‘దళిత బంధు ఆపాలంటూ ఆగస్ట్‌లో లేఖ రాస్తే రెండు నెలల తరువాత ఎన్నికల సంఘం స్పందించింది’- ప్రెస్ రివ్యూ

కేసీఆర్ దళితబంధు

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసేంత వరకు అక్కడ దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు 'ఈనాడు' కథనం వెల్లడించింది.

'ఆ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది.

ఆ పథకం అమలుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్న్ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఈ నెల 8న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఈ లేఖపై చర్చించిన మీదట పథకానికి సంబంధించిన నగదు బదిలీ ప్రక్రియ అంతటినీ ఉపఎన్నిక ముగిసేంత వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ స్పష్టం చేస్తూ సోమవారం రాష్ట్రానికి పంపిన ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు.

ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హుజురాబాద్‌లో దళిత బంధు పథకం అమలును ఆపాలని ఆగస్టులో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఆపడం పెద్ద జోక్‌గా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభ రెడ్డి ఆక్షేపించారు.

లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసి ఎన్నికలు దగ్గరకొచ్చాక నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమని ఆయన అన్నట్లు'' ఈనాడు పేర్కొంది.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

ఏపీలో 'కోవిడ్‌' కారుణ్య నియామకాలు, పోస్టుల భర్తీకి రేపు నోటిఫికేషన్లు

కోవిడ్‌తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించినట్లు 'సాక్షి' పేర్కొంది.

'నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, హెల్త్‌హబ్స్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. జనవరిలో వీటి పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకాలు ఉండాలని, ఇందులో రాజీకి ఆస్కారం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వివిధ ఆస్పత్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్‌ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

అక్టోబర్‌ 20న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్‌ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.

డీఎంఈలో పోస్టులకు డిసెంబర్‌ 5న నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఏపీవీవీపీలో పోస్టులకు అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్‌ 21 - 25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

షర్మిల

షర్మిల ప్రజాప్రస్థానం రేపటి నుంచి

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభం కానుందని 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

'ప్రజాప్రస్థానం పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రకు శంకర్‌పల్లి క్రాస్‌ రోడ్డు వద్ద తొలి అడుగు పడనుంది. ఉదయం 11 గంటలకు వైఎస్‌ఆర్‌ సతీమణి విజయలక్ష్మి జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

'తెలంగాణలో రాజన్న సంక్షేమం, అభివృద్ధి కోసం 20న చేవెళ్లలో షర్మిల ప్రజా ప్రస్థానం ప్రారంభించబోతోంది. ఆమె అడుగులో అడుగేయండి. చేతిలో చేయి కలపండి. మీరు.. ఆమె కలిసి ప్రభంజనం సృష్టించి రాజన్న రాజ్యం సాధించుకోండి' అంటూ విజయలక్ష్మి సోమవారం ఓ వీడియో సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు.

బుధవారం నుంచి ఏకంగా 400 రోజుల పాటు 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల రూట్‌ మ్యాప్‌ కూడా ఖరారైంది.

ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుంది.

మధ్యాహ్న భోజన సమయంలో స్థానిక ప్రజలతో 'మాట- ముచ్చట' పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు పాదయాత్ర మొదలై 6 గంటల వరకు సాగుతుంది

కాగా, పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం తాను ఎక్కడుంటే.. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహిస్తారని'' ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోతున్న జనం, యాప్‌లోనే కాలక్షేపం..

ప్రస్తుతం మన దేశంలోని స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు రోజూ సగటున 4.36 గంటలపాటు యాప్స్‌పై కాలం గడుపుతున్నారని, లాక్‌డౌన్‌తో ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగిందని డాటా అనలిటకల్‌ సంస్థ 'యాప్‌ అన్నె' స్పష్టం చేసినట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''2019 ప్రారంభంతో పోల్చితే ఈ ఏడాది జూన్‌ నాటికి యాప్స్‌ వినియోగం 80% పెరిగినట్టు వెల్లడించింది. 2019లో 3.18 గంటలుగా ఉన్న వార్షిక వినియోగ సగటు.. 2020లో 3.48 గంటలకు, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 4 గంటలకు చేరుకున్నట్టు వివరించింది.

రానున్న 3 నెలల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం, యాప్స్‌ వాడకం మరింత పెరుగుతుందని తెలిపింది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో జరిగే యాప్స్‌ వినియోగంపై ఈ సంస్థ ఓ అంచనా నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం.. యాప్స్‌తో అత్యధిక సమయాన్ని గడిపే దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నది.

మన దేశంలో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, టకాటక్‌, జెరోధా, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌పై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్టు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా చివరి త్రైమాసికంలో యాప్‌ డౌన్‌లోడ్స్‌ సంఖ్య 3,600 కోట్లుగా నమోదవుతుందని, వీటి కోసం చేసే ఖర్చు రూ.26 వేలకోట్ల (34 బిలియన్‌ డాలర్ల) వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)