కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...

తుపాను బీభత్సం -ప్రతీకాత్మక చిత్రం
ఫొటో క్యాప్షన్, తుపాను బీభత్సం -ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

నవంబర్ 6, 1996. సరిగ్గా పాతికేళ్ల క్రితం. ఈ తేదీ గుర్తుకొస్తే నేటికీ కోనసీమలో చాలామంది వణికిపోతారు. ఈ ప్రాంతంలో మూడు పదుల వయసు దాటిన ప్రతీ ఒక్కరికీ ఆనాటి తుపాను బీభత్సం కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.

ప్రకృతి అందాల నెలవుగా పచ్చగా కనిపించే కనిపించే కోనసీమలో ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలింది. అర్ధరాత్రి విరుచుకు పడిన పెను తుపానుకు జనం తల్లడిల్లిపోయారు. వందలమంది ప్రాణాలు పోయాయి. కనిపించకుండా పోయినవారి సంఖ్య లెక్క లేదు.

వేల చెట్లు నెలకొరిగాయి. లక్షల ఇళ్లు నేలకూలాయి. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. మళ్లీ కోలుకోవడానికి చాలాకాలమే పట్టింది.

ఆ రోజు ఎదుర్కొన్న అనుభవాలను పదే పదే జ్ఞప్తికి తెచ్చుకునే కోనసీమలో తుపాను కి ముందూ, తుపాను తర్వాత అన్నట్టుగా చెప్పుకుంటారు. అందుకే ఆనాటి అనుభవాల గురించి కోనసీమకి చెందిన పలువురిని బీబీసీ పలకరించింది.

ప్రశాంతంగా ప్రారంభమై...

ప్రస్తుతం వివిధ పేర్లతో పిలుస్తున్నట్టుగా అప్పట్లో తుపాన్లకు పేర్లు పెట్టే విధానం లేదు. అయితే 1996 నవంబర్ 4వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ను 07బి గా పేర్కొంటారు.

నవంబర్ 6 నాటికి ఈ తుఫాన్ పెనుతుపానుగా రూపాంతరం చెంది, కాకినాడకు దక్షిణాన కోనసీమ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మొదటి రెండు రోజులు పెద్దగా వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం లేనప్పటికీ నవంబర్ 6 బుధవారం నాటికి మాత్రం తుపాను తీవ్రత కనిపించింది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా అంతటా ఈదురుగాలులు, భారీ వర్షం నమోదయ్యింది.

గంటకు సుమారు 145 నుంచి 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు రికార్డయ్యింది. 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది.

ఆరో తేదీ సాయంత్రం తుపాను తీరం దాటే సమయంలో చీకటి పడిన తర్వాత తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది. కోనసీమలోని ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం మండలాలతో పాటుగా యానాం, తాళ్లరేవు పరిసరాల్లో ఈ తుపాను తాకిడి ఎక్కువగా కనిపించింది.

కోనసీమలోని మిగిలిన అన్ని మండలాల్లో భీకర ప్రభావం చూపింది. తూర్పు గోదావరి జిల్లా అంతా తుపాను తాకిడికి తల్లడిల్లింది.

1996 నవంబర్ 6 నాటి తుపాను తాకిడికి పెద్ద ఎత్తున కొబ్బరితోటలు నాశనమయ్యాయి-ప్రతీకాత్మక చిత్రం
ఫొటో క్యాప్షన్, 1996 నవంబర్ 6 నాటి తుపాను తాకిడికి పెద్ద ఎత్తున కొబ్బరితోటలు నాశనమయ్యాయి-ప్రతీకాత్మక చిత్రం

'మా కళ్లెదురుగానే పోయారు'

''భారీ వర్షం, ఈదురు గాలుల తీవ్రతతో కొబ్బరి, సరుగుడు తోటలు ఊగిపోయేవి. కొన్నిచోట్ల చెట్లు నేలతాకి మళ్లీ పైకి లేచినట్లుగా కనిపించాయి. భీకరమైన హోరుతో సముద్రం విరుచుకుపడింది. ఊరు మీదకు వచ్చేస్తుందేమో అన్నంతగా భయం వేసింది. ఈలోగా వర్షం పెరిగిపోవడంతో కరెంటు ముందు రోజే ఆపేశారు. ఆ రాత్రి ఏం జరుగుతుందో తెలియలేదు'' అని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు తాళ్లరేవు మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన సి.హెచ్. వెంకటేశ్వర్లు

''మా ఊరిలో పూరిళ్లు ఎగిరిపోయాయి. పెంకుటిళ్లు కూడా నేల కూలాయి. కొందరు మా కళ్లెదురుగానే వరదలో కొట్టుకుపోయారు. ఎవరు ఉన్నారో, ఎవరు పోయారో కూడా అప్పట్లో మాకు తెలియదు. రెండు, మూడు రోజుల పాటు మా ఊరికే ఎవరూ రాలేదు. తాగడానికి నీళ్లు కూడా లేకుండా, చుట్టూ శవాల మధ్యనే ఉన్నోళ్లమంతా బతికాం'' అని ఆయన బీబీసీతో అన్నారు.

తుపాను తీరం దాటిన ప్రాంతంలోనే ఈ గ్రామం ఉంది. చుట్టూ ఏరు, సముద్రానికి మధ్యలో గ్రామం ఉంటుంది. దాంతో తుపాను మూలంగా తీవ్రంగా నష్టపోయిన గ్రామాల్లో అది ఒకటిగా మారింది.

ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లోనే ఎక్కువ నష్టం జరిగింది. ఓవైపు పశు కళేబరాలు, మరోవైపు మనుషుల శవాల మధ్య వారం రోజుల పైబడి కొన్ని సముద్ర తీర గ్రామాలు దుర్వాసనతో తల్లడిల్లిపోయాయి.

1996 నవంబర్ 6 సాయంత్రం వరకు ప్రశాంతంగానే కనిపించిన సముద్రం ఆ తర్వాత విరుచుకుపడింది
ఫొటో క్యాప్షన్, 1996 నవంబర్ 6 సాయంత్రం వరకు ప్రశాంతంగానే కనిపించిన సముద్రం ఆ తర్వాత విరుచుకుపడింది

'పదేళ్లయినా నష్టం పూడలేదు'

తుపాను తీవ్రత నుంచి తప్పించుకోవడానికి అనేక మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఏటా వచ్చే తుపాన్లే కదా అన్నట్టుగా కొందరు తీరప్రాంత వాసులు తేలికగా తీసుకోవడం వల్ల కూడా నష్టం ఎక్కువగా వచ్చిందనే అభిప్రాయం ఉంది.

పశు సంపదకు అపార నష్టం జరిగింది. ఈదురు గాలులతో చెట్లు కూలి వాటి కిందనే తోటల్లో ఉన్న వేల కొద్దీ పశువులు చనిపోయాయి. ఇతర అనేక కారణాలతో తుపాను సమయంలో పశు సంపద కోల్పోయిన రైతులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

పశువులతో పాటు కొబ్బరి తోటలు నాశనం కావడంతో కోలుకోలేకపోయామని చాలామంది చెబుతుంటారు.

''ఆరు ఎకరాల కొబ్బరి తోట. దాదాపు నేలకు ఒరిగింది. 20 పశువుల్లో సగం చనిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీలే ప్రాణాలు నిలబడ్డాయని సంతృప్తి చెందామే గానీ ఆ నష్టం నుంచి గట్టెక్కడం ఎలా అన్నది అంతుబట్టలేదు. పదేళ్ల వరకూ కొబ్బరితోటకు కాపు లేకుండా పోయింది'' అని ఓడలరేవుకు చెందిన రైతు సత్యనారాయణ రాజు వెల్లడించారు.

''తుపాను రెండు మూడు రోజులే గానీ, దాని తాకిడితో మాకు దశాబ్దంకాలం పాటు కోలుకోని దెబ్బ పడింది. ఆ భయానకమైన అనుభవాన్ని మరచిపోలేం'' అన్నారాయన.

కొబ్బరి తోటలకు వివిధ తెగుళ్ల సమస్య రావడంతో ఆ తర్వాత ఆక్వాసాగు వైపు మళ్లిపోవడానికి ఈ తుపాను కూడా ఓ కారణమేనని సత్యనారాయణ రాజు అభిప్రాయపడ్డారు.

కోనసీమ తుపాను సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, కోనసీమ తుపాను సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు

'చంద్రబాబు కూడా కన్నీరు పెట్టారు'

"తీర గ్రామాలకు వెళ్లిన మాకు శవాల గుట్టలు కనిపించాయి. దుర్గంధం భరించలేక సతమతమయ్యేవాళ్లం. బతికున్నవాళ్లు హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహారం ప్యాకెట్ల కోసం పాకులాడిన తీరు చూసి బాధేసేది'' అని రాజమండ్రికి చెందిన పెద్దాడ నవీన్ అన్నారు.

జర్నలిస్టుగా పని చేసిన నవీన్ ఆనాటి తుపాను బీభత్సాన్ని కవర్ చేశారు.

''నేను రాజమండ్రి కేంద్రంగా వార్తలు కవర్ చేస్తున్నాను. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి లోనే క్యాంప్ ఆఫీసు పెట్టారు. ఆర్డీవో ఆఫీసునే కేంద్రంగా చేసుకుని సీఎం 15రోజులున్నారు. పునరావాస, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు స్వయంగా ఆయనే ప్రత్యక్షంగా బాధ్యత తీసుకున్నారు. ముఖ్యమంత్రితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ లో 5 రోజుల పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లాను. కాట్రేనికోన మండలంలో ఓ చోట ఈ దుస్థితిని చూసి నాకు దుఃఖం ఆగలేదు. చంద్రబాబు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు'' అని నవీన్ వెల్లడించారు.

''బ్రహ్మ సముద్రం దగ్గర తీరం వెంబడి 4 కిలోమీటర్ల పొడవునా 68 శవాలు నాతోపాటు ఉన్న మరో విలేఖరి కంటబడ్డాయి. వాటిని ఫొటోలు కూడా తీశాము. రోజుకి 13 కి.మీలు నడుచుకుంటూ, దారిలో పడిపోయిన చెట్లు దాటుకుంటూ తిరిగాము'' అని నవీన్ ఆనాటి పరిస్థితులను బీబీసీకి వివరించారు.

తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న కొండపల్లి కోటీశ్వరమ్మ, మోటూరి ఉదయం తదితరులు
ఫొటో క్యాప్షన్, తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న కొండపల్లి కోటీశ్వరమ్మ, మోటూరి ఉదయం తదితరులు

కోనసీమ చరిత్రలోనే ఇది అతి పెద్ద నష్టం

కోనసీమలో అనేక తుపాన్లు తీరం దాటాయి. కానీ 1996 స్థాయి నాటి నష్టాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదని స్థానికులు చెబుతుంటారు. ఈ తుపాన్ తాకిడితో 2.25 లక్షల కుటుంబాలు నష్టపోగా అందులో 70 శాతం కోనసీమ వాసులే.

అధికారిక లెక్కల ప్రకారం ఈ తుపాను 6,47,554 నివాసాలపై ప్రభావం చూపింది. అందులో 10వేల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యధికం నేలకూలగా, ఆ తర్వాత వరద తాకిడితో కొట్టుకుపోయిన ఇళ్లు కూడా ఉన్నాయి.

5.97 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. అందులో అత్యధికంగా కొబ్బరి, వరి పంటలున్నాయి. 1077 మంది మరణించినట్టు అధికారికంగా ధృవీకరించారు. ఇంకా అనేక మంది గల్లంతయినట్టు అప్పట్లో పేర్కొన్నారు.

మొత్తంగా ఈ తుఫాన్ మూలంగా ఆంధ్రప్రదేశ్ కి రూ.215 కోట్ల నష్టం సంభవించినట్టు వెల్లడించారు.

సమస్యల వలయం

''పునరావాస సహాయం అందించడం పెద్ద పరీక్ష. కరెంటు స్తంభాలు వేలల్లో నేలకూలాయి. రోడ్లు తెగిపోయాయి. ఎక్కడిక్కడ చెట్లు, బాధిత గ్రామాలకు వెళ్ళేందుకు మార్గం సిద్ధం చేయడమే పెద్ద పని. తక్షణ సహాయం కింద కనీసంగా బియ్యం, కిరోసిన్ అందించడానికే పది రోజులు పట్టింది'' అని రెవిన్యూ శాఖలో పనిచేసి ఆర్డీవో గా రిటైరైన ఎం.సుబ్బారావు వెల్లడించారు.

''కొన్ని గ్రామాలలో వారం రోజుల తర్వాత గానీ అడుగుపెట్టలేకపోయాం. అప్పటి వరకూ హెలీకాప్టర్ల ద్వారా అందించే ఆహారపు పొట్లాలే వారికి ఆధారం. నష్టాల నమోదు పూర్తవ్వకడానికి నెల పట్టింది. ఏళ్ల తరబడి సహాయం అందిస్తూనే ఉన్నాం. నా ఉద్యోగ జీవితంలో అంతటి విపత్తు చూడలేదు'' అన్నారాయన.

కొబ్బరితోటల మధ్యలో, సముద్రం ఒడ్డున, గ్రామాలను ఆనుకుని శవాల కుప్పలు చూసి చలించిపోయినట్లు ఆయన బీబీసీకి తెలిపారు.

కమ్యూనికేషన్స్ సమస్య

''ఇప్పటిలా కమ్యూనికేషన్స్ సదుపాయాలు లేవు. స్తంభాలన్నీనేలకొరగడంతో కోనసీమలో కరెంటు, టెలిఫోన్లు బంద్ అయ్యాయి. అయినా సహాయక చర్యలు ఊహించిన దానికన్నా వేగంగా జరిగాయి. చాలామంది స్వచ్ఛందంగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. కోనసీమ వాసులకు మనోధైర్యం నింపడంలో ఆనాటి స్వచ్ఛంద సహాయకుల పాత్ర చాలా ఉంది'' అని పెద్దింశెట్టి రామకృష్ణ తన అనుభవాలను పంచుకున్నారు.

కాకినాడకు చెందిన ఈ మాజీ కార్మిక నాయకుడు అప్పట్లో అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో తమ కార్యకర్తలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నెల రోజుల పాటు తమ కార్యకర్తలంతా తుపాను సహాయక కార్యక్రమాల్లోనే ఉన్నామని ఆయన వివరించారు.

ప్రకృతి అందాలు, పాడిపంటలకు నిలయం కోనసీమ
ఫొటో క్యాప్షన్, ప్రకృతి అందాలు, పాడిపంటలకు నిలయం కోనసీమ

కోలుకుంది కానీ....

తుపాన్లు ఏటా వస్తూనే ఉన్నాయి. 1996 నాటి తీవ్రతతో కాకపోయినా 2018లో కూడా ‘పెథాయ్’ తుపాన్ కూడా గట్టిదే. ఇంకా మధ్యలో మరికొన్ని తుపాన్లు కూడా కోనసీమలోనే తీరం దాటాయి.

''మడ అడవులు, సరుగుడు, జీడి తోటలు చాలా వరకు తీరాన్ని రక్షిస్తున్నాయి. అయితే వాటిని ధ్వంసం చేసి ఆక్వా సాగు చేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రమాదకరం. రక్షణ లేకుండా చేసి తీరాన్ని తుపాన్ల తాకిడికి వదిలేసేలా ఈ చర్యలుంటున్నాయి. 1996 నాటి అనుభవం గుర్తు చేసుకుని జాగ్రత్తపడకపోతే మరోసారి కోనసీమ కకావికలం అయిపోయే ప్రమాదం దాపురిస్తుంది'' అని అమలాపురానికి చెందిన పర్యావరణ కార్యకర్త ఆర్.సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.

కోనసీమలో ఆయిల్ కంపెనీలు, ఆక్వా సాగు మూలంగా దెబ్బతింటున్న పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆనాటి తుపాను చాటి చెబుతోందని ఆయన బీబీసీతో అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో దివిసీమ ఉప్పెన తర్వాత పెను నష్టాన్ని కలిగించిన కోనసీమ తుపాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నది పలువురి అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)