గ్రౌండ్ రిపోర్ట్ : అల్వర్‌లో ఆవులు తోలుకెళ్తున్న ముస్లిం యువకుడిని ఎవరు చంపారు?

- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి, మెవాత్ (హరియాణా) నుంచి
"కొంతమంది ఆవులను దొంగతనంగా తరలించేందుకు రాజస్థాన్ నుంచి హరియాణా వైపు కాలినడకన వెళ్తున్నారు". రక్బర్ హత్య కేసులో రాజస్థాన్ అల్వర్ జిల్లాలోని రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు అందిన మొదటి సమాచారం ఇదే.
ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ ఘటన గురించి అర్థరాత్రి 12. 41 గంటలకు పోలీసులకు తెలిసింది. నవల్ కిశోర్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఈ విషయం గురించి చెప్పాడు.
పోలీసులు మాత్రం రక్బర్‌ను ఆ ప్రాంతంలో ఉన్న కొందరు బాగా కొట్టారని, దాంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయాడని చెబుతున్నారు.
ఈ ఘటన లాలావండీ అడవులకు దగ్గర్లో జరిగింది. ఘటనాస్థలంలో దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అపరిచిత వ్యక్తులు తనపై దాడి చేశారని రక్బర్ చనిపోవడానికి ముందు వాంగ్మూలం ఇచ్చాడని కూడా పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో రాశారు.
ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన నవల్ కిశోర్ విశ్వహిందూ పరిషత్‌కు సంబంధించిన వ్యక్తిగా చెబుతున్నారు.
ఘటనాస్థలంలో అరెస్ట్ చేసిన ఇద్దరికీ ఇతర హిందూ సంస్థలతో సంబంధం ఉందని చెబుతున్నారు. దీంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది.
మరోవైపు ఈ కేసులో రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా చేసిన ప్రకటన పోలీసులనే బోనులో నిలబెడుతోంది.

మీడియాతో మాట్లాడిన అహుజా తమ కార్యకర్తలు రక్బర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్పారు.
కార్యకర్తలు రక్బర్‌ను పట్టుకున్న సమయంలో అతడు పారిపోవడానికి ప్రయత్నించాడని, అప్పుడు గాయపడ్డాడని చెప్పారు.
రక్బర్‌ను పోలీసులకు అప్పగించామని అహూజా చెబుతున్నారు.
కానీ, పోలీసులకు దీనిపై సమాచారం ఇచ్చిన నవల్ కిశోర్, తను కూడా పోలీసులతోపాటు ఘటనాస్థలానికి వెళ్లానని ఒక పెద్ద వార్తాపత్రికకు చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
రాత్రి ఒంటి గంటకు సమీప పోలీస్ బృందాలు రక్బర్‌ను పట్టుకున్నట్టు ఆ వార్తాపత్రిక రాసింది.

ఘటనాస్థలం నుంచి ఆస్పత్రి కేవలం నాలుగైదు కిలోమీటర్లే ఉన్నా.. రక్బర్‌ను అల్వర్ జిల్లా రామ్‌గఢ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు, ఉదయం నాలుగు గంటలయ్యిందని అందులో తెలిపారు.
కొన్ని మీడియా వార్తలు కూడా ఇదే చెబుతున్నాయి. ఆవులను మొదట గోశాలకు చేర్చారని, తర్వాత రక్బర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారని అవి తెలిపాయి.
పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో ఘటనాస్థలంలో అరెస్ట్ చేసిన వారి పేర్లు కూడా వెల్లడించారు. రక్బర్‌పై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న వ్యక్తిని కూడా అరెస్టు చేశామని పోలీసులు ఆదివారం చెప్పారు.
పూర్తి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు.

ఎవరు చంపారో, ఎలా చంపారో మాకు తెలీదు
రక్బర్‌తోపాటు పాలిచ్చే ఆవును తీసుకెళ్తున్న అస్లమ్ మాత్రం ఎలాగోలా ఆ దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. రాత్రంతా కటిక చీకట్లో పొలాల్లో, అడవుల్లో నడుస్తూ తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు.
ఉదయం గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత తనకు రక్బర్ చనిపోయాడనే విషయం తెలిసిందని అతడు బీబీసీకి చెప్పాడు.
కానీ దీనిపై మేవాడ్ పోలీస్ సూపరింటెండెంట్ నాజ్నీన్ భసీన్ అల్వర్ ఎస్పీతో మాట్లాడారు. అస్లమ్ రామ్‌గఢ్ పంపడం సాధ్యం కాదని, అతడి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడవచ్చని చెప్పారు.
దీంతో ఆదివారం మధ్యాహ్నం రాజస్థాన్ పోలీసులు అస్లమ్ వాంగ్మూలం నమోదు చేసి మేవాడ్‌లోని ఫిరోజ్‌పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

రక్బర్, అస్లమ్ నిజంగా గోవులు దొంగిలించారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదని అల్వర్ పోలీస్ అధికారి అనిల్ బేనీవాల్ చెప్పారు.
ప్రస్తుతం రెండు ఆవులను రామ్‌గఢ్‌లోని ఒక గోశాలలో ఉంచామని తెలిపారు..
కానీ రక్బర్‌పై 2014లో కూడా ఆవుల దొంగతనానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు.
రక్బర్, అస్లమ్ నూహ్ జిల్లా ఫిరోజ్‌పూర్ ఝిర్కాలో ఉన్న కోల్‌గావ్‌లో ఉంటారు. రక్బర్ చనిపోవడానికి కారణం ఏంటో తమకు తెలీడం లేదని అతడి సోదరుడు ఇర్షాద్ బీబీసీకి తెలిపారు.
"ఏం జరిగిందో మాకు తెలీదు. మాకు రక్బర్ చనిపోయాడని చెప్పారు అంతే. ఎవరు చంపారో, ఎలా చంపారో ఇప్పటివరకూ ఏం తెలీడం లేదు" అని అతడు తెలిపాడు.
పోస్టుమార్టం రిపోర్టులో రక్బర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని ఉంది. అతడి పక్కటెముకలు విరిగాయని, ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండాయని తెలిపారు. వాటితోపాటు అతడి శరీరం అంతా గాయాల గుర్తులు కూడా ఉన్నట్టు నివేదికలో చెప్పారు.

రక్బర్ భార్య గర్భవతి. కోల్‌గావ్‌లో అంతకు ముందెప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. దాంతో 500 ఇళ్లున్న ఈ ప్రాంతంలో దాదాపు అన్ని కుటుంబాలూ విషాదంలో మునిగిపోయాయి.
భారీ వర్షం కురుస్తున్నా రక్బర్ ఇంటికి జనం వస్తూనే ఉన్నారు. రక్బర్ వయసు 28 ఏళ్లని చెబుతున్నారు.
రక్బర్ భార్య అస్మీనా గర్భవతి. ఆమె ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది. అస్మీనాను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
తాము పాలు అమ్ముకుని జీవిస్తామని రక్బర్ తండ్రి సులేమాన్ చెప్పారు.

అల్వర్ వెళ్లద్దని మేం చెప్పాం
రక్బర్ దగ్గర మొదట్నుంచీ మూడు ఆవులు ఉన్నాయి. పాల వ్యాపారం మరింత పెంచడానికి తను మరో రెండు పాలిచ్చే ఆవులు కొనాలని అల్వర్ వెళ్లాడు.
"పరిస్థితులు సరిగా లేవు, అల్వర్ వెళ్లద్దని మేం చాలా చెప్పాం. కానీ తను ఏం కాదులే అని వెళ్లాడు. మా మాట వినుంటే ఇలా జరిగేది కాదు" అని సులేమాన్ చెప్పారు
తాము ఆవులను పికప్ వాహనంలో తీసుకురావాలని అనుకున్నామని, కానీ ఆవులు వాహనం ఎక్కకపోవడంతో, రోడ్డు మార్గంలో వాటిని తీసుకుని తిరిగి గ్రామానికి వస్తున్నామని, అస్లం చెప్పాడు.
తమ గ్రామం రామ్‌గఢ్‌కు దగ్గరే ఉంటుంది. అందుకే అందరూ తమను గుర్తుపడతారులే అని వాళ్లు అనుకున్నారు. తమపై ఎవరూ దాడి చేయరనే భావించారు.

"మేవాడ్ ప్రాంతమంతా భూగర్భ జలాలు చాలా లోతులో ఉంటాయి. శతాబ్దాల నుంచి ఇక్కడి వారికి ఒకటే జీవనాధారం. వారంతా ఆవు పాలు అమ్ముకుని ఉపాధి పొందుతున్నారు" అని నూహ్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ చెప్పారు.
"మేవాడ్ ముస్లింలు హిందువుల కంటే ఎక్కువగా ఆవులు పెంచుతున్నారు, గోవులను రక్షిస్తున్నారు. హరియాణా అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆజాద్ మహమ్మద్ కూడా రామలీలా సమితి, గోపాల్ సమితిలో జీవితకాల సభ్యుడుగా ఉన్నారు" అని ఆయన చెప్పారు.
"మేవాడ్ ప్రాంతంలో గోవుల పెంపకంలో హిందూ, ముస్లింల మధ్య ఎప్పుడూ ఏ వివాదం రాలేదు. గోరక్షణ పేరుతో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఎక్కువగా రాజస్థాన్ కేంద్రంగానే జరుగుతున్నాయి" అని జాకీర్ అన్నారు.
"గోరక్షణ పేరుతో రాజస్థాన్, హరియాణాలో జరుగుతున్నవి అనుకోకుండా జరిగే ఘటనలు కావు, అవి పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి" అని కోల్‌గావ్‌లోని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర సింగ్ బీబీసీతో అన్నారు.

"మేవాడ్ ప్రజలు తమ దేశభక్తి కోసం సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. వారి పూర్వీకులు ఆంగ్లేయులతో జరిగిన పోరాటంలో భారీ సంఖ్యలో తమ ప్రాణాలు అర్పించుకున్నారు. బాబర్, అక్బర్ సైన్యాలతో కూడా యుద్ధం చేశారు. కానీ ఈరోజు వారిని సందేహాస్పదంగా చూడడం దురదృష్టకరం" అని సురేంద్ర సింగ్ అన్నారు.
అల్వర్ జిల్లాలోని బహరోర్‌లో మొదట పహలూ ఖాన్‌ను గోరక్షకులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన 2017, ఏప్రిల్ 13న జరిగింది.
ఆ తర్వాత అల్వర్ జిల్లా మర్కపూర్‌లో ఉమ్మార్ ఖాన్‌ను 2017 నవంబర్ 9న హత్య చేశారు. ఈ ఏడాది జులై 21న రబ్కర్ హత్య జరిగింది.

మూకల దాడుల్లో హత్య
ప్రభుత్వ గణాంకాల ప్రకారం పహలూ ఖాన్ నుంచి రక్బర్ హత్య వరకూ మూకల దాడిలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 44 మంది మృతి చెందారు.
జార్ఖండ్‌లో అల్లరి మూకలు 13 మందిని చంపేశాయి. మహారాష్ట్రలో 8 మంది ప్రాణాలు తీశాయి.
తమిళనాడులో ఐదుగురు త్రిపురలో ఐదుగురు అల్లరి మూకల వల్ల మృతి చెందారు. తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, అసోంలో కూడా ఈ దాడులు జరిగాయి.

ఇటీవల గోరక్షణ పేరుతో జరిగిన ఒక హత్య కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు స్వాగతం పలికిన కొందరు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు పలుకుతూ, వారికి మిఠాయిలు తినిపించడంతో ఆయన పేరు కూడా ఈ వివాదంలో చిక్కుకుంది.
అయితే అల్వర్‌లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘటన కాస్త భిన్నమైనది. ఈ ఘటనను ఖండించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా ఈ కేసులో నిందితులపై కఠిన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజా స్థానిక పోలీసులపై ప్రశ్నలు లేవనెత్తడంతో జైపూర్ రేంజ్ క్రైమ్ అండ్ విజిలెన్స్ విభాగంలోని ఏసీపీ స్థాయి అధికారికి ముఖ్యమంత్రి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు.
ఇవికూడా చదవండి
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








