ప్రేమ దాసప్ప: అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్‌ ఎలా అయ్యారు?

ప్రేమ దాసప్ప

ఫొటో సోర్స్, IMRAN QURESHI

ఫొటో క్యాప్షన్, ప్రేమ దాసప్ప
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బెంగళూరు నుంచి, బీబీసీ కోసం

బాగా చదువుకుని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండుంటే ఇప్పుడు ఈమెకు ఒక ఇన్‌ఫ్లుయెన్సెర్‌గా గుర్తింపు వచ్చుండేది. అంటే ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఈమె కూడా ఒకరుగా నిలిచేవారు.

కానీ, ఈమెకు వేరే నైపుణ్యాలు ఉన్నాయి. వాటితో ఈమె వ్యసాయానికి, గిరిజన సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నారు.

ఈమె పేరు ప్రేమ దాసప్ప. 50 ఏళ్ల ఈమె 13 ఏళ్ల క్రితం వరకూ అడవుల్లో ఉండేవారు. కూలి పనులకు వెళ్లి చాలా కష్టపడేవారు.

ఇప్పుడు ఈమె ఆర్థిక స్వావలంబన ఎలా సాధించాలో మిగతా గిరిజన మహిళలకు నేర్పిస్తున్నారు. ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో మైసూర్ జిల్లా హెచ్‌డీ కోట నుంచి బీబీసీతో మాట్లాడిన దాసప్ప చెప్పారు.

ప్రేమ దాసప్ప

ఫొటో సోర్స్, IMRAN QURESHI

మొదటి ఏడాది తన ఎకరం భూమిలో ఆమె చియా గింజలు(సబ్జా గింజలు లాంటివి) నాటారు. ఆ విత్తనాలను ఆమె ఒక క్వింటాల్ రూ.18 వేలకు అమ్మారు. వాటిని అమ్మడం వల్ల ఆమెకు రూ.90 వేలు వచ్చాయి. ఆ సంపాదనతో ప్రేమ దాసప్ప తన కొడుకుకు మోటార్ సైకిల్ కూడా కొనిచ్చారు.

ప్రేమ దాసప్ప జేను కురుబ గిరిజన సముదాయానికి చెందినవారు. 2007-08లో నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్ అడవుల నుంచి బయటకు రావడానికి బదులుగా అటవీ శాఖ నుంచి మూడు ఎకరాల భూమిని పరిహారంగా పొందిన 60 గిరిజన కుటుంబాల్లో ఈమె కూడా ఒకరు.

వీరిలో 15 కుటుంబాలు ఇప్పటికీ అటవీ విభాగం కోసం కూలి పనులకు వెళ్తుంటే, మిగతా 45 కుటుంబాలు మాత్రం తమకు ఇచ్చిన భూమిని నివసించడానికి ఉపయోగించాయి. ప్రేమ దాసప్ప మాత్రమే కాస్త భిన్నంగా ఆలోచించారు.

తనకు ఇచ్చిన భూమిని మెరుగ్గా ఎలా సాగు చేయవచ్చో తెలుసుకోడానికి ప్రేమ దాసప్ప చాలా ప్రాంతాలకు వెళ్లారు. తన భర్తతో కలిసి ఆమె అక్కడ వ్యవసాయం మొదలుపెట్టారు. వరి, జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు వేశారు.

ప్రేమ దాసప్ప

ఫొటో సోర్స్, IMRAN QURESHI

గత దశాబ్దం చివర్లలో ఆమె జీవితంలో మార్పులు ప్రారంభమయ్యాయి.

"మేం మా భూమిని కేరళకు చెందిన ఒకాయనకు గుత్తకు ఇచ్చాం. ఆయన అల్లం పండించాలని అనుకున్నారు. మేం దానికి డబ్బులు తీసుకోకుండా, బదులుగా మా పొలంలో బావి తవ్వించాలని ఆయన్ను అడిగాం. మా గిరిజనులకు భూములు ఇచ్చిన ప్రాంతంలో నీటి పారుదలకు ఎలాంటి వనరులూ లేవు" అని ప్రేమ దాసప్ప చెప్పారు.

"అక్కడ అందరూ వర్షాలపైనే ఆధారపడ్డారు. చాలా మంది ఆ బంజరు భూమిలో వ్యవసాయం చేసుకోడానికి బదులు ఇంకెక్కడికైనా వెళ్లి కూలి పనులు చేసుకోవచ్చనుకున్నారు. అక్కడ వ్యవసాయానికి పెట్టిన డబ్బులు వృధా అవుతాయని అనుకున్నారు" అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆరు రోజులు సబ్‌ రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ

కానీ, ప్రేమ దాసప్ప విభిన్న దృక్పథం, నేర్చుకోవాలనే తపన ఆమెకు మరింత ప్రయోజనం అందించింది.

కర్ణాటక అటవీ శాఖతో కలిసి ప్రజలకు పునరావాసం కల్పించడానికి కృషి చేసే 'ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ'(డబ్ల్యుఎల్ఎస్) కూడా ఆమె సామర్థ్యాన్ని గుర్తించింది.

"మేం ఆమె వ్యసాయ భూమిలో ఒక పాలీ హౌస్ ఏర్పాటు చేశాం. అక్కడ ఆమె ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రకరకాల బీన్స్, టమాటాలు, రాగులు, అరటి పండిస్తున్నారు" అని డబ్ల్యుఎల్ఎస్‌లో పని చేస్తున్న గోవిందబ్బ బీబీసీకి చెప్పారు.

పాలీ హౌస్ అంటే గ్రీన్ హౌస్‌లాగే ఉంటుంది. కానీ, దానిని పాలిథీన్‌తో నిర్మిస్తారు. సూర్యరశ్మి ఆ పాలీ హౌస్ అంచుల్లోంచి లోపలికి వెళ్తుంది.

కర్ణాటక అటవీశాఖ

ఫొటో సోర్స్, IMRAN QURESHI

నేర్చుకోవాలనే తపన, అటవీ శాఖ-డబ్ల్యుఎల్ఎస్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆమెకు లాభాలు పండిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రేమ దాసప్ప అందరూ 'సూపర్ ఫుడ్‌'గా భావిస్తున్న చియా విత్తనాలను పండిస్తున్నారు. వాటిని మంచి ధరకు అమ్ముతున్నారు.

"నేను ఇప్పుడు మిగతా రైతులు కూడా చియా పంట సాగు చేసేలా, వారికి ఆ విత్తనాలు అమ్ముతున్నాను. అర కిలో విత్తనాల ధర రూ.250 వరకూ పలుకుతోంది" అని ప్రేమ దాసప్ప నవ్వుతూ చెప్పారు.

రైతులకు సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు తనను వేరే ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నారని సంతోషంగా అంటున్నారు.

ప్రేమ దాసప్ప ఇప్పుడు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సగటున రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదిస్తున్నారు.

ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు తన మనవరాలు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతోందని ఆమె గర్వంగా చెప్పారు.

రెండు రోజుల క్రితం అటవీ శాఖ ఆమెను ఒక వ్యవసాయ ఎగ్జిబిషన్‌ ప్రారంభించాలని కూడా కోరింది.

నిజానికి, ఆ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయి ప్రారంభించాలి. కానీ, ఆరోజున సీఎం దిల్లీలో ఉండడంతో అధికారులు ఆమెకు ఆ అవకాశం ఇచ్చారు.

వీడియో క్యాప్షన్, సేంద్రియ సాగుతో లాభాలు పండిస్తున్న మహిళా రైతు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)