హెచ్‌పీవీ వ్యాక్సీన్‌తో మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ నివారించవచ్చా... దీన్ని ఎవరు తీసుకోవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌పీవీ వ్యాక్సీన్ వల్ల గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వికల్ క్యాన్సర్) కేసులు 90 శాతం తగ్గే అవకాశం ఉందని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది.
మహిళల్లో ఎక్కువగా వచ్చే కేన్సర్లలో సర్వికల్ కేన్సర్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 లక్షల మంది సర్వికల్ కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు.
హెచ్‌పీవీ వ్యాక్సీన్‌తో రక్షణ ఎలా లభిస్తుంది?
గార్డాసిల్‌గా పిలిచే హెచ్‌పీవీ వ్యాక్సీన్ 9 రకాల హెచ్‌పీవీల నుంచి రక్షణ ఇస్తుంది. సర్వికల్ కేన్సర్లకు కారణమయ్యే రెండు రకాల హెచ్‌పీవీలు, జననేంద్రియ, తల, మెడలో ఏర్పడే కేన్సర్లనూ ఇది నిరోధిస్తుంది.
ఈ వ్యాక్సీన్ వేసుకుంటే కనీసం పదేళ్ల పాటు హెచ్‌పీవీల నుంచి రక్షణ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రధానంగా 90 శాతం సర్వికల్ కేన్సర్ కేసులు తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
2008లో ఇంగ్లండ్‌లో అమ్మాయిలకు ఈ వ్యాక్సీన్ వేసిన తరువాత ఏం జరిగిందన్న అధ్యయన ఫలితాన్ని 'ది లాన్సెట్' జర్నల్ ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్‌పీవీ వ్యాక్సీన్‌ను ఎవరికి ఇవ్వొచ్చు?
హెచ్‌పీవీకి లోనుకాకముందే యువతీయువకులు ఈ వ్యాక్సీన్ తీసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
హెచ్‌పీవీ వ్యాక్సీన్‌తో మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ నివారించవచ్చా?
ఈ వ్యాక్సీన్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా మాత్రమే నిరోధిస్తుంది. వైరస్ ఒకసారి శరీరంలో చేరిన తరువాత దాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. కాబట్టి ముందుగానే వ్యాక్సీన్ వేయిచుకుంటే ఫలితం ఉంటుంది.
ఈ వైరస్ విస్తృతంగా ఉంది కాబట్టి యువత లైంగికంగా చురుగ్గా మారకముందే వ్యాక్సీన్ వేయించుకుంటే మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ హెచ్‌పీవీ అంటే ఏమిటి?
హ్యూమన్ పాపిలోమా వైరస్‌ను సంక్షిప్తంగా హెచ్‌పీవీ అంటారు. ఈ హెచ్‌పీవీ వర్గంలో 100కి పైగా వేర్వేరు రకాల వైరస్‌లు ఉంటాయి.
వీటిలో చాలావరకు సోకినా కూడా ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కొన్ని రకాల హెచ్‌పీవీ సోకిన తరువాత చేతులు, జననేంద్రియాలు, పాదాలు, నోటిలో చిన్నచిన్న కురుపులు కనిపిస్తాయి.
చాలామందికి ఇది సోకినట్లే తెలియదు. ఒకవేళ కురుపులు వంటివి కనిపించినా తగ్గిపోతాయి అనుకుంటారు.
అయితే, హెచ్‌పీవీలో అధిక ప్రమాదం ఉన్న రకాలు సోకితే అది కేన్సర్‌కు దారితీయొచ్చు.
హెచ్‌పీవీ ఎవరికి వస్తుంది? లైంగికంగా ఇది సంక్రమిస్తుందా?
ఇది చాలా సులభంగా వ్యాపించే వైరస్. మనుషులు ఒకరిని ఒకరు తాకినప్పుడు(స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్) సోకుతుంది.
80 శాతం ప్రజలు 25 ఏళ్ల వయసులో ఈ హెచ్‌పీవీకి ఎక్స్‌పోజ్ అవుతారు.
చాలామందిలో ఈ ఇన్‌ఫెక్షన్ 18 నెలల నుంచి రెండేళ్ల పాటు ఎక్కువగా ఉంటుంది.
సాంకేతికంగా చూస్తే ఇది లైంగికంగా సంక్రమించే వైరస్ కాదు. గనేరియా వంటి వ్యాధుల మాదిరి ఇది లైంగిక ద్రవాల ద్వారా సోకదు.
కానీ, ఎక్కువగా లైంగిక కలయికల సమయంలోనే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో సర్వికల్ కేన్సర్ మరణాల్లో 90 శాతం అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
వచ్చే శతాబ్దం నాటికి హెచ్‌పీవీని నిర్మూలించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి 90 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా ప్రణాళికలు రూపొందించింది.
ఇప్పటికే 100కి పైగా దేశాలు ఈ వ్యాక్సీన్‌ను అందుబాటులోకి తెచ్చాయి
2020 సరికి అల్పాదాయ దేశాల్లో ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి తెచ్చినవి 25 శాతం కంటే తక్కువే. అదేసమయంలో అధికాదాయ దేశాలలో 85 శాతానికిపైగా దేశాలు దీన్ని అందుబాటులోకి తేగలిగాయి..
ఆఫ్రికా మహిళల్లో ఎక్కువగా వస్తున్న కేన్సర్లలో సర్వికల్ కేన్సర్ రెండోది. ఇది ప్రాణాంతకమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోం
ప్రాథమిక దశలోనే గుర్తించలేకపోవడం, సరైన చికిత్సలు అందుబాటులో లేకపోవడం, వ్యాక్సీన్ వేయించుకోవడానికి ముందుకురాకపోవడం వల్ల హెచ్‌పీవీ కేసులు ఆఫ్రికాలో ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఆఫ్రికా ఖండంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ముందుగా ప్రారంభించిన దేశాల్లో రువాండా ఒకటి. 2011 నుంచే అక్కడ హెచ్‌పీవీ వ్యాక్సీన్ వేస్తున్నారు.
మొదటి సంవత్సరంలోనే అక్కడ ప్రతి 10 మంది అమ్మాయిలలో 9 మందికి వ్యాక్సీన్ వేశారు.
అయితే, కొన్ని ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. ఈ వ్యాక్సీన్ వేయించుకుంటే సంతానం కలగదన్న తప్పుడు ప్రచారం కారణం కొన్ని చోట్ల ఉన్నందున చాలామంది వెనుకాడుతున్నారు.
జపాన్‌లో ఈ వ్యాక్సీన్ వేసుకోవడానికి అర్హత ఉన్న మహిళల్లో 0.1 శాతం మంది మాత్రమే వేసుకున్నారు.
ఈ వ్యాక్సీన్ సర్వికల్ కేన్సర్ ప్రమాదాన్ని 90 శాతం నివారిస్తున్నప్పటికీ అన్ని రకాల హెచ్‌పీవీలపైనా ఇది పనిచేయదు.
ఇవి కూడా చదవండి:
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
- అర్ధరాత్రి మాయమైన చిన్నారిని ఎలా గుర్తించారు, ఆ రహస్యాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదు?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- వాయు కాలుష్యాన్ని అత్యధికంగా సృష్టిస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











