వాతావరణ మార్పులు: ‘ప్రకృతి వైపరీత్యాలు ఇక సర్వసాధారణమవుతాయి, వాటికి అలవాటుపడాల్సిందే’

ఫొటో సోర్స్, LUIS SINCO
- రచయిత, మాట్ మెక్‌గ్రాత్
- హోదా, ఎన్విరాన్మెంటల్ కరస్పాండెంట్
తీవ్ర వడగాడ్పులు, ముంచెత్తే వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక సర్వసాధారణం అయిపోతాయని హెచ్చరిస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ).
"మన కళ్ల ముందే ప్రపంచం మారిపోతోంది" అంటూ 2021 వాతావరణ నివేదిక (స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ రిపోర్ట్) ప్రముఖంగా పేర్కొంది.
2002 నుంచి లెక్కిస్తే.. ఇరవై ఏళ్ల సగటు ఉష్ణోగ్రత తొలిసారిగా పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతల స్థాయిని దాటి 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండబోతోంది.
2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది.
వాతావరణ మార్పులపై గ్లాస్గోలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సదస్సు (COP26) నేపథ్యంలో డబ్ల్యూఎంఓ ఈ గణాంకాలను ముందుగానే విడుదల చేసింది.
ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టం పెరుగుదల, సముద్రాల పరిస్థితులతో సహా వాతావరణ సూచికల ఛాయాచిత్రాన్ని ఈ నివేదిక అందిస్తుంది.
వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల సాంద్రత రికార్డు స్థాయికి చేరుకోవడంతో గత ఏడేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.
పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతలు భూమిని మార్చేస్తున్నాయని వెల్లడించింది.

ఫొటో సోర్స్, PETER SUMMERS
ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు
"ప్రకృతి వైపరీత్యాలు ఇక సాధారణం కానున్నాయి. మానవ తప్పిదాలే ఇందుకు కారణమని శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నాయి" అని డబ్ల్యూఎంఓ ప్రొఫెసర్ పెట్టేరి తాలస్ తెలిపారు.
ఈ ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాలను తాలస్ ఉటంకించారు.
- గ్రీన్‌ల్యాండ్ మంచు ఫలకం శిఖరం వద్ద మంచుకు బదులు మొట్టమొదటిసారిగా వర్షం కురిసింది.
- కెనడా, దాని సరిహద్దుల్లో ఉన్న అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పుల కారణంగా బ్రిటిష్ కొలంబియాలోని ఒక గ్రామంలో ఉష్ణోగ్రత స్థాయి 50Cకి చేరుకుంది.
- డెత్ వ్యాలీ, నైరుతి అమెరికాలో వీచిన వడగాడ్పుల కారణంగా కాలిఫోర్నియాలో ఉష్ణోగ్రతలు 54.4Cకి చేరుకున్నాయి.
- చైనాలోని ఒక ప్రాంతంలో ఓ నెలలో కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లో కురిసింది.
- యూరోప్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. అధిక స్థాయిలో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం చేకూరింది.
- దక్షిణ అమెరికాలో వరుసగా రెండో ఏడాది కరువు చోటు చేసుకుంది. దాంతో, నదుల్లో నీటి మట్టం తగ్గింది. వ్యవసాయం, రవాణా, ఇంధన ఉత్పత్తి భారీగా దెబ్బతిన్నాయి.

ఫొటో సోర్స్, SOPA IMAGES
సముద్ర మట్టాల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది
ఇవే కాకుండా, సముద్ర మట్టాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూఎంఓ అధ్యయనం తెలిపింది.
1990ల నుంచి శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా సముద్ర మట్టాన్ని కొలవడం ప్రారంభించారు.
1993 నుంచి 2002 మధ్యలో సముద్ర మట్టాలు ఏడాదికి 2.1 మి.మీ చొప్పున పెరిగాయి.
కానీ, 2013 నుంచి 2021 మధ్యలో ఇది రెట్టింపు అయ్యింది. ఏడాదికి 4.4 మి.మీ చొప్పున పెరుగుతూ వచ్చాయి. ప్రధానంగా హిమనీనదాలు, మంచు ఫలకాలు కరిగిపోవడంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.
"గత రెండు వేల సంవత్సరాలలో సముద్ర మట్టాలు ఇంత ఎత్తుకు పెరిగింది లేదు" అని బ్రిస్టల్ గ్లాసియాలజీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జోనాథన్ బాంబర్ తెలిపారు.
"ఇది ఇలాగే కొనసాగితే, 2100 కల్లా సముద్ర మట్టాలు 2 మీటర్లు దాటి పోవచ్చు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల జనాభా నివాసాలు కోల్పోతారు. ఇంకెలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించలేం."
అధిక ఉష్ణోగ్రతల జాబితాలో 2021వ సంవత్సరం ఆరు లేదా ఏడవ స్థానంలో నిలుస్తుంది.
ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో 'లా నినా' అనే సంఘటన చోటుచేసుకుంది. ఇది వాతావరణంలో జరిగే సహజ ప్రక్రియ. దీని వలన ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
కానీ, గత ఇరవై యేళ్లల్లో తొలిసారిగా ప్రపంచ ఉష్ణోగ్రతల సగటు 1C దాటనుందని ఈ రిపోర్ట్ తెలిపింది.
"ఇరవై యేళ్ల సగటు ఉష్ణోగ్రత 1C దాటనుందన్న వాస్తవాన్ని COP26లో పాల్గొంటున్న దేశ నాయకులు గుర్తిస్తారని, ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం" అని బ్రిటన్ మెట్ ఆఫీస్‌లో చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ స్టీఫెన్ బెల్చర్ అన్నారు.
ఈ నివేదికపై స్పందిస్తూ, "భూ గ్రహం మన కళ్ల ముందే మారిపోతోంది" అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు.
"సముద్ర లోతుల నుంచి పర్వత శిఖరాల వరకు, హిమనీందాలు కరగడం నుంచి అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల వరకు, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థ, సమాజాలు ధ్వంసం అవుతున్నాయని" అని ఆయన అన్నారు.
"COP26 ఈ గ్రహానికి, ప్రజలకు కూడా ఒక మలుపు కాగలదు" అని గుటెరస్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 కీలకమైన ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








