ఉత్తరాఖండ్‌లో ఒకటి తర్వాత మరొకటిగా గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
- రచయిత, వర్షా సింగ్
- హోదా, బీబీసీ కోసం
పౌడీలో చౌబట్టాఖాల్ తాలూకాలోని కింగిడి గ్రామానికి చెందిన మహిళలు తమ పొలాల్లో రాగులు, మినుములు, మిగతా పప్పు ధాన్యాల పంటల కోత పనుల్లో ఉన్నారు.
అక్టోబర్ 17, 18, 19న ముంచెత్తిన భారీ వర్షాలతో అక్కడి పంటలపై తీవ్ర ప్రభావం పడింది.
"వానలు కావాల్సినప్పుడు పడవు. ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయి. మినుములు తడిచిపోయాయి. రాగులు మక్కిపోయాయి. పశువుల కోసం మేం కోసి పెట్టిన గడ్డి కూడా పాడయ్యింది" అని వృద్ధురాలైన రైతు లీలాదేవి చెప్పారు
మేలో నాట్లు వేసే సమయంలో కూడా అకాల వర్షాలు పడ్డాయని ఆమె చెప్పారు. మొలకలపై ఆ ప్రభావం పడిందని, ఇప్పుడు కోతల సమయంలో కూడా పడిన వర్షాలు మిగిలిన పంటను కూడా నాశనం చేశాయని చెప్పారు.
అడవిపందుల గుంపు తమ పొలాల్లో నాశనం చేసిన పంటను కూడా లీలాదేవి మాకు చూపించారు.
"కొన్నిసార్లు వాతావరణం వల్ల పంటలు పాడైతే, కొన్నిసార్లు జంతువుల వల్ల నాశనమవుతాయి. దాంతో ఇల్లు గడవడం కూడా కష్టమైపోతోంది" అంటారు లీలాదేవి
"మొదట్లో మా పొలాలు చాలా దూరం వరకూ ఉండేవి. మేం అక్కడి వరకూ సాగు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మేం అదంతా వదిలేశాం. మా పొలం బీడుపడింది. మేం ఏదైనా ఉద్యోగం చేసుకుంటాం.. కానీ కొడవళ్లు, పారలు పట్టుకోం అని నా కూతుళ్లు, కోడళ్లు అంటున్నారు. మేం ఇదే పొలంలో పంటలు పండించి మా పిల్లల్ని పెంచాం. పశువులు పోషించాం. అందరికీ మంచి చేశాం" అన్నారు.

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
దీనికంటే ఉద్యోగం చేయడం మేలు
లీలా దేవి తమ కుటుంబంలో చివరి రైతు అయిపోయారు. ఆమె ఒక కొడుకు డెహ్రాడూన్‌లో, మరో కొడుకు జోషీమఠ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.
కానీ కరోనా, మహమ్మారి పరిస్థితులు చూసిన ఆమె "ఏదో ఒకరోజు ఉద్యోగాల వల్ల ఏ లాభం లేదనిపిస్తే, వాళ్లు కచ్చితంగా మళ్లీ తిరిగి ఇక్కడికి వస్తారు. పారలు, నాగళ్లు పట్టుకుంటారు" అన్నారు.
పూనమ్ బిష్ట్ తన పొలాల్లో మినుములు, కందులు, సోయాబీన్ కోత పనుల్లో ఉన్నారు. ఆమె చౌబట్టాఖాల్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివారు.
"వ్యవసాయం వల్ల ఏం లాభం ఉండడం లేదు. దీనికంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవడం మేలు" అన్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం
ఉత్తరాఖండ్‌లో వాతావరణ మార్పుల వల్ల ఒత్తిడి పెరుగుతుండడంతో చాలా మంది వ్యవసాయం వదులుకుని ఉద్యాగాలు వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలవైపు వెళ్లిపోతున్నారు.
రాబోవు ఏళ్లలో ఈ పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని ద ఏజెన్సీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ అండ్ పాట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంపాక్ట్ రీసెర్చ్ ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది.
రాష్ట్రంలో పొలాలు బీడువారడానికి, వలసలు పెరగడానికి వాతావరణ మార్పులను ఒక పెద్ద కారణం అని ఉత్తరాఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మైగ్రేషన్ కమిషన్ కూడా చెప్పింది.
2019లో వచ్చిన వలస కమిటీ రిపోర్టు ప్రకారం ఉత్తరాఖండ్‌లో 66 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వీరిలో 80 శాతానికి పైగా ప్రజలు పర్వతప్రాంత జిల్లాల్లో ఉన్నారు.
కొండల్లో రైతుల పొలాలు చాలా చిన్నవిగా, అక్కడక్కడా ఉంటాయి. దీంతో 10 శాతం పొలాలకు మాత్రమే నీటి పారుదల సౌకర్యం ఉంది. మిగతా వాటికి రైతులు వర్షాలపైనే ఆధారపడుతున్నారు.
2001, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో చాలా పర్వత ప్రాంత జిల్లాల్లో జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉంది. అదే సమయంలో అల్మోడా, పౌడీ జిల్లాల్లో జనాభాలో 17,868 మంది తగ్గుదల నమోదైంది.

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
ఒకే ఒక కుటుంబం ఉన్న గ్రామం
చౌబట్టాఖాల్ తాలూకా మఝ్‌గావ్ పంచాయతీలోని భరత్‌పూర్ గ్రామంలోని ఉంటున్న ఒకే ఒక కుటుంబం ఈ రిపోర్టులకు రుజువుగా నిలిచింది.
ఆ గ్రామంలో చాలా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ఇళ్లకు తాళాలుంటే, కొన్ని ఇళ్ల తలుపులు విరిగిపోయాయి. లోపలంతా పిచ్చి పొదలు పెరిగి కనిపించాయి.
గ్రామంలోని పొలాలన్నీ పొదలతో కప్పుకుపోయాయి. ఇక్కడ యశోదా దేవి తన భర్త, కోడలు, ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె ఇద్దరు కొడుకులు దిల్లీ, గుర్‌గ్రామ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్ విధించినపుడు కోడలు తన పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వచ్చేశారు.
"గ్రామంలో మా ఒక్క కుటుంబమే ఉంటోంది. ఎప్పుడైనా పెళ్లిళ్లు, పూజల్లాంటివి జరిగితే రెండు మూడు రోజులుండడానికి జనం వస్తుంటారు. కొంతమంది శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్లిపోయారు" అని యశోదా దేవి చెప్పారు.
రాత్రి సమయాల్లో చిరుత పులులు లాంటివి ఇంటి దగ్గరకు రాకుండా యశోదా దేవి తమ ఇంటి చుట్టూ లైట్లు వేయించారు.
"మూడు చిరుత పులులు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. నాలుగు రోజుల క్రితమే అవి మా దూడను చంపేశాయి. మాకు మా పిల్లల గురించి భయమేస్తుంది. ఫారెస్టు అధికారులకు చెబితే, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పొదలను నరికి, శుభ్రం చేయండి అంటారు. మేం ఒక్కరిమే ఎన్ని పొదలు కొట్టగలం చెప్పండి" అంటున్నారు.
వ్యవసాయం ఎలా జరుగుతోందని అడిగినపుడు ఆమె సమాధానం ఇచ్చారు.
"పండించినవి పందులు తినేస్తున్నాయి. వర్షం మూడు రోజులు ఆగకుండా పడింది. కరెంటు లేదు. పందుల గుంపు పొలాల్లో పడింది. వాటిని తరిమికొట్టడానికి రాత్రుళ్లు బయటకు ఎవరు వెళ్తారు చెప్పండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వర్షం పడితే పడుతూనే ఉంటుంది. ఎండలు ఉంటే అలాగే ఉంటాయి" అని ఆవేదన చెందారు.

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
ఈ ఊరు కూడా ఖాళీ అయిపోతుంది
భరత్‌పూర్ గ్రామం తర్వాత వచ్చే నౌలూకులో కూడా వలసల ప్రభావం ఉంది. ఆ గ్రామంలోని చాలా కుటుంబాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి.
"మరో రెండు మూడేళ్లలో మా ఊరు కూడా ఖాళీ అయిపోతుంది.. కొన్ని కుటుంబాలు తమ చిన్న పిల్లల్ని చదివించుకోడానికి వెళ్లిపోతున్నాయి. కొందరు వ్యవసాయం దెబ్బతినడం వల్ల, అడవి జంతువుల బాధకు వెళ్లిపోతున్నారు" అని స్థానిక రైతు సర్వేశ్వర్ ప్రసాద్ ధౌండియాల్ చెప్పారు.
"ఒకప్పుడు మా పొలాల్లో ఎంత వెల్లుల్లి, ఉల్లి, మిర్చి పండింటేవాళ్లమంటే, అవన్నీ అమ్మడమే కష్టంగా ఉండేది. నా పొలం నిండా పంట ఉండేది. మేం వరి, సజ్జ, జొన్న, గోధుమలు, పప్పు ధాన్యాలు, ఇంకా చాలా పండించేవాళ్లం. మా ఇళ్లకు వచ్చేవాళ్లకు కూడా పప్పులు, రాగులు లాంటివి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అవేం లేవు. గ్రామంలో నీటి వనరుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దాంతో పొలాలకు నీళ్లు పెట్టడమే కష్టంగా ఉంది. కొన్ని పంటలు వేసినా, వాటిని జంతువులు నాశనం చేస్తున్నాయి" అన్నారు.
సర్వేశ్వర్ తన ఇంటిపై ఎండబెట్టిన మినుములు, మిగతా ధాన్యం వైపు చూపించారు.
"అడవి పందులు వీటిలో దేన్నీ వదలవు. ఇప్పుడు ఇవి మా కుటుంబానికే సరిపోవడం లేదు. మొదట్లో మేమంతా వ్యవసాయం చేసేవాళ్లం. జంతువులు పంటలు నాశనం చేసినా, అందరికీ కొద్దోగొప్పో మిగిలేది. ఇప్పుడు కొంతమందే సాగు చేస్తున్నారు. పక్షులు వస్తుంటాయి, జంతువులు కూడా వస్తాయి. మనిషి వాటికి పోను మిగిలిన వాటితోనే పొట్ట నింపుకోవాలి" అని చెప్పారు.
"ప్రభుత్వం మా పిల్లలకు ఇక్కడే ఏదైనా ఉద్యోగాలు చూపిస్తే వాళ్లు వలస వెళ్లాల్సిన పని ఉండదు. కోడళ్లు ఇక్కడ ఇళ్లలో ఉంటే పొలాలు కూడా పచ్చగా ఉంటాయి. ఇది మా దేవభూమి. మేం మా మట్టిని వదిలి దూరంగా ఎందుకు వెళ్లాలి" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
హరియాణాలో పుట్టి పెరిగిన నిర్మలా సంద్రియాల్ 13 ఏళ్ల క్రితం పెళ్లైన తర్వాత పౌడీలోని కుయీ గ్రామానికి వచ్చేశారు. ఆమె వచ్చినపుడు ఆ ఊళ్లో 80 కుటుంబాలు ఉంటే, ఇప్పుడు అక్కడ 30 కుటుంబాలే ఉంటున్నాయి. పొయ్యిపై రొట్టెలు కాలుస్తున్న నిర్మల అక్కడి పరిస్థితి చెప్పారు.
"ఊళ్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు పొలాలన్నీ పచ్చగా కళకళ్లాడేవి. పొదలే కనపడేవి కావు. అడవి పందులు సమస్యగా పెద్దగా లేదు. ఇప్పుడు జనం తగ్గిపోయారు. మిగతా వారి కష్టాలు పెరిగాయి. కొండలపై పైన్ చెట్ల అడవులు పెరిగాయి. వేసవిలో ఆ అడవుల్లో కార్చిచ్చు రేగగానే అక్కడి జంతువులన్నీ మా ఊళ్లపై పడతాయి. వాటికి అడవిలో తిండీ, నీళ్లూ ఏవీ దొరకవు. అందుకే, అవి మా పశువులను ఆహారంగా చేసుకున్నాయి" అన్నారు.
వ్యవసాయం, వాతావరణ మార్పులు
ప్రస్తుతం వాతావరణం పాటర్న్ మారిపోయిందని జీబీ పంత్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ తేజ్ ప్రతాప్ అంటున్నారు.
"ఇప్పుడు మనం వ్యవసాయంపై వాతావరణ మార్పులు చాలా స్పష్టంగా కనిపించే దశకు చేరుకున్నాం. మొదట్లో గ్లోబల్ వార్మింగ్ వల్ల పంటల సాగు ఎత్తైన ప్రాంతాలకు మారుతుంది అనేవారు. ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటూ వర్షం, మంచు పాటర్న్ కూడా మారిపోయినట్లు మనకు వాతావరణం చెబుతోంది" అన్నారు.
"ఈ ఏడాది మేలో వేసవి కాలంలో చాలా ఎక్కువ వర్షం పడింది. కానీ, వచ్చే ఏడాది కూడా ఆ సమయంలో అలాగే వర్షం పడుతుంది అని చెప్పలేం. వాతావరణంలో వస్తున్న మార్పులు చాలా అనూహ్యంగా ఉన్నాయి. అందుకే, రైతులకు ఎప్పుడు విత్తనాలు వేయాలో తెలీడం లేదు. నాట్లు తర్వాత భారీ వర్షం పడితే పంట నాశనం అవుతుంది. విత్తే సమయంలో తగినంత వర్షం లేకపోయినా కూడా పంట నష్టం ఉంటుంది" అన్నారు.
"మేం గత 10-15 ఏళ్ల నుంచి విత్తనాలు నాటడం, వర్షం పాటర్న్‌లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాం. ఇది పంట కోతల సమయం. అక్టోబర్లో వచ్చిన అకాల వర్షాల వల్ల రైతుల పంట తీవ్రంగా దెబ్బతింది" అంటారు తేజ్ ప్రతాప్.
"వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోవు కాలంలో వాతావరణ పరిస్థితులు తీవ్రం అవుతాయి. ఎండలు సుదీర్ఘ కాలంపాటు ఉండడం అనేది కచ్చితంగా జరుగుతుంది, వ్యవసాయానికి తగినట్లు దీనికి సంబంధించిన సవాళ్లు ఎదుర్కోడానికి మనం సిద్ధం కావాల్సి ఉంటుంది" అన్నారు.
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది అని స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్(2019) చెబుతోంది. ఉష్ణోగ్రత పెరగడం, అకాల వర్షాలు, రుతుపవనాల ఆలస్యం, నీటి వనరులు ఎండిపోవడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి తగ్గుతోంది.

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పెరిగిందా
వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ అండ్ హాబిటట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ దీపాంకర్ ఘోష్ దీనికి సమాధానం చెప్పారు.
"వాతావరణ మార్పులు, మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణను మనం నేరుగా కలిపి చూడలేం, కానీ ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి, కార్చిచ్చులు చెలరేగడం వల్ల అలాంటివి పెరుగుతున్నాయి. దానివల్ల అడవుల నాణ్యత కూడా తగ్గిపోతోంది. వన్యప్రాణులు ఆధారపడే చెట్లు, పళ్లు లాంటివి కార్చిచ్చుతో అంతం అవుతున్నాయి. దాంతో జంతువులకు ఆహార సమస్యలు వస్తున్నాయి. అయితే దీనిపై చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి" అన్నారు.
"వాతావరణ మార్పుల ప్రభావంతో మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణ ఘటనలు పెరిగాయి. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎలుగుబంట్లు-మనుషులు ఎదురుపడే ఘటనలు పెరగడాన్నిఆయన ఉదాహరణగా చెప్పారు.
ఎలుగుబంట్లు మొదట్లో శీతాకాలం 4-5 నెలలపాటు నిద్రావస్థలో ఉండేవి. కానీ, మంచు తగ్గిపోవడం వల్ల చలికాలంలో అవి నిద్రావస్థలో ఉండే సమయం తగ్గిపోతోంది. లద్దాఖ్‌లోని ద్రాస్, జాంస్కర్ లోయలోని ఎలుగుబంట్లు కనీసం నెల కూడా నిద్రావస్థలోకి వెళ్లడం లేదు" అన్నారు.
కానీ, మనుషులు-వన్యప్రాణులు ఎదురుపడే ఘటనలు పెరగడాన్ని పౌడీ సహా మధ్య హిమాలయ ప్రాంతాల్లో వారు ఒక సామాజిక సమస్యగా భావిస్తున్నారు.
"వలసలు వెళ్లడం, పొలాలు బీడుపడడం, వ్యవసాయం చేయడానికి తగినంత మంది లేకపోవడం వల్ల కూడా పర్వత ప్రాంతాల్లో మనుషులు-జంతువుల మధ్య సంఘర్షణ చోటుచేసుకుంటోంది. అడవి పందుల గుంపు మొదట్లో 100 ఎకరాల్లో పంటలకు నష్టం కలిగించేవి. కానీ, ఇప్పుడు 40 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. అందుకే మనకు నష్టం తీవ్రత ఎక్కువగా అనిపిస్తోంది. పొలాలు బీడువారడం భారత్ అంతా పెరిగింది. దాంతో పొలాల్లో పొదలు పెరుగుతున్నాయి వాటిలో చిరుతలు లాంటివి సులభంగా దాక్కుంటున్నాయి. గ్రామాలకు దగ్గరగా చేరుకుంటున్నాయి" అని దీపాంకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, VARSHA SINGH/BBC
ప్రతికూల పరిస్థితుల్లో కూడా తిరిగి వస్తున్న ప్రజలు
గుడ్డూ దేవరాజ్ పర్వతం వాలులో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో సాగు చేయడంలో బిజీగా ఉన్నారు. 2020లో కరోనా సమయంలో పౌడీలోని పోఖడా బ్లాక్‌లో ఉన్న స్వగ్రామం గోడోలీకి ఆయన తిరిగి వచ్చేశారు.
"దిల్లీలో దాదాపు 35 ఏళ్లు గడిపిన తర్వాత నేను మా గ్రామానికి చేరుకున్నప్పుడు, మా పూర్వీకుల భూమి బీడుగా మారడం చూసి చాలా బాధేసింది. నగరం నుంచి గ్రామానికి తిరిగివచ్చాక దాదాపు 15 మంది వలస కార్మికులం కలిసి ఇక్కడ మా పొలాల్లో మళ్లీ సాగు చేయాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు.
"గత ఏడాది జూన్‌లో మేం పొలం పనులు ప్రారంభించాం. కానీ, ఈ ఏడాది జూన్ నాటికి 5-6 మందే ఇక్కడ మిగిలారు. మిగతా అందరూ మళ్లీ నగరానికి వెళ్లిపోయారు. ఈ ఏడాదిన్నరలో మేం మా పొలాల్లో దాదాపు 200 కిలోల టమాటాలు, 200 కిలోల వెల్లుల్లితోపాటూ మంచి దిగుబడి సాధించాం" అంటారు దేవరాజ్.
ఈ 35 ఏళ్లలో గ్రామంలో ఏమేం మారాయి అన్నప్పుడు.. "ఇక్కడ ఒకప్పుడు కొన్ని రకాల అడవి పండ్లు కూడా పండేవి. కానీ ఎండలు, వానల కాలం మారిపోయింది. బహుశా అందుకే అవి ఇప్పుడు కనిపించకుండా పోయాయి" అంటున్నారు గ్రామస్థులు.
ఇవి కూడా చదవండి:
- దళితుడిని నరికి, బ్యారికేడ్‌కు వేలాడదీసిన ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే వెయ్యి మరణాలు.. టీకాలు వేయించుకోకపోవడం వల్లనేనా?
- భారత్‌లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'ఏపీలో విద్యుత్ కొరత లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














