సవ్యసాచి: ‘ఇది కండోమ్ ప్రకటనా? నగల ప్రకటనా?’- ఈ బ్రాండ్‌‌ను ఎందుకు నిషేధించమంటున్నారు

సబ్యసాచి మంగళసూత్ర ప్రకటన

ఫొటో సోర్స్, SABYASACHI/INSTAGRAM

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మొన్న తనిష్క్, నిన్న ఫ్యాబ్ ఇండియా, మాన్యవర్, డాబర్... ఇప్పుడు సవ్యసాచి. వీటిలో చాలావరకు ఫ్యాషన్ బ్రాండ్‌లు.

ఈ బ్రాండులన్నీ ఇటీవల కాలంలో వ్యతిరేకత ఎదుర్కొన్నాయి. వీటిని నిషేధించాలనే వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగింది.

అయితే, ఈ నిషేధం ఆయా సంస్థల ఉత్పత్తులలో నాణ్యత లేకపోవడం వల్లో, లేదా వ్యాపార నైతికత లేకపోవడం వల్లో జరగలేదు.

ఆ సంస్థలు సామాజిక అంశాలను స్పృశిస్తూ, రెండు మతాల మధ్య ఐక్యతనో లేదా లైంగిక సంబంధాల విషయంలో స్వేచ్చాయుత భావాలనో తమ ప్రకటనల ద్వారా చెప్పాలనుకున్నాయి.

తనిష్క్, మాన్యవర్, ఫ్యాబ్ ఇండియా ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాల వారు ప్రోత్సహించే బ్రాండులు. ఈ బ్రాండులను కొనుగోలు చేయాలని అనుకునే వినియోగదారులు నిజానికి ఈ ట్రోలింగ్‌ను పట్టించుకుంటారో లేదో సందేహమే.

తాజాగా ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీకి చెందిన ‘సవ్యసాచి’ బ్రాండ్ కూడా సోషల్ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడికి తలవంచక తప్పలేదు. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా "సవ్యసాచి ప్రకటనను 24 గంటలలోగా ఉపసంహరించని పక్షంలో పోలీసులను పంపించాల్సి వస్తుందని అల్టిమేటం ఇవ్వడంతో, సవ్యసాచి బ్రాండ్ తమ సోషల్ మీడియా హ్యాండిళ్ల నుంచి మంగళ సూత్ర ప్రకటనను తొలగించింది.

తనిష్క్ ప్రకటన

ఫొటో సోర్స్, Tanishq

ఫొటో క్యాప్షన్, తనిష్క్ వాణిజ్య ప్రకటన

తనిష్క్ లాంటి పెద్ద బ్రాండులు కూడా సోషల్ మీడియాలో వచ్చే ఒత్తిడికి తలవంచి ప్రకటనలను ఉపసంహరించుకోవడం తప్పడం లేదు..

హిందువైన తమ కోడలి కోసం, ముస్లిం దంపతులు, హిందు సంప్రదాయ పద్ధతిలో సీమంతం ఏర్పాటు చేయడాన్ని ఈ యాడ్‌లో చూపించారు.

ఆ అడ్వర్టైజ్‌మెంట్, 'లవ్ జిహాద్'ను ప్రమోట్ చేస్తుందంటూ కొంతమంది మితవాదులు పేర్కొన్నారు. వివాహం ద్వారా హిందు మహిళలను మారుస్తున్నారంటూ కొంతమంది ముస్లిం పురుషుల పై ఆరోపణలు చేశారు.

సంస్థ ఉద్యోగులకు బెదిరింపులు కూడా ఎదురయ్యాయి.

దాంతో, 2020లో తనిష్క్ తమ ఏకత్వం సిరీస్‌లో రూపొందించిన ప్రకటనను ఉపసంహరించుకుంది.

వారం రోజుల క్రితం ఇంటిమేట్ ఫైన్ జ్యూవెలరీ ప్రచారంలో భాగంగా సవ్యసాచి వీడియోలు, ఫోటోలను అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లలో పోస్ట్ చేశారు.

ఆ ఫోటోలలో ఒక అబ్బాయి, అమ్మాయి సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందులో అమ్మాయి 'బ్రా' ధరించి మంగళ సూత్రం వేసుకున్నట్లుగా ఫోటో ఉంది.

ఈ ప్రకటనల్లో ముగ్గురు అమ్మాయిలున్న ఫోటోలు కూడా ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కులను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటనలను రూపొందించినట్లు తెలుస్తోంది.

కానీ, ఈ ప్రకటనల పట్ల నిరసన తెలుపుతూ ట్విటర్‌లో #బ్యాన్‌సబ్యసాచి అంటూ ట్రెండ్ మొదలయింది.

"ఇది కండోమ్ ప్రకటనా? దీనిని మంగళ సూత్రం అంటారా?" "ఇది నగల ప్రకటనా?"

"ఈ ప్రకటన లింగరీ పోస్టర్‌ను తలపిస్తోంది. ఇంటిమేట్ హిజాబ్‌ను విడుదల చేయండి" అంటూ సోషల్ మీడియా యూజర్లు రకరకాల కామెంట్‌లు చేశారు.

వాక్‌స్వాతంత్య్రం, సృజన పేరుతో హిందూ మత సంప్రదాయాలను తేలికగా తీసుకుంటూ చవకబారు పనులకు పాల్పడుతున్నారంటూ కామెంట్లు చేశారు.

"మంగళ సూత్రం అంటే ఇలా ఉంటుంది. ఇది ఫ్యాషన్ ఆభరణం కాదు. భార్యా భర్తల మధ్యన ఉండే ప్రేమకు, అనుబంధానికి ఇది సంకేతం" అంటూ శీతల్ చోప్రా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇలా వివిధ సంస్థల ఉత్పత్తులను సోషల్ మీడియా వేదికలుగా నిషేధించమని పిలుపునిచ్చే సంస్కృతి ఒక ట్రెండ్‌గా మారుతోందా?

ఈ నిషేధపు సంస్కృతి ఏ బ్రాండుకైనా ఇబ్బందిగా తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అనురాధ తోట అంటారు.

ఒక బ్రాండ్‌‌ను ఏదో ఒక వర్గానికి పరిమితం చేయమని అడగడం సరైంది కాదని అంటూ, ఇలా చేయడం వల్ల సృజన దెబ్బ తింటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

"సవ్యసాచి విషయానికొస్తే అదొక లగ్జరీ బ్రాండ్. మధ్యతరగతి వారెవ్వరూ ఆ బ్రాండ్ ఉత్పత్తులను కొనలేరు. దానిని నిషేధించడం ట్రోలర్స్ వల్ల కుదిరే పని కాదు" అని ఆమె అభిప్రాయపడ్డారు

"ఏదైనా వస్తువును ఇష్టం, నాణ్యత, అవసరం మేరకు కొంటారు కానీ, బ్రాండు రూపొందించిన ప్రకటనను చూసి వస్తువును కొనడాన్ని మానరు" అని అనురాధ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"నిజం చెప్పాలంటే, సవ్యసాచి చేసిన ప్రకటన అసలు హుందాగా లేదు. ఈ ప్రకటనను ట్రోల్ చేసేందుకు నాకనిపించిన కారణాలు వేరు" అంటూ ‘ది మాక్స్ ఫౌండేషన్’ సౌత్ ఆసియా రీజనల్ హెడ్ విజ్జి వెంకటేష్ ట్వీట్ చేశారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "ఈ ప్రకటన ఆకర్షణీయంగా లేదు. అదేసమయంలో సవ్యసాచి ప్రకటన పట్ల చేస్తున్న ట్రోల్స్ చెబుతున్న కారణాలు మాత్రం సమంజసంగా లేవు" అని అన్నారు.

"సంస్థ తయారు చేసే ఉత్పత్తుల గురించి సమాచారాన్నిచ్చి వినియోగదారులను ఆకర్షించడం ప్రకటనల ఉద్దేశం కావాలి. ప్రకటనలను రూపొందించేటప్పుడు అశ్లీల, ద్వేషపూరిత, ప్రేరేపించే అంశాలు ఉండరాదన్న నియమావళి కూడా ప్రకటన సంస్థలకు ఉంటుంది" అని చెప్పారు.

"గతంలో ఇలా ప్రకటనలను తప్పు పట్టే ధోరణి అరుదుగా కనిపించేది. ప్రతీ ఒక్కరికి ఏది తప్పు, ఏది సరైంది అనే విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలుండటం సహజం. కానీ, సాంస్కృతిక, మతపరమైన కారణాలు చూపిస్తూ ట్రోలింగ్ జరగడం సాధారణంగా మారిపోవడం విచారకరం" అని అన్నారు.

భారతదేశంలో 2019లో 20% ఉన్న డిజిటల్ అడ్వర్టైజింగ్ 2021 నాటికి 29.4 శాతానికి పెరిగింది. అది 2022 చివరి నాటికి 32.7 శాతం చేరవచ్చని అడ్వర్టైజింగ్ సంస్థ డెంట్‌సు అంచనా వేసింది.

ఫ్యాబ్‌ఇండియా యాడ్

ఫొటో సోర్స్, SCREENSHOT/FABINDIA

కొద్ది రోజుల క్రితం ఫ్యాబ్ ఇండియా బ్రాండ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. దుస్తులు, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్, హోమ్ ఫర్నిషింగ్స్, జ్యువెలరీ లాంటి ఉత్పత్తులను ఫ్యాబ్ ఇండియా అమ్ముతుంది.

దీపావళి పండుగ కోసం రూపొందించిన దుస్తుల కలెక్షన్‌ను 'జష్ణ్-ఇ-రివాజ్' పేరిట ప్రచారం చేయడంపై అనేక మంది విమర్శలు చేశారు. తమ మత భావాలను దెబ్బతీశారని నిరసన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఎదురయిన ఈ ఒత్తిడితో, సంస్థ ట్యాగ్ లైన్‌ను "ఝిల్‌మిల్‌సీ‌దివాలీ" అని మార్చాల్సి వచ్చింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

ఈ ప్రకటనలో మోడల్స్ బొట్టు పెట్టుకోలేదంటూ 'నో బిందీ నో బిజినెస్' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు.

మాన్యవర్ ప్రకటన హిందూ సంస్కృతిని ప్రశ్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఇవన్నీ ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నవే.

రోడ్లపై బాణాసంచా కాల్చవద్దంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన సియట్ టైర్ల ప్రకటన కూడా మితవాదులు నుంచి విమర్శలెదుర్కొంది.

ఒక జెండర్ లేదా ఒక వర్గానికి చెందిన వారు కొన్ని నిర్దిష్ట ప్రామాణికాలలోనే ప్రవర్తించాలనే ఒత్తిడి సరైంది కాదని అంటూ, "బ్రాండ్‌లు కూడా స్టీరియో టైపు సిద్ధాంతాలను పగులగొట్టి, రోజు రోజుకీ పరిణితి చెందుతూ, సృజనాత్మకంగా ప్రకటనలను రూపొందించడం ఆనందించాల్సిన విషయం" అని బ్రాండ్ మేనేజర్ శేషాంకా బినేష్ అన్నారు. ఆమె నటి సమంత నిర్వహిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ కు బ్రాండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, భారతదేశంలాంటి దేశంలో జెండర్ న్యూట్రాలిటీని ఆమోదించడం అంత సులభమైన విషయం కాదు. ప్రకటనలను సృజనాత్మక ధోరణిలో స్వీకరించడానికి చాలా సమయం పట్టవచ్చు. నిషేధపు పిలుపులు అంతమవ్వడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది" అని అన్నారు. "అయితే, ప్రకటన సంస్థలు ఆలోచన రేకెత్తించే ప్రకటనలు రూపొందించడం పట్ల మాత్రం నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అమ్మకాల పై ప్రభావం

అయితే, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఒత్తిడి బ్రాండుల అమ్మకాల పై ఎంత వరకు ప్రభావం చూపిస్తాయి?

ఈ నిషేధపు పిలుపులు పెద్ద బ్రాండుల పై ప్రభావం చూపకపోవచ్చు కానీ, చిన్న చిన్న బ్రాండులు, రోజువారీ సరుకులను అమ్మే బ్రాండుల పై ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు దళిత్ విమెన్ కలెక్టివ్‌కు చెందిన దీప్తి.

హిందూస్తాన్ లివర్ లిమిటెడ్ రెడ్ లేబుల్ టీపొడి , హోలీ పండగ సందర్భంగా తీసిన సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనకు కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంది. ఇదే విషయాన్ని దీప్తి గుర్తు చేశారు.

హిందుస్తాన్ యూనిలివర్

ఫొటో సోర్స్, Getty Images

"ప్రేమ శాశ్వతం, కామం తాత్కాలికం. ఈ సోషల్ మీడియా నిషేధపు పిలుపులు కూడా కామం లాంటివే. ఇవొక వారం లేదా నెల రోజులుంటాయి. ఆ తర్వాత కనుమరుగైపోతాయి. వీటి వల్ల బ్రాండుల అమ్మకాల పై ప్రభావం ఉండదు" అని హైదరాబాద్‌కు చెందిన పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్ సత్య పాముల అన్నారు.

ఇటువంటి చర్యల వల్ల బ్రాండ్ విలువ తగ్గడానికి బదులు బ్రాండ్ పట్ల అవగాహన మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫేస్ బుక్ లాంటి వేదికల గురించి కూడా డేటా బ్రీచింగ్ జరుగుతోందంటూ ఎన్ని రకాల వార్తలు వచ్చినా వాటిని వాడటం మానడం లేదనే విషయాన్ని అనురాధ గుర్తు చేశారు.

అయితే, సంస్థలు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రకటనలను రూపొందిస్తాయా అనే సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు...

"ఏ బ్రాండ్‌కైనా పేరు, ప్రతిష్ట అవసరమే. సంస్థకు, ప్రకటన సంస్థలకు కూడా లాభం ఆర్జించటం ముఖ్యం. ఒక వర్గాన్నో, మతాన్నో, ప్రేరేపించే ఉద్దేశంతో ప్రకటన సంస్థలేవీ ప్రకటనలను రూపొందించవు" అని సత్య అన్నారు.

ఎల్జీబీటీ చరిత్ర: స్వలింగ సంపర్కుల చరిత్రను కూడా ఆధునిక జీవితంలో భాగమైన సాధారణ చరిత్రలా తెలియచేయడం కూడా ముఖ్యమని చరిత్ర కారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎల్జీబీటీ కమ్యూనిటీ-ప్రతీకాత్మక చిత్రం

"ప్రతి దశాబ్దంలోనూ అంతర్జాతీయంగా కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచ శాంతి, సమైక్యత, ఫెమినిజమ్, ఇంక్లూజివ్‌నెస్ లాంటివి. ఆ ట్రెండ్‌ను బ్రాండులు కూడా ఒక అంశంగా తీసుకుని ప్రకటనలను రూపొందిస్తూ ఉంటాయి" అని సత్య వివరించారు.

"సంస్కృతి పరిరక్షణ బాధ్యత మాదే అని నెత్తిన వేసుకున్న సమూహాల వల్ల వచ్చే సమస్యలివన్నీ" అని ఆయన అంటారు.

ఈ అభిప్రాయంతో హైదరాబాద్‌కు చెందిన స్మాల్‌టౌన్ యాడ్ ఏజెన్సీ క్రియేటివ్ హెడ్ ఉదయ్ పోతన్‌శెట్టి అంగీకరించారు.

"భారతదేశంలో చాలా సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ప్రకటనల కోసం సమయాన్ని వెచ్చించి, సంస్థలు, వ్యక్తుల నైతిక బలాన్ని తీసే విధంగా ప్రవర్తించడం చూస్తుంటే విచారంగానే ఉంది" అని ఉదయ్ అన్నారు.

"సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే, ప్రజలు సున్నితత్వాన్ని, సహనాన్ని కోల్పోయారా" అనే ప్రశ్న ఉదయిస్తోందని అన్నారు.

సబ్యసాచి ప్రకటన గురించి మాట్లాడుతూ, "ఇంటిమసీ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సాధారణమైన సహజమైన విషయం. ఇవి చట్టబద్ధమైన సంబంధాలనే సూచిస్తున్నాయి కదా. ఆ ఫొటోల్లో అసంబద్ధత ఏముందో అర్థం కావడం లేదు " అని అన్నారు.

LGBT

ఫొటో సోర్స్, Sonal Giani/Facebook

ఫొటో క్యాప్షన్, సోనల్ జ్ఞాని

సహనాన్ని కోల్పోవడం, ద్వేషపూరిత వాతావరణాన్ని పెంచి ప్రోత్సహించే సంస్కృతే వీటన్నిటికీ మూలమని దళిత్ విమెన్ కలెక్టివ్ సభ్యురాలు దీప్తి అన్నారు.

"ఈ ప్రకటనలన్నీ చూస్తుంటే, మహిళకేమి కావాలని అడగకుండానే, మహిళ ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నిర్దేశిస్తున్నారని అనిపిస్తోంది".

"బొట్టు పెట్టుకోవాలో లేదో నిర్ణయించుకోవల్సింది ఆ ప్రకటనలో నటించే మహిళా, లేదా నెటిజెన్లా" అని ప్రశ్నించారు.

"ఆఖరికి నిత్యావసర సరుకులను ఉత్పత్తి చేసే బ్రాండ్ కూడా కూడా హిందూ ముస్లిం సమైక్యతను చూపించినందుకు నిరసనలను ఎదుర్కోక తప్పలేదు" అని అన్నారు.

"సవ్యసాచి ప్రకటనలు రూపొందించే విధానం ఇదేనా? ఈ ప్రకటన తర్వాత మరిన్ని రత్నాల లాంటి ప్రకటనలు రావాలేమో?" అంటూ జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌ను 2500 సార్లు రీట్వీట్ చేశారు.

కొన్ని వర్గాలు పెంచి ప్రోత్సహించే ఐటీ సెల్‌లకు చెందిన గ్రూపులే ఈ విధమైన ధోరణిని ప్రోత్సహిస్తాయని దీప్తి అన్నారు. అభ్యదయ భావాలను ఆమోదించలేకపోవడం వల్లే సోషల్ మీడియా వేదికల పై కృత్రిమంగా ద్వేషపూరిత ప్రచారాన్ని సృష్టిస్తారని అన్నారు.

"రాజ్యాంగబద్ధంగా సృజనాత్మక స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. ప్రకటనలను చూపించి సంస్థ ఉత్పత్తులను నిషేధించమని పిలుపునిచ్చే శక్తి రాజకీయ వర్గాలకు ఉండకూడదు" అని విజ్జి వెంకటేష్ అభిప్రాయపడ్డారు.

ఉత్తరాది వారు జరుపుకునే పండగ కర్వా చౌత్ సందర్భంగా స్వలింగ సంపర్క సంబంధాలను సానుకూల దృక్పథంతో చూపించినందుకు గాను, డాబర్ సంస్థ కూడా సోషల్ మీడియాలో నిరసనలు ఎదుర్కొంది.

"ఫెయిర్ నెస్ క్రీములు కొత్త కాదు, కర్వా చౌత్ కొత్త కాదు. మరి ఇప్పుడే కొత్తగా ఇలాంటి బంధాల విషయంలో జూమ్ చేసి మరీ చూస్తున్నారు" అని దీప్తి సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన గురించి ప్రశ్నించారు.

"సుప్రీం కోర్ట్ కూడా స్వలింగ సంబంధాలను చట్టబధ్దం చేసిన తర్వాత ఆ అంశాల చుట్టూ రూపొందించిన ప్రకటనలను దుమ్మెత్తిపోయడంలో అర్ధం లేదు" అని సత్య పాముల అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"ఈ స్థాయిలో ఉత్పత్తులను నిషేధిస్తూ వెళితే, నిషేధ పరిశ్రమ చివరకు తమను తాము నిషేధించుకునే పరిస్థితి తలెత్తుతుంది" అంటూ ఎం‌ఎన్ పార్థ్ అనే జర్నలిస్ట్ గతంలో ట్వీట్ చేశారు.

"ఈ ప్రకటనలు నిజానికి అభ్యుదయాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకొస్తున్నాయి. కానీ, అన్ని అంశాలనూ ఒకేసారి ప్రజలకు చేరవేద్దామని చూడటం వల్ల కూడా వాటిని సహేతుకంగా అర్ధం చేసుకుని స్వీకరించగలిగే శక్తి సమాజానికుండదు. ఇదే సోషల్ మీడియా విప్లవాలకు దారి తీస్తోంది" అని అంటారు ఉదయ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)