విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ జిల్లా ఏనుగులపాలెంలో జరిగిన లైన్‌మెన్ హత్య కేసులో బాధితులు చేస్తున్న అందోళన రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. ఈ హత్య కేసులో నిందితుడిగా మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణ్ పేరును చేర్చాలంటూ మృతుని బంధువులు అందోళనలు చేస్తున్నారు
ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఏం జరిగింది?
ఆనందపురం మండలం గొట్టిపల్లిలో మొల్లి బంగార్రాజు విద్యుత్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్టోబర్ 31వ తేదీ (ఆదివారం) సాయంత్రం నుంచి బంగార్రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు భీమునిపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే నవంబర్ 3వ తేదీ (బుధవారం) ఏనుగులపాలెం పంటపొలాల్లో ఉన్న గెస్ట్ హౌస్ సమీపంలో బంగార్రాజు మృతదేహం దొరికింది.
ఆ గెస్ట్ హౌస్ బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణ్‌దేనని బాధితులు చెప్తున్నారు. అనుమానాస్పదమృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, UGC
"బంగార్రాజు మా చిన మామగారి కొడుకు. బంగ్రాజుకు, కోరాడ గోవింద్ అనే వ్యక్తి సన్నిహితులు. వీరిద్దరూ కలిసి భూములు కొనడం, అమ్మడం చేస్తుంటారు.
దీనికి సంబంధించి వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గోవింద్ ఫోన్ చేశాడు, వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. రాత్రైనా ఇంటికి రాలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్ఛ్ ఆఫ్ వచ్చింది. ఉదయానికి కూడా ఇంటికి రాకపోయేసరికి అతని భార్య నందిని, మిగతా కుటుంబసభ్యులం అంతా కలిసి వెదికాం. కానీ ఎక్కడ కనిపించలేదు" అని చెప్పారు.
దాంతో పోలీస్ కంప్లైట్ ఇచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, UGC
బుధవారం బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణ్ గెస్ట్ హౌస్ సమీపంలో ఒక మృతదేహం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లి చూసినట్లు తెలిపారు.
"అది బంగార్రాజ డెడ్ బాడీయే".
"కోరాడ గోవింద్, బంగార్రాజుల మధ్య ఆర్థిక పరమైన వివాదాలుండటంతో పాటూ డెడ్ బాడీ లక్ష్మణ్ గెస్ట్ హౌస్ దగ్గరే దొరకడంతో అతడి పేరుని కూడా నిందితుల్లో చేర్చి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం" అని గుడాల ఎల్లయ్య బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారు
మృతుడు మొల్లి బంగార్రాజు ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఆనందపురం సబ్ స్టేషన్ లో లైన్‌మ్యాన్‌గా పని చేస్తున్నారు.
బంగార్రాజు భార్య నందిని బీబీసీతో మాట్లాడారు.
రెండేళ్ల క్రితం ఈపీడీసీఎల్‌లో కొన్ని లైన్ మెన్, ఇతర ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, వాటిని మనకు కావాలసిన వారికి ఇప్పించుకోవచ్చని...అయితే దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుందని కోరాడ గోవింద్ బంగార్రాజుకు చెప్పినట్లు మృతుడి భార్య నందిని చెప్పారు.
దాంతో బంగార్రాజు తనకు తెలిసిన వారికి ఈ విషయం చెప్పి వారి వద్ద డబ్బులు తీసుకుని గోవింద్‌కు ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
"అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించలేదు. దీంతో నా భర్త, గోవింద్ మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగేది. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, కనీసం వారి డబ్బులైనా ఇచ్చేయాలని నా భర్త డిమాండ్ చేశారు. దాంతో డబ్బులిస్తామని పిలిపించి అత్యంత కిరాతకంగా చంపేశారు" అని నందిని ఆరోపిస్తున్నారు.
"రాజకీయంగా పలుకుబడి ఉందని...తమని ఏమీ చేయలేరన్న ధైర్యంతో కాళ్లు, చేతులు విరిచి హత్య చేసి పొలాల్లో పడేశారు. మాకు న్యాయం చేయండి. గోవింద్ తో పాటు లక్ష్మణ్ పేరుని కూడా నిందితుల లిస్టులో చేర్చి విచారణ జరిపితేనే అసలు విషయాలు బయటపడతాయి. గోవింద్‌తో పాటు లక్ష్మణ్ ను కూడా అరెస్ట్ చేయాలి. లేదంటే వారి పేర్లు రాసి నేను, నా పిల్లలు చనిపోతాం. నాకు డబ్బులేమీ వద్దు, నిందితుల అరెస్టు చేసి శిక్షవేయడమే కావాలి" అని నందిని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఒక్కరు కూడా పరామర్శించలేదు
బంగార్రాజు హత్య కేసులో న్యాయం చేయాలంటూ గత నాలుగు రోజులుగా అతడి కుటుంబ సభ్యులు అందోళనలు చేస్తున్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో అందోళన నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
"అనుమానితులకు రాజకీయంగా పలుకుబడి ఉంది. అందుకే ఇన్ని రోజులుగా అందోళనలు చేస్తున్నా జిల్లాలోని వైసీపీ నాయకుడు, మంత్రి కూడా స్పందించలేదు. కనీసం బాధితులను పరామర్శ కూడా చేయలేదు" అని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గురవయ్య యాదవ్ అన్నారు.
"మంత్రి అవంతి శ్రీనివాసరావు సొంత నియోజకవర్గంలో ఒక హత్య జరిగి...ఇంత రచ్చ జరుగుతుంటే మంత్రి కనీసం పట్టించుకోలేదు. మంత్రి బొత్స సైతం ఏ మాత్రం స్పందించలేదు. ఎంపీ విజయసాయి రెడ్డి బంగార్రాజు కటుంబసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. న్యాయం చేస్తామని చెబుతున్నారు. పోలీసులు సైతం ఈ కేసు విషయంలో ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు" అని యాదవ్ ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
పోస్టుమార్టం జరగనట్లే...
ఈ హత్య కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును టీడీపీ, జనసేన పార్టీలు తప్పుపట్టాయి. ఈ పార్టీలకు చెందిన యాదవ నాయకులు బాధితులకు మద్ధతుగా అందోళనలు చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి బంగార్రాజు మృతదేహానికి పోస్టు మార్టమ్ చేసేందుకు బాధిత కుటుంబీకులు ఒప్పుకున్నారు. విజయసాయి రెడ్డి ఫోన్ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతోనే వారు అంగీకరించారు.
అయితే పోస్టు మార్టంకు సంబంధించిన రిపోర్ట్ ఇంకా బాధితులకు ఇవ్వకపోవడంతో పోస్ట్ మార్టం అవ్వలేదనే భావిస్తున్నాం అని టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాసరావు అంటున్నారు .
"పోలీసులు నిందితులను కాపాడేందుకు ఈ కేసు విషయంలో వ్యవహారిస్తున్న తీరు అనుమానస్పదంగా ఉంది. అందుకే బంగార్రాజు కుటుంబ సభ్యులు, యాదవ సంఘం నాయకులు కూడా ఈ హత్య కేసు విషయంలో పోలీస్ కమిషనర్ తో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడమని చెబుతున్నారు" అని శ్రీనివాసరావు అన్నారు.
"పోలీసులు ఈ కేసులో సరైన విధంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా బంగార్రాజు హత్య కేసును పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ కేసులో అన్నీ కోణాలను విశ్లేషిస్తున్నాం. ఇప్పటీకే కోరాడ గోవింద్ ను అరెస్ట్ చేశాం. బాధితుల అనుమానాల ప్రకారం ఈ కేసుకు అవసరమైన సాక్ష్యాలను, టెక్నికల్ డేటాను సంపాదిస్తున్నాం. హత్యలో ప్రమేయం ఉన్నవారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం" అని విశాఖపట్నం 1 డీసీపీ గౌతమి సాలి చెప్పారు.

ఫొటో సోర్స్, Telugudesam party
డీజీపీకి చంద్రబాబు లేఖ
లైన్ మెన్ బంగార్రాజు హత్యపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు.
ఆ లేఖలో వివరాలిలా ఉన్నాయి.
"బంగార్రాజు దారుణ హత్యకు గురై నాలుగైదు రోజులైనా ఇంకా పోస్ట్ మార్టం నిర్వహించకపోవడం దారుణం. మృతదేహం మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే దొరికింది. బంగార్రాజు హత్యలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకుల ప్రమేయం ఉండడంతో పోలీసులు ఈ కేసులో వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
హంతకులపై కఠిన చర్యలు తీసుకోకపోతే విశాఖలో శాంతిభద్రతల సమస్య మరింత పెరుగుతుంది. మృతుడు బంగార్రాజు భార్య నందిని, అతడి ముగ్గురు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరుతున్నాను."

ఫొటో సోర్స్, UGC
వైసీపీ నాయకులు ఏమన్నారంటే..
హత్య కేసులో నిందితులను వదిలిపెట్టేది లేదని...వైకాపా నాయకులు చెబుతున్నారు. బాధితులు చేస్తున్న అందోళనకు సంఘీభావం తెలిపారు. వైకాపా నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బాధితులతో మాట్లాడారు.
"న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. పార్టీలతో సంబంధం లేకుండా బాధితులకు న్యాయం చేస్తాం" అని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
"అక్టోబర్ 31వ తేదీన భీమిలి పోలీస్ స్టేషన్లో బంగార్రాజు కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అయితే, నవంబర్ 3వ తేదీన పద్మనాభం మండలం పంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మణ్ గెస్ట్ హౌస్ సమీపంలో బంగార్రాజు మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఆ స్థలానికి చేరుకున్నాం. మృతదేహం తల, ఇతర శరీర భాగాలపై గాయాలు న్నాయి. అదే విధంగా లక్ష్మణ్ గెస్ట్ హౌస్ కూడా పరిశీలించాం. గెస్ట్ హౌస్ లో కూడా కొన్నిచోట్ల రక్తపు మరకలు కనిపించాయి. ప్రస్తుతానికి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత సరైన ఆధారాలతో ఎఫ్ఐఆర్ లో పేర్లు చేరుస్తాం" అని పద్మనాభం పీఎస్ సీఐ శ్రీనివాసరావు చెప్పారు.
మంత్రుల స్పందన ఇదీ..
ఈ అంశంపై బీబీసీ మంత్రి బొత్స సత్యన్నారాయణ కార్యాలయాన్ని సంప్రదించగా.. మంత్రి అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. ఈ అంశంపై మాట్లాడేందుకు వారు నిరాకరించారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ కార్యాలయం స్పందిస్తూ.. హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు, యాదవ సంఘం నాయకులతోనూ అవంతి శ్రీనివాస్ మాట్లాడారని వివరణ ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపైన కూడా విచారణ జరిగేలా చూడాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా, వారికి తగిన శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. పాపికొండలు టూరిజం బోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో మంత్రి రాజమండ్రిలో ఉన్నారని, విశాఖపట్నం చేరగానే బాధిత కుటుంబాన్ని కలసి, ప్రత్యక్షంగా పరామర్శిస్తారని వివరించారు.
మంత్రి మేనల్లుడికి క్లీన్‌చిట్ ఇచ్చిన పోలీసులు
కాగా, ఈ హత్యతో మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణ్‌కు సంబంధం లేదని విశాఖపట్నం డీసీపీ గౌతమి సాచి చెప్పారు.
ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. "విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో మృతుడు బంగార్రాజు, కోరాడ గోవిందుకు రూ. 30 లక్షలు ఇచ్చారు. అయితే రెండేళ్ళు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బంగార్రాజు గోవిందును అడిగారు. అప్పటికే రూ. 30 లక్షలు అప్పులు తీర్చుకునేందుకు, ఇంటి నిర్మాణానికి వాడుకున్న గోవిందు డబ్బుని తిరిగి చెల్లించలేకపోయారు. డబ్బులు చెల్లించాలని బంగార్రాజు ఒత్తిడి చేస్తుండడంతో...డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి... తన దుకాణానికి రమ్మని గోవిందు చెప్పారు. ఈ దుకాణం లక్ష్మణ్ గెస్ట్ హౌస్‌కు సమీపంలోనే ఉంది. సీసీటీవీలో కవర్ కాకుండా లక్ష్మణ్ గెస్ట్ హౌస్ ట్రాన్స్‌ఫార్మర్‌ని.. రిపేరు వచ్చిందని చెప్పి బంగార్రాజు చేత ఆపేయించారు. ఆ తర్వాత ఇనుప రాడ్ తో బంగార్రాజును కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా పారేయడానికి గోవిందు మరో ఇద్దరితో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంఘటన జరిగింది లక్ష్మణ్ గెస్ట్ హౌస్ సమీపంలోనే. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం ఈ హత్యకు లక్షణ్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది. అయినప్పటికీ మరింత లోతుగా పరిశీలించి లక్ష్మణ్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తాం’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణులు ఏం తినాలి, ఎంత బరువు ఉండాలి? అపోహలు, వాస్తవాలు
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల్లో సాయిధరమ్ తేజ్.. ఫొటో షేర్ చేసిన చిరు
- టబు: ‘వయసు ఆమెను వాడిపోనివ్వదు'
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








