మూక దాడులు: గాల్లో కలిసిన 80 ప్రాణాలు, నీరుగారుతున్న క్రిమినల్ కేసులు

మూక దాడి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంకా దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మూక దాడి... గత కొంతకాలంగా భారత్‌లో విస్తృతంగా వినిపిస్తున్న మాట ఇది. దేశ వ్యాప్తంగా వదంతుల కారణంగా మూక దాడికి గురై కొందరు ప్రాణాలు కోల్పోతే, గోవధకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు, ఇతరత్రా కారణాల వల్ల ఇంకొందరు మూకదాడికి గురయ్యారు.

మొత్తంగా 2015 సెప్టెంబర్‌లో మొహమ్మద్ అఖ్లాక్‌పై జరిగిన మూక దాడితో మొదలుపెడితే ఇప్పటిదాకా దేశంలో 80మందికి పైగా మూక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మూక దాడుల గురించి ఎలాంటి ప్రభుత్వ అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ, మీడియా కథనాల ప్రకారం విచరాణలో 30కి పైగా కేసుల్లో ఈ మూక దాడుల్లో 'గో సంరక్షకుల' పాత్ర బయటపడింది.

ఇలా మూక దాడులు జరిగేప్పుడు తీసిన ఎన్నో వీడియోలు దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. దాడులకు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోల రూపంలో సాక్ష్యాలు కనిపిస్తున్నా, వాటి విచారణ మాత్రం మందకోడిగా సాగింది.

ఈ కేసుల విషయంలో క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించేందుకు, అఖ్లాక్, పెహ్లూ ఖాన్, జునైద్, రక్బర్... మూక దాడిలో చనిపోయిన ఈ నలుగురి కేసు విచారణలో పురోగతిని బీబీసీ పరిశీలించింది. ఈ కేసుల ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్ షీట్లు, అప్పీల్ పత్రాలు, లాయర్లు, సాక్షులు, బాధితుల మాటల్ని గమనిస్తే, అవన్నీ కూడా విచారణ సంస్థల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి.

ఈ నాలుగు కేసులు విచారణలోనూ కొన్ని అంశాలు కామన్‌గా ఉన్నాయి. వీటిలో నిందితులందర్నీ బెయిల్‌పై విడుదల చేశారు. నిందితుల్ని గుర్తించగల ప్రత్యక్ష సాక్షులను పరిగణనలోకి తీసుకోలేదు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలకు అనుగుణంగా కేసు నమోదు చేయాలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు అధికారుల పాత్రపై చర్య తీసుకోలేదు. చార్జి షీట్లను బలహీనపర్చడం ద్వారా కేసులను బలహీనపరిచారు.

రక్బర్ భార్య అస్మీనా
ఫొటో క్యాప్షన్, రక్బర్ భార్య అస్మీనా

రక్బర్

2018 జూలైలో రక్బర్ అనే 20 ఏళ్ల కుర్రాడు రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఆవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడనే నెపంతో కొందరు గో సంరక్షకులు అతడిపై దాడి చేశారు.

రక్బర్ కుటుంబం హరియాణాలోని నూహ్ జిల్లాలో ఉణ్న కోల్గావ్ గ్రామంలో నివశిస్తోంది. నేను ఆ ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఇంటికి ముందు ఆవు, దూడ కట్టేసి కనిపించాయి.

'ఆవు మాకు అమ్మతో సమానం. పాలమ్ముకొని మేం జీవిస్తాం. నాకంటే ఎక్కువగా రక్బర్ ఆవుల్ని ప్రేమించేవాడు. కానీ, ఇప్పుడు దేశంలో ఆవుల ప్రాణాలకుండే విలువ మనిషి ప్రాణానికి లేదనిపిస్తోంది' అంటూ రక్బర్ భార్య అస్మీనా కన్నీళ్లు పెడుతూ చెప్పారు.

ఆవుల్ని ప్రేమించే తన భర్తను, ఆవుల్ని అక్రమ రవాణా చేస్తున్నాడనే నెపంపై చంపడాన్ని అస్మీనా ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.

రక్బర్‌ చనిపోయిన రోజు అతడి వెంట ఉన్న అస్లమ్ కూడా ఇంటి బయట కూర్చొని ఉన్నాడు. ఇప్పటికీ అతడి కళ్లలో భయం కనిపిస్తోంది. 'జూలై 20న రక్బర్, నేను లాడ్‌పుర్ బయల్దేరాం. లాడ్‌పుర్ రాజస్థాన్‌లోకి వస్తుంది. కానీ, మేం ఉన్న ప్రాంతం నుంచి అది దగ్గరే. సాయంత్రమయ్యేసరికి మేం అక్కడికి చేరుకున్నాం.

రక్బర్ 60వేల రూపాయలు పెట్టి రెండు పాలిచ్చే ఆవుల్ని కొన్నాడు. మేం వాటిని తీసుకెళ్లడానికి చాలా ట్రక్కుల్ని ఆపాం. కానీ, ఎవరూ రాలేదు. దాంతో నడిచే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కోల్‌గావ్ పెద్ద దూరమేం కాదు. నడిచి వెళ్లడం ద్వారా ఆదా అయ్యే డబ్బుతో పిల్లలకు ఏదైనా కొని తీసుకెళ్లొచ్చు అని రక్బర్ అన్నాడు' అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని అస్లమ్ వివరించాడు.

రక్బర్ తండ్రి సులేమాన్
ఫొటో క్యాప్షన్, రక్బర్ తండ్రి సులేమాన్

వాళ్లిద్దరూ తమ ఇంటికి 12 కి.మీ. దూరంలో ఉన్న లాల్‌వండీ గ్రామాన్ని అడవిగుండా దాటుతుండగా కొందరు దుండగలు వాళ్లను అడ్డగించారు. 'ఉన్నట్టుండి 6-7మంది మాపైన దాడి చేశారు. వాళ్లలో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపారు. దాంతో ఆవులు భయపడి పరుగుపెట్టాయి. రక్బర్ ఆవుల్ని నియంత్రించడానికి ప్రయత్నించాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వాళ్లు మమ్మల్ని పట్టుకున్నారు. నేను ఎలాగోలా తప్పించుకొని దగ్గర్లోని పత్తి పొలాల్లో దాక్కున్నా. కానీ, రక్బర్ దొరికిపోయాడు' అని అస్లమ్ వివరించాడు. ఆ తరువాత రక్బర్‌పైన దుంగలతో దాడి చేశారు.

రక్బర్ ముసలి తండ్రి సులేమాన్‌ ఇప్పటికీ అతడి విరిగిన చేతుల్ని గుర్తు చేసుకొని బాధపతారు. 'పోస్ట్‌మార్టం రిపోర్టులో అతడి ఒంటిపైన 13 గాయాలున్నట్లు తేలింది. వాళ్లు కొడుతున్నప్పుడు చేతులు అడ్డుపెట్టుకున్నాడేమో... రెండు చేతుల్లోని దాదాపు అన్ని ఏముకలూ విరిగిపోయాయి. వాడి వెన్ను, మెడ, భుజాలు, కాళ్ల ఎముకలు కూడా విరిగాయి. ఇదంతా వాడు పాలు అమ్ముకోవడానికి ఆవుల్ని కొన్నందుకా? లేక తన ఏడుగురు పిల్లల్ని పోషించుకోవడానికి ప్రయత్నించినందుకా?' అని సులేమాన్ ప్రశ్నిస్తారు. ఆ మాటలు అంటున్నప్పుడు ఆయన చెంపలు కన్నీళ్లతో తడిచిపోయాయి.

ఓ పక్క రక్బర్ చివరి క్షణాలను తలచుకుంటూ అతడి కుటుంబం కుమిలిపోతుంటే, ఇంకోపక్క కేసు విచారణ మందకోడిగా సాగుతోంది.

తమ కేసు విషయంలో నిందితుల్ని రక్షించడానికి కావాలనే చార్జ్ షీట్‌ను బలహీనంగా తయారు చేశారని రక్బర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 'సరైన సాక్ష్యం ఉన్నప్పటికీ, రక్బర్ హత్య కుట్రలో భాగం ఉన్నవారిని తుది చార్జ్‌ షీట్‌లో నిందితులుగా చేర్చలేదు' అని వారి తరఫు న్యాయవాది అసద్ హయత్ అంటున్నారు.

రక్బర్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, రక్బర్ కుటుంబం

ఎఫ్ఐఆర్ ఏం చెబుతోంది?

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రామగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మోహన్ సింగ్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్ ప్రకారం... సింగ్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు, డ్రైవర్ జూలై 20, 21న పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి 12.41కి నావల్ కిశోర్ శర్మ అనే వ్యక్తి నుంచి పోలీసులకు ఫోనొచ్చింది. ఆవుల్ని అక్రమంగా తరలించేవారు లాల్‌వండీ గ్రామంలో పట్టుబడినట్లు ఆయన చెప్పారు. దారి మధ్యలోనే శర్మను ఎక్కించుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన ఓ వ్యక్తితో మట్టిలో పడి ఉన్నాడు. అతడి పక్కన రెండు ఆవులతో పాటు ఇద్దరు స్థానికులు కూడా ఉన్నారు. గాయపడిన వ్యక్తి తన పేరు రక్బర్ అని చెప్పడంతో పాటు అక్కడే ఉన్న పరమ్ జీత్ ధర్మేంద్ర అనే వ్యక్తులు తనపై దాడి చేసినట్లు చెప్పారు. ఆవుల రక్షణ కోసం ఒక కానిస్టేబుల్‌ను అక్కడే వదిలి రక్బర్‌ను తమ జీపులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు, అక్కడికి చేరేసరికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పినట్లు సింగ్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

రక్బర్ ఇంటి ముందు ఆవులు
ఫొటో క్యాప్షన్, రక్బర్ ఇంటి ముందు ఆవులు

చార్జ్ షీట్‌లో ఏముంది?

ధర్మేంద్ర యాదవ్, పరమ్ జీత్, నరేష్ కుమార్‌లను నిందితులుగా పేర్కొంటూ డిసెంబర్ 7న ఆల్వార్ సెషన్స్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఆగస్టు 21న అదే ఎస్‌ఐ మోహన్ సింగ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆ నేరానికి సంబంధించి పూర్తిగా భిన్నమైన కోణంలో ఉంది. ఆ స్టేట్‌మెంట్‌ ప్రకారం... ఆ రోజు అక్కడికి వెళ్లేసరికి అక్కడున్న నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు రక్బర్ చెప్పాడు. వాళ్లు పరమ్‌జీత్, నరేంద్ర, ధర్మేంద్ర, విజయ్ శర్మ. మరో స్థానికుడు యోగేష్ అలియాస్ మాంటీ కూడా అక్కడే ఉన్నాడు.

రక్బర్‌ను లేపి దగ్గర్లోని వీధిలోకి తీసుకెళ్లి మట్టిని శుభ్రం చేశారు. అప్పుడు కొద్దిగా వర్షం పడుతోంది. తనతో వచ్చిన అస్లమ్ పత్తి పొలాల్లోకి పారిపోయాడని రక్బర్ చెప్పాడు. మేం అతడి కోసం పొలాల్లో వెతికాం. కానీ దొరకలేదు'.

ఆ తరువాత రక్బర్ చెప్పిన నలుగురు వ్యక్తులు గోవుల్ని తీసుకొని లాల్‌వండీ గ్రామానికి వెళ్లారని, పోలీసులు జీపులో వెళ్లిపోయారని, గోవుల్ని గోశాలలో వదలమని టెంపో డ్రైవర్‌తో చెప్పినట్లు చార్జిషీట్‌లో నమోదైంది. తరువాత పోలీసులు పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి ఆవుల్ని చూసేందుకు గోశాలకు వెళ్లారు. ఘటనా స్థలానికి వెళ్లిన రెండున్నర గంటల తరువాత రక్బర్‌ను నాలుగు కి.మీ. దూరంలో ఉన్న స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారని చార్జ్ షీట్‌లో నమోదు చేశారు.

ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

193 సెక్షన్ కింద పిటిషన్

బాధితుడి తరఫు న్యాయవాదులు సీఆర్‌పీసీ సెక్షన్ 193 కింద పిటిషన్ దాఖలు చేశారు. రక్బర్ పరిస్థితి తీవ్రత గురించి పోలీసులకు తెలుసని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయినా కూడా కేవలం 4కి.మీ. దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంత ఆలస్యం చేశారని, జీపులో చనిపోతున్న మనిషి ప్రాణం కంటే ఆవుల సంరక్షణకే పోలీసులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

మూకదాడులను ఎదుర్కోవడంలో జూలై 2018 నాటి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉటంకిస్తూ, ఆ ఘటనలో భాగమైన పోలీసులకు కూడా నేరంలో భాగం ఉన్నట్లు చార్జ్ దాఖలు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. విజయ్ శర్మ, నావల్ కిశోర్, యోగేశ్, అతడి తండ్రి దారాను రక్బర్ హత్యకు కుట్ర పన్నినట్లు కేసు నమోదు చేయాలని కూడా కోరారు.

'కాల్ రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల మాటలన్నీ కూడా వీళ్లంతా కలిసికట్టుగా రక్బర్ హత్యలో భాగమయ్యారని తెలుపుతున్నాయి. కానీ వీళ్లందరూ చార్జ్ షీట్ నుంచి తప్పించుకోవడంతో సెక్షన్ 193 మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది' అని రక్బర్ కుటుంబం తరఫు న్యాయవాది అసద్ తెలిపారు.

'విచారణ సంస్థలు బాధితుల కుటుంబాలను ఆటబొమ్మల్లా చూస్తున్నాయి. హై ప్రొఫైల్ కేసుల్లో తగినన్ని ఆధారాలున్నప్పటికీ నిందితులు తప్పించుకుంటున్నారు. అసహాయ బాధిత కుటుంబాలు పోరాడలేవనే ఆలోచనతో చార్జ్ షీట్లను నీరుగారుస్తున్నారు' అని అసద్ అన్నారు.

మూక దాడి

ఫొటో సోర్స్, Getty Images

మొహమ్మద్ అఖ్లాక్

నేను నవంబర్ చివరివారంలో మొహమ్మద్ సర్తాజ్‌ను కలిసినపుడు ఆయన మరోసారి నోయిడాలోని సూరజ్‌పూర్ సెషన్స్ కోర్టు హియరింగ్‌కు వెళ్లడానికి సిద్ధమౌతున్నారు. 2015, సెప్టెంబర్‌లో ఆయన తండ్రి మొహమ్మద్ అఖ్లాక్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బిసాడా గ్రామంలో మూకదాడిలో మరణించారు.

సర్తాజ్ భారతీయ వాయుసేనలో పని చేస్తున్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ఆయన మీడియాతో మాట్లాడకూడదు. అందువల్ల ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించారు. కానీ నేను తనతో పాటు కోర్టు వరకు వెళ్లడానికి అంగీకరించారు.

సీఆర్‌పీసీలోని సెక్షన్ 193 ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన ఆయన న్యాయవాది అసద్ హయత్, మూడేళ్ల న్యాయపోరాటంలో ఆరోజు చాలా కీలకమైనదన్నారు.

కోర్టుకు వెళ్లే దారిలో అసద్ కేసు పేపర్లు చూపిస్తూ, ''నిందితులు 18 మంది ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. దానికితోడు, అఖ్లాక్ హత్య కుట్రలో 'గ్రామంలో గోవధ జరిగింది' అని ఫిర్యాదు ఇచ్చిన సంజయ్ రాణా మీద ఇంతవరకు చర్య తీసుకోలేదు'' అని తెలిపారు.

సంజయ్ రాణాతో సహా మరో ఎనిమిది మంది బిసాడా గ్రామస్తుల పేర్లు చేర్చాలని అఖ్లాక్ భార్య పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా గోవధ జరిగిందని ప్రకటించిన పూజారి సుఖదాస్‌ను కూడా ఈ కేసులో విచారించలేదు లేదా సాక్షిగా జతపరచలేదు. బిసాడా గ్రామస్తులు ఆయనను బలవంతంగా గ్రామం నుంచి వెళ్లగొట్టారు. 'లభించిన సాక్ష్యాధారాలను బట్టి, సంఘటనా స్థలంలో ఎలాంటి గోవధా జరగలేదు' అని చార్జిషీటులో పేర్కొన్నారు.

మేం కోర్టుకు చేరగా, కేసు వాయిదా పడిందని చెప్పారు. కోర్టు ఆవరణలో నడుస్తున్నపుడు సర్తాజ్ ముఖంలో నీలినీడలు కనిపించాయి.

''కేవలం నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టు.. మూకదాడి కేసుల్లో కింది కోర్టులు రోజువారీ విచారణ చేపట్టాలని మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే వాటిని క్షేత్రస్థాయిలో ఎలా నీరుగారుస్తున్నారో మీరే చూడొచ్చు'' అని అసద్ అన్నారు.

మరోవైపు, మరో నిందితుడు హరిఓమ్ సిసోడియా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ నోయిడా నుంచి పోటీ చేయడానికి సిద్ధమౌతున్నారు. యూపీలో కొత్తగా ఏర్పాటైన నవనిర్మాణ్ సేన ఆయనను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

తండ్రితో షాకిర్
ఫొటో క్యాప్షన్, తండ్రితో షాకీర్

హఫీజ్ జునైద్

2017 జూన్‌లో ఒక రైలులో మూకహత్యకు గురైన మైనర్ బాలుడు హఫీజ్ జునైద్ కేసు విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నిందితులపై తీవ్రమైన ఆరోపణలు వీగిపోయేలా తమ వాంగ్మూలాలను వక్రీకరిస్తున్నారని బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

జునైద్ సోదరులు షాకీర్, హషీమ్‌లు కూడా నాటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. బల్లబ్‌ఘఢ్‌లోని తన ఇంటిలో షాకీర్ నాతో మాట్లాడుతూ, ''మాపై మతపరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులకు మళ్లీ మళ్లీ చెప్పాం. మేం ముస్లింలు అయినందువల్లే మా మీద దాడి జరిగింది. కానీ చార్జిషీటులో నేరపూరిత కుట్ర అన్న విషయాన్ని పేర్కొననే లేదు. కేవలం సీటు కోసం జరిగిన గొడవగా దాన్ని పేర్కొన్నారు.'' అని తెలిపారు.

నిందితులందరికీ బెయిల్ లభించడంతో ఆ కుటుంబం జునైద్ కేసులో మరోసారి తాజా విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, జునైద్ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించింది. జునైద్ తండ్రికి గుండెపోటు రాగా, తల్లికి ఒక కంటి చూపు పోయింది.

ఈ కేసులో బాధితులను మొదట కత్తితో పొడిచిన ప్రధాన నిందితుడు నరేష్ - ఐపీసీ సెక్షన్ 34 కింద కేసును నమోదు చేయకపోవడాన్ని ఉపయోగించుకుని బెయిల్ తెచ్చుకున్నారు.

ఆయన కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇక్కడ కూడా నవనిర్మాణ్ సేన ఆయన ఫరీదాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది.

కన్నీళ్లు తుడుచుకుంటూ జునైద్ తండ్రి ఇలా అన్నారు, ''ఇలా మూకహత్యలకు పాల్పడే వాళ్లను ఎన్నికలలో పోటీ చేయనిస్తారా? ఇలాంటి విషయాలు విన్నప్పుడు గుండె బద్దలవుతుంది. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గను. నా కుమారుణ్ని హత్య చేసిన వాడు ఎన్నికల్లో నిలబడితే, అతనికి పోటీగా నా కుమారుడు షాకీర్‌ను నిలబెడతాను. మన దేశ పౌరులలో ఇంకా ఏ మాత్రం మానవత్వం మిగిలి ఉందో చూద్దాం.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)