ఆస్ట్రేలియా: అర్ధరాత్రి మాయమైన చిన్నారిని ఎలా గుర్తించారు, ఆ రహస్యాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదు?

క్లియో స్మిత్

ఫొటో సోర్స్, WA POLICE

ఫొటో క్యాప్షన్, క్లియో స్మిత్

నవంబర్ 3 ఉదయం ఆస్ట్రేలియలోని కెనావన్ పట్టణంలో ఉన్న ఓ ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. 18 రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి క్లియో స్మిత్‌ను వారు అక్కడ గుర్తించారు.

నాలుగేళ్ల క్లియో స్మిత్ అక్టోబర్ 16న కెనావన్ సమీపంలోని క్యాంప్‌సైట్‌లో తన కుటుంబం ఉంటున్న టెంట్ ‌నుంచి మాయమైంది. చిన్నారిని వెతకడం కోసం పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.

చిన్నారిని తన ఇంట్లో దాచిన 36 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. టెరెన్స్ డారెల్ అనే ఈ వ్యక్తి మైనర్ బాలికను అక్రమంగా ఎత్తుకెళ్లాడని పోలీసులు అభియోగాలు మోపారు.

క్లియో తప్పిపోయిన ప్రాంతం ఇదే

ఫొటో సోర్స్, WA POLICE

ఫొటో క్యాప్షన్, క్లియో తప్పిపోయిన ప్రాంతం ఇదే

'గడ్డివాములో సూదిని వెతికాం'

సెలవులు గడపడానికి క్లియో కుటుంబం క్వాబా బ్లోహోల్స్‌కు వెళ్లారు. అక్కడ క్యాంపింగ్ గ్రౌండ్‌లో ఉన్న టెంట్‌లో బస చేశారు. అక్టోబర్ 16న అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారి 6.00 మధ్య కాలంలో క్లియో స్మిత్ టెంట్ నుంచి కనిపించకుండా పోయింది.

మాక్లియోడ్‌లో ఉన్న ఈ మారుమూల ప్రాంతం, పెర్త్ నుంచి దాదాపు 900 కి.మీ దూరంలో ఉంది. సముద్ర గుహలు, కోరల్స్‌తో నిండి ఉన్న ఈ ప్రాంతం పర్యటకులను ఆకర్షిస్తుంది.

ఆ రాత్రి క్లియో స్మిత్ టెంట్‌లో తన చెల్లి కాట్ పక్కనే పడుకుని నిద్రపోయింది. అదే టెంట్‌లో మరో గదిలో నిద్రిస్తున్న క్లియో తల్లి తెల్లవారు జామున లేచి చూసేసరికి క్లియో కనిపించలేదు. టెంట్ తలుపులు తెరిచి ఉన్నాయి.

క్లియో తనంతట తాను బయటకు వెళ్లలేదని, ఆమెను ఎవరో అపహరించారని పాప తల్లి పోలీసులతో అన్నారు. దాంతో స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

పెర్త్ నుంచి వందమంది పోలీసు సిబ్బంది కూడా వచ్చి పాప కోసం వెతికారు. నిఘా విమానాలను ఉపయోగించి మూల మూలలా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

చిన్నారి కోసం మా సెర్చ్ ఆపరేషన్ 'గడ్డివాములో సూది' కోసం వెతికినట్లుగా ఉందని వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కల్నల్ బ్లాంచ్ అన్నారు.

క్లియో స్మిత్ కోసం వందలమంది పోలీసు సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, క్లియో స్మిత్ కోసం వందలమంది పోలీసు సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు

ఆధారాల కోసం వేట

క్లియో ను వెతకాల్సిన ప్రదేశాలలో పక్కనే ఉన్న సముద్రంతోపాటు, పెద్దగా జన సంచారం లేని ప్రాంతాలు ఉన్నాయి. వీటిని జల్లెడ పట్టే క్రమంలో నిఘా విమానాలను కూడా ఉపయోగించారు.

''విమానాలు, గుర్రాలు, డ్రోన్‌లు ఉపయోగించారు. ప్రతి అంగుళాన్ని మ్యాప్ చేసి వెతికారు'' అని ఈ వార్తను కవర్ చేసిన ఏబీసీ టెలీవిజన్ రిపోర్టర్ ఎవెలిన్ మేన్‌ఫీల్డ్ అన్నారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని 600 కి.మీ విస్తీర్ణంలో రోడ్డు పక్కన ఉన్న బస్తాలకు బస్తాల చెత్తకుప్పలను పోలీసులు నిశితంగా పరిశీలించారు.

పాప ఆచూకీ కోసం వందలు వేల ఆధారాలను పరిశీలించామని డిటెక్టివ్ సూపరింటెండెంట్ రాడ్ వైల్డ్ చెప్పారు."మేం చాలా సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది. క్యాంప్‌ సైట్‌లో ఉన్న 100మంది వ్యక్తుల స్టేట్‌మెంట్‌లు, సీసీటీవీ ఫుటేజీ, ఫోన్‌ డేటా ను కూడా పరిశీలించాం" అని ఆయన వివరించారు.

క్లియో ఆచూకీ పై సమాచారం ఇచ్చిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతిని కూడా ప్రకటించారు.

ఫోన్ డేటా కూడా కీలక పాత్ర పోషించిందని డిప్యూటీ కమిషనర్ బ్లాంచ్ తెలిపారు. "ఇది ఒక పెద్ద పజిల్. చాలా విషయాలు ఇందులో కీలకంగా మారాయి'' అని బ్లాంచ్ అన్నారు.

''పోలీసుల తమదైన రీతిలో పరిశోధన చేశారు. ప్రతి చిన్న ఆధారం ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఉపయోగపడింది'' అని కమిషనర్ క్రిస్ డాసన్ అన్నారు

క్లియో ను క్షేమంగా రక్షించగలిగిన పోలీసులు ఆ వివరాలను మాత్రం వెల్లడించడం లేదు.

ఫొటో సోర్స్, WA POLICE

ఫొటో క్యాప్షన్, క్లియో ను క్షేమంగా రక్షించగలిగిన పోలీసులు ఆ వివరాలను మాత్రం వెల్లడించడం లేదు.

ఆపరేషన్‌లో చివరి భాగాలు

క్లియో సజీవంగా, క్షేమంగా ఉన్న కెనవాన్‌లోని తాళం వేసి ఇంటికి పోలీసులు ఎలా వెళ్లగలిగారు ? ఈ విషయంపై స్పష్టమైన సమాచారం రావడం లేదు.

''ఒక కారు గురించి అందిన అత్యంత నమ్మకమైన సమాచారం బుధవారం పోలీసులు ఆ ఇంటికి నేరుగా వెళ్లడానికి సహాయ పడింది'' అని కమిషనర్ డాసన్ విలేఖరులతో అన్నారు. అయితే, ఆ సమాచారం ఏంటన్నది మాత్రం ఆయన బయటపెట్టలేదు.

''పోలీసులు తమకు అందిన సమాచారం మొత్తాన్ని సేకరించడం, తర్వాత సరైన వ్యక్తులను సరైన ప్రాంతంలో మోహరించడం ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారన్న విషయం తెలిసింది'' అని డిటెక్టివ్ వైల్డ్ చెప్పారు.

క్లియో తల్లి ఎల్లి స్మిత్, మారు తండ్రి జేక్ గ్లిడ్డన్

ఫొటో సోర్స్, WA POLICE

ఫొటో క్యాప్షన్, క్లియో తల్లి ఎల్లి స్మిత్, మారు తండ్రి జేక్ గ్లిడ్డన్

నిందితుడి గురించి మంగళవారం మధ్యాహ్నమే స్పష్టత వచ్చిందని, ఇదే అతని అరెస్టుకు దారితీసిందని ఆయన తెలిపారు. పోలీసులు క్లియో ను రక్షించడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తిని అతని వాహనంలోనే అరెస్టు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పోలీసు కస్టడీలో ఆ వ్యక్తి తనను తాను గాయపరుచుకోవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించి తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు.

"ఈ కేసులో చాలా ఆధారాలు లభించాయి. వాటన్నింటినీ ఒకచోట చేర్చినప్పుడు అవన్నీ ఒకవైపే చూపించాయి. అక్కడే మేం క్లియోను సురక్షితంగా చూడగలిగాం" అని కమిషనర్ డాసన్ చెప్పారు.

అయితే ఆ రాత్రి జరిగిన ఘటనలపై విచారణ ఇంకా ముగియలేదు. ఈ వ్యవహారంలో ఇంకా ఏమేం జరిగిందో పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు

అక్టోబర్ 15, నవంబర్ 2 మధ్య తమ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను అందించాలని ఆ ప్రాంతంలోని వ్యాపార సంస్థలకు, వ్యక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఈ కిడ్నాప్ వ్యవహారంపై క్లియో ఏమైనా చెప్పగలుగుతుందా? ఈ విషయం కోసమే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు నిపుణులను పిలిపించారు. ఆమె నుంచి ఉపయోగపడే సమాచారం రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చని కూడా వారు వెల్లడించారు.

''ఇది ఎంతకాలమైనా పట్టవచ్చు. కానీ, ఆమె ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలి'' అని డిటెక్టివ్ వైల్డ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)