భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతంటే : ప్రెస్ రివ్యూ

కరోనా వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Reuters

భారత్‌లో క‌రోనా వ్యాక్సిన్‌ను రూ.225 ధరకు అందిస్తామని సీరమ్ ఇండియా సంస్థ ప్ర‌క‌టించిందంటూ ‘వెలుగు’ దినపత్రిక ఓ కథనం రాసింది.

‘‘ప్ర‌పంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.

సీరమ్ ఇండియా ,ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీల భాగ‌స్వామ్యంలో క‌రోనా వ్యాక్సిన్‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా రెండో, మూడో ద‌శ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ చేసుకోవ‌చ్చంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్.

యూకేలో దీనిపై రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌మ వ్యాక్సిన్ ను రూ.225కే అందిస్తామని సీర‌మ్ ఇండియా ప్ర‌క‌టించింది. ఈ వ్యాక్సిన్‌ను 92 దేశాల‌కు అందించేందుకు సుమారు 100 మిలియ‌న్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది.

కోవిషీల్డ్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు ప్ర‌ముఖ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ది లాన్సెట్ తెలిపింద’’ని ఆ కథనంలో తెలిపారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి

ఫొటో సోర్స్, JCPRTADIPATRI

ఫొటో క్యాప్షన్, జేసీ ప్రభాకర్ రెడ్డి

విడుదలైన 24 గంటల్లోపే మళ్లీ జైలుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్‌ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే మళ్లీ పోలీసులు అరెస్టు చేశారంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

‘‘గతంలో నమోదుచేసిన సెక్షన్లకు మరికొన్నింటిని జోడించి శుక్రవారం సాయంత్రం అనంతపురం పోలీస్ స్టేషన్‌లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. కరోనా నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను ఆయనపై పెట్టారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి ముందురోజే బెయిల్‌పై కడప సెంట్రల్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. విడుదలై 24 గంటలు గడవకముందే తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదే కడప జైలుకు తరలించారు.

ఈ సమయంలో పోలీస్ స్టేషన్‌లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. కోర్టు కండీషన్‌ బెయిల్‌ ఇవ్వడంతో సంతకం చేయడానికి వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి వచ్చారు.

సంతకాల పని పూర్తిచేసి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకొన్నారు. అక్కడే కూర్చోవాలని చెప్పారు.

‘సంతకాలు అయిపోయాయి కదా. ఎందుకు స్టేషన్‌లో కూర్చోమంటున్నారు? నా ఆరోగ్యం సరిగ్గా లేదు. టాబ్లెట్‌లు వేసుకోవాలి’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి వారితో అన్నారు.

మధ్యాహ్నం 3 గంటల దాకా ఆయన్ను అక్కడే ఉంచారు. తాడిపత్రి రూరల్‌ సీఐ దేవేంద్రకుమార్‌ ఫిర్యాదుతో నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న కేసులు జేసీపై పెట్టారు.

వీటితోపాటు 506, 189, 353, 52 సెక్షన్‌ల కింద మరో నాలుగు కేసులు నమోదయ్యాయి.

అక్కడినుంచి గుత్తి కోర్టుకు ప్రభాకర్‌రెడ్డిని తరలించారు. ఈ నెల 21 వరకు ఆయనకు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ శారద రిమాండ్‌కు విధించారు. ఆ వెంటనే వారిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కడప జైలు నుంచి విడుదలై గురువారం తాడిపత్రికి ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ బయలుదేరి వెళ్తున్న సమయంలో సజ్జలదిన్నె సమీపంలో తనిఖీల కోసం వారి కాన్వాయ్‌ను సీఐ దేవేంద్రకుమార్‌ ఆపారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సమయంలో కులం పేరుతో తనపై ఆయన దుర్భాషలాడినట్టు సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడినుంచి వారు తాడిపత్రిలోని తమ నివాసానికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులతో పాటు జేసీ అభిమానులు బాణాసంచా పేల్చి నివాసం వద్ద స్వాగతం పలికారు. దీనిపై కొవిడ్‌ ఉల్లంఘన కేసును పోలీసులు పెట్టారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డిని మళ్లీ అరెస్ట్‌ చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని, అక్రమ కేసులు పెట్టి జగన్‌ రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశార’’ని అందులో పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తెలంగాణ హైకోర్టు

‘అక్కడికి వెళ్లి ఏం చూస్తారు? నిధి ఉందని ఎవరు చెప్పారు?’

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి తమను వెళ్లనివ్వాలని పిటిషన్ వేసిన ప్రజాప్రతినిధులను రాష్ట్ర హైకోర్టు ‘అక్కడికి వెళ్లి ఏం చూస్తారు?’ అని ప్రశ్నించిందంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం రాసింది.

సచివాలయం కూల్చామని ప్రభుత్వమే ప్రకటించిందని, ఈ విషయం ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చిందని, అలాంటప్పుడు అక్కడ కొత్తగా చూసి శోధించాల్సింది ఏముందని కోర్టు నాయకులను ప్రశ్నించింది.

సచివాలయ భవనాల కూల్చివేత ప్రదేశానికి అనుమతివ్వాలని కోరినా ప్రభుత్వం అనుమతించట్లేదని, ఈ నేపథ్యంలో తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కాంగ్రెస్‌ నేతల తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలేవీ లేవంటూ అభ్యర్థనను తిరస్కరించింది.

138 ఏళ్ల పురాతనమైన గుడిని కూల్చారని, అప్రకటిత నిషేధం విధించి ఎవరినీ కూల్చివేత ప్రదేశాలకు అనుమతివ్వడం లేదని వారి తరఫు న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి నివేదించారు. జీ బ్లాక్‌ కింద నిజాం నిధి ఉంది కాబట్టే ఎవరినీ అనుమతించట్లేదన్న అనుమానాలున్నాయని, ప్రజాప్రతినిధులు అక్కడికెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలపాలనుకుంటున్నారని వివరించారు.

‘నిధులు వెలికితీస్తానంటూ ఉత్తరప్రదేశ్‌లో ఒక బాబా సమాధిలోకి వెళ్లాడు. నిధి వెలికి తీయడమేమోగానీ, సమాధి నుంచి మళ్లీ ఆయన బయటకు తిరిగి రాలేదు. అలాగే సచివాలయంలోని జీ బ్లాక్‌ కింద నిజాం నిధి ఉందనే సమాచారంతో అక్కడికి వెళ్తామనడం సరికాదు. అక్కడ నిధి ఉందని ఏ విభాగం ధ్రువీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వాదనలు వినిపించడం సరికాదు’ అని ధర్మాసనం సూచించింది.

స్కూలు

‘సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు మొదలు?’

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూతపడిన పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పునఃప్రారంభించేలా కేంద్రం కసరత్తు చేస్తోందంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

పలు దేశాలు విద్యా సంస్థలను తెరిచిన తీరుపై అధ్యయనం సాగించిన మీదట, ఈ విషయమై కేంద్రం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అయితే, దీనిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

‘‘అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నెలాఖరు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ను విడుదల చేయనుంది. విద్యా సంస్థలను తెరిచే విషయమై వీటిలో కూలంకషంగా వివరించనుంది.

లాక్‌డౌన్‌ ఎత్తివేత క్రమంలో ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడు, ఏ విధానంలో తరగతులకు హాజరుకావచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాలి. ఈ విషయంలో కొవిడ్‌-19 కేసుల తీరును పరిశీలించడంతో పాటు పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

బోధన సిబ్బంది, విద్యార్థుల్లో 33% సామర్థ్యంతో బడులు షిఫ్టుల వారీగా తరగతులు నడపాలని, తరగతి గదుల్లో విద్యార్థులు 2-3 గంటలు మాత్రమే ఉండేలా చూడాలని కేంద్రం సూచనలివ్వనుంది.

మొదటి షిఫ్టు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ; రెండో షిఫ్టును 12 నుంచి 3 గంటల వరకూ నిర్వహించాలి. రెండు షిఫ్టుల మధ్యనుండే సమయంలో తరగతి గదులను శానిటైజ్‌ చేయాలి. ప్రస్తుతం మాత్రం 10 నుంచి 12వ తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి.

చిన్నారులకు మాత్రం ఆన్‌లైన్‌ తరగతులనే కొనసాగించాలి. సెక్షన్ల వారీగా విద్యార్థులు నిర్దిష్ట రోజుల్లో నేరుగా బడులకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)