‘హరికేన్‌ను ఆపేందుకు అణు బాంబు’.. వాడొద్దంటున్న అమెరికా సంస్థ ఎన్‌వోఏఏ

ఫొటో సోర్స్, Getty Images
హరికేన్లను అణ్వాయుధాలతో ఎదుర్కోవాలనేది మంచి ఆలోచన కాదని అమెరికాలోని ఒక ప్రభుత్వ సంస్థ చెప్పింది. హరికేన్ల నియంత్రణకు అణు బాంబును ప్రయోగించే అవకాశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారనే వార్తలొచ్చిన నేపథ్యంలో, 'నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌వోఏఏ)' ఈ మేరకు తెలిపింది.
ఈ అవకాశాన్ని పరిశీలించాలని పలువురు జాతీయ భద్రత అధికారులతో ట్రంప్ అన్నారని వార్తా వెబ్‌సైట్ 'ది యాక్సియోస్' రాసింది. హరికేన్ భూమిని తాకకుండా నియంత్రించేందుకు హరికేన్ కేంద్ర స్థానంలో అణు బాంబును ఎందుకు వేయకూడదంటూ ట్రంప్ వారితో వ్యాఖ్యానించారని చెప్పింది.
తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని ట్రంప్ చెప్పారు.
హరికేన్ నియంత్రణకు అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే పెను విధ్వంసం తప్పదని ఎన్‌వోఏఏ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, NOAA
అణ్వాయుధాలు హరికేన్ ప్రభావాన్ని తగ్గించలేకపోవచ్చని, పైగా వీటి ప్రయోగంతో సముద్రంలో వెలువడే రేడియో ధార్మికత గాలులతోపాటు శరవేగంగా భూమి మీదకు చేరి దుష్ప్రభావం చూపొచ్చని ఎన్‌వోఏఏ తెలిపింది.
అమెరికా తూర్పు తీరంపై హరికేన్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంటాయి. పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి.
2004లో హరికేన్ సీజన్‌లో ఆరు వారాల వ్యవధిలో నాలుగు హరికేన్లు టెక్సాస్ రాష్ట్రంపై విరుచుకుపడ్డాయి.
అప్పుడు టెక్సాస్‌లో దాదాపు ప్రతి చదరపు అంగుళం ఈ నాలుగింటిలో ఏదో ఒక హరికేన్ ప్రభావానికి గురైందని ఎన్‌వోఏఏ తెలిపింది.

ప్రతిపాదన కొత్తది కాదు
హరికేన్ల నియంత్రణకు అణ్వస్త్రాన్ని ప్రయోగించాలనే ఆలోచన తెరపైకి రావడం ఇదే ప్రథమం కాదు.
దాదాపు 1950ల నుంచే ఈ ప్రతిపాదన ఉంది. ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు అప్పట్లో దీనిని తెరపైకి తెచ్చారు.
1961లో నేషనల్ ప్రెస్ క్లబ్‌లో అమెరికా వాతావరణ విభాగం సారథి ఫ్రాన్సిస్ రీచెల్‌డెర్ఫర్ ప్రసంగిస్తూ- భవిష్యత్తులో సముద్రంలో సుదూర ప్రాంతంలో హరికేన్‌పై అణు బాంబు వేయడం సాధ్యమేనన్నారు.
హరికేన్ సీజన్‌లో ఈ ప్రతిపాదన తరచూ వినిపిస్తుంటుందని ఎన్‌వోఏఏ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
సెప్టెంబరులో ముప్పు ఎక్కువ
అట్లాంటిక్ హరికేన్ సీజన్ జూన్ 1 నుంచి నవంబరు 30 వరకు ఉంటుంది. సెప్టెంబరులో సముద్ర ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరతాయి. అప్పుడు హరికేన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుపాను వేగం గంటకు 119 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని హరికేన్ అంటారు.
గాలి వేగాన్ని బట్టి హరికేన్లను ఒకటి నుంచి ఐదు కేటగిరీలుగా వర్గీకరిస్తారు.
సముద్ర జలాల ఉష్ణోగ్రత పెరుగుతోందని, దీనివల్ల భవిష్యత్తులో హరికేన్ల తీవ్రత పెరగొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం 'డోరియన్' అనే తుపాను కరీబియన్ దీవుల వైపు కదులుతోంది. ఇది మంగళవారం (ఆగస్టు 27)లోగా హరికేన్‌గా మారొచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో ఇది అమెరికాకు చెందిన ప్యూర్టో రికో భూభాగంపై ప్రభావం చూపే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: ప్రాణాలు తీసిన కొండ చరియలు... సహాయ శిబిరాల్లో బాధితులు
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- మునిగిపోతున్న ఈ దేశాన్ని కాపాడేదెలా
- మోదీది చారిత్రక తప్పిదం.. కశ్మీర్ కోసం ఎంత వరకైనా వెళ్తాం: ఇమ్రాన్ ఖాన్
- ఎ68: కదులుతున్న అతిపెద్ద హిమఖండం, చివరికి ఏమవుతుంది
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్‌లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








