ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: ఆర్థర్ రోడ్ జైలు అత్యంత ప్రమాదకరమని ఎందుకంటారు?

ఆర్థర్ రోడ్ జైలు
    • రచయిత, మయాంక్ భాగవత్
    • హోదా, బీబీసీ మరాఠీ

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి చర్చలకు కేంద్రంగా నిలుస్తున్నారు. ఆయనను మూడు వారాలకుపైగా ఉంచిన ఆర్థర్ రోడ్ జైలుపై చర్చ జరుగుతోంది.

డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను అక్టోబరు మొదటివారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు అనంతరం ఆయన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఇదే జైలులో కరడుగట్టిన నేరస్థులు, షార్ప్‌షూటర్లు, గూండాలు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు.

ప్రముఖ సినీనటులు, అండర్‌వరల్డ్ డాన్‌లు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఐపీఎస్ అధికారులు ఈ జైలులో గడిపారు. హైప్రొఫైల్ ఖైదీలను ఇక్కడ ఉంచడంతో తరచూ ఈ జైలు వార్తల్లో నిలుస్తుంటుంది.

భారత్‌లో అత్యంత భద్రమైన జైళ్లలో ఇదీ ఒకటి. 26/11 దాడుల్లో దోషిగా తేలిన అజ్మల్ అమీర్ కసబ్‌ను కూడా ఇక్కడే ఉంచారు.

ఇంతకీ ఈ జైలు ప్రత్యేకత ఏమిటి? దీన్ని అత్యంత భద్రమైన, ప్రమాదకరమైన జైలుగా ఎందుకు పిలుస్తారు?

ఆర్థర్ రోడ్ జైలు

ఫొటో సోర్స్, Reuters

ఈ జైలును ఎప్పుడు కట్టారు?

1925-26 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో ఈ జైలును కట్టారు. 1842 నుంచి 1846 మధ్య బాంబే గవర్నర్‌గా పనిచేసిన సర్ జార్జ్ ఆర్థర్ పేరును ఈ జైలుకు పెట్టారు.

మొదట దీన్ని రెండు ఎకరాల్లో నిర్మించారు. అయితే, ఖైదీల సంఖ్య క్రమంగా పెరగడంతో దీన్ని విస్తరిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇది ఆరు ఎకరాల స్థలంలో ఉంది. ముంబయిలో ఇదే అతిపెద్ద జైలు.

1994లో ఇది కేంద్ర కారాగారంగా మారింది. అనంతరం ‘‘ముంబయి ఇంటర్మీడియట్ ప్రిసన్’’గా దీని పేరు మార్చారు. అయితే, ఇప్పటికీ పోలీసులు, కోర్టులు, సాధారణ ప్రజలు దీన్ని ఆర్థర్ రోడ్ జైలుగానే పిలుస్తుంటారు.

‘‘అధికారికంగా దీని పేరు ముంబయి సెంట్రల్ జైలు. అయితే, ఆర్థర్ రోడ్‌లో ఉండటంతో దీన్ని అందరూ అర్థర్ రోడ్ జైలు అని పిలుస్తుంటారు’’అని ఏబీపీ న్యూస్ క్రైమ్ రిపోర్టర్ జితేంద్ర దీక్షిత్ చెప్పారు.

మహాలక్ష్మీ, చించ్‌పోకలీ ప్రాంతాలకు పశ్చిమంగా పది నిమిషాల దూరంలో ఈ జైలు ఉంది.

దావూద్ ఇబ్రహీం

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత ప్రమాదకరమైనది..

విచారణ కొనసాగుతున్న కేసుకు సంబంధించిన ఖైదీలను కూడా ఈ జైలుకు తరలిస్తుంటారు. ‘‘దేశంలో అత్యంత ప్రమాదకరమైన జైళ్లలో ఇదీ ఒకటి’’అని జితేంద్ర చెప్పారు.

అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని, అండర్‌వరల్డ్ నేతలతో సంబంధం ఉండేవారిని ఇక్కడ ఉంచుతారని, అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన జైలని ఆయన వివరించారు.

అండర్‌వరల్డ్ నేతలు దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, ఛోటా రాజన్‌ల షార్ప్‌షూటర్లు; 1993 ముంబయి దాడులతో సంబంధం ఉన్నవారు ఇప్పటికీ ఈ జైలులో ఉన్నారు.

కసబ్

అండా సెల్

అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడేవారిని, ఉగ్రవాదంతో సంబంధం ఉన్నవారిని ఉంచేందుకు ఇక్కడ అత్యంత భద్రమైన గది ఒకటి ఉంది. ఇక్కడ ఆ నేరస్థులను విడిగా ఉంచుతారు.

ఈ గది గుడ్డు ఆకారంలో ఉంటుందని, అందుకే దీన్ని అండా సెల్ అని పిలుస్తారని జైలులో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.

కరడుగట్టిన గూండాలు, షార్ప్‌షూటర్లు, ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొన్నవారిని ఈ గదిలో ఉంచుతారు. 1993 బాంబు దాడుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారిని ఈ గదిలోనే ఉంచారు.

కొన్నేళ్లుగా ఇక్కడి జైలులోని బరాక్స్‌ను పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ జైలులో 14 సాధారణ బరాక్స్, ఒక హైసెక్యూరిటీ సెల్ మరో ఆరు విడిగా ఉండే బరాక్స్ ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు.

భారత్‌కు రప్పించిన గ్యాంగస్టర్ అబూ సలీం, దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌లను ఇక్కడి హైసెక్యూరిటీ అండా సెల్‌లో ఉంచారు.

అరుణ్ గావ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరుణ్ గావ్లీ

జైలు వివాదాలు..

ఈ జైలులో ఆర్థర్ రోడ్ జైల్ దావూద్ గ్యాంగ్, రాజన్ గ్యాంగ్, గౌలి గ్యాంగ్ పేరుతో కొన్ని ముఠాలు ఉన్నాయి. జైలులో ఆధిపత్యం కోసం అవి ఒకదానితో మరొకటి వివాదాలకు దిగుతుంటాయి.

ఇక్కడ గ్యాంగ్ వార్‌లు కూడా జరిగాయి. 2006లో అలంటి కొట్లాట జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

‘‘ఆ దాడిలో అబూ సలీం గాయపడ్డాడు. ప్లేట్లు, స్పూన్లను ఆయుధాలుగా ఉపయోగించి ఇక్కడ గ్యాంగ్‌లు ఒకటిపై మరొకటి దాడులు చేసుకున్నాయి’’అని జితేంద్ర తెలిపారు.

ఇలాంటి గ్యాంగ్ వార్లలో కొంతమంది ఖైదీలు కూడా మరణించారు. ఈ జైలులో ఖైదీలకు మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ అందుతున్నాయని తరచూ వార్తలు వస్తుంటాయి.

2006లో అప్పటి జైలు సూపరింటెండెంట్ స్వాతి సాఠె ఒక యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

‘‘డబ్బు ఉంటే జెంటిల్‌మ్యాన్, లేదంటే మెంటల్‌మ్యాన్’’

‘‘డబ్బు ఉంటే జెంటిల్‌మ్యాన్, లేదంటే మెంటల్‌మ్యాన్.’’ ఇది ఆర్థర్ రోడ్ జైలు గురించి ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న మాట.

‘‘అంటే, ఈ జైలు డబ్బులు ఉన్నవారికి.. అసలు జైలులానే అనిపించదు. అదే డబ్బులు లేకపోతే, ఇదొక నరకంలా అనిపిస్తుంది’’అని జితేంద్ర చెప్పారు.

అయితే, ఈ జైలుకు మొదట్నుంచీ హైసెక్యూరిటీ కల్పిస్తూనే ఉన్నామని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా చూస్తున్నమని జైలు అధికారులు చెబుతున్నారు.

‘‘హైరిస్క్, హైప్రొఫైల్ ఖైదీలను మేం విడిగా ఉంచుతాం. వీరిని జనరల్ బరాక్స్‌లోకి వెళ్లేందుకు అసలు అనుమతించం’’అని ఓ జైలు అధికారి తెలిపారు.

‘‘జైళ్లలో గ్యాంగ్‌ వార్‌లు తరచూ జరుగుతుంటాయి. అందుకే మేం భిన్న గ్యాంగ్‌లను భిన్న జైళ్లకు పంపిస్తుంటాం. ఫలితంగా వారు ఒకరికి మరొకరు ఎదరుపడే అవకాశం ఉండదు’’అని మహారాష్ట్ర మాజీ డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ ఇదివరకు వెల్లడించారు.

ఆర్థర్ రోడ్ జైలు

కిక్కిరిసిపోతుండటంతో..

జైలులో గరిష్ఠంగా 800 మంది వరకు ఖైదీలను ఉంచొచ్చు. అయితే, ప్రస్తుతం ఇక్కడ 3,000 మంది వరకు ఖైదీలు ఉన్నట్లు ఓ జైలు అధికారి తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఇక్కడి జైలులో ఖైదీల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా నవీ ముంబయిలోని తలోజాలో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త జైలును నిర్మించింది. ఫలితంగా ఆర్థర్ రోడ్ జైలుపై కొంత ఒత్తిడి తగ్గింది. అయినప్పటి ఇక్కడ బరాక్స్‌లో ఎప్పుడూ పరిమితికి మించే ఖైదీలు ఉంటున్నారు.

‘‘ముంబయి, ఠానె జైళ్లలో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఇలా లేదు. అందుకే మిగతా పెద్ద నగరాల్లోని జైళ్లకు అక్కడి ఖైదీలను పంపించేయాలి’’అని ప్రవీణ్ తెలిపారు.

జైలు కిక్కిరిసిపోవడంతో వీటి సంరక్షణ కష్టం అవుతోందని వార్తలు కూడా వస్తున్నాయి.

ముంబయి దాడులు

ఫొటో సోర్స్, AFP

1993 ముంబయి దాడులు...

1993 ముంబయి దాడుల కేసు విచారణ 12ఏళ్లకుపైనే కొనసాగింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను ఆర్థర్ రోడ్ జైలులోనే ఉంచారు.

ఈ కేసు విచారణ కోసం జైలులోనే ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) కోర్టును కూడా ఏర్పాటుచేశారు.

ఈ కేసులో దాదాపు 100 మందిని దోషులుగా నిర్ధారిస్తూ జస్టిస్ పీడీ కోడె తీర్పు నిచ్చారు. వీరందరినీ ఆర్థర్ రోడ్ జైలులోనే ఉంచారు.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు షైనీ అహుజాను కూడా ఇదే జైలులో ఉంచారు.

కసబ్

ఫొటో సోర్స్, SABASSTIAN D'SOUZA

కసబ్‌కు ప్రత్యేక కోర్టు

2008లో ముంబయిలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ కేసులో అజ్మల్ అమీర్ కసబ్‌ను అరెస్టు చేశారు.

అతడ్ని ఆర్థర్ రోడ్ జైలులో హైసెక్యూరిటీ నడుమ ఉంచారు. అతడి కోసం కోర్టును కూడా ఆ బరాక్‌లోనే ఏర్పాటుచేశారు.

సెల్ నుంచి కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు అతడు తప్పించుకునే లేదా హత్యకు గురయ్యే ముప్పు ఉండేది. అందుకే అతడి కోసం ఓ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేశారు. దీని గుండా అతణ్ని సెల్ నుంచి నేరుగా కోర్ట్‌కు తరలించేవారు.

కసబ్‌కు మరణశిక్ష విధించిన తర్వాత, అతణ్ని ఇక్కడి నుంచి పుణెలోని ఎరవాడ జైలుకు తీసుకెళ్లారు.

అర్థర్ రోడ్ జైలు

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE

రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు

మహారాష్ట్రలోని బాల్ ఠాక్రే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఛగన్ భుజ్‌బల్ అక్రమ నగదు చెలామణీ కేసులో అరెస్టైనప్పుడు ఇక్కడికే తీసుకువచ్చారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ప్రభుత్వ, పోలీసు అధికారులను కూడా ఈ జైలులో ఉంచారు.

ఈ జైలు ప్రజల నివాస ప్రాంగణాల మధ్యలో ఉంటుంది. అందుకే ఇక్కడ భద్రతకు అధికారులు పెద్దపీట వేస్తుంటారు.

అందుకే చుట్టుపక్కల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఆంక్షలను అమలు చేస్తుంటుంది. ముఖ్యంగా జైలుకు చుట్టుపక్కల ఎత్తైన భవనాలను నిర్మించకుండా చూడటం లాంటి చర్యలను తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)