మహారాష్ట్ర: చర్చిల్లో ఉపనిషత్తు పఠనం

ఫొటో సోర్స్, RAHUL RANSUBHE/BBC
- రచయిత, సంకేత్ సబ్నీస్, రాహుల్ రణ్‌సుభే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మహారాష్ట్రలోని పలు చర్చిల్లో గుడ్ ఫ్రైడేకు ఎంతో ప్రత్యేకత ఉంది. గుడ్ ఫ్రైడే రోజు ముంబయి, మరికొన్ని ప్రాంతాల్లోని కొన్ని చర్చిల్లో క్రైస్తవ ప్రార్థనలతోపాటు హిందూ గ్రంథమైన నారాయణ ఉపనిషత్తు పఠనం జరుగుతుంది. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతోంది.
హిందూ ఆధ్యాత్మిక సంస్థ 'స్వాధ్యాయ్ పరివార్' ఆధ్వర్యంలో ఈ చర్చిల్లో నారాయణ ఉపనిషత్తును పఠిస్తారు. ఈ ఉపనిషత్తు విశ్వ శాంతి సందేశాన్ని ఇస్తుంది.
స్వాధ్యాయ్ పరివార్‌కు చెందిన ఆమోద్ దాతార్ బీబీసీతో మాట్లాడుతూ- పాండురంగశాస్త్రి అథవాలే ఆధ్వర్యంలో 1991లో ఈ కార్యక్రమం మొదలైందన్నారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు బాధను కలిగించే సందర్భమని, ఈ సందర్భంలో నారాయణ ఉపనిషత్తు పఠనంతో వారికి తోడుగా ఉంటామని తెలిపారు.
రెండు మతాల మధ్య అంతరాలను తొలగించుకొనేందుకు ప్రార్థనను ఒక మార్గంగా ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు.
నారాయణ ఉపనిషత్తు ప్రపంచ శాంతిపై దృష్టి కేంద్రీకరిస్తుందని, చర్చిలో దీని పఠనానికి క్రైస్తవులు ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని, వారు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు.
నారాయణ ఉపనిషత్తులోని మొదటి మంత్రం గురించి ఆమోద్ దాతార్ వివరించారు. నారాయణుడు ప్రపంచానికి శాంతిని ప్రసాదించేవాడని, నారాయణుడు పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడని, నారాయణుడిని పూజించాలని ఇది చెబుతుందని ఆయన తెలిపారు. ఉపనిషత్తు సంస్కృతంలో ఉంది.
క్రైస్తవ మతపెద్ద ఫ్రాన్సిస్ డీబ్రిటో బీబీసీతో మాట్లాడుతూ- చర్చిలో ఉపనిషత్తు పఠనాన్ని స్వాగతించారు.
''భారత్‌లో అనేక సంస్కృతులు, అనేక భాషలు, అనేక మతాలు ఉన్నాయి. పూజా విధానం, ప్రార్థన తీరు ఒక్కో మతం వారికి ఒక్కోలా ఉంటుంది. భిన్నత్వంలో ఇమిడి ఉన్న అందమే ఇది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
క్రైస్తవులు, హిందువుల మధ్య బంధం బలపడేందుకు చర్చిలో ఉపనిషత్తు పఠనం తోడ్పడుతుందని, అందుకే స్వాధ్యాయ్ పరివార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తామని ఆయన వివరించారు. ''వారు గుడ్ ఫ్రైడే రోజు మా వద్దకు వస్తారు. దీపావళి రోజు మేం వాళ్ల వద్దకు వెళ్తాం'' అని తెలిపారు.

మార్చి 30న గుడ్‌ఫ్రైడే సందర్భంగా మహారాష్ట్రలోని పలు చర్చిల్లో ఉపనిషత్తు పఠనం జరిగింది.
రాయ్‌గఢ్ జిల్లా కజ్రత్‌లోని 'అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా చర్చ్'లో ప్రార్థనల తర్వాత చర్చి ఫాదర్ కాలిస్టస్ ఫెర్నాండెజ్ సమక్షంలో స్వాధ్యాయ్ పరివార్ ఆధ్వర్యంలో నారాయణ ఉపనిషత్తును పఠించారు.
కార్యక్రమంపై ఫెర్నాండెజ్ స్పందిస్తూ- ''చర్చిలో 2010 నుంచి ఉపనిషత్తు పఠనం జరుగుతోంది. దీని పఠనానికి స్వాధ్యాయ్ పరివార్ సభ్యులను మేం హృదయపూర్వకంగా స్వాగతిస్తాం. ఇలాంటి కార్యక్రమాలకు క్రైస్తవులు ఎన్నడూ అభ్యంతరం చెప్పరు. భారత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేయడాన్ని మేం స్వాగతిస్తాం'' అన్నారు.
నిరుడు 114 చర్చిల్లో ఉపనిషత్తు పఠనం
తమ ఆధ్వర్యంలో 2016లో 98 చర్చిల్లో, 2017లో 114 చర్చిల్లో ఉపనిషత్తు పఠనం నిర్వహించినట్లు ఆమోద్ దాతార్ తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబయి, ఠాణే, పుణె, నాసిక్, ఔరంగాబాద్ జిల్లాల్లో, గుజరాత్‌లోని రాజ్‌కోట్, వదోదర జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








