గీతా గోపీనాథ్: 'కరోనా వ్యాక్సీన్ అన్ని దేశాలకు ఎంత వేగంగా అందితే అంత వేగంగా ఎకానమీ రికవరీ'

వీడియో క్యాప్షన్, 'కరోనా వ్యాక్సీన్ అన్ని దేశాలకు ఎంత వేగంగా అందితే, అంత వేగంగా ఆర్థిక ప్రగతి'

ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఊహించిన దాని కంటే మెరుగ్గానే ఉన్నాయని అంటున్నారు అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్. అయితే, కొన్ని దేశాలలో ఈ వృద్ధిలో తేడాలున్నాయని కూడా ఆమె అన్నారు. కరోనా వ్యాక్సీన్ అన్ని దేశాలకు ఎంత వేగంగా అందితే ఆర్ధిక రికవరీ అంత వేగంగా ఉంటుందని చెప్పారు.

బీబీసీ ప్రతినిధి ఆండ్రూ వాకర్‌కు గీతా గోపీనాథ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర. కరోనావైరస్ ప్రభావానికి గురైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాదిలో ఎలా ఉండబోతోంది?

గత ఏడాది అక్టోబరులో ఊహించిన దానికి భిన్నంగా, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు పురోగామి ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతున్నట్టు వార్తలు రావడం, అలానే 2020 చివరి నాటికి అమెరికా, జపాన్ వంటి దేశాలు ప్రత్యేక ఆర్థిక ఉద్దీపన పథకాలను ప్రకటించడం - ఈ రెండు కారణాల ఫలితంగా 2021లో 0.3 శాతం వృద్ధి కనిపించింది.

అలానే మరో ముఖ్యమైన విషయం - కొత్త రకం వైరస్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వైరస్‌ను అదుపు చేసే చర్యలు కూడా సమాంతరంగా అమలవుతున్నాయి కాబట్టి ప్రతికూల ప్రరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో అనిశ్చిత పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మ్యూటేట్ అవుతోన్న వైరస్ ఒకవైపు... వ్యాక్సీనేషన్ మరోవైపు.. ఈ రెండింటి మధ్య సాగుతోన్న రేస్‌లో మనం ఇప్పుడున్నాం.

ప్ర: అయితే, కనిపిస్తోన్న ఆర్థిక పురోగతి అన్ని దేశాల్లో ఎంతవరకు సమానంగా ఉండే అవకాశముంది?

ఇది నిజానికి ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటుంది. కచ్చితంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకలాగా, అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలలో మరొక విధంగా ఉంటుంది. అలానే ఈ సమూహాల్లో కూడా వేర్వేరు దేశాల్లో పరిస్థితి వేర్వేరుగానే ఉంటుంది. ఉదాహరణకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనే చూసుకుంటే... ఈ ఏడాది అమెరికా 2019 నాటి స్థాయిని దాటుతుందనే అంచనా వేశారు.

కానీ, ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఈ ఫలితాన్ని సాధించడానికి 2022 లేదా అంతకు మించి సమయం పట్టవచ్చు. ఇక అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థల్లో చైనా విషయానికొస్తే.. 2020 నాలుగో ఆర్థిక త్రైమాసికం నాటికే అది మహమ్మారికి ముందటి స్థాయికి చేరుకుంది.

ప్ర: ఆర్థిక విధానాలను రూపొందించే పరిభాషలో చెప్పాలంటే, ఇటువంటి రికవరీ సస్టైన్ అవ్వాలంటే ప్రాధాన్యాలు ఎలా ఉండాలని మీరనుకుంటున్నారు?

ప్రాధ్యాన్యాలు చాలా స్పష్టం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరగాలి. వ్యాక్సీన్ అందుబాటులో ఉన్న దేశాలు ఆశించినంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నాయి. అయితే, వ్యాక్సినేషన్ వేగంలో బ్రిటన్ కొంత మెరుగ్గా కనిపిస్తోంది. కానీ ఇతర దేశాల్లో ఆ పరిస్థితి లేదు. వ్యాక్సీన్ సరఫరాలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. చాలా పేద దేశాలకు వ్యాక్సీన్ సప్లై 2022లో లేదా ఇంకా ఆలస్యంగా జరగొచ్చు.

అందుకే, అంతర్జాతీయ సముదాయం కోవాక్స్‌ ఫండింగ్ కోసం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అనేక లాజిస్టిక్స్ అంశాల్లో ఫండింగ్ జరగాలి. ప్రపంచంలో అనేక చోట్ల కొత్త రకం వైరస్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి అన్ని ప్రాంతాల్లోనూ అంతమయితే తప్ప పూర్తిగా అంతమైనట్లు కాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)