COP26: ‘ఈ సదస్సు విఫలమైంది... ఇదో రెండు వారాల వేడుక’ - గ్రెటా థన్‌బర్గ్

గ్రెటా థన్‌బర్గ్

ఫొటో సోర్స్, Reuters

కాప్26 సదస్సు విఫలమైందని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. గ్లాస్గోలో భారీ ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

సదస్సుకు వేదికైన బ్రిటన్ నగరం గ్లాస్గోలో ర్యాలీ చేపట్టిన వేల మంది పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె కూడా నిరసన తెలియజేశారు.

ఈ ర్యాలీ జార్జ్ స్క్వేర్‌కు చేరుకున్నప్పుడు ఆమె ప్రసంగించారు. ‘‘తక్షణమే, భారీగా ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరముంది’’అని ఆమె నొక్కిచెప్పారు.

ఈ ర్యాలీని ‘‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ స్కాట్లాండ్’’ సంస్థ నిర్వహించింది. గ్రెటా నుంచి స్ఫూర్తి పొందిన యువత ఈ సంస్థను స్థాపించారు.

కాప్26 సదస్సు సమయంలో నిర్వహించేందుకు ప్రణాళికలు రచించిన భారీ ర్యాలీల్లో తాజా ప్రదర్శన కూడా ఒకటి.

గ్రెటా థన్‌బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

‘‘కాప్26 విఫలమైంది. ఇదేమీ రహస్యం కాదు. నేటి సంక్షోభానికి కారణమైన మార్గాలతో సమస్యలను పరిష్కరించలేం’’అని గ్రెటా వ్యాఖ్యానించారు.

‘‘మునుపెన్నడూ లేని స్థాయిలో తక్షణమే ఉద్గారాలను కట్టడి చేయాల్సిన అవసరముంది.’’

‘‘ప్రపంచ నాయకులు వారి ప్రపంచంలో వారు బతుకుతున్నారు. వారేవో కలలు కంటున్నారు. పరిమిత వనరులతో భారీ వృద్ధి సాధించాలని భావిస్తున్నారు. ఏవేవో పరిష్కార మార్గాలతో సంక్షోభాన్ని చిటికెలో పరిష్కరించాలని చూస్తున్నారు.’’

‘‘ఈ ప్రపంచం భగభగ మండిపోతోంది. చాలామంది ప్రజలు ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావాన్ని చూస్తున్నారు.’’

కాప్26 సదస్సును ఆమె రెండు వారాల వేడుకగా అభివర్ణించారు. ‘‘ఈ సదస్సు అనంతరం ఎప్పటిలానే ఎవరి పని వారు చూసుకుంటారు. ఈ ఒప్పందాల్లో తమకు ప్రయోజనం చేకూర్చే లొసుగుల కోసం అన్వేషిస్తారు’’అని గ్రెటా అన్నారు.

‘‘మన నాయకులు వారి స్వప్రయోజనాల కోసమే చూసుకుంటారని అందరికీ తెలుసు.’’

తమ దేశాలపై వాతావరణ మార్పులు ఎలా ప్రభావం చూపుతున్నాయో వివిధ దేశాలకు చెందిన పర్యావరణ ఉద్యమకారులు ఈ ర్యాలీలో వివరించారు.

కాప్26

ఫొటో సోర్స్, Getty Images

‘‘ప్రపంచ ఉద్గారాల్లో 3 శాతానికి మాత్రమే ఆఫ్రికా కారణమని చరిత్ర చెబుతోంది. కానీ, వాతావరణ మార్పుల విధ్వంసకర ప్రభావాలకు ఆఫ్రికన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది’’అని ఉగాండాకు చెందిన వెనెసా నకటే వివరించారు.

‘‘దక్షిణార్ధ గోళంలోని దేశాలు వాతావరణ మార్పులపై ముందుండి పోరాడుతున్నాయి. కానీ, పత్రికల్లో మొదటి పేజీల్లో వాటి పేర్లు కనిపించడం లేదు.’’

ఈ ర్యాలీ గ్లోస్గోకు పశ్చిమంగా కదిలి కాప్26 సదస్సు జరుగుతున్న ప్రాంతంలో నిరసన తెలిపింది. అనంతరం నగరం నడిబొడ్డుకు వీరు ప్రదర్శనగా వెళ్లారు.

చివరగా జార్జ్ స్క్వేర్ వద్ద ఈ ర్యాలీ ముగిసింది. అక్కడే పర్యావరణ ఉద్యమకారులు ప్రసంగించారు.

కాప్26

ఫొటో సోర్స్, PA Media

ఈ ర్యాలీలో పాలుపంచుకునేందుకు గ్లాస్గోకు చెందిన 14ఏళ్ల చార్లీ ఓరూర్కే పాఠశాలకు సెలవుపెట్టి వచ్చారు. అతడి వెంట తల్లి కైర్‌స్టీ, సోదరి ఉన్నారు.

‘‘ప్రజలు చెబుతున్నది ప్రపంచ నాయకులు వినాలి. కేవలం లాభాల కోసం మాత్రమే చూసుకోకూడదు. నేడు మన భూమి అవసరాలను కూడా పట్టించుకోవాలి’’అని చార్లీ వ్యాఖ్యానించాడు.

తన పిల్లల కోసం ఇక్కడకు వచ్చానని చార్లీ తల్లి కైర్‌స్టీ చెప్పారు. ‘‘కచ్చితమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్ తరాలు కోరుకుంటున్నాయి. ఆ చర్యలను వేగంగా తక్షణమే తీసుకోవాలి’’అని ఆమె అన్నారు.

ర్యాలీ పాల్గొనేందుకు ఉలాపూల్‌కు చెందిన 14ఏళ్ల ఫిన్లే ప్రింగిల్ తన తండ్రితో కలిసి రైలులో ఇక్కడికి వచ్చాడు.

‘‘నిజంగా మీరు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తే, దీన్ని కాపాడాలని అనుకుంటే, కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ఉండకూడదు’’అని ఫిన్లే వ్యాఖ్యానించాడు.

అన్నా బ్రౌన్
ఫొటో క్యాప్షన్, అన్నా బ్రౌన్

‘‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’’ చేపడుతున్న నిరసనల్లో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. శుక్రవారం నాడు పాఠశాలలకు సెలవు పెట్టి వీరు వాతావరణ మార్పులపై నిరసనలు తెలుపుతున్నారు.

‘‘కేవలం నాలుగు గోడలకే వాతావరణ మార్పులపై చర్చలు పరిమితం కాకుండా చర్యల దిశగా అడుగులు వేయాలని కోరుతూ ఈ ప్రదర్శన చేపడుతున్నాం’’అని ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమకారిణి అన్నా బ్రౌన్ చెప్పారు.

‘‘కాప్ సదస్సుల్లో తీసుకుంటున్న చర్యలు పనిచేయడం లేదు. ఈ విధానాలను కూకటివేళ్లతో పెకలించాలి.’’

‘‘వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న యువత, కార్మికులు చెప్పేది మీరు వినాలి.’’

కాప్26

‘‘చర్చలన్నీ నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న వారు చెప్పేది కూడా వినాలి. వారిని కూడా పట్టించుకోవాలి’’అని ఆమె అన్నారు.

‘‘నిజానికి ఇక్కడ అసలు ఏం జరుగుతోందో ప్రజలకు అర్థం కాకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అసలు అర్థమే కానప్పుడు ఇక్కడ తీసుకునే చర్యలను ఎవరు విమర్శిస్తారు? ఈ పరిస్థితి మారాలి.’’

గ్లాస్గో వీధుల్లో ఇలా వేలమంది విద్యార్థులను చూస్తుంటే తనలో స్ఫూర్తి రగులుతోందని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ గ్యారీ రిచ్చీ అన్నారు.

‘‘ఇది కాప్26 సదస్సులో చాలా ముఖ్యమైన రోజు. భారీగా యువత పాల్గొంటున్న ఇలాంటి చరిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా అనిపిస్తోంది’’అని ఆయన చెప్పారు.

‘‘శాంతి, భద్రతల పరిరక్షణ కోసం మా అధికారులు విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ ర్యాలీలో పాల్గొనేందుకు చాలామంది పిల్లలు వారికి వారిగానే వస్తున్నారు.’’

పోలీసులు, విద్యార్థుల మధ్య వాతావరణం చాలా సామరస్యంగా ఉందని ఆయన వివరించారు. కొన్నిచోట్ల నిబంధనలను ఉల్లంఘించిన 20 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

కాప్26

ఫొటో సోర్స్, PA Media

ప్రభుత్వ నిర్ణయాల్లో యువతను భాగస్వామ్యం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్కాటిష్ ఆర్థిక మంత్రి నికోలా స్ట్రూజన్ చెప్పారు.

‘‘స్కాట్లాండ్‌లో మేం ఇప్పటికే వాతావరణ సంక్షోభ పరిష్కారం దిశగా చర్యలు మొదలుపెట్టాం. అయితే, నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పిల్లలు ముందుకు వచ్చి చాలా కొత్త విషయాలు చెబుతున్నారు. ఇవి చూస్తుంటే మేం చేస్తున్నది సరిపోదు.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అర్థమవుతోంది’’అని ఆమె అన్నారు.

విద్యార్థుల ఆగ్రహం, బాధను తాను అర్థం చేసుకోగలనని ప్రిన్స్ చార్లెస్ కూడా సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల భుజాలపై చరిత్ర చాలా భారం మోపుతోందని ఆయన అన్నారు.

తనను కూడా ర్యాలీలో పాల్గొనాలని కోరారని, కానీ తనకు వీలుపడలేదని ఆయన వివరించారు.

కాప్26

‘‘ర్యాలీలో పాల్గొనేందుకు చాలామంది విద్యార్థులు తమ పాఠశాలలకు సెలవు పెడుతున్నారు. ఇప్పటికే కరోనావైరస్ వ్యాప్తితో వారి చదువుపై చాలా ప్రభావం పడింది. ఇలాంటి సమయంలో ర్యాలీతో మరింత ప్రభావం పడుతుంది’’అని రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే, వాతావరణ మార్పులపై నిరసన తెలిపేందుకు వస్తున్న విద్యార్థులను శిక్షించకూడదని గ్లోస్గో సిటీ కౌన్సిల్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని అధికారులు బీబీసీతో చెప్పారు.

ర్యాలీ రోజున పాఠశాలకు హాజరుకాకపోతే, దీన్ని ‘‘చెప్పకుండా పెట్టిన సెలవు’’గానే పరిగణిస్తామని ఈస్ట్ డన్‌బార్టన్‌షైర్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)