షిఫ్టు డ్యూటీల్లో పని చేసేవారి శరీరంలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు

ఇటీవలి కాలంలో ఆరోగ్య సిబ్బంది వివిధ షిఫ్టుల్లో పని చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆరోగ్య సిబ్బంది వివిధ షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది

షిఫ్టుల్లో పని చేయాల్సి రావడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కేవలం రాత్రిపూట ఒక్కటే కాదు.

9-5 పని గంటలకు భిన్నంగా వివిధ రకాల డ్యూటీలు ఉంటున్నాయి. ఉదయం క్లీనింగ్ పని చేయడం, షాపులు, టాక్సీలు నడపడం, ఆరోగ్యశాఖ పనులు.. ఇలాంటివెన్నో.

షిఫ్టుల్లో పని చేయడానికి అనేకమందికి అనేక కారణాలుంటాయి.

ఉపాధి కోసం తప్పని స్థితిలో కొందరు, ఉద్యోగ స్వభావం (నేచర్ ఆఫ్ జాబ్) రీత్యా మరికొందరు, పిల్లలు, ఇంటి పనులు చక్కబెట్టుకునేందుకు ఇంకొందరు షిప్ట్‌ల వారీ విధులకు ఒప్పుకుంటారు.

నైట్ షిఫ్టుల్లో పని చేసేవారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం మరింత అవసరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నైట్ షిఫ్టులో పని చేసేవారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం మరింత అవసరం

షిఫ్టుల్లో పని చేయడం వల్ల వచ్చే ఇబ్బందులేంటి?

షిఫ్టుల్లో పని చేసేవారిలో బరువు పెరగడం, రక్తపోటు, షుగర్, హృద్రోగాల్లాంటి అనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని పరిశోధనలు తేల్చాయి.

''అనుకోని సమయాల్లో మేల్కోని ఉండటం'' కారణంగా శరీరం ధర్మం గతి తప్పిపోతున్నట్లు, దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నట్లు గుర్తించారు. ఇటీవల జరిగిన పరిశోధనలు మొదట్లో ఊహించినదానికన్నా సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నాయి.

చాలామంది భావిస్తున్నట్లు మనిషి శరీరానికి ఒకటే 'బాడీక్లాక్' ఉండదు. ప్రతి అవయవానికి ఒక క్లాక్ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రతి అవయవానికి సంబంధించిన క్లాక్‌ పని తీరుకు ఇబ్బంది కలిగేలా మన షిఫ్టు విధులు సాగుతుంటే సమస్య మొదలవుతుంది.

మన కడుపులో ఉండే బ్యాక్టీరియాకు కూడా ఒక లయ ఉంటుంది. మన షిఫ్టు డ్యూటీల కారణంగా ఆ లయ దెబ్బతింటుంది. దానివల్ల శరీరం మొత్తానికి సమస్యలు మొదలవుతాయి.

నైట్ షిఫ్టు చేసిన వారు పగలు నిద్రపోవడానికి సరైన వాతావారణాన్ని సృష్టించుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నైట్ షిఫ్టు చేసిన వారు పగలు నిద్రపోవడానికి సరైన వాతావారణాన్ని సృష్టించుకోవాలి

ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?

ఇప్పుడు ఆధునిక కాలంలో మనకిష్టమైన షిఫ్టులను కోరి కొనసాగించుకునే పరిస్థితి లేదు. అందుకే, ఇలాంటి షిఫ్టుల కారణంగా ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకునేందుకు మనం చేయగల పనులు కొన్ని ఉన్నాయి.

వాటిలో కొన్ని ఇక్కడ వివరించబోతున్నాము. ఇందులో మీకు సరిపడే విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రధాన లక్ష్యం ఏంటంటే మన బాడీక్లాక్ జాగ్రత్తగా మేనేజ్ చేయడం. సాధారణ సమయంలో ఉన్నట్లుగా ఉంచే ప్రయత్నం చేయడం.

1. ఆహారం

నైట్ షిఫ్ట్ చేసేవారు మామూలు సమయాలలో తినే ఆహారాన్ని, అదే టైమ్‌కు తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటారు. పగలు యథావిధిగా తినడం, రాత్రి పూట తగ్గించడం మంచిది. రాత్రిపూట తినే అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి.

దీనికొక కారణం ఉంది. రక్తంలో గ్లూకోజ్, ఫ్యాట్ లెవెల్స్ సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో మళ్లీ కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో వాటి లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి.

కాబట్టి రాత్రి సమయంలో ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. వాటికి బదులుగా కూరగాయలు, ప్రోటీన్‌లు ఉన్న గింజలు, పండ్ల వంటివి తీసుకోవచ్చు. అన్నిటికంటే ముందు ఉదయం, సాయంత్రాలు తేలికపాటి భోజనాన్ని, సలాడ్లను తీసుకుంటే మంచిది.

2. వ్యాయామం

వ్యాయామం వల్ల చురుకుదనం పెరుగుతుంది. జాగింగ్ చేయాలనుకుంటే షిఫ్ట్‌కు వెళ్లే ముందు చేయండి. కానీ, ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు మాత్రం చేయవద్దు.

షిఫ్టుల్లో పని చేసేవారు తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షిఫ్టుల్లో పని చేసేవారు తగినంత నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి

3. నిద్ర

రాత్రి పూట పని చేసే వారికి నిద్ర చాలా ముఖ్యం. అంటే, పగలు నిద్రపోవడానికి సరైన వాతావరణం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది.

పగలు నిద్రపోయే ప్రాంతం చీకటిగా ఉండాలని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇందుకోసం బ్లాక్-అవుట్ బ్లైండ్‌లు, భారీ కర్టెన్‌లు సహాయపడతాయి. లేదంటే ఐ మాస్క్‌ను ఉపయోగించవచ్చు.

ఉదయపు సూర్యరశ్మిలో నీలం రంగు, సాయంత్రపు సూర్యరశ్మిలో ఎరుపు రంగు ఉంటుంది. నీలిరంగు కాంతి మేల్కొల్పడానికి , నారింజ కాంతి నిద్రపుచ్చడానికి సహాయపడుతుంది.

తెల్లవారు జామున షిఫ్ట్ నుండి వచ్చేటప్పుడు సూర్యరశ్మి సోకకుండా చూసుకోవాలి. నీలికాంతిని నిరోధించే స్పెషల్ సన్‌గ్లాసులు సహాయ పడతాయి.

షిఫ్ట్ ముగిసే ముందు కెఫీన్ తాగకుండా ఉండటం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images

4. కెఫీన్

కెఫీన్ ప్రభావం తగ్గడానికి చాలా గంటలు పడుతుంది. అయితే, ఈ సమయం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. అయితే షిఫ్ట్ ముగిసే ముందు కెఫీన్ ఉన్న డ్రింక్స్ తాగకుండా ఉండటం మంచిది.

5. వర్కింగ్ అవర్స్

అవకాశం ఉన్నంత మేరకు ఒకే షిఫ్టులో కొనసాగడానికి ప్రయత్నించండి. ఒకే షిఫ్టులో కొనసాగడం ఆరోగ్యం మీద పడే ప్రభావాలు చాలా వరకు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)