ్రన్‌కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ గుర్‌దీప్ సింగ్ సామ్రా ఎదురుచూస్తున్నారు.
ఆ ముందు రోజు రాత్రి ఆయన సరిగా నిద్రపోలేదు. ఎందుకంటే సరిహద్దుల్లోని భారత శిబిరాలపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు దాడులుచేస్తూ ఆ రోజే యుద్ధాన్ని మొదలుపెట్టాయి.
ఉదయం 9.15 గంటలకు ఆదమ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి సుఖోయ్-7 యుద్ధ విమానంలో సామ్రా బయలుదేరారు. సరిహద్దుల్లోని ఛంబ్ సెక్టార్‌లో పాకిస్తానీ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆయనకు రెండు నెలల క్రితమే మణిందర్ కౌర్‌తో వివాహమైంది.
పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులే లక్ష్యంగా 57 ఎంఎం రాకెట్లతో సామ్రా దాడులు చేయడం మొదలుపెట్టారు. అయితే, ఒక్కసారిగా తన యుద్ధ విమానానికి ఏదో తాకిన శబ్దం ఆయనకు వినిపించింది. అప్పుడే, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్ నుంచి పేల్చిన షెల్స్ తన విమానానికి తాకినట్లు ఆయన గుర్తించారు.
ఒక్కసారిగా కాక్‌పిట్‌లో రెడ్ లైట్లు వెలిగాయి. ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందని, మంటలు అంటుకున్నాయని సంకేతం ఇచ్చేలా సీటుకు ఎదురుగా ఉండే మీటర్ సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
ఉన్నఫళంగా విమానం నుంచి బయటకు దూకితే ఆయన నేరుగా పాకిస్తాన్ భూభాగంలో పడతారు. అయితే, భారత్ భూభాగం వైపుగా వెళ్లేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించడం మొదలుపెట్టారు.
ఆయన విమానం చాలా ఎత్తులో ఉంది. దీంతో భారత భూభాగం దిశగా కదిలేందుకు ఆయనకు అవకాశం దక్కింది. ఒకవేళ పాకిస్తాన్ భూభాగంలో పడితే, ఆయన్ను యుద్ధ ఖైదీగా తీసుకెళ్లిపోతారు.
‘‘నా అత్యవసర పరిస్థితి గురించి రేడియో కనెక్టివిటీ ద్వారా కంట్రోల్ రూమ్‌కు చెప్పేందుకు ప్రయత్నించాను. విమానం లోనుంచి దూకేయాలని భావిస్తున్నట్లు చెప్పాలని అనుకున్నారు. మరోవైపు ఇంజిన్ మళ్లీ మొదలుపెట్టేందుకు ప్రయత్నించాను. ఒకవేళ ఇంజిన్ మొదలైతే, సమీపంలోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో నేను ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వొచ్చు’’అని ఆనాటి పరిస్థితులను గుర్‌దీప్ సింగ్ సామ్రా గుర్తుచేసుకున్నారు.
‘‘ప్రాణాలకు ముప్పు పొంచివున్నప్పుడు చేసే ‘మే డే కాల్’ను కూడా చేసేందుకు ప్రయత్నించాను. కానీ ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా చెట్టు ఎత్తుకు నా విమానం వచ్చినట్లు అప్పుడే గమనించాను. వెంటనే బయటకు దూకేందుకు వీలుకల్పించే ఎజెక్షన్ బటన్ నొక్కేశాను. నేను బటన్ నొక్కిన వెంటనే, కొన్ని సెకన్లపాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ అయితే దాదాపు జీరో చూపించింది. అప్పటికి ఉదయం పది గంటలైంది.’’

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
మంటల మధ్యలో పారాచ్యూట్
పారాచ్యూట్ సాయంతో సామ్రా బయటపడిన వెంటనే, విమానం నేలపై కుప్పకూలింది.
సామ్రాకు కింద అన్నివైపులా మంటలే కనిపించాయి. దీంతో అసలు పారాచ్యూట్ ఎటు తీసుకెళ్తోందో ఆయనకు సరిగా అర్థం కాలేదు.
‘‘అది ఎవరికీ చెందని భూభాగం (నో మ్యాన్స్ ల్యాండ్)’’అని సామ్రా చెప్పారు. ‘‘నేను పారాచ్యూట్‌తో కిందకు దిగేటప్పడు నా బట్టలకు మంటలు అంటుకున్నాయి. నా కనుబొమ్మలు కూడా కాలిపోయాయి. నేను చాలా తక్కువ ఎత్తులో విమానం నుంచి బయటకు దూకాను. దీంతో సరిగ్గా ల్యాండ్ అయ్యేందుకు నాకు వీలు లేకుండా పోయింది.’’
‘‘మంటలు, వేడి వల్ల నా పారాచ్యూట్ ముడుచుకుపోయినట్లు అయిపోయింది. దీంతో ఆకాశం మీద నుంచి రాయిపడినట్లు నేను నేల మీద పడ్డాను. నా చుట్టుపక్కల అంతా మంటలే ఉన్నాయి. దీంతో వెంటనే లేచి, కాస్త పక్కకు వెళ్లిపోవాలని చూశాను. అప్పుడే నా కాలి ఎముక విరిగిపోయిందని అర్థమైంది. అసలు నడవలేకపోయాను. కనీసం కాళ్ల మీద నిలబడటం కూడా కష్టమైంది’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
150 మీటర్ల దూరంలో అంబులెన్స్
సామ్రాకు కాలి నొప్పి చాలా ఎక్కువైంది. మరోవైపు మంటలు కూడా నొప్పిని తీవ్రం చేశాయి. అక్కడి నుంచి పక్కకు వెళ్లేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, అప్పుడే విమానంలోని బాంబులు పేలడం మొదలయ్యాయి. అయితే, అదృష్టవశాత్తు ఆ పేలుడు మరో వైపుగా దూసుకెళ్లింది.
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విమానం నుంచి బయటకు దూకిన సామ్రా... అందులోని బాంబుల సెగను కూడా చవిచూడాల్సి వచ్చింది. వెంటనే, మాస్క్‌ను తీసేసి పక్కనే ఉన్న చెట్లవైపు ఆయన దొర్లుకుంటూ వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయనకు విపరీతంగా దాహం వేసింది. మరోవైపు ఒళ్లంతా చెమటలతో తడిచిపోయింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల తర్వాత ఆయన ఒక అంబులెన్స్ వస్తుండటాన్ని గమనించారు.
‘‘ఆ అంబులెన్స్ నాకు 150 మీటర్ల దూరం వరకు వచ్చింది. అయితే, ఆ అంబులెన్స్ భారత్‌దో లేదా పాకిస్తాన్‌దో నాకు తెలియదు. తీవ్రంగా గాయపడిన నేను నడవడం కూడా కష్టమైంది. శత్రువు లేదా మిత్రుడు ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి నాది. నేను ఏదో ఒకటి చేసేలోపే, ఆ అంబులెన్స్ కళ్ల ముందు నుంచి మాయమైంది. అంతా ఒక ఎండమావిలా అనిపించింది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
కాసేపటికి మరో జీపు
ఇప్పుడు ఏం చేయాలి? అంటూ సామ్రా ఆలోచించడం మొదలుపెట్టారు. వెంటనే తన పైలట్ జాకెట్‌ను మంటల్లోకి విసిరిపారేయాలనే ఆలోచన వచ్చింది. లోపల ఆయన సాధారణ పౌరుల్లానే బట్టలు వేసుకున్నారు.
తన జుట్టుకు కత్తిరించుకునేందుకు కత్తెరతోపాటు అవసరమైనప్పుడు ఉపయోగించేందుకు పాకిస్తానీ కరెన్సీ కూడా ఆయన దగ్గర ఉంది.
దాదాపు 45 నిమిషాల తర్వాత, మరో వాహనం తన వైపుగా రావడాన్ని సామ్రా గమనించారు. అదొక విల్లీస్ జీప్.
‘‘బహుశా ఆ మంటలు చూసి, విమాన ప్రమాదం నుంచి ఎవరూ బయటపడి ఉండకపోవచ్చని అంబులెన్స్‌లో ఉన్నవారు అనుకుని ఉండొచ్చు. అందుకే వారు వెళ్లిపోయారు. అయితే, నా వైపుగా వస్తున్న చిన్న జీపును ఎలాగైనా ఆపాలని అనుకున్నాను. విజిల్ వేసి, చప్పట్లు కొట్టి వారిని పిలిచేందుకు ప్రయత్నించాను. మొత్తానికి వారు నావైపుగా వచ్చారు. కాసేపటికి నా చుట్టూ సైనికులు కనిపించారు’’అని సామ్రా వివరించారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
రివాల్వర్, మ్యాప్స్ తీసుకున్నారు..
‘‘వారి రైఫిల్స్ నా వైపుగా గురిపెట్టారు. నాకు ఏదో హాలీవుడ్ సినిమా చూసినట్లు అనిపించింది. అసలు ఏమీ అర్థంకాలేదు. అంతా నిశ్శబ్దం ఆవరించింది. కాసేపటికి, కాస్త దూరంలో ఏవో యుద్ధ ట్యాంకుల కాల్పుల శబ్దం వినిపించింది’’అని సామ్రా వివరించారు.
‘‘నువ్వు ఎవరు? అంటూ కెప్టెన్ అప్పయ్య, ఆయనతో వచ్చిన సైనికులు ప్రశ్నించారు. నేను భారతీయుణ్ని అని వారికి చెప్పారు. వారి ముఖంలో ఎలాంటి భావాలూ కనిపించలేదు. ఆ తర్వాత, నీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? అని అడిగారు. ఉంటే మాకు ఇచ్చేయమని సూచించారు. దీంతో వెంటనే నా దగ్గరున్న రివాల్వర్ ఇచ్చేశాను.’’

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
‘‘నీ దగ్గర ఏమైనా మ్యాప్స్ లేదా ఇతర డాక్యుమెంట్లు, కోడ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి కూడా ఇచ్చేయ్ అని అన్నారు. దీంతో మొత్తం అన్నీ వారికి ఇచ్చేశాను. అయినప్పటికీ, నన్ను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యాను. నేను ఏ బ్రిగేడ్‌లో పనిచేస్తున్నానో కూడా చెప్పాను. ఆ తర్వాత ఎప్పటినుంచో నన్ను తొలిచివేస్తున్న ప్రశ్నను అడిగాను. ‘మీరు ఎవరు?’అని ప్రశ్నించాను. దీంతో కాసేపటి తర్వాత కెప్టెన్ అప్పయ్య వచ్చి.. మేం భారతీయులమని చెప్పారు.’’
బంకర్‌లో..
‘‘కాసేపటి తర్వాత, సామ్రాను భారత సైనికులు తమ జీపులో ఎక్కించుకున్నారు. విల్లీస్ జీపు చాలా చిన్నగా ఉంటుంది. అందులో అప్పటికే ముగ్గురు ఉన్నారు. వారి వెనుక పైభాగంలో నేను పడుకోవాల్సి వచ్చింది. అప్పటికే నా కాలి ఎముక మూడుచోట్ల విరిగిపోయింది. నా పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు’’అని సామ్రా వివరించారు.
మీరు అంబులెన్స్‌ను ఎందుకు పిలవడం లేదు? అని వారిని ప్రశ్నించాను. అప్పుడు దగ్గర్లో కనిపిస్తున్న పాకిస్తానీ యుద్ధ ట్యాంకులవైపు కెప్టెన్ అప్పయ్య చూపించారు. ‘‘ఇక్కడ మనం ఎక్కువ సేపు ఉండకూడదు. ఎందుకంటే పాకిస్తానీ యుద్ధ ట్యాంకులు మనల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశముంది’’అని అప్పయ్య అన్నారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
ఆ జీపులో కొంతదూరం వరకు సామ్రాను తీసుకెళ్లారు. అక్కడి నుంచి అండర్‌గ్రౌండ్ బంకర్‌కు తరలించారు. ఒక చెట్టు పక్కనే ఆ బంకర్ ఉంది. ఆ పక్కనే భారత యుద్ధ ట్యాంకు కూడా ఉంది. దానివైపుగా పాకిస్తానీ యుద్ధ ట్యాంకులు కాల్పులు జరుపుతున్నాయి. అయితే, అదృష్టవశాత్తు వీరు పాకిస్తానీ ట్యాంకులకు లక్ష్యంగా మారలేదు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
జౌరియా ఆసుపత్రిలో ప్లాస్టర్
అయితే, సామ్రా కష్టాలు అక్కడితో తీరిపోలేదు. ట్యాంకు నుంచి పేలుడు జరిగినప్పుడల్లా, భూకంపం వచ్చినట్లు నేల వణికేది. చుట్టుపక్కల అంతా గాల్లోకి దుమ్ము లేచేది. బంకర్ లోపల గాయపడిన సైనికులకు ఓ వైద్య సిబ్బంది సేవలు అందించేవారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
సాయంత్రం మరికొంత మంది గాయపడిన సైనికులతోపాటు సామ్రాను కూడా అంబులెన్స్‌లోకి ఎక్కించారు. వీరిని జౌరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకునే సరికి సమయం తొమ్మిది అయ్యింది. అయితే, అక్కడ ఎక్స్‌రే మెషీన్ లేదు. అయితే, నా కాలిని పరీక్షించిన వైద్యులు.. మూడు చోట్ల ఎముక విరిగిందని చెప్పారు.
ఎలాంటి మత్తుమందూ ఇవ్వకుండానే లాంతరు వెలుగుల్లో ఆయన కాలికి ఒక ప్లాస్టర్ వేశారు. అయితే, ప్లాస్టర్ చాలా గట్టిగా వేశారు. దీంతో నొప్పి మరింత ఎక్కువైంది.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
పాకిస్తాన్ యుద్ధ విమానం దాడి
డిసెంబరు 5 ఉదయం నాటికి సామ్రాను ‘‘మిస్సింగ్ ఇన్ యాక్షన్’’గా ప్రకటించారు. ఆదమ్‌పూర్ వైమాని స్థావరం ఆయన ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించింది. అయితే, ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. సామ్రాతోపాటు పనిచేసే సైనికులు సామ్రా సమాచారం కోసం చాలా ఎదురుచూశారు.
మరుసటిరోజు రాత్రికి గాయపడిన వారిని తీసుకెళ్లడానికి ఎంఐ-4 హెలికాప్టర్ వస్తుందని సామ్రాకు చెప్పారు. గాయపడిన వారిని ఉధమ్‌పూర్ ఆసుపత్రికి తరలిస్తారని వివరించారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
‘‘మేం నలుగురు క్షతగాత్రులం ఉన్నారు. హెలికాప్టర్ ఇంజిన్ ఆపకుండానే, వెంటవెంటనే అందరినీ ఎక్కించుకుని తీసుకెళ్లాలని ప్రణాళికలు రచించారు. అయితే, మమ్మల్ని స్ట్రెచర్‌పై పెట్టి తీసుకెళ్తుండగా, ఒక్కసారిగా పాకిస్తానీ మిగ్-9 యుద్ధ విమానం బాంబులతో దాడులు మొదలుపెట్టింది’’అని సామ్రా వివరించారు.
‘‘బహుశా, హెలికాప్టర్ వచ్చినప్పుడు గాల్లోకి దుమ్ము రేగడంతో వారు గుర్తించి ఉండొచ్చు. వెంటనే హెలికాప్టర్ ఇంజిన్ ఆపేశారు. మమ్మల్ని తీసుకెళ్తున్న సైనికులు అక్కడే మమ్మల్ని వదిలేశారు. వారు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బంకర్‌లోకి వెళ్లిపోయారు.’’
‘‘దీంతో పాకిస్తానీ యుద్ధ విమానానికి మేం లక్ష్యాలుగా మారే పరిస్థితి వచ్చింది. అయితే, భారత సైన్యానికి చెందిన ఓ అధికారి మమ్మల్ని కాపాడారు. క్షతగాత్రులను అలా వదిలి వచ్చేస్తారా? అంటూ ఆయన గట్టిగా అరిచారు. దీంతో మమ్మల్ని మళ్లీ వారు సురక్షితమైన ప్రాంతానికి తీసుకువచ్చారు.’’
ఉధమ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స
పాకిస్తాన్ యుద్ధ విమానం దాడి ముగిసిన వెంటనే, గాయపడిన సైనికులందరినీ ఆ హెలికాప్టర్‌లోకి ఎక్కించారు. అందరినీ ఉధమ్‌పూర్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి దిల్లోలోని సైనిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మూడు నెలల పాటు దిల్లీలోని సైనిక ఆసుపత్రిలోనే సామ్రా చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ జనవరి 1973లో ఆయన విమానం నడిపారు.

ఫొటో సోర్స్, Gurdeep Singh Samra
1995లో భారత వైమానిక దళం నుంచి గ్రూప్ కెప్టెన్ హోదాలో ఆయన పదవీ విరమణ పొందారు.
ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలోనూ ‘‘రిజర్వు ఆఫీసర్’’గా భారత సైన్యం కోసం పనిచేసే అవకాశం సామ్రాకు దక్కింది. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి జలంధర్‌లో ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- COP26: ‘ఈ సదస్సు విఫలమైంది... ఇదో రెండు వారాల వేడుక’ - గ్రెటా థన్‌బర్గ్
- మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వెనుక రాజకీయ కారణాలున్నాయా?
- కోవిడ్ టీకా: రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?
- కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువు
- హెచ్‌పీవీ వ్యాక్సీన్‌తో మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ నివారించవచ్చా?
- శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
- అర్ధరాత్రి మాయమైన చిన్నారిని ఎలా గుర్తించారు, ఆ రహస్యాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదు?
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












