లాక్‌డౌన్ విధించడం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచించాలి - సుప్రీంకోర్ట్

ఆక్సిజన్ మాస్కుతో వ్యక్తి

ఫొటో సోర్స్, NURPHOTO

దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి దృష్ట్యా, లాక్‌డౌన్ విధించడం గురించి సీరియస్‌గా ఆలోచించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

జనం అధిక సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్న కార్యకలాపాలపై నిషేధం విధించాలని, వైరస్ వ్యాపించకుండా అడ్డుకోడానికి ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్ కూడా విధించవచ్చని సూచించింది.

అయితే, లాక్‌డౌన్ వల్ల అట్టడుగు వర్గాలపై సామాజిక, ఆర్థిక ప్రభావం పడవచ్చని కూడా కోర్టు చెప్పింది. వారి అవసరాలు దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌కు ముందే ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది.

గుర్తింపు కార్డు లేదనే కారణం చూపుతూ రోగిని ఆస్పత్రిలో భర్తీ చేసుకోవడం, లేదా అవసరమైన మందులు ఇవ్వడం కుదరదని ఏ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ చెప్పకూడదని సూచించంది.

రోగులను ఆస్పత్రిలో చేర్చించడం గురించి రెండు వారాల్లో ఒక జాతీయ విధానం రూపొందించాలని సుప్రీం ముగ్గురు జడ్జిల ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

ఆ విధానాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని, అప్పటివరకూ గుర్తింపు కార్డులు, స్థానికుడనే ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశించింది.

జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ బెంచ్‌లో జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావ్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ కూడా ఉన్నారు.

ఆక్సిజన్ కొరతపై కర్టు

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI

ఆక్సిజన్ కొరతపై...

రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడానికి వివిధ రాష్ట్రాలు రకరకాల నిబంధనలు అమలు చేస్తున్నాయని, దానివల్ల దేశమంతా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, అనిశ్చితి పెరుగుతోందని కోర్టు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ విధానం రూపొందించడం ఆలస్యం చేయకూడదని ఆదేశించింది.

అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత తలెత్తకుండా, దాని సరఫరా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదివారం అర్థరాత్రి ఇచ్చిన ఆదేశాలలో చెప్పింది.

అవసరమైతే వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి వీలుగా, రకరకాల ప్రాంతాల్లో ఆక్సిజన్ నిల్వలు ఉంచాలని కూడా కోర్టు కేంద్రానికి సూచించింది.

అత్యవసర వినియోగం కోసం నాలుగు రోజుల్లోనే ఎమర్జెన్సీ స్టాక్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుత కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంతోపాటూ, ఆ స్టాక్‌ను రోజూ భర్తీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

రెండు రోజుల్లో దిల్లీకి ఆక్సిజన్ సరఫరా అందేలా చూడాలని కోర్టు కేంద్రానికి చెప్పింది.

ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టే ప్రయత్నాల్లో "సామాన్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేయలేం" అని కోర్టు వ్యాఖ్యానించింది.

"ఇది జాతీయ విపత్తు సమయం. ఇలాంటప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడడం అత్యంత కీలకం. ఆ బాధ్యత కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలపై ఉంది. పరిస్థితిని మెరుగుపరిచే దిశగా రెండూ కలిసి పనిచేయాలి" అని సూచించింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI

సోషల్ మీడియాలో సాయం అడిగేవారిని ఇబ్బంది పెట్టద్దు

సోషల్ మీడియాలో సమాచారం పోస్ట్ చేసేవారిని లేదా సాయం పొందుతున్నవారిని ఇబ్బంది పెట్టడం, వారిపై చర్యలు తీసుకోవడం చేయద్దని సీఎస్‌లను ఆదేశించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు న్యాయస్థానం చెప్పింది.

ఈ కేసులో మే 10న తదుపరి విచారణ జరగనుంది. ఆ లోపు దేశంలో ఆక్సిజన్ లభ్యత, కరోనా వ్యాక్సీన్ లభ్యత గురించి, అత్యవసర ఔషధాలు తగిన ధరలకు అందేలా కేంద్రం అన్ని నిబంధనలు, ప్రయత్నాలను సమీక్షించాలని సూచించింది.

దేశంలో ఆక్సిజన్, అత్యవసర ఔషధాల కొరత, వ్యాక్సీన్ విధానం లాంటి అంశాలను సూమోటోగా స్వీకరించిన కోర్టు దీనిపై విచారణ జరిపింది.

మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రమాదకరమైన పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో వాటన్నిటి సమాచారం ఇవ్వాలని కోర్టు ఏప్రిల్ 22న నోటీసు జారీ చేసింది.

వరుసగా పెరుగుతున్న కేసులను అడ్డుకోడానికి తీసుకుంటున్న చర్యలతోపాటూ, సమీప భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతున్నాయో చెప్పాలని న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

మందుల బ్లాక్ మార్కెటింగ్

ఫొటో సోర్స్, EPA/JAGADEESH NV

మందుల బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకోవాలి

రెమెడెసివీర్ లాంటి అత్యవసర ఔషధాలు నల్లబజారుకు తరలడంపై మాట్లాడిన కోర్టు "ప్రజల కష్టాలను దోచుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం" అని చెప్పింది.

నల్లబజారులో ఔషధాలు, పరికరాలు అమ్మేవారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయాలని, కోవిడ్-19 ఔషధాలు ఎక్కువ ధరలకు అమ్మకుండా, నకిలీ మందులు, పరికరాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వాలు అంబులెన్స్ సేవల గురించి కూడా ఒక ప్రొటోకాల్ ఏర్పాటు చేయవచ్చని కోర్ట్ సూచించింది. అప్పుడే, వారు అవసరమైనవారి నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా ఉంటారని చెప్పింది. వాటి గురించి రిపోర్ట్ చేయడానికి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది.

వ్యాక్సినేషన్ వేగంగా జరిగేందుకు సైన్యం, పారామిలిటరీ బలగాల కోసం పనిచేసే వైద్య సిబ్బందిని కూడా కేంద్రం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)