‘ఈ కోడి గుడ్లు తింటే క్యాన్సర్‌ను అంతం చేయొచ్చు’

ఫొటో సోర్స్, Norrie Russell, The Roslin Institute
జన్యుమార్పిడి ద్వారా పుట్టిన కోళ్లు పెట్టే గుడ్లతో అర్థ్రైటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు మందు కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ కోళ్లు పెట్టే గుడ్లలో కొన్ని రకాల ఔషధ గుణాలుంటున్నాయని, వాటితో వ్యాధుల నివారణ సాధ్యమని వారు చెబుతున్నారు. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదని చెబుతున్నారు.
కొద్దికాలంలోనే ఈ మందుల ఉత్పత్తిని భారీ స్థాయిలో చేపట్టవచ్చంటున్నారు.
ఈ మందుల తయారీ కోసం కోళ్లకు ఎలాంటి హాని తలపెట్టాల్సిన అవసరం లేదని ఎడిన్‌బరోకు చెందిన రోస్‌లిన్ టెక్నాలజీస్ ప్రతినిధి డాక్టర్ లిసా హెరాన్ తెలిపారు.
"కోళ్ల పెంపకం కేంద్రాల్లో వాటికి రోజూ సరైన సమయానికి ఆహారం, నీళ్లు అందిస్తారు. వాటి బాగోగులు చూసేందుకు శిక్షణ పొందినవారిని నియమిస్తారు. అందువల్ల ఆ కోళ్లు సంతోషంగా జీవిస్తాయి. ఈ కోళ్లకు తాము ఓ ప్రత్యేకమైన గుడ్డు పెడుతున్నట్లు ఏమీ తెలియదు. ఇలాంటి గుడ్లు పెట్టడం వల్ల వాటి ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదు" అని లిసా అంటున్నారు.
జన్యు మార్పిడి చేసిన మేకలు, కుందేళ్ల పాలు, కోళ్లు పెట్టే గుడ్లతో ప్రోటీన్ థెరపీలను చేయవచ్చని గతంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే ప్రస్తుత పరిశోధన మరింత ప్రభావమంతమైనదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని వారు అంటున్నారు.
ఫ్యాక్టరీల్లో మందుల తయారీతో పోలిస్తే కనీసం 10 నుంచి 100 రెట్లు తక్కువ ఖర్చుతోనే కోడిగుడ్ల నుంచి మందులు తయారు చేయవచ్చని, ఇదే తమ లక్ష్యమని డాక్టర్ లిసా చెబుతున్నారు.
కొన్ని రకాల రసాయనాలు, ప్రొటీన్లను మన శరీరం తగిన స్థాయిలో తయారుచేసుకోలేకపోవడమే చాలా వ్యాధులకు కారణం. తక్కువైన ఆ ప్రొటీన్లను శరీరానికి అందిస్తే చాలా జబ్బులను నయం చేయవచ్చు. వీటిని ఫార్మా కంపెనీల్లో కృత్రిమంగా తయారుచేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది.

ఫొటో సోర్స్, Norrie Russell, The Roslin Institute
డాక్టర్ లిసా బృందం... మానవ శరీరంలో ఈ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులను కోళ్ల శరీరంలో... గుడ్డులో ఉండే తెల్లసొనను తయారు చేసే డీఎన్ఏలో ప్రవేశపెట్టారు.
ఈ కోళ్లు పెట్టిన గుడ్ల తెల్ల సొనలో భారీ స్థాయిలో ప్రొటీన్లు ఉన్నట్లు డాక్టర్ లిసా కనుగొన్నారు.
వీటిలో ప్రధానంగా రెండు ప్రొటీన్లు మానవ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. వాటిలో ఒకటి క్యాన్సర్, వైరల్ ఇన్ఫెక్షన్లపై ప్రభావం చూపించేది కాగా, రెండోది దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
సాధారణంగా కోడి సంవత్సరానికి 300 గుడ్లు పెడుతుంది. కానీ, కేవలం మూడు గుడ్లతోనే ఔషధంలో ఒక డోస్ తయారు చేయవచ్చంటున్నారు. భారీ స్థాయిలో కోళ్లు, గుడ్లు ఉంటే మందులు కూడా అంతే భారీగా ఉత్పత్తి చేయవచ్చని వారు చెబుతున్నారు.
"ఇంతవరకు మానవులకోసం మేము ఎలాంటి మందులూ తయారుచేయలేదు. కానీ కోళ్లను ఉపయోగించి కొన్ని రకాల ప్రొటీన్లను తయారుచేయవచ్చని ఈ ప్రయోగం ద్వారా వెల్లడైంది" అని ఎడిన్‌బరో యూనివర్సిటీలోని రోస్‌లిన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ హెలెన్ శాంగ్ అభిప్రాయపడ్డారు.
అయితే ఇది అందుబాటులోకి రావడానికి కనీసం మరో పదేళ్లు పట్టొచ్చు. ఈ గుడ్ల ద్వారా జంతువుల్లో వ్యాధులకు కూడా చికిత్స చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- ఎయిడ్స్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదేనా?
- రోజ్ గోల్డ్: ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్న కొత్త రంగు
- చిత్రహింసల జైలుగా మారిన హైటెక్ షాపింగ్ మాల్
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- చిరుత పులి బలహీనతలేంటో మీకు తెలుసా!?
- జికా వైరస్: క్యాన్సర్‌కు మందు
- జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలున్నాయా?
- క్యాన్సర్‌ను ‘తినేసే’లా మానవ కణాలను బలోపేతం చేయనున్న కొత్త మందు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








