మెక్సికోలో అవయవాల విక్రయం: ‘20 మందిని చంపేసి.. అవయవాలు అమ్మేసిన జంట’

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల్ని తీసుకెళ్లే ఒక తోపుడు కుర్చీలో మనుషుల అవయవాలను తరలిస్తున్న ఒక జంటను మెక్సికో పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి పలు హత్యలతో సంబంధముందన్నది మెక్సికో పోలీసుల అభియోగం.
మెక్సికో నగరంలోని శివారు ప్రాంతాల్లో 20 మంది మహిళలను హత్య చేసినట్లు ఆ జంటలోని పురుషుడు జువాన్ కార్లోస్ విచారణలో అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
జువాన్ కార్లోస్ తన భాగస్వామి పాట్రీసియాతో కలిసి నివసిస్తున్న ఫ్లాట్‌లో సిమెంట్ బకెట్లు, ఫ్రిడ్జ్‌లో దాచిన మానవ శరీర అవయవాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఈ శరీర అవయవాలను విక్రయించిందని.. అయితే ఎవరికి విక్రయించిందనేది ఇంకా తెలియలేదని ప్రాసిక్యూటర్లు చెప్తున్నారు.
మెక్సికోలో పెద్ద సంఖ్యలో మహిళలు హత్యకు గురవుతున్నారు. చాలా కేసుల్లో ఎవరికీ శిక్షలు కూడా పడవు. కానీ ఈ జంట దురాగతానికి సంబంధించి ఒళ్లుగగుర్పొడిచే వివరాలు వెలుగు చూస్తుండటంతో.. మెక్సికోలోని పేదల ప్రాంతమైన ఎకాటెపెక్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రాంతంలోనే ఈ హత్యలు చోటు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, EDOMEX PROSECUTOR'S OFFICE
‘రెండు నెలల పాపనూ అమ్మేశారు’
ఈ జంట ఎప్పుడు కనిపించినా వాళ్లు పిల్లల చక్రాల కుర్చీని తోసుకుంటూ కనిపించేవాళ్లని స్థానికులు చెప్తున్నారు. ఆ తోపుడు కుర్చీలోనే మానవ అవయవాలను తరలించేవారని పోలీసులు గుర్తించారు.
సెప్టెంబర్ నెలలో స్థానికంగా నివసించే నాన్సీ హ్యూట్రాన్ అనే 28 ఏళ్ల మహిళ, ఆమె రెండు నెలల కూతురు వాలెంటినా కనిపించకుండా పోవటంతో పోలీసులు ఈ జంటను ఆపి సోదా చేశారు.
నిందితుడి పేరు జువాన్ కార్లోస్ అని పోలీసులు చెప్పారు. నాన్సీని తానే చంపానని అతడు అంగీకరించాడని.. తను హత్య చేసిన వారిలో ఆర్లెట్ ఓల్గ్విన్ (23), ఎవిలిన్ రోజాస్ (29 ) చిత్రాలను గుర్తించాడని వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలను హత్య చేసి.. వారి వస్తువులు, శరీర అవయవాలను అమ్మివేయటానికి ముందు వారిపై లైంగిక దాడి చేసినట్లు కూడా నిందితుడు అంగీకరించాడని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
బాధితుల్లో ముగ్గురు ఒంటరి తల్లులే. వారు ఇటీవలి నెలల్లోనే అదృశ్యమయ్యారు.
నాన్సీ సెప్టెంబర్ 6వ తేదీన.. తన ఇద్దరు కుమార్తెలను స్కూలులో డ్రాప్ చేసిన తర్వాత.. చిన్న కూతురుతో తిరిగి వస్తూ ఆచూకీ లేకుండాపోయారు.
పెద్ద కూతుర్లిద్దరినీ స్కూల్ నుంచి పికప్ చేసుకోకపోవటంతో.. పొరుగువారు పోలీసులను అప్రమత్తం చేశారు.
నాన్సీ కూతురు వాలెంటినాను నిందితులిద్దరూ అమ్మేశారని.. ఆ పాపను తీసుకువచ్చి ఆమె అమ్మమ్మకు అప్పగించామని పోలీసులు చెప్పారు.

జువాన్ కార్లోస్, అతడి భాగస్వామి పాట్రీసియాలు నాన్సీకి తెలుసునని, వారిదగ్గర ఆమె దుస్తులు, ఆహారం కొనుగోలు చేసేవారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
పాట్రీసియా తమ ఇంట్లో ఇంకా చాలా దుస్తులు, వస్తువులు ఉన్నాయని.. వాటిని చూడటానికి రావాలని మాయమాటలు చెప్పి నాన్సీని తన ఇంటికి తీసుకువచ్చిందని పోలీసులు వివరించారు.
మెక్సికో దేశంలో.. మెక్సికో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 395 మంది అదృశ్యం కాగా.. అందులో 207 మంది మహిళలే.
పోలీసులు ప్రవేశించటానికి భయపడే నేర ముఠాల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా మనుషులు ఆచూకీ లేకుండా పోతున్న ఘటనలు జరుగుతున్నాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









