కేరళ వరదలు: పెళ్లి మండపానికి వంటపాత్రలో

కేరళ జంట

ఫొటో సోర్స్, AFP

వరదలతో అతలాకుతలమైన కేరళలో పెళ్లి మండపానికి చేరుకోవడానికి వధూవరుల జంట ఒకటి పెద్ద వంట పాత్రలో కూర్చుని నీటిలో తేలుతూ వెళ్లాల్సి వచ్చింది.

ఈ ఫొటో, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేరళకు చెందిన ఆకాశ్, ఐశ్వర్యలు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. వీరికి కొద్దిరోజుల కిందట పెళ్లి కుదిరింది. వరదల కారణంగా తమ పెళ్లి ఆగిపోకూడదని వారు అనుకున్నారు. వీరి పెళ్లి సోమవారం తలవడి గ్రామంలో జరిగింది.

వరదల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో ఈ జంట ఒక పెద్ద గంగాళంలో(పాత్ర) కూర్చుని వరద నీటిలో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.. చాలా గ్రామాలు, పట్టణాలకు మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

కేరళ జంట

ఫొటో సోర్స్, AFP

వరద ప్రభావం తక్కువగా ఉన్న తలవడిలో ఒక గుడిలో పెళ్లి చేసుకోవాలని ఆకాశ్, ఐశ్వర్య నిర్ణయించుకున్నారు.

ఈ జంట మరో స్థానిక ఆలయం నుంచి వంటకు ఉపయోగించే అల్యూమినియం గంగాళాన్ని అడిగి తీసుకుంది.

వారు అందులో కూర్చున్న తర్వాత వరద నీటిలో పడవలా ముందుకు నడుపుతూ బంధువులు వారిని మండపానికి తీసుకెళ్లారు.

"మా పెళ్లి ఇలా జరుగుతుందని మేం ఎప్పుడూ ఊహించలేదు" అని స్థానిక న్యూస్ చానల్ ఏసియానెట్‌తో మాట్లాడిన వధువు ఐశ్వర్య అన్నారు.

మొదట కొద్ది మంది కుటుంబ సభ్యులతో ఒక చిన్న వేడుక ప్లాన్ చేసుకున్నామని, కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు చాలా మందికి ఆసక్తి కలిగిస్తుండడంతో తమ పెళ్లి రోజును కూడా చాలా మందితో షేర్ చేసుకోవాలని అనిపించిందని ఈ కొత్త జంట చెప్పింది.

"మా పెళ్లి తేదీ చాలా రోజుల క్రితమే ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ తేదీని వాయిదా వేసుకోకూడదని అనుకున్నాం" అని ఆకాశ్ చెప్పారు.

అప్పటికప్పుడు వెళ్లడానికి ఆ గంగాళం తప్ప తమకు వేరే దారేదీ కనిపించలేదని ఈ కొత్త జంట చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)