మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వెనుక రాజకీయ కారణాలున్నాయా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Reuters

దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇలా ఇంతకు ముందు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, దాదాపు మూడేళ్లకు పైగానే అవుతోంది.

ఈ నిర్ణయంతో, రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు చాలా కాలం తర్వాత స్వల్ప ఊరట లభించినట్లయింది.

ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో లీటర్ పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయలు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన అనంతరం పలు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చమురుపై విధించే సుంకాలను కూడా తగ్గించాయి.

మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉప ఎన్నికల ఫలితాల సమీక్షలో భాగంగా రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే అంశం చర్చకు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల ఫలితాలు మాత్రమే కాకుండా, వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఈ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత సునీల్ భరాలా కొద్దిరోజుల క్రితం కేంద్ర పెట్రోలియం మంత్రికి లేఖ రాశారు.

ఇలాంటి కొన్ని కారణాలతో, ఎక్సైజ్ సుంకం తగ్గించాలనే నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

"పెట్రోల్, డీజిల్‌లను ఆదాయ వనరుగానే కాకుండా, రాజకీయ అస్త్రంగా కూడా ఉపయోగిస్తున్నారు" అని రాజకీయ విశ్లేషకులు సంజీవ్ ఉన్‌హాలే బీబీసీ మరాఠీతో పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్‌

ఫొటో సోర్స్, ANI

రాజకీయ ఎత్తుగడ?

చమురు ధరలు తగ్గించడం మోదీ ప్రభుత్వ రాజకీయ నిర్ణయమని చెబుతూ అందుకు ఐదు ముఖ్యమైన కారణాలను విశ్లేషకులు వివరించారు.

  • మోదీకి సామాన్యుల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపించాలనుకుంటున్నారు.
  • కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గిస్తుంది. కానీ, రాష్ట్రాలు తగ్గించడం లేదని, ఆయన ప్రజల సానుభూతిని పొందాలనుకుంటున్నారు.
  • ఉత్తరప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. కాబట్టి ప్రజల దీర్ఘకాల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.
  • తాజా ఉప ఎన్నికల ఫలితాలు.
  • కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం

''ఇప్పటి వరకు ప్రజల ఆగ్రహాన్ని మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు సామాన్యుల ఆగ్రహాన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని వారికి అర్థమైంది'' అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు సంజయ్ అవే అన్నారు.

పెట్రోల్, డీజిల్

ఫొటో సోర్స్, ANI

ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం?

ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీ పట్టునిలుపుకోగా, పలుచోట్ల గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలోనే ఆ పార్టీ ఓడిపోయింది.''ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఆశించిన స్థాయిలో రాలేదు కాబట్టి ఈ ఫలితాల నుంచి కేంద్రం ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుంది'' అని సంజయ్ అవే తెలిపారు."ఉపఎన్నికల్లో బీజేపీ విఫలమైంది. తమ ప్రాభవాన్ని కోల్పోతున్నారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సంజీవ్ ఉన్‌హాలే అ‍న్నారు."ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తన కంచుకోటను కోల్పోయింది. అందుకే ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది" అని మరో రాజకీయ విశ్లేషకులు శైలేంద్ర తాన్‌పురే చెప్పారు.

ఉప ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమైన మండి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది

వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి?

2022లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వీటిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే, యూపీలో పాగా వేస్తేనే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని రాజకీయపార్టీలు భావిస్తుంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరిగి సత్తా చాటాలంటే, గోవా, ఉత్తరాఖండ్‌లలో గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ భావిస్తోంది.

ఎన్నికల కోసమే చమురు ధరల అంశాన్ని బీజేపీ వాడుకుంటుందనేది ఇప్పుడు రహస్యమేమీ కాదు అని సంజీవ్ ఉన్‌హాలే చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ తగ్గింపునకు అదనంగా, ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు చమురు ధరలను తగ్గించాయి. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.

''ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ప్రజల ఆగ్రహాల సెగలు యూపీని తాకకుండా ఉండేలా చూసుకుంటుంది" అని సంజయ్ అవే అన్నారు.

కరోనా మహమ్మారితో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయని సంజీవ్ ఉన్‌హాలే అన్నారు. అందుకే ఎన్నికలకు ముందు ప్రజల్లో అసంతృప్తిని పెంచే పనిని బీజేపీ చేయదని తెలిపారు.

దీపావళి సందర్భంగానే ఈ ప్రకటన ఎందుకు?

''ప్రజలు తమ కష్టాలను మరచి పండుగ జరుపుకుంటారు. అలాంటి సమయాల్లో ఇచ్చిన ఉపశమనం చాలా కాలం గుర్తుండిపోతుంది'' అని ఈ ప్రకటన వెలువడిన సమయం కూడా చాలా ముఖ్యమైనదని శైలేంద్ర తాన్‌పురే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)