బ్లాక్ ఫంగస్: ఏపీలో పెరుగుతున్న కేసులు... సమయానికి అందని మందులు, చికిత్సలో జాప్యం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
"ఏప్రిల్ 20న స్కానింగ్‌లో 15 పాయింట్లు వచ్చిందన్నారు. అదేంటో అర్థం కాలేదు కానీ, డాక్టర్లు పరిస్థితి సీరియస్‌గా ఉందనే విషయం మాత్రం చెప్పారు. 62 ఏళ్ల మా నాన్నగారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం. వైద్యులు చేసిన సేవలతో ఆయన కోలుకుని ఇంటికి చేరుకున్నారు. కానీ మరో వ్యాధి మా నాన్నను మాకు దూరం చేస్తుందని అనుకోలేదు" అని విశాఖలోని మధురవాడకు చెందిన రాజేంద్రకుమార్ చెప్పారు.
"ఇంటికి వచ్చిన తర్వాత రెండువారాలు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత కన్ను వాచి, నీరు కారడంతో మళ్లీ కేజీహెచ్‌కు తీసుకెళ్లాం. అక్కడ పరీక్షలు చేసి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వచ్చిందని, ఇది కోవిడ్ వచ్చిన కొందరికి వస్తుందని వైద్యులు చెప్పారు. దానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన మూడు రోజుల తర్వాత మా నాన్నగారు చనిపోయారు" అన్నారు.
కోవిడ్‌ను జయించిన నాన్నగారు, బ్లాక్ ఫంగస్ అనే మరో వ్యాధికి బలవుతారని మేం అసలు ఊహించలేదని రాజేంద్రకుమార్ బీబీసీతో అన్నారు.
ఇలా, కోవిడ్ నుంచి కోలుకున్న వారికి మరో ముప్పు పొంచి ఉంటోంది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 90 శాతం వరకు కోవిడ్ సోకిన వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసులు తక్కువ చెబితే మనకే నష్టం
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ వచ్చిన వారికే ఈ వ్యాధి అధిక శాతం వస్తుండటంతో, కోవిడ్ తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ బయటపడుతోంది.
జూన్ 11 నాటికి రాష్ట్రంలో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసుల డేటాను వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
"ఏపీలో మే 17, 2021 నాటికి కేవలం 9 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. కానీ, జూన్ 11 నాటికి 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి
వీరిలో ప్రస్తుతం 1,301 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కారణంగా రాష్ట్రంలో మొత్తం 138 మంది మృతి చెందారు".
"బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చూపిస్తున్నామని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, తగ్గించి చెబితే రాష్ట్రానికి రావాల్సిన ఇంజక్షన్లు తక్కువ వస్తాయి. దాని వలన మనకే నష్టం. బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అనుమానస్పద కేసులను బ్లాక్ ఫంగస్‌గా ప్రకటించలేం" అని అనిల్ సింఘాల్ చెప్పారు.
"కేంద్రం, రాష్ట్రాల వారీగా నిర్ణయించిన కోటా ప్రకారమే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు వస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రానికి 13,105 ఇంజెక్షన్లు వచ్చాయి. ఇంకా 91,650 యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్ల కోసం కంపెనీలకు ఆర్డర్ ఇచ్చాం. అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సలో అవసరమైన పోనోకొనజోల్ ఇంజక్షన్లు 12,250, పోసోకొనజోల్ 1,01,980 మాత్రలు కొనుగోలు చేశాం" అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఆరు జిల్లాల్లోనే అధికం...
బ్లాక్ ఫంగస్ కోవిడ్ బారిన పడిన వారికి మాత్రమే వస్తుందని భావించవద్దని వైద్యులు చెప్తున్నారు. ఇది ఎవరికైనా సోకే అవకాశం ఉందని, కోవిడ్ బారిన పడినా, లేకపోయినా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ రాకుండానే 43 మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. అయితే కోవిడ్ వచ్చిన వారిలో ఇది ఎక్కువగా ఉంటుందని షుగర్ వ్యాధి ఉన్న వారికి కోవిడ్ వస్తే బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుదని డాక్టర్లు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ కేసుల్లో కోవిడ్ సోకిన తర్వాత ఈ వ్యాధికి గురైనవారు దేశవ్యాప్తంగా 86 శాతం ఉండగా, ఏపీలో మాత్రం 95 శాతం ఉంది.
ఏపీలో సగటున రోజూ 80 వరకూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో ఈ సగటు క్రమంగా వందకు చేరుకునే అవకాశం ఉందని విశాఖ ఈఏన్‌టి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు.
"గతంలో విశాఖపట్నంలో ఏడాదికి ఒకటో, రెండో కేసులు వస్తుండేవి. కానీ కోవిడ్ నేపథ్యంలో రోజూ కనీసం నాలుగైదు కేసులు వస్తున్నాయి. దీంతో జూన్ 11 నాటికి విశాఖపట్నంలో 172 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 16 మంది మరణించారు.
"ఈ వ్యాధి వచ్చిన ఆరుగురికి కన్ను తీసేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లాక్ ఫంగస్ బారిన ఎక్కువగా పడుతున్నది వారే"అని బ్లాక్ ఫంగస్ జిల్లా కమిటీ హెడ్ డాక్టర్ పీవీ సుధాకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
జూన్ రెండో వారం పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో ఇవి 2,100 కేసులు, మూడో వారం నాటికి సుమారు 2,700 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది.
బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులతో కమిటీని కలెక్టర్ నియమించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అత్యధికంగా గుంటూరు 397, చిత్తూరులో 215, కృష్ణాలో 203, అనంతపురంలో 180, విశాఖపట్నంలో 172, కర్నూలులో 160, ప్రకాశంలో 83 కేసుల వరకూ ఉన్నాయి.
ఈ జిల్లాల్లో తక్కువ కేసులు
బ్లాక్ ఫంగస్ మరణాలు కూడా ఈ ఏడు జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి.
అత్యధిక శాతం మరణాలు ప్రకాశం (15), విశాఖ (16), గుంటూరు (14), కర్నూలు (14), చిత్తూరు (13), అనంతపురం (11) లో నమోదయ్యాయి.
బ్లాక్ ఫంగస్ కేసులు తక్కువగా విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదైయ్యాయి. ఫంగస్ నుంచి బయటపడాలంటే యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు, పోసోకోనజల్ ఇంజక్షన్లు, మందులు అవసరం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందుల కొరత వేధిస్తోంది.

ఫొటో సోర్స్, Tauseef Mustafa/AFP/Getty Images
వెయిటింగ్ లిస్టులో మందులు
దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ మందుల కొరత వేధిస్తోంది. ఫంగస్ చికిత్స కోసం యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు, పోసోకోనజల్ ఇంజక్షన్లు అవసరం. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి యాంఫోటెరిసిన్-బి 50 ఎంబీ ఇంజక్షన్లు రోజూ ఆరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 14 రోజుల పాటు అందించాలి. దీంతో పాటు పోసకొనజల్ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఈ మందులు బయట మార్కెట్ లో దొరకడం లేదు.
"రానున్న పది రోజుల్లో 16 వేల యాంఫోటెరిసన్-బి ఇంజక్షన్లు అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న 19 వందల మంది రోగులకు ఒక్క రోజుకు 11 వేలపైనే డోస్లు అవసరం. కానీ ఆ స్థాయిలో ఇంజక్షన్లు అందుబాటులో లేవు. దీంతో బ్లాక్ పంగస్ బారినపడిన బాధితులకు రోజుకు ఆరు ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను ఒక్కటి లేదా రెండింటితో సరిపెడుతున్నారు. కొన్ని చోట్ల అవి కూడా ఇవ్వడం లేదు. దీంతో ఫంగస్ బాధితులు అందోళన చెందుతున్నారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈఎన్‌టీ ప్రభుత్వ వైద్యుడు ఒకరు బీబీసీతో చెప్పారు.
"యాంఫొటెరిసిన్- బి ఇంజక్షన్లను దేశంలో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్, సన్ ఫార్మా, సిప్లా, మైలాన్ లాంటి సంస్థలు తయారు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మందుల ఉత్పత్తి పెంచాల్సిన అసవరం ఉంది. అలాగే గుర్తింపు పొందిన ఫార్మా కంపెనీలకు ఈ మందును తయారు చేసేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలి. అప్పుడే బ్లాక్ ఫంగస్ కు మందులు కొరత తీరడంతో పాటూ ధర కూడా నియంత్రణలోకి వస్తుంది." అని విశాఖ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్కెట్ లో ఇంజెక్షన్ల కొరత
యాంఫోటెరిసన్-బి ఒక్కటే బ్లాక్ ఫంగస్‌కు మందు. అయితే ప్రస్తుతం ఈ మందులు మార్కెట్‌లో లభించడం లేదు. కేంద్రం, రాష్ట్రాలకు పంపిస్తున్న కోటా ప్రకారమే వీటిని కొనుగోలు చేయాలి. దీని ఖరీదు రూ.4000 వరకు ఉంటుంది. ఈ ఇంజెక్షన్లు రోజుకు ఆరు డోసుల చొప్పున ఎనిమిది వారాలపాటు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (APMSIDC) బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు, మాత్రల సరఫరాను పర్యవేక్షిస్తుంది. యాంఫోటెరిసన్-బి పొందడం కోసం ఏపీఎంఎస్‌ఐడీసీ ఆర్డర్ 123ని విడుదల చేసింది.
దీని ప్రకారం ఈ ఇంజక్షన్ పొందాలంటే ప్రొసీజర్ పెద్దది. అలాగే సమయం కూడా ఎక్కువ తీసుకుంటుందని బాధితులు చెబుతున్నారు.
ముందుగా బ్లాక్ ఫంగస్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి విభాగాధిపతులు సంతకాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆ లేఖను డీఎంహెచ్ఓ, జిల్లా వైద్య సేవల కోఆర్డినేటర్ల సంతకాలు తీసుకోవాలి. అవన్నీ పూర్తైన తర్వాత జాయింట్ కలెక్టర్‌తో దీనిని అప్రూవ్ చేయించుకోవాలి. అయితే వీరంతా ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు.
"మా అన్నయ్యకు ఇంజక్షన్ అవసరం వచ్చినప్పుడు, ఈ అధికారుల ఉండే ఆఫీసులకు వెళ్తే.. వాళ్లు వేరే పని మీద బయటకు వెళ్లారనే సమాధానం వచ్చేది. ఇలా మందులు పొందడం చాలా అలస్యం అవుతోంది. ఇటువంటి వాటికి మొబైల్ యాప్ ద్వారా 'అప్రూవల్' ఇవ్వాల్సిన అసవరం ఉంది. కానీ, ఒక వైపు పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే మందుల కోసం రోజుల తరబడి ఎదురు చూడటం దారుణం" అని కర్నూలుకు చెందిన షేక్ అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్లాక్ ఫంగస్‌కూ ఆయుర్వేదం
బ్లాక్ ఫంగస్‌కు ఆయుర్వేదంలో మందులున్నాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. కేంద్ర ఆయుష్ శాఖ కూడా కొన్ని ఆయుర్వేద మందులను బ్లాక్ ఫంగస్ నిరోధక ఔషధాలుగా ప్రకటించింది.
"శంషమన వటి, నిషామలకి వటి, సుదర్శన ఘనవటి, ఆయుష్ - 64 మాత్రలు బ్లాక్ ఫంగస్ రాకుండా నిరోధిస్తాయని కేంద్ర ఆయుష్ శాఖ చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి ప్రత్యామ్నాయం. బ్లాక్ ఫంగస్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడే వస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఆయుర్వేద మందుల్లో ఉన్నాయి. అయితే ఆయుర్వేద వైద్యులను సంప్రదించిన తర్వాతే వీటిని తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి" అని తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల ద్రవ్యాగుణ విభాగాధిపతి డాక్టర్ రేణు దీక్షిత్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మరణాల శాతం 6.5
బ్లాక్ ఫంగస్‌ను ప్రాధమిక దశలో గుర్తించి చికిత్స పొందితే మంచిది. ఆ ఫంగస్ మెదడుకు చేరితే ప్రాణాంతకంగా మారుతుంది. అయితే, యాంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లు పొందడానికే రెండు, మూడు రోజులు కష్టపడాల్సి వస్తుంది. ఇంజక్షన్ల కోసం ఇంత సమయం ఎదురుచూడటం రోగి ప్రాణాల మీదకు తెస్తోంది.
"బ్లాక్ ఫంగస్ నిర్ణరణకు కూడా 48 గంటల సమయం పడుతుంది. ఈఎన్‌టి వైద్యుల బృందంతో పాటు మత్తుమందు ఇచ్చే వైద్యులు, ఇతర సిబ్బంది కూడా అవసరం. బ్లాక్ ఫంగస్ బాధితుల్లో కొందరికి అప్పటికప్పుడే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ ఇవ్వాలి ఉంటుంది. అయితే, ఈ ఇంజక్షన్ల కొరత చాలా తీవ్రంగా ఉంది" అని బ్లాక్ ఫంగస్‌కు ట్రీట్మెంట్ ఇస్తున్న ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ ఆర్. వెంకటేష్ బీబీసీకి చెప్పారు.
"రోగికి ఈ మందు అవసరం అని నిర్థారణకు వచ్చిన తర్వాత కూడా, ఒక్కోసారి ఒకటి, రెండు రోజులపాటు ఆసుపత్రులకు ఇంజెక్షన్లు రావడంలేదు. దీంతో పోసోకొనజోల్ ఇంజెక్షన్లు, మాత్రలను బాధితులకు ఇస్తున్నాం. రోగికి మందులు ఆలస్యం అవడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి"అని ఆయన అన్నారు.
"జూన్ 11 తేదీ నాటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1955, దేశంలో 31,216 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అలాగే దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్‌తో 2,109 (6.7 శాతం), రాష్ట్రంలో 138 (6.5 శాతం) మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ శాతం మరణాలు యాంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు తక్కువగా లభించడం వల్లే అని చెప్పక తప్పదు" అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?
- విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









