కోవిడ్ టీకా: రెండో డోసు సరైన సమయానికి తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?

కరోనా టీకాలతో ఆరోగ్య శాఖ సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘నేను కోవిడ్ టీకా మొదటి డోసు జూన్ 16న వేయించుకున్నా. ఆ తర్వాత గర్భం దాల్చడంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకుంటున్నా. దీంతో రెండో డోసు గడువు దాటి పోయింది. ఇప్పుడు రెండో డోసు తీసుకోవద్దు అని డాక్టర్ చెప్పారు. రెండో డోసు సమయానికి తీసుకోలేదు కాబట్టి, ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ మొదటి డోసు తీసుకోవాలి అని కూడా డాక్టర్ చెప్పారు’’ అని లక్ష్మీ ప్రియ బీబీసీతో చెప్పారు.

అయితే, ప్రియతో పాటు ఆమె భర్త కూడా కోవిడ్ రెండవ డోసు గడువు అయిపోయినా తీసుకోలేదు. కారణం.. ఆయన వేయించుకున్న మొదటి డోసుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇంకా లభించలేదు. ఆ సర్టిఫికెట్ లేకుండా రెండో డోసు వేయట్లేదు అని లక్ష్మీ ప్రియ తెలిపారు.

లక్ష్మీ ప్రియ మొదట డోసు తీసుకున్నా.. అది అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ కాలేదు. ‘ఆ రోజు సైట్‌లో ఎదో ఇబ్బంది ఉందన్నారు. రిజిస్టర్‌లో రాసుకొన్నామని, తాము అప్డేట్ చేస్తామని అన్నారు. కానీ, ఇంతవరకూ చేయలేదు’’ అని లక్ష్మీ ప్రియా చెప్పారు.

ఇలా చాలా మంది, ఎన్నో కారణాల కారణంగా కోవిడ్ రెండవ డోసు తీసుకోలేదు. అధికారులు అంచనా ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది ఇప్పటి వరుకు ఒక్క డోసు కూడా తీసుకోలేదు. మరో 36 లక్షల మందికి పైగా రెండవ డోసు తీసుకునే సమయం దాటినప్పటికీ ఇంకా తీసుకోలేదు.

వీడియో క్యాప్షన్, అమెరికాలో కరోనా వ్యాక్సీన్ తీసుకున్న తెలుగు డాక్టర్ల అనుభవాలు

రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు ఎందుకు వేయించుకోవాలంటే..

రెండవ డోసు కాల పరిమితి దాటి నెల-రెండు నెలలు గడిచిపొతే మళ్ళీ మొదటి డోసు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్లు.

ఇందుకు ప్రత్యేకించి నియమ నిబంధనలు ఏమి లేనప్పటికీ, మొదటి డోసు ద్వారా వచ్చే యాంటీబాడీస్ రోజులు గడిచే కొద్దీ తగ్గి పోతాయి కాబట్టి, రెండొవ డోసు వాటిని మెరుగు పరుస్తుంది. కానీ, మొదటి డోసు వల్ల కలిగే లాభాలు పూర్తిగా తగ్గిపోతే అలాంటప్పుడు.. రెండో డోసు తీసుకోవడం వల్ల లాభం లేదు అని చెబుతున్నారు డాక్టర్లు.

"ఒక వారం లేక రెండు వారాల టైం దాటినా ఫరవాలేదు, సెంకండ్ డోసు తీసుకోవచ్చు. కానీ ఒకటి, రెండు నెలలు దాటిన తరువాత అయితే, ఏ రోగ నిరోధక శక్తి పెంచడానికి అయితే రెండో డోసు ఇస్తామో అది శరీరంలో ఉండదు. అలాంటప్పుడు మళ్ళీ మొదటి డోసు తీసుకోవాల్సిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా, ఎవరికైనా మొదటి డోసు తీసుకున్న తరువాత ఇన్ఫెక్షన్ లేక ఎక్కువ రోజులు జ్వరం వస్తే వారిని ఇలా వచ్చిన రోజు నుంచి మూడు నెలల తరువాత రెండవ డోసు తీసుకోమని సలహా ఇస్తాము. రెండవ డోసు తీసుకోవాల్సిన సమయం కన్నా మూడు లేక నాలుగు వారలు వ్యవధి మించకుండా రెండవ డోసు తీసుకోవాలి. ఆ సమయం మించితే మళ్లీ మొదటి డోసు తీసుకోవాలి" అని చెబుతున్నారు కేర్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ నవోదయ జెల్లు.

మరో వైపు వాక్సినేషన్ అందిస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ల సిబ్బంది కూడా రెండవ డోసు తీసుకోని వారిపై దృష్టి పెట్టారు.

గండిపేట మండలం మల్టీ పర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ.. " రెండవ డోసు సమయం మించి పోయినప్పటికీ వేయించుకొని వారి డేటా తీసి వారికి ఫోన్లు చేసి మరీ వేయించుకోమని చెబుతున్నాము. మణికొండలోని మా సెంటర్‌లో ఇప్పటివరకు సుమారు 1, 30,000 మందికి కరోనా వాక్సినేషన్ ఇచ్చాము. అందులో మా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం సుమారు 26, 263 మంది రెండవ డోసు వేయించుకొని వారు ఉన్నారు. అయితే కాల్ చేసినప్పుడు చాలా మంది వేరే చోట వేయించుకున్నాం అని చెబుతున్నారు. అయితే వారు వేయించుకున్నట్టు మా దగ్గర అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు."

వీడియో క్యాప్షన్, కరోనా వ్యాక్సీన్‌లో అయస్కాంతం, మైక్రో చిప్ ఉన్నాయా? - Fact Check

‘చుట్టుపక్కల వాళ్లకి కరోనా సోకుతుంటే టీకా పరుగెత్తే పరిస్థితి వద్దు’

4 కోట్లకు పైగా జనాభా ఉన్న తెలంగాణ రాష్టంలో 18 ఏళ్ళు నిండిన వారు 2 .75 కోట్ల మంది ఉన్నారు. వీరందరూ వాక్సినేషన్‌కు అర్హులే. అయితే అక్టోబర్ 19 వరకు 2.08 కోట్ల మందే మొదటి డోసు తీసుకున్నారని, 82.24 లక్షల మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ జి .శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. "ప్రస్తుతం వస్తున్న కేసుల్లో 60 శాతం మంది ఒక్క డోసు టీకా కూడా తీసుకొని వారే ఉన్నారు. 30 శాతం మంది మొదటి డోసు తీసుకొని, రెండో డోసు తీసుకోని వారు ఉన్నారు. కేవలం 5 నుంచి 10 శాతం మంది మాత్రమే రెండు డోసులు టీకా తీసుకున్నా కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే, రెండు డోసులు తీసుకున్న వారు ఆసుపత్రిపాలయ్యే సంఘటనలు లేవు" అన్నారు.

రెండవ డోసు సమయానికి తీసుకోకుంటే, శరీరంలో యాంటీ బాడీస్ ప్రభావం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరిలో ఎక్కువ శాతం మంది రెండు డోసులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.

"50 లక్షల డోసులు ప్రస్తుతం రాష్ట్రంలో రెడీగా ఉన్నా.. జనాలు ముందు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మన చుట్టూ పక్క వాళ్ళు కోవిడ్ బారిన పడుతున్నప్పుడు వాక్సినేషన్ కోసం పరిగెత్తే పరిస్థితి రాకుండా ముందుగానే వాక్సీనేషన్ వేయించుకోవడం మంచింది. డిసెంబర్ వరుకు మనం గనుక వంద శాతం వాక్సినేషన్ వేయించుకోగలిగితే, కొత్త సంవత్సరంలో కొవిడ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం" అని శ్రీనివాస్ రావు చెప్పారు.

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం కొన్ని రాష్ట్రాల్లో ఇలా రెండవ డోసు తీసుకోవడానికి ప్రజలు ముందు రావడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. కొన్ని ఆంగ్ల పత్రికలలో వచ్చిన కధనాల ప్రకారం ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కోటీ 57 లక్షల మంది రెండవ డోసు సమయం దాటిపోయినా కూడా తీసుకోలేదు. కోటీ 19 లక్షల మందితో రెండవ స్థానంలో మధ్య ప్రదేశ్.. ఆ తరువాత 86 లక్షల మందితో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉన్నాయి. మొత్తం 17 రాష్టాల్లో సమయం దాటినా రెండవ డోసు వాక్సినేషన్ తీసుకొని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం పట్ల ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, 'కరోనా వ్యాక్సీన్ అన్ని దేశాలకు ఎంత వేగంగా అందితే, అంత వేగంగా ఆర్థిక ప్రగతి'

సమయం దాటినా రెండో డోసు వేయించుకోనివారు హైదరాబాద్‌లోనే ఎక్కువ..

ఈ విషయంపై డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. "యూకే, రష్యా, అమెరికా లాంటి దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తీవ్రత లేదు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. యూకేలో డెల్టా ప్లస్‌లో కూడా కొత్త మ్యుటేషన్‌తో కొత్త కరోనా వేరియంట్ వస్తోంది అని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు. ఒక్క హైదరాబాద్‌లోనే 7 లక్షల మంది గడువు దాటి పోయినా రెండవ డోసు తీసుకోలేదు. మేడ్చల్, రంగారెడ్డిలో 4 లక్షల మంది రెండవ డోసు తీసుకోవడానికి రాలేదు" అని వివరించారు.

ఇతర దేశాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సమయం వృధా చేయకుండా, వాక్సినేషన్ రెండు డోసులు వేయించుకోవడమే కాదు, మాస్కులు ధరించాలి, ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలి అని సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కోటి మందికి పైగా పిల్లలు.. 2 నుండి 17 ఏళ్ల వారు ఉన్నారు. వారికి కూడా త్వరలోనే వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అందుబాటులో ఉండే వాక్సినేషన్ వేసుకోకపోవడం సరికాదనేది డాక్టర్ల అభిప్రాయం.

‘‘కరోనా కనుమరుగైపోయింది అని అనుకోవడం పొరపాటు. ఇంకా కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది’’ అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రెండవ డోస్ సమయానికి తీసుకోకపోతే ఆ ప్రభావం వ్యాక్సినేషన్ తయారీపైనా పడుతుంది.