COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?

ఫొటో సోర్స్, Reuters
బొగ్గు వాడకంపై నిషేధానికి 40కి పైగా దేశాలు అంగీకరించాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ దేశాలలో భారత్ లేదు. పోలాండ్, వియత్నాం, చిలీతో సహా ప్రధానగా బొగ్గును వాడే దేశాలు నిషేధ ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి అంగీకరించాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, చైనా సహా ప్రపంచంలో అత్యధికంగా బొగ్గును ఉపయోగించే దేశాలు ఈ ప్రతిజ్జకు దూరంగా ఉన్నాయి.
పర్యావరణ సమస్యలకు ప్రధాన కారణం బొగ్గేనన్నది నిపుణులు చెబుతున్న మాట.
దీనిని అంగీకరించిన దేశాలు దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్తగా బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్ ఉత్పత్తికి పెట్టే పెట్టుబడుల నుంచి వైదొలుగుతాయి.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు 2030 నాటికి, పేద దేశాలు 2040 నాటికి దశలవారీగా బొగ్గు ద్వారా విద్యుత్ తయారీని నిలిపి వేసేందుకు అంగీకరించినట్లు యూకే వెల్లడించింది.
అనేక ప్రధాన బ్యాంకులు బొగ్గు పరిశ్రమకు ఫైనాన్సింగ్ ఆపడానికి ముందుకు రావడంతో డజన్ల కొద్దీ సంస్థలు కూడా ప్రతినను స్వీకరించాయి. "బొగ్గు కు స్వస్తి పలికే రోజు కనుచూపు మేరలోనే ఉంది'' అని యూకే బిజినెస్ అండ్ ఎనర్జీ శాఖ కార్యదర్శి క్వాసి క్వార్టెంగ్ అన్నారు.
"ప్రపంచం సరైన పథంలో నడుస్తోంది. బొగ్గు వినియోగాన్ని ఆపడానికి సిద్ధంగా ఉంది. కాలుష్యరహితమైన శక్తితో నడిచే భవిష్యత్తును నిర్మించుకోవడం వల్ల పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలను చేకూరతాయి" అని క్వార్టెంగ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే, ఈ ఒప్పందంలో అనేక లోపాలున్నాయని, యూకే షాడో బిజినెస్ సెక్రటరీ ఎడ్ మిల్బాండ్ వ్యాఖ్యానించారు.
''చైనా, మరికొన్నిపెద్ద దేశాలు అధిక ఉద్గారాలకు కారణం. వారు బొగ్గు వినియోగాన్ని ఆపకపోతే ప్రయోజనం ఉండదు. ఆయిల్, గ్యాస్ వినియోగాన్ని ఆపడంపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం ఇందులో మరో లోపం'' అని ఆయన పేర్కొన్నారు.
''యూకే ప్రభుత్వం వీరిని వదిలేసింది'' అని మిల్బాండ్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు వినియోగాన్ని తగ్గించడంలో పురోగతి ఉన్నప్పటికీ, 2019లో ప్రపంచంలోని 37% విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అయ్యింది.
దక్షిణాఫ్రికా, పోలాండ్, ఇండియా వంటి దేశాలు తమ ఇంధన రంగాలను క్లీన్ ఎనర్జీ రంగాలుగా మార్చుకోవడానికి పెద్దఎత్తున పెట్టుబడులు అవసరం.


తవ్వుతున్నది బొగ్గు గనులా, సమాధులా ?- విశ్లేషణ
మాట్ మెక్‌గ్రాత్
ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్
ప్రపంచంలో అత్యంత కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనం గురించి పెద్ద ఎత్తున ప్రకటనలైతే వస్తున్నాయి. కానీ, వాటిని అనుసరించడం అంత సులభం కాదు. ఇక్కడ సమాధానం దొరకని ప్రశ్నలు కూడా చాలానే ఉన్నాయి.
అమెరికా, చైనా, ఇండియా లాంటి పెద్ద దేశాలు ఈ కట్టుబాటుకు ఒప్పుకోలేదు. ఈ జాబితా పెద్దదే.
బొగ్గు వినియోగాన్ని 2030ల నాటికి ఆపేస్తామని ధనిక దేశాలు, 2040ల నాటికి దశలవారీగా ఆపుతామని అభివృద్ధి చెందుతున్న దేశాలు టైమ్ లిమిట్ పెట్టుకున్నాయి. కానీ, ఈ కట్టుబాట్లు నిలుస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు. పైగా, ఎందుకు పాటించలేదని అడిగేవారు కూడా లేరు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో బొగ్గు వాడకాన్ని ఆపేందుకు అవసరమైన ఆర్ధిక సాయం కోసం అభివృద్ధి చెందిన దేశాలు ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశాయా?
బొగ్గు వినియోగాన్ని నిలిపేసినందుకు దక్షిణాఫ్రికాకు యూకే, జర్మనీ, అమెరికాలు 8.5 బిలియన్ డాలర్లు ( రూ. 63750 కోట్లు) చెల్లించడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని దేశాలు కూడా దక్షిణాఫ్రికా అడుగుజాడల్లో నడవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
అంటే సంపన్న దేశాలు తాము ఇంట్లో చేయలేని పనిని బయటివాళ్లు చేసేందుకు డబ్బు చెల్లిస్తున్నాయా?
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్ కప్: ‘అఫ్గానిస్తాన్‌పై గెలిచినా భారత్ సెమీస్ చేరడం అంత సులభం కాదు’
- షిఫ్టు డ్యూటీల్లో పని చేసేవారి శరీరంలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు
- వాయు కాలుష్యాన్ని అత్యధికంగా సృష్టిస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








