పండరీపుర యాత్ర: 'ఈ ఒక్క నెలే మాకు స్వేచ్ఛ, ఇంటికెళ్తే మళ్లీ అవే భయాలూ, బాధలు, బాధ్యతలు’
‘దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. కానీ మాలాంటి మహిళలకు మాత్రం ఇంకా స్వేచ్ఛ రాలేదు’ అంటున్నారు నాందేడ్‌కు చెందిన కుసుం బాయి అనే మహిళ.
మహారాష్ట్రలో ఏటా జరిగే ‘వారీ’ అనే తీర్థయాత్రలో ఈమె పాల్గొంటున్నారు. ఈ యాత్రలో భాగంగా దాదాపు 5లక్షల మంది కాలినడకన పండరీపుర్‌లోని వితోబా దేవాలయానికి వెళ్తారు.
మొత్తం యాత్ర దూరం 250కి.మీ. మూడువారాల పాటు జరిగే ఈ యాత్రలో గ్రామీణ మహిళలకు స్వేచ్ఛగా జీవించే అవకాశం దొరుకుతుంది.
ఈ ఏడాది అలాంటి స్వేచ్ఛను అనుభవిస్తోన్న వేలాది మహిళల్లో కుసుం బాయి ఒకరు. స్వేచ్ఛకూ ఈ యాత్రకూ సంబంధం ఏంటో ఆమె మాటల్లోనే...
నాక్కూడా వారీలో భాగమవ్వాలని ఎప్పట్నుంచో ఉండేది. కానీ నా భర్త అనుమతి ఇవ్వలేదు. అయినా నేను వదిలిపెట్టలేదు. '50ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నా. ఇంక నాకు నచ్చినట్టు బతికే అవకాశం ఎప్పుడొస్తుంది' అని ఈసారి గట్టిగా అడగడంతో ఒప్పుకున్నాడు.
ఆడపిల్ల తన తల్లిదండ్రుల్ని చూడటానికి పుట్టింటికి వెళ్తే ఎంత సంతోషిస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది. ఆమె అక్కడ మహారాణిలా ఉంటుంది. నేనూ ఇక్కడ అలానే ఉన్నా.
ఓ మహిళ ఇంట్లో ఎన్ని పనులని చేయాలి? పొలం పనులకు వెళ్లాలి. ఇంట్లో వంట చేయాలి.

మగవాళ్లు మమ్మల్ని వదిలేసి చాలాసార్లు బయట తినేస్తారు. అలాంటప్పుడు మేము ఇంట్లో ఏది మిగిల్తే అది తిని సరిపెట్టుకోవాలి. అదే మేం ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం, భర్తకు వండిపెట్టే వెళ్లాలి. ఇలాంటి పనుల నుంచి కొన్నాళ్లు బయటపడితే ఎంత బావుంటుంది? పైగా ఇక్కడ దేవుడిని దర్శించుకునే అవకాశం కూడా దొరుకుతుంది.
ఇంట్లో వాళ్లు మమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లరు. మేం ఇంటికే పరిమితమవ్వాలని వాళ్లనుకుంటారు. ఈ వ్యవస్థతో నేను విసిగిపోయాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఆ బాధలన్నీ మరచిపోయి స్వేచ్ఛగా ఉంటాం.
ఇక్కడ పొద్దున్నే లేచి, స్నానం చేసి నడవడం మొదలుపెడతాం. నీళ్లు దొరికినప్పుడు స్నానం చేస్తాం. లేకపోతే వానదేవుడిని నమ్ముకొని అలా నడుస్తూ మందుకెళ్లిపోతాం.
ఇక్కడ ఆడా మగా తేడా లేదు. అందర్నీ ఒకేలా చూస్తారు. అందరూ మనతో మాట్లాడతారు. అందరూ మహిళల్ని 'మౌలీ'(అమ్మ) అనే పిలుస్తారు.

మౌలీ.. మౌలీ.. జ్ఞానేశ్వర్ మౌలీ అని ఇక్కడ పాట పాడుతున్నప్పుడు నాకు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. కానీ ఇంటి దగ్గర అలా చేయాలంటే మాత్రం భయమేస్తుంది.
నా చీర కొంగును ఇలా కిందకు అనీ అనీ ఎన్ని అంచులు చిరిగిపోయాయో తెలీదు. ఇప్పుడు నేను హాయిగా చీరను ఇలా పెట్టుకోవచ్చు.
దాన్యాన్ని ఆరుబయట ఎండబెడితేనే అవి నాణ్యంగా తయారవుతాయి. మా పరిస్థితి కూడా అంతే. 11 నెలలపాటు మేం ఇంటికే పరిమితమవుతాం. కానీ ఈ ఒక్క నెల మాత్రం స్వేచ్ఛగా జీవిస్తాం... ఎలాంటి భయాలూ, బాధలూ లేకుండా.
(రిపోర్టర్: మయూరేష్ కొన్నూర్, షూట్-ఎడిట్: శరద్ బదే)
ఇవి కూడా చదవండి:
- గ్రౌండ్ రిపోర్ట్ : అల్వర్‌లో ఆవులు తోలుకెళ్తున్న ముస్లిం యువకుడిని ఎవరు చంపారు?
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- భారత మహిళలు గృహహింసను ఎందుకు భరిస్తారు?
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- విట్టెనూమ్: ‘ఈ పట్టణం ఖాళీ.. అక్కడకు వెళ్లారా అంతే’
- వాట్సప్: 'ఇక మెసేజీని ఐదుసార్లకు మించి ఫార్వర్డ్ చేయలేరు'
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- 'సేక్రెడ్ గేమ్స్'లో చిహ్నాల అర్థం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









