ప్రధాని మోదీ: ‘వాతావరణ మార్పు గురించి చర్చలు జరుగుతున్నాయి, కానీ చర్యలు తీసుకోవట్లేదు’

ఫొటో సోర్స్, Reuters
భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు వాతావరణ మార్పు అనేది చాలా పెద్ద సవాలుతో కూడిన అంశం అని కాప్26 సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా, వాతావరణ మార్పుల గురించి చర్చలకు లభిస్తోన్న ప్రాధాన్యత, తగిన చర్యలు తీసుకోవడానికి లభించట్లేదు. దీనివల్ల అభివృద్ధి చెందుతోన్న దేశాలకు అన్యాయం జరుగుతోంది. ఈ దేశాలే వాతావరణ మార్పుల వల్ల అధికంగా ప్రభావితం అవుతున్నాయి.’’
‘‘ భారత్‌తో సహా అభివృద్ధి చెందుతోన్న అన్ని దేశాలకు ఇది పెద్ద సవాలుగా నిలిచింది. పంటల సాగు ప్రణాళిక మారుతోంది. అకాలవర్షాలు, వరదలు వెల్లువెత్తుతున్నాయి.’’
‘‘ఈ విషయంలో నేను మూడు సూచనలు చేయాలనుకుంటున్నా. మన అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టుల్లో వాతావరణ మార్పు కట్టడి కార్యక్రమాలను అంతర్భాగంగా చేసుకోవాలి.’’
‘‘నల్ సే జల్, స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల లాంటి పథకాలు భారతదేశంలోని పేద పౌరులకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడ్డాయి.’’
‘‘చాలా సంప్రదాయ సమాజాలకు ప్రకృతితో మమేకమై జీవించే జ్ఞానం ఉంది. వాతావరణ మార్పుల కట్టడికి ఈ సమాజాలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి. పాఠ్యాంశాల్లో కూడా వీటిని చేర్చాలి.
స్థానికంగా లేదా వెనుకబడిన దేశాల్లో మేలైన అనుసరణీయ విధానాలు ఉంటే, వాటికి ప్రపంచ వ్యాప్తంగా సహకారం లభించాలి.’’
‘‘భారత్, డిజాస్టర్ రెసిస్టెన్స్ ఇన్‌ఫాస్ట్రక్చర్ కూటమిని ప్రారంభించింది. ఇందులో అన్ని దేశాలు భాగస్వాములు కావాలని కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ ప్రసంగించారు.














