ఆస్ట్రేలియా: చోరీకి గురైన రూ. 16 కోట్ల విలువైన కళాఖండాలు మళ్లీ భారత్‌కు

12వ శతాబ్దం నాటి ఈ విగ్రహాన్ని కూడా భారత్‌కు ఆస్ట్రేలియా అప్పగించనుంది

ఫొటో సోర్స్, National Gallery of Australia

ఫొటో క్యాప్షన్, 12వ శతాబ్దం నాటి ఈ విగ్రహాన్ని కూడా భారత్‌కు ఆస్ట్రేలియా అప్పగించనుంది

చోరీకి గురైనట్లుగా, అక్రమంగా చేతులు మారినట్లుగా భావిస్తున్న 14 కళాఖండాలను భారత్‌కు ఆస్ట్రేలియా అప్పగించనుంది.

ఈ కళాఖండాల్లో శిల్పాలు, పెయింటింగ్‌లు, ఓ స్క్రోల్ కూడా ఉన్నాయి. వీటి విలువ 2.2 మిలియన్ల డాలర్లు. అంటే భారత కరెన్సీలో 16.36 కోట్లు.

‘‘ఈ కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చేస్తే.. మన చరిత్రలో ఒక ఇబ్బందికర అధ్యాయానికి ముగింపు పడుతుంది’’అని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా డైరెక్టర్ నిక్ మిట్జేవిచ్ అన్నారు.

ఈ కళాఖండాల్లో కొన్నింటితో శుభాష్ కపూర్‌కు సంబంధముంది. న్యూయార్క్‌ చెందిన కపూర్.. కళాఖండాలను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

భారత్‌లో కపూర్‌పై కేసులు కూడా నమోదుఅయ్యాయి. అయితే, ఆ ఆరోపణల్ని కపూర్ ఖండించారు.

ఓ గుజరాతీ కుటుంబం గ్రూప్ ఫోటో

ఫొటో సోర్స్, National Gallery of Australia

ఫొటో క్యాప్షన్, ఓ గుజరాతీ కుటుంబం గ్రూప్ ఫోటో కూడా ఈ కళాఖండాల్లో ఒకటి

12వ శతాబ్దంనాటివి..

ఈ కళాఖండాల్లో కొన్ని 12 శతాబ్దపు కాలంనాటివి కూడా ఉన్నాయి. చోళుల హయాంలో తమిళనాడులో హిందూ కళలు విరాజిల్లుతున్నప్పుడు వీటిని తయారుచేశారు.

కపూర్ ద్వారా కొనుగోలు చేసిన చాలా కళాఖండాలను ఇప్పటికే క్యాన్‌బెర్రా గ్యాలరీ తిరిగి ఇచ్చేసింది. వీటిలో 2008లో సంస్థ కొనుగోలుచేసిన 5 మిలియన్ల డాలర్ల (37.19 కోట్ల రూపాయలు) విలువైన శివుడి విగ్రహం కూడా ఉంది.

కొన్ని నెలల్లోనే ప్రస్తుత కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చేస్తామని నిక్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

ఈ చర్యలను ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్ స్వాగతించారు. ‘‘రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఇది ప్రతీక’’అని ఆయన అన్నారు.

నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా

కళాఖండాలను చరిత్ర, వాటి చట్టపరమైన యాజమాన్య హక్కులను పరిగణలోకి తీసుకొనేలా కొత్త నిబంధనలను సిద్ధం చేసినట్లు ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీ తెలిపింది.

‘‘కళాఖండాలను అక్రమంగా తీసుకొచ్చినా లేదా చోరీకి గురైనట్లు అనుమానం వచ్చినా, సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం సదరు దేశానికి ఆ కళాఖండాలను తిరిగి ఇచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’అని దీనిపై నేషనల్ గ్యాలరీ ఒక ప్రటకన విడుదల చేసింది.

చోరీకి గురైన, అక్రమంగా చేతులు మారిన వందల కొద్దీ ప్రముఖ కళాఖండాలను ‘‘ఆపరేషన్ హిడెన్ ఐడల్’’ పేరుతో అమెరికా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లోనూ సుభాష్ కపూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదివరకు మ్యాన్‌హాటన్‌లో ‘‘అప్పర్ ఈస్ట్ సైడ్’’ పేరుతో కపూర్ ఓ గ్యాలరీని నిర్వహించేవారు. దీనిలో 2012లో అమెరికా అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)