ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?

    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ హిందీ

దేశవ్యాప్తంగా హేట్ క్రైమ్‌కు సంబంధించిన ప్రభుత్వ గణాంకాలు అందుబాటులో లేవు. అందుకే బీబీసీ 2016 నుంచి 2021 వరకు ఉత్తర ప్రదేశ్‌లో మతం పేరిట మూక చేసిన తీవ్రమైన హింసకు సంబంధించిన గణాంకాలపై బీబీసీ అథ్యయనం చేసింది. 2016 జనవరి నుంచి ఆగస్టు వరకు ముస్లింలపై హేట్ క్రైమ్‌కు సంబంధించిన 11 తీవ్రమైన కేసులు వెలుగులోకి వచ్చాయి. 2021 జనవరి నుంచి ఆగస్టు వరకు ముస్లింలపై తీవ్రమైన హింసాత్మక చర్యల సంఖ్య 24. 2016లో తొలి ఎనిమిది నెలల గణాంకాలు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనివి. 2021లో తొలి ఎనిమిది నెలల గణాంకాలు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనివి.

మూక దాడుల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరుగుతోందా?
ఫొటో క్యాప్షన్, మూక దాడుల వ్యవహారంలో బాధితులకు న్యాయం జరుగుతోందా?

"ఆయన భుజాలపై కండువా వేసుకునేవారు. అదే కండువాను ఆయన నోట్లో కుక్కి చంపేశారు"అని ఆ రాత్రి ఆమె భర్తను కొట్టి చంపేసిన ఘటనను 48 ఏళ్ల కమ్రూన్ గుర్తు చేసుకున్నారు.

అలీని ఆయన ఇంటి ముందే పారతో, మరొక పదునైన ఆయుధంతో కొట్టి చంపేశారు. ఈ ఘటన జరిగి మూడేళ్లయింది. కానీ, ఆమె కొడుకు ఇప్పటికీ న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు వారికొక్క పైసా కూడా అందలేదు.

ఘటన జరిగిన రెండేళ్లకు ఈ విషయం కోర్టుకు చేరింది. కానీ, కోర్టులో వాదనలు ఇంకా మొదలుకాలేదు. ప్రస్తుతం సాక్షులు చెప్పే వాంగ్మూలాలను కోర్టు నమోదు చేస్తోంది. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ లభించింది.

ఇది ఒక్క కమ్రూన్, ఆమె కొడుకు కథ మాత్రమే కాదు.

గత ఆరేళ్లలో భారత్‌లో మూక దాడులతో వ్యక్తులను చంపిన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనల్లో బాధితుల మతమే హత్యకు కారణంగా కనిపిస్తోంది.

చాలా దేశాల్లో ఇలాంటి హత్యలను "విద్వేష నేరాలు"గా (హేట్ క్రైమ్స్) పరిగణిస్తారు. కానీ, భారత్‌లో ఇప్పటివరకు విద్వేష నేరాలను ప్రత్యేకంగా వర్గీకరిస్తూ నేర గణాంకాలు నమోదు చేయలేదు.

భారత్‌లో విద్వేష నేరాలు ఎక్కువగా చోటు చేసుకున్న రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ ముందున్నట్లు 2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.

ఇలాంటి నేరాల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, నేరస్థులను పట్టుకునేందుకు కఠినమైన ఆదేశాలను జారీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నారు.

"ఇలాంటి దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు చేసుకోవడానికి వీల్లేదని చెబుతూ డీజీపీ కార్యాలయం ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తోంది"అని ఉత్తర్ ప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ బీబీసీకి చెప్పారు.

"ఎవరైనా తప్పు చేసినా కూడా ఆ వ్యక్తి పై చేయి చేసుకునే అధికారం ఎవరికీ లేదు. ఎవరైనా హింసకు పాల్పడితే, అలాంటి నేరస్థులపై చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ వ్యక్తి ఎవరైనా సరే" అని ఆయన అన్నారు.

అయినప్పటికీ, అప్పుడప్పుడూ మతపరమైన హింస, హత్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

టీవీ స్టూడియోలలో యాంకర్లు మాత్రం గట్టిగా అరుస్తూ.. అభిప్రాయాలను వ్యక్తం చేసే నిపుణులు, రాజకీయవేత్తల మధ్య వాగ్వాదపు చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. అసందర్భమైన ప్రశ్నలు సంధించేందుకు విలేఖరులు కూడా తొందరపడుతుంటారు.

సగటు ప్రేక్షకుడు ఆ చర్చలో ఏ పక్షం వహిస్తున్నాడనే అంశం ఆధారంగా ఈ చర్చలు జరుగుతూ ఉంటాయి.

కానీ, కొన్ని లక్షల సవాళ్ళను ఎదుర్కొంటున్న దేశంలో పేద, అణగారిన, మైనారిటీ వర్గాలకు చెందిన బాధితులను మాత్రం వెంటనే మర్చిపోతారు.

దాడులతో హత్యలు, హింసకు సంబంధించిన కేసుల సంగతేంటి? అలాంటి కేసులను ఉత్తర్ ‌ప్రదేశ్ పోలీసులు ఎలా విచారణ చేస్తారు? దోషులను శిక్షిస్తారా లేదా వారు తప్పించుకుంటారా? బాధితుల సంగతేంటి?

ఉత్తర్ ‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న కొన్ని కేసులను మేము నిశితంగా పరిశీలించాం. ఈ కేసుల విచారణ తీరు, న్యాయ ప్రక్రియలో ఏదైనా ప్రత్యేక సరళి కనిపిస్తోందా? అని పరిశీలించాం.

ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి-ప్రతీకాత్మక చిత్రం

కేసు నంబర్ 1: సోన్‌భద్ర: అన్వర్ అలీ హత్య

2019 మార్చి 20న దేశ వ్యాప్తంగా ప్రజలంతా హోలీ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. అదే రోజు రాత్రి సుమారు 9.30 నిమిషాలకు రౌడీ మూకలు 50 సంవత్సరాల అన్వర్ అలీపై దాడి చేశాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో పర్‌సోయి గ్రామంలో జరిగింది.

"అప్పుడు రాత్రి 9.30 అయింది. అకస్మాత్తుగా మా ఇంటి బయట నుంచి ఏవో అరుపులు వినిపించాయి. ఇమాం చౌక్‌ను ఎవరైనా పగుల గొడుతున్నారేమోననే అనుమానంతో ఆయన బయటకు తొంగి చూశారు. ఆయన కేవలం, "ఏయ్! వాళ్ళేం చేస్తున్నారు? అనే అన్నారు. అంతే, రౌడీ మూకలు పార, మరొక పదునైన ఆయుధంతో ఆయన మీదకు ఉరికారు".

"ఆయన అరుపులు వినిపించకుండా ఉండేందుకు చుట్టూ ఉన్న పండగ కోలాహలం, డప్పులు, ఇతర సంగీత వాయిద్యాల హోరు ఉండేటట్లు ఆ మూకలు చూసుకున్నాయి. ఆయన ఎంతకీ తిరిగి రాకపోయేసరికి నేను బయటకు వెళ్లాను. అప్పటికి ఇంకా ఊపిరి ఉంది. కానీ, ఆయనను వరండాలోకి తీసుకుని వచ్చేసరికి, అంతా అయిపోయింది" అని అన్వర్ అలీ భార్య కమ్రూన్ చెప్పారు.

రెండేళ్ల తర్వాత, ఈ విషయం కోర్టుకు చేరింది. కానీ, ఇంకా ఈ కేసుకు సంబంధించిన వాదనలు మొదలు కాలేదు. ప్రస్తుతానికి కోర్టు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తోంది.

పదునైన ఆయుధంతో ఏర్పడిన గాయాల వల్ల అన్వర్ అలీ మరణించినట్లు ఆయన పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది.

అన్వర్ అలీపై జరిగిన దాడి ఇమాం చౌక్ వివాదంతో ముడి పడి ఉంది. ఇమాం చౌక్‌లో ఇస్లామిక్ ఆరాధనకు సంబంధించిన నిర్మాణం తజియాను ఏర్పాటు చేశారు. మహమ్మద్ ప్రవక్త మనుమలు హసన్, హుస్సేన్ సమాధుల ప్రతిరూపాలనే తజియా అని అంటారు.

ప్రభుత్వ భూమిపై గ్రామాధికారి అనుమతితో ఈ ఇమాం చౌక్‌ను నిర్మించారు. ఈ హత్య జరగడానికి ఆరు నెలల ముందు ఆ వేదికను కూల్చేశారు. అయితే, పోలీసుల సమక్షంలో దానిని పునర్నిర్మించారు.

అన్వర్‌పై దాడి జరగడానికి నెలన్నర రోజుల క్రితం కొంత మంది ఇమాం చౌక్‌ను తిరిగి కూలగొట్టారు. ఈసారి కూడా పోలీసులు కౌన్సిలింగ్ చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ఇరు పక్షాల వారికీ సూచించారు.

"మొదటిసారి ఇమాం చౌక్‌ను కూల్చినప్పుడు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కానీ, ఆ వేదికను కూల్చిన వారితోనే ఆ తర్వాత స్థానిక పోలీసులు కలిసి తిరుగుతూ ఉండేవారు. అటువంటి చర్యలు అవతలి పక్షం వారి నమ్మకాన్ని దెబ్బ తీయవా?" అని అన్వర్ పెద్ద కొడుకు అయాన్ అల్ హక్ ప్రశ్నించారు.

అన్వర్ మరణానికి ప్రణాళిక రచించింది గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న రవీంద్ర ఖర్వార్ అనే టీచర్ అని అయాన్ అల్ హక్ ఆరోపిస్తున్నారు. అయితే, ఈ వాదనను పోలీసులు అంగీకరించలేదు. ఆయనపై చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.

ఖర్వార్ గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచీ గ్రామంలో హిందూ ముస్లిం ఉనికికి సంబంధించిన చర్చలు సాధారణంగా మారిపోయాయని అన్వర్ కుటుంబం ఆరోపిస్తోంది.

"పర్‌సోయి‌లో ప్రభుత్వ పాఠశాలలో రవీంద్ర ఖర్వార్ టీచర్‌గా నియమితులయ్యారు. ఆయన పిల్లలకు పాఠాలు చెప్పడం అయ్యాక ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన విషయాలను బోధించేందుకు శాఖలను నిర్వహించేవారు. కొన్ని రోజులకు ఈ శాఖకు చెందిన విద్యార్థులు ఇమాం చౌక్ మైదానం దగ్గర సమావేశమవ్వడం మొదలుపెట్టారు. అది సరిగ్గా మా ఇంటి ముందే ఉంది. ఇక్కడకొచ్చి 'పర్‌సోయి వీరులొస్తారు. ఇమామ్ చౌక్‌ను కూలగొడతారు' అంటూ వారు నినాదాలు చేసేవారు" అని అన్వర్ చిన్న కొడుకు సికందర్ చెప్పారు.

2019, మార్చి 20 రాత్రి, గ్రామంలో కొందరు హిందూ యువకులు తిరిగి ఇమాం చౌక్‌ను కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పుడే వారిని ఆపేందుకు అన్వర్ బయటకు వచ్చారు. కానీ, ఆయన తిరిగి ఇంటికి సజీవంగా తిరిగి రారని ఆ క్షణంలో తెలియదు.

"ఈ కేసులో నిందితులందరూ ప్రస్తుతం బెయిల్ పై బయటే ఉన్నారు. వారంతా అరెస్టు అయ్యారు. కానీ, నేరాన్ని చేసేందుకు ప్రేరేపించిన వ్యక్తిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. నేను పోలీస్ స్టేషన్‌కు కూడా ఒక సారి వెళ్లి, టీచర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించాను. విచారణాధికారి నన్ను తిట్టి బయటకు పంపించేశారు"అని అయన్ అల్ హక్ చెప్పారు.

''రవీంద్ర ఖర్వార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఆయనకు పెద్ద పెద్ద వారితో పరిచయాలున్నాయి. దాంతో, ఆయనను సులభంగా మరో స్కూలుకు బదిలీ చేశారు. ఆయన బయట స్వేచ్ఛగానే తిరుగుతున్నారు" అని చెప్పారు.

పర్‌సోయి గ్రామంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న కొంత మందిని మేము కలిసాం. అందులో రాజేశ్ ప్రజాపతి, రాజేశ్ ఖర్వార్, అక్షయ్ ఉన్నారు.

"మాస్టర్ గారు శాఖలు నిర్వహించేవారు. ఆయన మాకు ఏదైనా విషయం పట్ల ఎలా వ్యవహరించాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే అంశాలను నేర్పిస్తూ ఉండేవారు. మేమీ కేసులో ఇరుక్కుని ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఈ మొత్తం వ్యవహారాన్ని మొదలుపెట్టింది ఆయనే. అయినా ఆయన బాగానే ఉన్నారు"అని వారు వివరించారు.

చాలాచోట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు ఎఫ్ఐఆర్‌లు నుంచి మాయమయ్యాయి.
ఫొటో క్యాప్షన్, చాలాచోట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు ఎఫ్ఐఆర్‌లు నుంచి మాయమయ్యాయి.

పత్రాలు ఏం చెబుతున్నాయి?

ఈ కేసుకు సంబంధించిన పత్రాలను బీబీసీ పరిశీలించింది. జూన్ 17, 2019లో నమోదైన పోలీస్ కేసు డైరీ నంబర్ 18 ప్రకారం...

"రవీంద్ర ఖర్వార్ ఇంటిపై రెయిడ్ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. పోలీసుల దగ్గర జ్యుడీషియల్ వారంట్ ఉంది. కానీ, రవీంద్ర ఖర్వార్ పరారీలో ఉన్నారు"అని రాసి ఉంది.

కానీ, ఛార్జిషీటు నమోదు చేసే సమయానికి రవీంద్ర ఖర్వార్ పేరును ఫిర్యాదు నుంచి తొలగించారు.

రవీంద్ర ఖర్వార్ గురించి సమాచారం సేకరించేందుకు బీబీసీ ప్రయత్నించగా.. ఆయన ప్రభుత్వ పాఠశాలలో టీచర్ అనే విషయం తెలిసింది. ఆయనకు గత 20ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్నట్లు తెలిసింది.

ఈ దాడి తర్వాత, ఆయనను పర్‌సోయి గ్రామం నుంచి బదిలీ చేశారు. ఆయన ప్రస్తుతం చోపన్ బ్లాక్‌లో పని చేస్తున్నారు.

బీబీసీ రవీంద్ర ఖర్వార్‌ను కలిసింది. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్నట్లు ఆయన అంగీకరించారు. ఆయన ప్రస్తుతం సోన్‌భద్ర జిల్లా సంస్థ కో-కేర్‌టేకర్‌గా పని చేస్తున్నారు.

అన్వర్ హత్య గురించి ఆయన్ను అడిగినప్పుడు, ఆయన వైఖరిలో మార్పు కనిపించింది.

"నా పేరును అనవసరంగా ఈ కేసులోకి లాగి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెడ్డ పేరు తీసుకొచ్చారు. నేను నా ఇంట్లో ఉన్నాను. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ఎవరూ నాకు తెలియదు" అని సమాధానమిచ్చారు.

"ఫిర్యాదులో నిందితుడి పేరు చేర్చడం మాత్రం సరిపోదు. రవీంద్ర ఖర్వార్‌కు వ్యతిరేకంగా మా పరిశోధనలో ఏమీ లభించలేదు" అని సోన్‌భద్ర సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమరేంద్ర సింగ్ చెప్పారు.

ఈ కేసు గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేషనల్ పబ్లిసిటీ హెడ్ డాక్టర్ సునీల్ అంబేద్కర్‌ను బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించింది. అనేక మెసేజ్‌లు కూడా పంపింది. కానీ, ఈ కథనం ప్రచురించే సమయం వరకూ కూడా అటు నుంచి ఎటువంటి సమాధానమూ లభించలేదు.

లహ్ జిహాద్ పేరుతో మూక దాడులు జరుగుతున్నాయి.
ఫొటో క్యాప్షన్, లహ్ జిహాద్ పేరుతో మూక దాడులు జరుగుతున్నాయి.

కేసు నంబర్ 2: గులాం అహ్మద్, లవ్ జిహాద్ పగ

2020లో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా 'ది ఉత్తర్ ప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లా‌ఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్' ను తీసుకొచ్చింది. ఇలాంటి సంబంధాలను హిందూత్వ సంస్థలు 'లవ్ జిహాద్' అని పిలుస్తాయి.

2017, మే 2న 60ఏళ్ల గులాం అహ్మద్ బులంద్‌షహర్‌లోని సోహి గ్రామంలో హత్యకు గురయ్యారు. ఈ దాడి జరగడానికి ఆయన పొరుగింట్లో ఉండే యూసఫ్ కారణం అని గ్రామస్థులు చెబుతున్నారు.

యూసఫ్ పొరుగూర్లో ఉండే హిందూ అమ్మాయిని ప్రేమించారు. వీరిద్దరూ కలిసి పారిపోయారు. ఠాకుర్ కుటుంబాలు ఎక్కువగా నివసించే ఈ గ్రామాల్లో కొన్ని ముస్లిం కుటుంబాలే ఉన్నాయి. అందులో చాలా మంది కూలి పని చేసుకునే వారే ఉంటారు.

ఈ ఘటన తర్వాత మూకలు గులాం ఇంటి పై దాడి చేసి ఆయన తలుపును కొట్టినట్లు గ్రామస్థులు చెప్పారు. అందులో కొంత మంది గ్రామస్థులు ఉండగా, మిగిలిన వారు బయటి వారు. వారు ఆ కుటుంబాన్ని దూషించి బెదిరించారు.

2017, మే 2న గులాం అహ్మద్ కొడుకు వకీల్ అహ్మద్‌ను పోలీసులు స్టేషన్‌కు రమ్మని ఆదేశించడంతో ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఉదయం 9.30 నిమిషాలకు గులాం అహ్మద్ మామిడి తోటలో కాపలా కాస్తుండగా, కాషాయ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్న 6-7 మంది వారి చేతుల్లో కర్రలతో తోటలోకి అడుగుపెట్టారు. వారు గులాంను తమతో పాటు తీసుకుని వెళ్ళిపోయి దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు ఆయన ప్రాణాలు కోల్పోయారు.

గులాంకు తగిలిన దెబ్బలతో శరీరం లోపలే తీవ్రంగా రక్త స్రావమై మరణించినట్లు ఆయన పోస్ట్‌మార్టం నివేదిక చెబుతోంది.

ఈ దాడితో సంబంధం ఉన్న 9 మందికి హిందూ యువ వాహినితో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అందులో ఈ కేసులో అరెస్ట్ అయిన గవీందర్ అనే వ్యక్తి కూడా ఉన్నారు.

హిందూత్వ, జాతీయతకు అంకితమైన బలమైన సాంస్కృతిక , సాంఘిక సంస్థగా చెప్పే ఈ సంస్థను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2002లో స్థాపించారు.

నిందితులందరినీ ఈ కేసులో తప్పుగా ఇరికించారని హిందూ యువవాహిని బులంద్‌షహర్ అధ్యక్షుడు సునీల్ సింగ్ రాఘవ్ బీబీసీతో చెప్పారు.

ఈ దాడి జరిగిన తర్వాత వకీల్ కుటుంబం సోహి గ్రామాన్ని విడిచి అలీగఢ్‌కు వెళ్లిపోయింది. కానీ, వారు రోజు కూలీని సంపాదించుకోవాలంటే బులంద్‌షహర్‌కు వెళ్లాల్సిందే.

కుట్రపూరితంగా తమపై కేసులు పెడుతున్నారని ఆర్.ఎస్.ఎస్., హిందూ వాహిని సభ్యులు అంటున్నారు.
ఫొటో క్యాప్షన్, కుట్రపూరితంగా తమపై కేసులు పెడుతున్నారని ఆర్.ఎస్.ఎస్., హిందూ వాహిని సభ్యులు అంటున్నారు.

ఈ దాడి జరిగి అయిదేళ్లు అవుతోంది. వకీల్ అహ్మద్‌ను కలిసేందుకు బీబీసీ బులంద్‌షహర్ వెళ్ళింది. ఈ కేసులో పరస్పర ఒప్పందం కుదిరిందని, ఈ కేసును సామరస్యంగా కోర్టులో తేల్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.

వకీల్ వడ్రంగి పని చేస్తారు. అయితే, ఈ ఒప్పందానికి అంగీకరించేందుకు ఆయనకు రూ.5 లక్షలు ఇచ్చినట్లు మాతో గుసగుస లాడుతున్నట్లుగా చెప్పారు.

ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేకపోవడంతో ఆయన ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధపడినట్లు చెప్పారు.

"ఈ ఊరు వచ్చేటప్పటికి మా నాన్నగారికి నాలుగేళ్లు. ఆయన ఈ గ్రామాన్ని తన సొంతూరులానే భావించారు. కానీ, చివరకు ఆయన ఇలా మరణించారు''.

"ఇక్కడ యుద్ధభూమి సమాన స్థాయిలో ఉంటే, మేం కూడా అదే స్థాయిలో పోరాడి ఉండేవాళ్ళం. కానీ, మా పరిస్థితి వేరు. ఈ గ్రామంలో అధికారం చెలాయించే వారిపై కనీసం గొంతెత్తి మాట్లాడటానికి ధైర్యం చేసినా కూడా మేం రెండు రోజుల పాటు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మా రెండు పూట్ల భోజనం వారి మీదే ఆధారపడి ఉంది. అలాంటి పరిస్థితిలో అపరాధులకు వ్యతిరేకంగా నా కుటుంబ సభ్యులు సాక్ష్యమెలా చెబుతారు. వారి తోటల్లోనే వారు కూలీలుగా పని చేస్తారు" అని వకీల్ చెప్పారు.

ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన ఆరు నెలల్లోనే బెయిల్‌పై విడుదల చేశారు. ఇందులో ముఖ్య నిందితుడు గవీందర్‌ను బెయిల్‌పై విడుదల చేసినప్పుడు ఆయనకు పూలతో, పూల దండలతో స్వాగతం పలికారు. ఆయన విడుదలను సంబరం చేసుకోవడానికి ఊర్లో కొంత మంది అబ్బాయిలు డీజేను కూడా ఏర్పాటుచేశారని చెప్పారు.

"మా నాన్న ప్రాణాలు తీసిన వ్యక్తికి జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా పూలతో స్వాగతం లభించింది. ఇలా సంబరం జరుపుకున్న గ్రామంలో మేమెలా బ్రతకగలం?"అని ఆయన అడిగారు.

గులాం అహ్మద్ పై మూకదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గవీందర్
ఫొటో క్యాప్షన్, గులాం అహ్మద్ పై మూకదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గవీందర్

కాషాయ కండువాలతో ముఖాలు కప్పుకున్న వ్యక్తులు గులాంను లాక్కుని వెళ్లడం ఆయన 46ఏళ్ల సోదరుడు పప్పు చూశారు. కానీ, కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

ఆయనను కలిసేందుకు మేము సోహి గ్రామానికి వెళ్లాం. "అవును! నేను వాళ్ళను చూశాను. కానీ, నేను సాక్షిని కాదు" అని అన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు గవీందర్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు సాధువు తరహాలో దుస్తులు ధరించిన ఆయన సోదరుణ్ని కలిసాం. ఆయన జునా అఖాడాకు సాధువుగా చెప్పుకుంటున్నారు.

పోలీసులతో, జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు చెప్పుకున్నారు. .

ఆ గ్రామంలో జరిగిన దాడి గురించి మాట్లాడేందుకు వచ్చినట్లు చెప్పగానే, ఆయన నా పేరు, ఐడెంటిటీ కార్డులను చూపించమని అడిగారు. నేను హిందూ అని తెలుసుకున్న తర్వాతే ఆయన సంతృప్తి చెంది, నాతో మాట్లాడేందుకు అంగీకరించారు.

"నేను హిందూ యువ వాహినిలో ఉన్నాను. కానీ, అధికారిక సభ్యత్వం ఏమీ లేదు. నేను వారితో కలిసి తిరుగుతూ ఉండేవాడిని. దాంతో, నా పై కూడా అభియోగాలు వేశారు" అని గవీందర్ చెప్పారు.

వకీల్ అహ్మద్ కుటుంబానికి డబ్బులిచ్చారనే విషయాన్ని ఖండించారు.

మాతో మాట్లాడుతున్నంత సేపూ, గవీందర్ తన సోదరుడి వైపు చూస్తూనే ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతీ మాటకూ ఆయన ఆమోదం తీసుకుంటున్నట్లుగా ప్రవర్తించారు.

వకీల్ తరఫున వాదిస్తున్న న్యాయవాది నయీమ్ సాహిబ్ బీబీసీతో మాట్లాడారు.

"ఈ కేసులో రాజీ కుదుర్చుకునేందుకు 90 శాతం భయం, 10శాతం పేదరికం కారణం. వకీల్ అహ్మద్ కుటుంబీకులు చాలా పేదవారు. వారి జీవితంలో ప్రతీ చిన్న విషయానికీ గ్రామం పైనే ఆధారపడతారు. వాళ్ళు అలీగఢ్‌లో స్థిరపడ్డారు. కానీ, ఆ గ్రామంతో ఉన్న సంబంధాలను మాత్రం పూర్తిగా తెంచుకోలేకపోతున్నారు".

"ఎప్పటికైనా నిందితులు స్వేచ్ఛగా బయటకు వస్తారు, కానీ, మీరు కోర్టు విచారణకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వీరికి చెప్పారు. తెలివిగా ప్రవర్తించి డబ్బు తీసుకోండని ఒప్పించారు. ఈ ఒప్పందానికి రాజీ అయితేనే, వారికి గ్రామంతో ఉండే రాకపోకలు కూడా ఆధారపడి ఉంటాయని అన్నారు. ఇదే రాజీకి అంగీకరించడానికి ముఖ్య కారణం" అని నయీమ్ సాహిబ్ చెప్పారు.

"మూక దాడులకు సంబంధించిన కేసులు చాలా వరకూ రాజీతోనే ముగుస్తాయి" అని ఆయన అన్నారు.

గవీందర్ సోదరుడు
ఫొటో క్యాప్షన్, గవీందర్ సోదరుడు

కేస్ నంబర్ 3: షేరాను ఎవరు చంపారు?

2021 జూన్ 4న 50 ఏళ్ల షేర్ ఖాన్ అలియాస్ షేరాను మథురలో కాల్చి చంపారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన వ్యక్తి. ఆయన మాంసం కోసం ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారని అనుమానించారు.

భారత్‌లో చాలా రాష్ట్రాల్లో గోవధ, గోమాంస విక్రయాలను నిషేధించారు. ఆవును పవిత్ర జంతువుగా చాలా మంది హిందువులు భావిస్తారు. మథుర దగ్గర ఒక గ్రామం నుంచి పిక్‌అప్ ట్రక్‌లో ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అందులో షేరా ఒకరు.

అదే వాహనంలో ఆవులు, ఎద్దులను అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో మథురలో కోసికలాన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు (410/2021, 411/2021) నమోదు చేశారు.

అందులో ఒక ఎఫ్‌ఐఆర్ పశువుల అక్రమ రవాణాకు, షేరాతో పాటూ ప్రయాణిస్తున్న మిగిలిన ఆరుగురు వ్యక్తులకు సంబంధించినది. మథురలో గోశాల నిర్వహిస్తున్న చంద్రశేఖర్ బాబా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎఫ్‌ఐఆర్ 411, షేరా హత్యకు సంబంధించినది. అయితే, ఈ కేసులో నిందితులెవరినీ అరెస్టు చేయలేదు. వారి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదు.

తూముల గ్రామం దగ్గర పశువుల అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానం ఉందని 2021, జూన్ 4, తెల్లవారుజామున 3.30కు సమాచారం వచ్చినట్లు చంద్రశేఖర్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. వారి దగ్గర నుంచి ఆరు పశువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పశువుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు గ్రామస్థులతో ఘర్షణకు పాల్పడటంతో వారికి గాయాలయినట్లు పేర్కొన్నారు.

షేరాను కాల్చి చంపారు. కానీ, ఆయనతో పాటూ ఉన్న మిగిలిన ఆరుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో షేరా కొడుకు షారుఖ్ కూడా ఉన్నారు.

వీరందరినీ రాష్ట్రంలో అమలులో ఉన్న గోవధ చట్టం కింద అరెస్ట్ చేశారు. వారంతా కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత వారిని జైలుకు పంపారు.

ఆగస్టు 2021లో గోవధ కేసులో నిందితులందరినీ బెయిల్ పై విడుదల చేశారు. షారుఖ్‌కు తండ్రి మరణ వార్త పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తర్వాతే తెలిసింది.

ఆ రోజు జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. "మా నాన్నను చంద్రశేఖర్ బాబా కాల్చారు. నేను ప్రత్యక్షంగా చూశాను. మేము మేవాత్‌కు వెళుతుండగా, బాబా, ఆయన సహచరులు మా పై కాల్పులు జరిపారు" అని షారుఖ్ చెప్పారు

ఫిర్యాదు రాస్తున్నప్పుడు చంద్రశేఖర్‌ను నిందితునిగా పేర్కొంటూ ఫిర్యాదు రాసినట్లు షారుఖ్ చెప్పారు. కానీ, ఆయన చేతితో రాసిన ఫిర్యాదును పోలీసు అధికారి చింపి పడేసినట్లు వివరించారు.

"నా భర్త, పిల్లలను స్మగ్లర్లని తీర్మానించారు. వారు నిజంగా స్మగ్లర్లే అయితే, వారిని పోలీసులకు అప్పగించాల్సింది. వారిపై కాల్పులు జరపడం ఎందుకు ?"అని షేరా భార్య ప్రశ్నించారు.

షేరా మరణం విషయంలో న్యాయాన్ని కోరుతూ ఆయన భార్య సితార తాజాగా మరో దరఖాస్తు చేశారు. అందులో ఆమె చంద్రశేఖర్‌ను ఆయన సహచరులను నిందితులుగా పేర్కొన్నారు. కానీ, తన దరఖాస్తును పోలీసులు పట్టించుకోలేదని సితార చెప్పారు.

ఆయన హత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ఎవరో తెలియని గ్రామస్థుల పేర్లను చేర్చినట్లు చెప్పారు.

మథుర దగ్గరున్న ఒక గ్రామంలో ఉన్న చంద్రశేఖర్ గోశాల బయట ఒక పిక్‌అప్ ట్రక్ పార్క్‌చేసి ఉంది. దాని పై పెద్దపెద్ద అక్షరాలతో 'గో రక్షా దళ్' (గోరక్షక దళం) అని హిందీలో రాసిన అక్షరాలు కనిపించాయి.

"ఆవులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నేను రాత్రి పూట చేతిలో గొడ్డలి పట్టుకుని తిరుగుతూ ఉంటాను. నేను ఆ ఘటన జరిగిన రోజు అక్కడకు దగ్గర్లనే ఒక గ్రామంలో ఉన్నాను. నాకు గోవుల అక్రమ రవాణా గురించి సమాచారం అందగానే, నేను గ్రామస్థులను గొడవ ఆపమని చెప్పి, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించాను. కానీ, వాళ్ళు నా పేరునే లాగి, నన్ను నిందిస్తున్నారు" అని చంద్రశేఖర్ బాబా బీబీసీకి చెప్పారు.

గోసంరక్షకులు, అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు గ్రామంలో చాలామంది మాతో చెప్పారు.

మేం మథుర రూరల్ ఎస్‌పీ శిరీష్ చంద్రను సంప్రదించాం.

ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కూడా ఈ కేసులో ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించాం. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లెందుకు లేవని అడిగాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయనకు అధికారం లేదనే సమాధానాన్నిచ్చారు.

నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తే ఉపాధి కోల్పోతామని బాధిత కుటుంబాల సభ్యులు అంటున్నారు.
ఫొటో క్యాప్షన్, నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తే ఉపాధి కోల్పోతామని బాధిత కుటుంబాల సభ్యులు అంటున్నారు.

కేస్ నంబర్ 4: దాడి చేస్తున్నట్లు వైరల్ అయిన వీడియో

దిల్లీకి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్ పట్టణంలో జరిగిన ఒక దాడికి సంబంధించిన వీడియో ఈ మే నెలలో వైరల్ అయింది. అందులో కొంతమంది ఒక చెట్టు దగ్గర ఒక వ్యక్తిని కొడుతున్నట్లుగా కనిపించింది.

ఆ వీడియోలో చావుదెబ్బలు తింటున్న వ్యక్తి పేరు షాకీర్ ఖురేషి . ఆయన మొరాదాబాద్ నివాసి. షాకీర్ కుటుంబాన్ని ఇంకా ఘటన జరిగినప్పటి భయం వీడలేదు. మమ్మల్ని వారింటి ముందు చూడగానే, ఆయన తల్లి ఏడవడం మొదలుపెట్టారు.

"మేమీ పని చేసేవాళ్ళం కాదు. నా కొడుకు ఇంట్లో లేరు" అని చెప్పారు.

కానీ, షాకీర్ ఇంట్లోనే ఉన్నారు. కానీ, మాతో మాట్లాడేందుకు ఆయన భయపడుతున్నారు. చివరకు ఆయన ఘటన వివరాలు చెప్పేందుకు అంగీకరించారు.

"మేము ఖురేషీ వంశానికి చెందిన వాళ్ళం. మాంసం సరఫరా చేసే వ్యాపారం చేస్తాం. నేను నగరంలో ఒకరికి 40 కేజీల గేదె మాంసం ఇవ్వాల్సి ఉంది. అదే రోజు మాంసాన్ని ఇచ్చేందుకు స్కూటర్‌పై బయలుదేరాను. దాంతో, గ్రామం దగ్గర కొంత మంది నన్ను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. నేను చాలా ఏడ్చి, ఎద్దు మాంసం తీసుకుని వెళ్ళటం లేదని చెప్పాను. బతిమాలాను. కానీ, వారు నన్ను కొడుతూనే ఉన్నారు"అని షాకీర్ చెప్పారు.

ఆయన పోలీసుల దగ్గరకు వెళ్ళేసరికే ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపై వైరల్ అయినట్లు షాకీర్ చెప్పారు. ఆ వీడియో వైరల్ అవ్వక ముందు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు షాకీర్ భయపడినట్లు చెప్పారు.

ఈ వీడియో బయటకు రావడంతోనే కేసు సంచలనంగా మారింది. ఇందులో ప్రధాన నిందితుడు మనోజ్ ఠాకుర్‌తో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. రెండు నెలల పాటు జైలులో ఉన్న తర్వాత మనోజ్ ఠాకుర్‌ని విడుదల చేశారు.

మనోజ్ గోరక్షా యువ వాహిని ఉపాధ్యక్షుడినని చెప్పుకుంటారు. ఈ సంస్థను దిల్లీలో ఏర్పాటుచేశారు. అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయనను సంస్థ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించారు.

ఆయన మీద ఫిర్యాదు నమోదు చేయడం ఇది మొదటి సారి కాదు. ఆయన మీద గోసంరక్షణ పేరిట దోపిడీ, బెదిరింపులు చేయడం లాంటి నేరాలకు పాల్పడినట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి.

ఠాకుర్‌పై వచ్చిన అనేక ఫిర్యాదుల తర్వాత డిసెంబర్ 2020లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో విచారణ జరపాలని ఆదేశించినట్లు స్థానిక వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ, ఈ విచారణ ఫలితాలేంటో ఎవరికీ తెలియదు.

ఈ వీడియో వైరల్ అయి ఉండకపోతే, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు వెళ్లి ఉండేవారు కాదని ఠాకుర్ కూడా గట్టిగా భావిస్తున్నారు.

మొరాదాబాద్ ఎస్‌ఎస్‌పీ బబ్లూ కుమార్‌కు బీబీసీ కొన్ని ప్రశ్నలను పంపింది. కానీ, ఇప్పటివరకు వాటికి సమాధానం లభించలేదు.

అన్వర్ అలీ భార్య కమ్రూన్
ఫొటో క్యాప్షన్, అన్వర్ అలీ భార్య కమ్రూన్

తరహా కేసుల విచారణలో ఏదైనా ప్రత్యేక సరళి కనిపిస్తోందా?

బీబీసీ పరిశీలించిన ఈ కేసుల్లో ఒక సరళి కనిపించింది. బాధితుల కుటుంబాలు వలస వచ్చిన వారు , లేదా హింస, దాడులు చోటు చేసుకున్న తర్వాత ప్రాణ భయంతో, అనుభవించిన వేదనతో ఇళ్లను విడిచి పెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.

మేము మాట్లాడిన బాధితుల కుటుంబాలెవరూ కేసుల్లో పోలీసులు తీసుకున్న చర్యల పట్ల పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నట్లు కనిపించలేదు.

అయితే, అధికారులు, పోలీసులు మాత్రం వారు చేపట్టిన చర్యలను సమర్థించుకున్నారు. లేదా కొన్ని కేసుల విషయంలో మాట్లాడేందుకు నిరాకరించారు.

బీబీసీ పరిశీలించిన కొన్ని కేసుల్లో నిందితుల పేర్లను నమోదు చేయకపోవడం లేదా స్థానిక కోర్టులు బెయిల్ ఇవ్వడం గానీ జరిగింది.

జులై 2018లో సుప్రీంకోర్టు ఒక పిటిషన్‌పై తీర్పునిస్తూ, హింసాత్మక దాడులకు సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాలని పేర్కొంది.

కేవలం హింసాత్మక దాడులకు సంబంధించిన కేసుల విచారణ కోసం ప్రతీ జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల నియామకం జరగాలని రాష్ట్రాలకు సూచించింది.

ఇప్పటి వరకు భారత్‌లో మూడే మూడు రాష్ట్రాలు మణిపూర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మాత్రమే హింసాత్మక దాడుల విచారణ కోసం చట్టాలను రూపొందించాయి.

జులై 2019లో ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ లా కమిషన్ దాడులకు వ్యతిరేకంగా "యాంటీ లించింగ్ బిల్"‌ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు ఈ రకమైన నేరాల వ్యవహారంలో సంపూర్ణంగా లేవని కమిషన్ పేర్కొంది. అయితే, ఈ ముసాయిదాను యోగి ప్రభుత్వం చట్టంగా మార్చాల్సి ఉంది.

ఈ ముసాయిదాతో పాటు, కేసుల విచారణ తీరు గురించి బీబీసీ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ నవ్‌నీత్ సెహగల్‌ను ఈ మెయిల్ ద్వారా సంప్రదించింది. కానీ, ఆయన బీబీసీ ప్రశ్నలకు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)