నిసర్గ సైక్లోన్: తుపాన్లు ఎలా ఏర్పడతాయి.. అల్పపీడనం, వాయుగుండం, సైక్లోన్, సూపర్ సైక్లోన్ మధ్య తేడా ఏమిటి.. ఏది ప్రమాదకరం

ఎగసిపడుతున్న అలలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ‌త వందేళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌ని పెను తుపాను ముంబ‌యి తీరాన్ని తాకింది. భార‌త్‌లోని అరేబియా స‌ముద్రంలో అరుదుగా విరుచుకుప‌డే తుపాన్లలో ఇది ఒక‌టిగా నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌పంచంలో ప‌ది శాతం ట్రాపిక‌ల్ సైక్లోన్‌లు (స‌మశీతోష్ణ ప్రాంతాల్లో వ‌చ్చే తుపాన్లు) భార‌త్ తీరాన్ని తాకుతుంటాయి. వీటిలో చాలావ‌ర‌కు బంగాళాఖాతంలో ఏర్ప‌డి తూర్పు తీరం వైపుగా వ‌స్తుంటాయి.

నిస‌ర్గ లాంటి ప్ర‌చండ‌ వేగంతో ప‌శ్చిమ తీరాన్ని తాకే తుపాన్లు అరుదుగా వ‌స్తాయి. అరేబియా స‌ముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుపానులు నాలుగు రెట్లు ఎక్కువని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) చెబుతోంది.

అస‌లు తుపాన్లు ప‌శ్చిమ తీరం వైపు ఎందుకు వ‌స్తుంటాయి? వీటి దిశ ఎలా మారుతుంది? అల్ప పీడ‌నం నుంచి సూప‌ర్ సైక్లోన్‌గా ఎలా బ‌ల‌ప‌డుతుంది?

ప్రచండ గాలులు

ఫొటో సోర్స్, Getty Images

ప‌శ్చిమ తీరంలో తుపాన్లు పెర‌గ‌డానికి అదే కార‌ణ‌మా?

1891, నుంచి 1990 మ‌ధ్య తూర్పు, పశ్చిమ తీరాల్లోని తుపాన్ల‌ను ఐఎండీ నిపుణులు విశ్లేషించారు. దీంతో 262 తుపాన్లు తూర్పు తీరంలోని 50 కి.మీ ప్రాంతాన్ని ఎక్కువ‌గా తాకిన‌ట్లు తేలింది. వీటిలో 92 తీవ్ర‌మైన తుపాన్లు.

అదే స‌మ‌యంలో ప‌శ్చిమ తీరంలో కేవ‌లం 33 తుపాన్లు మాత్ర‌మే వ‌చ్చాయి. వీటిలో 19 మాత్ర‌మే తీవ్ర‌మైన‌వి. సాధార‌ణంగా ఈ తుపాన్లు మే-జూన్, అక్టోబ‌రు-న‌వంబ‌రు నెలల్లో వ‌స్తుంటాయి.

"తూర్పు తీరాన్ని తాకే తుపాన్లు ఆగ్నేయ‌ బంగాళా ఖాతంలో పుడ‌తాయి. లేదా వాయువ్య ప‌సిఫిక్‌లో పుట్టి ద‌క్షిణ చైనా స‌ముద్రం మీదుగా బంగాళా ఖాతంలోకి వ‌స్తాయి.

వాయువ్య ప‌సిఫిక్ స‌ముద్రంలోనే 35 శాతం తుపాన్లు పుడ‌తాయి. కాబ‌ట్టి బంగాళా ఖాతంలో వ‌చ్చే తుపాన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అరేబియా స‌ముద్రంలోని తుపాన్ల‌కు వ‌స్తే.. ఇవి ల‌క్ష్య ద్వీప్‌లో ఏర్ప‌డ‌తాయి. లేదా భార‌త ద్వీప క‌ల్పం దాటి ఇవి ప‌శ్చిమ తీరం వైపుకు వ‌స్తుంటాయి. ద్వీప క‌ల్పాన్ని దాటుకుని వ‌చ్చే క్ర‌మంలో ఇవి బాగా బ‌ల‌హీన ప‌డ‌తాయి"అని విశాఖప‌‌ట్నంలోని తుపాను హెచ్చ‌రిక‌ల కేంద్రం అధిప‌తి ఆర్ బీబ్రాజ్ తెలిపారు.

మ‌రోవైపు అరేబియా స‌ముద్రంతో పోల్చిన‌ప్పుడు బంగాళాఖాతంలో స‌ముద్ర ఉప‌రిత‌ల‌ ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌గా ఉండ‌ట‌మూ ఇక్క‌డ తుపాన్ల సంఖ్య పెరిగేందుకు కార‌ణ‌మ‌ని వాతావ‌ర‌ణ నిపుణురాలు, ఆంధ్రా యూనివ‌ర్సిటీలోని ఓష‌నోగ్ర‌ఫీ విభాగం అధిప‌తి ప్రొఫెస‌ర్ పి. సునీత చెప్పారు.

తుపాను గమనాన్ని పరిశీలిస్తున్న వాతావరణ శాఖ సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

"హిమాల‌యాల నుంచి వ‌చ్చే నీరు ఎక్కువ‌గా బంగాళా ఖాతంలో క‌లుస్తుంది. దీంతో నీటి ఉష్ణోగ్ర‌త కొంచెం పెరుగుతుంది.

మ‌రోవైపు బంగాళా ఖాతంలోని నీటిలో ల‌వ‌ణీయ‌తా త‌క్కువ‌గా ఉండ‌ట‌మూ తుపానులు ఎక్కువ‌గా వ‌చ్చేందుకు కార‌ణం అవుతాయి.

ఇటీవ‌ల‌ హిందూ మ‌హాస‌ముద్రంలోని డైపోల్ బ‌ల‌ప‌డ‌టం వ‌ల్ల ప‌శ్చిమ తీరంపై వ‌చ్చే తుపాన్ల సంఖ్య పెరుగుతోంది.

తూర్పు హిందూ మ‌హా స‌ముద్రంలో పోల్చిన‌ప్పుడు ప‌శ్చిమ హిందూ మ‌హాసముద్రం ముఖ్యంగా.. భార‌త్ ప‌శ్చిమ తీరం, తూర్పు ఆఫ్రికా వేడెక్క‌డాన్ని ఇండియ‌న్ ఓష‌న్‌ డైపోల్‌గా అభివ‌ర్ణిస్తారు.

ఇటీవ‌ల కాలంలో ఈ డైపోల్ మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతోంది. అంటే ఇక్క‌డి నీటిలో ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత పెరుగుతున్నాయి. ఇదే ప‌శ్చిమ తీరంలో తుపాన్ల సంఖ్య పెరిగేందుకు ప్ర‌ధాన కార‌ణం."అని సునీత వివ‌రించారు.

మ‌రోవైపు, వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. అరేబియా స‌ముద్రంలోని తుపాన్ల సంఖ్య‌, తీవ్ర‌త‌ను ప్ర‌భావితం చేస్తోందా? అనే కోణంలో అధ్య‌య‌నాలు జ‌రుగుతున్న‌ట్లు బీబ్రాజ్ తెలిపారు.

తీవ్ర తుపాను

ఫొటో సోర్స్, Getty Images

తుపానుగా బ‌ల ప‌డేందుకు అవే కార‌ణం

ట్రాపిక‌ల్ సైక్లోన్లు సాధార‌ణంగా స‌మశీతోష్ణ ప్రాంతాల్లో(ట్రాపిక్స్‌) పుడుతుంటాయి. అంటే ఉత్త‌రార్థ గోళంలోని క‌ర్కాట‌క రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్స‌ర్‌), ద‌క్షిణార్థ గోళంలోని మ‌క‌ర రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్స‌ర్‌) మ‌ధ్య‌నున్న ప్రాంతాల్లో ఇవి జ‌నిస్తుంటాయి. విధ్వంస‌క‌ర గాలులు తోడ‌వ‌డంతో ఇవి తీరాల‌పై విరుచుకుప‌డుతుంటాయి.

హిందూ మ‌హాస‌ముద్రంలో వీటిని సైక్లోన్లు (తుపానులు), అట్లాంటిక్‌లో హ‌రికేన్ల‌ని, ప‌శ్చిమ ప‌సిఫిక్‌-ద‌క్షిణ చైనా స‌ముద్రాల్లో టైఫూన్ల‌ని, ప‌శ్చిమ ఆస్ట్రేలియాలో విల్లీ-విల్లీస్ అని పిలుస్తుంటారు. ‌

సాధార‌ణంగా ఈ తుపానులు ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌గా ఉండే స‌ముద్ర జ‌లాల్లో జ‌నించి క్ర‌మంగా బ‌ల‌ప‌డుతుంటాయి. 27 డిగ్రీల కంటే ఎక్కువుండే ఉష్ణోగ్ర‌త‌లుండే సువిసాల స‌ముద్ర ఉప‌రిత‌లం, భూభ్ర‌మ‌ణం వ‌ల్ల జ‌నించే కొరియోలిస్ బ‌లాలు, నిట్ట‌నిలువుగా వీచే గాలుల్లో తేడాలు, అల్ప పీడ‌న‌ ప్రాంతాలు లేదా అప్ప‌టికే నెమ్మ‌దిగా సుడులు తిరుగుతున్న గాలులు.. లాంటి అంశాలు తుపానులు పుట్టేందుకు, బ‌ల‌ప‌డేందుకు తోడ్ప‌డ‌తాయి.

తుపాను జ‌నించ‌డంలో అల్ప పీడ‌నం అత్యంత కీల‌క‌మైన‌ది. అల్ప పీడ‌నం ఏర్ప‌డేచోట‌.. అన్ని వైపుల నుంచీ గాలులు చేరి అత్యంత వేగంతో సుడులు తిరుగుతుంటాయి.

తుపాను నష్టం

ఫొటో సోర్స్, Getty Images

తుపాను కేంద్ర భాగానికి స‌మీపంలో నుండే మేఘాల్లో నీటి ఆవిరి నీరుగా మారే ప్ర‌క్రియ‌లో వెలువ‌డే శ‌క్తి తుపానుకు ఆజ్యం పోస్తుంది. స‌ముద్రం నుంచి నిరంతరంగా అందే తేమ‌.. దీన్ని మ‌రింత బ‌ల ప‌రుస్తుంది. ఒక‌సారి తీరాన్ని చేరితే.. తుపానుకు ఇక తేమ అంద‌దు. దీంతో ఇది బ‌ల‌హీన ప‌డుతుంది.

20 డిగ్రీల ఉత్త‌ర అక్షాంశాన్ని దాటే తుపానులు మ‌లుపు తిరిగి మ‌రింత విధ్వంస‌క‌రంగా మారతాయి.

భార‌త్‌ ప‌శ్చిమ తీరంలో అయితే ద‌మ‌ణ్‌, తూర్పు తీరంలో కోణార్క్ ప‌ట్ట‌ణం దీని కింద‌కు వ‌స్తాయి. ఈ రేఖాంశాన్ని దాటేచోట తుపాన్లు దిశ మార్చుకుంటాయి. దీనికి బ‌లంగా వీచే ప‌వ‌నాల్లో మార్పులే కార‌ణం.

"వాతావ‌ర‌ణంలోని పైపొర‌ల్లో బ‌లంగా దూసుకెళ్లే ప‌వ‌నాలు తుపానుల దిశ‌ను ప్ర‌భావితం చేస్తాయి. సాధార‌ణంగా అరేబియా స‌ముద్రంపై ప‌వ‌నాలు తూర్పు వైపు నుంచి ప‌శ్చిమ దిశ‌గా వీస్తాయి. అందుకే ఇక్క‌డి తుపాన్లు ఒమ‌న్ వైపుగా వెళ్తాయి. కానీ నిస‌ర్గ విష‌యానికి వ‌స్తే.. భార‌త పీట‌భూమిపైనున్న బ‌ల‌మైన గాలులు తుపానును ఉత్త‌రం, ఈశాన్యంవైపు మ‌ళ్లిస్తున్నాయి. అందుకే తుపాను ముంబ‌యి తీరం వైపుగా వ‌స్తోంది."అని బీబ్రాజ్ అన్నారు.

మ‌ధ్య‌లో ప్ర‌శాంతంగా..

తుపాను ఏర్పడడం

ఫొటో సోర్స్, IMD

తుపాను మ‌ధ్య భాగంలో అత్యంత వేగంతో సుడులు తిరిగే గాలులను తుపాను కేంద్రం(ఐ)గా పిలుస్తారు.

ఈ కేంద్రం వ్యాసం 150 నుంచి 250 కి.మీ. వ‌ర‌కు ఉంటుంది. సాధార‌ణంగా ఈ ప్రాంతం చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది.

ఇక్క‌డ వేడి గాలి కిందివైపుగా ప‌య‌నిస్తుంది. దీనికి చుట్టూ ఉండే ప్రాంతాన్ని ఐ వాల్ గా పిలుస్తారు. ఇక్క‌డుండే గాలులు 18 కి.మీ. వ‌ర‌కు పైకిలేస్తాయి.

గాలి వేగం గంట‌కు 200 కి.మీ. వ‌ర‌కు ఉంటుంది. ఈ ప్రాంతంలో కుంభ‌వృష్టి వ‌ర్షం కురుస్తుంది.

"ఐ వాల్"పైఏర్ప‌డే మేఘాలు ప‌రిస‌ర ప్రాంతాల్లోకి కూడా విస్త‌రించి వ‌ర్ష‌పాతం కురిపిస్తాయి.

బంగాళాఖాతం, అరేబియా స‌ముద్రం, హిందూ మ‌హాస‌ముద్రాల్లో ఈ వ‌ర్ష‌పాతం ప‌రిధి 1200 కి.మీ. వ‌ర‌కు ఉంటుంది.

అందుకే తుపాను కేంద్ర‌ ప్రాంతంతోపాటు ప‌రిస‌రాల్లో కూడా విప‌రీంగా వ‌ర్షం కురుస్తుంటుంది. ఈ తుపానులు రోజుకు 300 నుంచి 500 కి.మీ. వేగంతో ప‌య‌నిస్తుంటాయి.

కమ్ముకున్న మేఘాలు

ఫొటో సోర్స్, Getty Images

సూప‌ర్ సైక్లోన్ అని ఎప్పుడంటారు?

భార‌త్ ప్ర‌భుత్వానికి చెందిన వికాస్ పీడియా స‌మాచారం ప్ర‌కారం.. బంగాళాఖాతంతోపాటు, అరేబియా స‌ముద్రంలోని అల్ప పీడ‌నాల‌ను ఐఎండీ ఆరు ర‌కాలుగా విభ‌జించింది. గాలుల వేగం గంట‌కు 31 కి.మీ. కంటే త‌క్కువ ఉంటే దాన్ని అల్ప పీడ‌నం అంటారు. తుపానుగా గుర్తించాలంటే గాలు వేగం గంట‌కు 61 కి.మీ. కంటే ఎక్కువే ఉండాలి. సూప‌ర్ సైక్లోన్ అంటే గంట‌కు 221 కంటే ఎక్కువ వేగంతో గాలులు వీయాలి.

విధ్వంసం సృష్టించే ముప్పు ఆధారంగా కూడా తుపానుల‌ను ఐదు ర‌కాలుగా ఐఎండీ వ‌ర్గీక‌రించింది.

ప్ర‌స్తుతం నిస‌ర్గ‌ను కేట‌గిరీ 4 తుపానుగా ఐఎండీ గుర్తించింది.

"మిగ‌తా ప్రాంతాల‌తో పోల్చిన‌ప్పుడు ముంబ‌యి తీరం నీటి మ‌ట్టం కొంచెం ఎక్కువ‌గా ఉండ‌టంతో విధ్వంసం మ‌రింత ఎక్కువ‌య్యే ముప్పుంది" అని సునీత అన్నారు.

"మేతో పోల్చిన‌ప్పుడు అక్టోబ‌రు, న‌వంబ‌రు నెల‌ల్లో వ‌చ్చే తుపాన్లు ఎక్కువ విధ్వంస‌క‌రంగా ఉంటాయి. అయితే ప్ర‌స్తుతం జూన్‌ నెల‌లో సూప‌ర్ సైక్లోన్ రావ‌డం ఊహించ‌ని ప‌రిణామం"

"భూతాపం, వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్లా మ‌న‌కు చాలా ముప్పులు వ‌చ్చాయి. ఉత్త‌రాఖండ్‌, ముంబ‌యి, చెన్నై, కేర‌ళల్లో వ‌ర‌ద‌లు విధ్వంసం సృష్టించాయి. 2019లో వ‌చ్చిన‌న్ని తుపాన్లు గ‌త 40ఏళ్ల‌లో ఎప్పుడూ రాలేదు. గ‌త ఏడాది రుతు ప‌వ‌నాలు ఆల‌స్యంగా వ‌చ్చాయి. వీట‌న్నింటికీ వాతావ‌ర‌ణ మార్పులే కార‌ణం" అని విశాఖ‌ప‌ట్నంలోని తుపాను హెచ్చ‌రిక‌ల కేంద్రం డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ భాస్క‌ర్ చెప్పారు.

అల్పపీడనం, వాయుగుండం, తుపాను, పెను తుపాను

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)