భారత్‌లో మూక దాడులపై విదేశీ మీడియా ఇలా రాస్తోంది

కోపంతో ఉన్న వ్యక్తి

ప్రజల సామూహిక దాడిలో ఎవరో ఒకరు చనిపోయిన ఘటనపై చర్చ ముగిసే లోపే, మరో ప్రాంతంలో మరో వ్యక్తిపై దాడి జరిగిందన్న వార్త మీడియాలో కనిపిస్తోంది.

వరుసగా జరుగుతున్న ఈ మూక దాడుల వార్తలు భారత మీడియాతో పాటు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.

ఇటీవల అల్వర్‌లో రక్బర్ అనే వ్యక్తి చనిపోయిన ఘటనపై పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. శుక్రవారం రాత్రి అల్వర్ జిల్లాలోని రాంగఢ్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో గోరక్షకుల దాడిలో రక్బర్ తీవ్రంగా గాయపడినట్లు ఆరోపణలున్నాయి.

ఆపైన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలోనూ పోలీసులు కావాలనే జాప్యం చేశారనే విమర్శలు వస్తున్నాయి. దాడి జరిగిన మూడు గంటల తరవాత పోలీసులు రక్బర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.

ఇలాంటి ఘటనలు ఇప్పుడు విదేశీ మీడియా దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వివిధ దేశాల్లో వెబ్‌సైట్లు, పత్రికలు వీటిని ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.

గోరక్షకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రక్బర్
ఫొటో క్యాప్షన్, గోరక్షకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రక్బర్

భారత్‌లో గోరక్షకుల చేతిలో చనిపోయిన వ్యక్తి అంటూ అల్వర్ ఘటనకు సంబంధించి అల్ జజీరా ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఆ ఘటన గురించి వివరిస్తూ రాజస్థాన్‌లోని లాల్వాడీ గ్రామంలో 28ఏళ్ల ముస్లిం వ్యక్తిని గోరక్షకులు చంపారంటూ పేర్కొంది.

దోషులుపై చర్య తీసుకుంటామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ దొరికేవరకూ మృతదేహాన్ని ఖననం చేయబోమని అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలిపింది.

ఉత్తర భారతంలో గోవుల్ని కాపాడేందుకు గోరక్షకులు నిత్యం తిరుగుతుంటారని, వాళ్ల చేతుల్లో ముస్లింలు చనిపోవడం ఇదేమీ తొలిసారి కాదని, ఇలాంటి దాడులు అనేకం జరిగాయని ఆ కథనం పేర్కొంది.

మలేషియాకు చెందిన ‘ది సన్ డెయిలీ’ కూడా... ‘గోవుల్ని తరలిస్తుండగా గోరక్షకుల దాడిలో చనిపోయిన ముస్లిం వ్యక్తి’ అంటూ కథనాన్ని అందించింది. ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని కూడా విదేశీ మీడియా ప్రస్తావించింది.

‘సామూహిక దాడిలో గాయపడ్డ వ్యక్తి దగ్గరకు వెళ్లే ముందు పోలీసులు టీ బ్రేక్ తీసుకున్నారు’ అన్న శీర్షికతో ‘ది గార్డియన్’ ఓ కథనాన్ని అందించింది. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ముందు టీ కోసం ఆగిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని కూడా అది తెలిపింది.

జయంత్ సిన్హా
ఫొటో క్యాప్షన్, ఓ ముస్లిం యువకుడిని చంపిన ఘటనలో శిక్షపడ్డ వ్యక్తుల మెడలో పూల మాల వేసిన మంత్రి జయంత్ సిన్హా

భారత్‌లో గోవుల్ని కాపాడేందుకు గోసంరక్షకులు రహదార్లపై సంచరిస్తుంటారనీ, వాళ్ల చేతిలోనే రక్బర్ చనిపోయాడనీ ఆ కథనంలో పేర్కొన్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కూడా ఈ ఘటనకు ప్రాధాన్యమిచ్చింది. బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేముందు టీ తాగిన అధికారులపై విచారణ అంటూ కథనాన్ని అందించింది.

అల్వర్ ఘటనకు ముందు జరిగిన సామూహిక దాడులపై కూడా విదేశీ మీడియా కథనాల్ని ప్రచురిస్తూ వస్తోంది.

ఓ ముస్లిం యువకుడిని చంపిన ఘటనలో శిక్షపడ్డ ఎనిమిది మంది వ్యక్తుల మెడలో పూల మాల వేసిన భారత కేంద్ర మంత్రి అంటూ జయంత్ సిన్హాకు సంబంధించిన కథనాన్ని ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించింది.

‘ద్వేషం మత్తులో, ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన గుంపుకి సన్మానం చేసిన భారత నేత’ అంటూ దానికి శీర్షికనిచ్చింది. జయంత్ సిన్హా వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఆ కథనంలో అందించింది.

సామూహిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అభిజీత్, నీలోత్పల్ దాస్
ఫొటో క్యాప్షన్, సామూహిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అభిజీత్, నీలోత్పల్ దాస్

వీటితో పాటు, అసోంలో మూక దాడిలో చనిపోయిన ఇద్దరు యువకులకు సంబంధించిన కథనాన్ని కూడా ‘ది సన్’ ప్రచురించింది. ‘ఫేక్ న్యూస్ కిల్లింగ్స్’ అంటూ దానికి శీర్షికనిచ్చి, భారత్‌లో ఓ కొత్త ట్రెండ్ విస్తరిస్తోందని పేర్కొంది.

ఇలా భారత్‌లోని అనేక ఘటనలకు సంబంధించి విదేశీ మీడియా కూడా ప్రాధాన్యమివ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)