సహారా ఎడారిలో నీలం రంగు మనుషులు

సహారా పురుషులు

ఫొటో సోర్స్, Juan Martinez

    • రచయిత, జువాన్ మార్టినెజ్
    • హోదా, బీబీసీ ట్రావెల్‌

సహారా ఎడారిలో కనిపించే ఆకర్షణీయమైన నీలిరంగు వస్త్రధారణ గత కాలపు జ్ఞాపకంగా మారుతుండగా మారిటానియా దేశంలో మాత్రం ఈ ఫ్యాషన్ ఇంకా సజీవంగా ఉంది.

సహారా దరా లేదా బోబో అనేది పొడవైన, వదులుగా ఉండే గౌనులాంటి వస్త్రం. సహారా ఎడారిలోని కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి అక్కడి పురుషులు తలకు ముఖానికి కలిపి కట్టుకునే ఈ వస్త్రాన్ని ధరిస్తారు. ఇది వందల ఏళ్ల నాటి ఆచారం.

ఈ వస్త్రధారణ మూలాలు ఉత్తర ఆఫ్రికాలో ఉన్నాయి. 7, 8వ శతాబ్దాల్లో ఉత్తర ఆఫ్రికా, సబ్ సహారాకు మధ్య వాణిజ్య కేంద్రంగా వెలుగొందిన ప్రాంతాల్లో ఈ వస్త్రధారణ ఆనవాళ్లు కనిపిస్తాయి.

కొంతమంది స్థానికులు ఈ దుస్తులను ప్రజల వినమ్రతకు, నిరాడంబరతకు ప్రతీక అని చెబుతుంటారు.

కానీ, సూర్యుడి వేడి నుంచి, ఈ ప్రాంతంలో తరచుగా వచ్చే ఇసుక తుపానుల నుంచి కాపాడుకోవడానికి ఇలాంటి వస్త్రధారణ మొదలైందనే అభిప్రాయంతో ఎక్కువమంది ఏకీభవిస్తుంటారు.

"దరా వస్త్రధారణ శైలి ఈ కఠిన వాతావరణ పరిస్థితులలో తగినంత గాలిని లోపలికి వెళ్లనిస్తూనే నట్టనడి ఎడారిలో శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోకుండా సహారా పురుషులను కాపాడుతుంది" అని స్థానిక మారిటానియన్ గైడ్ దహిద్ జెడిడో అన్నారు.

ప్రస్తుతం, ఈ ప్రాంతాల నుంచి చాలామంది ఇతర పెద్ద నగరాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. దాంతో వారి ద్వారా పాశ్చాత్య ఫ్యాషన్ ప్రభావం ఈ ప్రాంతంపై ఎక్కువగా పడుతోంది. దీంతో సహారన్ పురుషులు ఒకప్పుడు ఎండలో ఎడారిని దాటడానికి వేసుకున్న వస్త్రధారణ కాస్తా గత కాలపు జ్ఞాపకంగా మారుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా మారిటానియాలో చాలా మంది పురుషులు నీలిరంగు దరా, టగెల్‌మస్ట్‌లను ధరించడం చూస్తుంటే, ఇక్కడ ఈ వస్త్రధారణ మరింత కాలం సజీవంగా ఉంటుందని అనిపిస్తుంది.

నీలం రంగు దరా

ఫొటో సోర్స్, juan martinez

వర్తకం నుంచి పుట్టిన ఫ్యాషన్

ట్రాన్స్ సహారన్‌ వాణిజ్య యుగంలో, సహారా ఎడారి శివార్లలో కొత్త వాణిజ్య కేంద్రాలు పుట్టుకొచ్చాయి. వివిధ జాతులకు చెందిన వారు ఉత్తర ఆఫ్రికా అంతటా మసాలా దినుసులు, ఖనిజాలు, జంతువులు, వస్త్రాలు వంటి వ్యాపారాలు చేశారు.

శతాబ్దాలుగా జరిగిన వాణిజ్యం కారణంగా మారిటానియాలోకి విభిన్న సమూహాలను తీసుకువచ్చింది. 3వ శతాబ్దం నుంచి మారిటానియాలో నివసిస్తున్న బెర్బర్స్(స్థానికంగా అమాజిగ్ అని పిలుస్తారు)తోపాటూ, ఈశాన్యం నుండి సంచార తువరేగ్, ఆగ్నేయం నుండి హరటిన్, దక్షిణం నుండి హాల్పులార్లవంటి విభిన్న సమూహాలు వచ్చి స్థిరపడ్డాయి.

ఇస్లాం విశ్వాసాలు, అరబిక్ భాషల ప్రభావం ప్రబలంగా ఉన్నా కొత్త సాంస్కృతిక సంప్రదాయాలు ఇక్కడ ఉద్భవించాయి.

ఆర్కిటెక్చరల్ డిజైన్‌లు అభివృద్ధి చెందాయి. సహారా చుట్టూ ఉన్న పుస్తకాలు స్థానిక లైబ్రరీలలోకి ప్రవేశించాయి. ఉత్తర ఆఫ్రికాలోని ఫ్యాషన్ పోకడలు మిళితమై పొడవైన, వదులుగా ఉండే, వైడ్-స్లీవ్ ట్యూనిక్ రూపంలో కొత్త శైలిని తయారు చేశాయి.

దరా

ఫొటో సోర్స్, juan martinez

ఫ్యాషన్ చరిత్రలో దరా

జపాన్‌కి చెందిన కిమోనో/ప్రాచీన మెసొపొటేమియాలో పుట్టిన కఫ్తాన్ వంటి ఇతర ట్యూనిక్ తరహా దుస్తుల మాదిరిగానే దరా కూడా చరిత్రలో చోటు సంపాదించుకుంది.

దరాకు సంబంధించిన తొలి వెర్షన్‌ మాత్రం ఆధునిక సెనెగల్‌కు, మారిటానియాకు మధ్యలో ఉన్న సెనెగల్ నది వెంబడి నివసించిన హాల్పులార్ల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు.

చివరికి, అన్ని సామాజిక హోదాల జనాభా వారు దరా వస్త్రాలను ధరించారు. కానీ, వారి జీవన విధానం ఆధారంగా దరా రంగులు ఉండేవి. ధనవంతులైన వ్యాపారులు తెల్ల దరాలు, టగెల్‌మస్ట్‌లు ధరించారు. ఎందుకంటే వారు ప్రతిరోజూ తమ దుస్తులను శుభ్రపరుచుకోగలిగేవారు. అయితే బానిసలు తరచుగా అపరిశుభ్రమైన వాతావరణంలో పని చేయడంతో పాటూ, అదే దుస్తులను పదేపదే ధరించాల్సి రావడంతో సాధారణంగా నల్లని 'దరా'లు ధరించేవారు.

సహారా చుట్టూ సహజ రంగులు అద్దే పరిశ్రమలు లేకపోవడంతో, హల్పులార్లు సహజసిద్ధమైన ఇండిగో డై వ్యాపారం ప్రారంభించిన తర్వాత, ఇండిగో-డైయింగ్ టెక్నిక్‌లకు ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత మాత్రమే రంగురంగుల 'దరా'లు కనిపించాయి.

తెల్లని దరాలను కొనుగోలు చేయలేనివారికి, నల్లటి వాటిని ధరించడానికి ఇష్టపడని వ్యక్తులకు ముదురు నీలం రంగు దరాలు ఉపయోగపడేవి.

daraa

ఫొటో సోర్స్, juan martinez

సహారా "నీలి పురుషులు"

ఇండిగో 'దరా'లు హాల్పులార్లు మొదలుపెట్టినప్పటికీ తువరేగ్ తెగకు చెందిన ప్రజలు ఈ ఫ్యాషన్‌ని స్వీకరించి ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ఇలా నీలి రంగు 'దరా'లు ధరించేవారు ఎండలో ఉన్నప్పుడు ఆ 'దరా'ల రంగు వారి చర్మానికి అంటుకుని ముఖం నీలంగా కనిపించడంతో 'సహారా నీలి పురుషులు' అనే పేరు వాడుకలోకి వచ్చింది.

హాల్పులార్లు ప్రభావం తువరేగ్ ఫ్యాషన్‌లో పెద్ద మార్పులకు దారితీసి ఉండవచ్చు అని వియన్నా విశ్వవిద్యాలయంలో సహారా అధ్యయనాల పరిశోధకులు డాక్టర్ అంజ ఫిషర్ తెలిపారు.

"తువరేగ్ ప్రజలు తోలు దుస్తులను ధరించేవారు. ఏదో ఒక సమయంలో వారు నీలిరంగు దుస్తులకు మారారు"

లిబియా నుంచి అల్జీరియా, నైగర్, మాలి, బుర్కినా ఫాసో వరకు విస్తరించి ఉన్న తువరేగ్ తెగ వారు, సహారా సంచార జాతుల్లో ఒకరు. ఆఫ్రికాలో ఇస్లాం మతం వ్యాప్తి చెందడంలో ఈ తెగ పాత్ర ప్రభావవంతమైనది. వారు సహారా అంతటా ప్రసిద్ధి చెందారు.

మారిటానియాలో వారు అనుసరించిన ఫ్యాషన్ శైలి ఉత్తర ఆఫ్రికా అంతటా, తరువాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

మారిటానియా

ఫొటో సోర్స్, juan martinez

ఇటీవలి దశాబ్దాలలో ఆసియా, యూరోప్‌ నుంచి రసాయన రంగులు రావడం, బేల్ డైయింగ్ వంటి తక్కువ-ధర డైయింగ్ టెక్నిక్‌లు అందుబాటులోకి రావడంతో వివిధ రకాల నీలిరంగు షేడ్స్ సాధ్యమయ్యాయి.

మారిటానియన్ పట్టణాలు, నగరాలలో మధ్యతరగతి జనాభా పెరుగుదలతో, సామాజిక స్థితి ప్రతిబింబించేలా ప్రజలు సాంప్రదాయక వైట్ దరాస్‌తో సారూప్యత ఉన్న లేత నీలం రంగు దరాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

"లేత నీలం రంగు దరా తెల్లగా కనిపిస్తుంది. అయితే దీనిని ప్రతి మూడు నాలుగు రోజులకు శుభ్రం చేయాలి" అని జెడిడో చెప్పారు.

వీడియో క్యాప్షన్, సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

నీలం రంగు ప్రపంచం

మారిటానియా రాజధాని నౌక్‌చాట్‌లోని సెంట్రల్ మార్కెట్ నిజంగా నీలి ప్రపంచాన్ని తలపిస్తుంది. చాలా మంది విక్రయదారులు నీలిరంగు దుస్తులను మాత్రమే అమ్ముతారు. ప్రతి నలుగురిలో కనీసం ఒకరు నీలి రంగు దరా ధరిస్తారు.

మారిటానియాలో నీలం రంగును దుస్తుల్లోనే కాకుండా, మిగతా వాటిలో కూడా గమనించవచ్చు. దుప్పట్లు, స్టాల్ గొడుగులతో పాటూ నిర్మాణ సంబంధిత వస్తువులైన తలుపులు, పైకప్పులు, కంచెలు వంటి వాటిలో కూడా కనిపిస్తాయి.

ఖురాన్‌లో నీలం రంగు, ఆకాశాన్ని, దైవత్వాన్ని సూచిస్తున్నప్పటికీ, స్థానిక మారిటానియన్‌లు దీనిని ఉపయోగించడానికి ఆచరణాత్మక కారణం ఉంది. సూర్యుడి నుండి రక్షణ కోసం ఇది సరైన రంగు.

market

ఫొటో సోర్స్, juan martinez

ఆకట్టుకునే దుస్తులు

మొట్టమొదట 'దరా'లను పట్టుతో తయారు చేశారు. ఇప్పుడు నౌక్‌చాట్‌లోని దుకాణాలలో, పాలిస్టర్, మస్లిన్, ఒంటెలు, మేకల ఉన్నితో తయారు చేసిన దరాలు కనిపిస్తాయి.

ఇక ముస్లిమేతరులకు సిల్క్ వెర్షన్‌లలో దరాలు అందుబాటులో ఉంటాయి. మారిటానియాలోని అనేక దరాలు బంగారం, తెలుపు ఎంబ్రాయిడరీతో అలంకరించి ఉంటాయి. కొన్నింటికి జేబులు కూడా ఉంటాయి. చాలా శతాబ్దాల క్రితం ఈ వివరాలు అరుదైనవే కానీ, నేటి ఆధునిక, పట్టణ ప్రపంచంలో ఉపయోగకరమైనవి.

మారిటానియాలో మరిన్ని పాశ్చాత్య దుస్తులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, చాలా వరకు విఫలమయ్యాయి. జౌరాత్ పట్టణానికి చెందిన స్థానిక గైడ్ హడెమైన్ అహ్మదౌ ప్రకారం, ఒకప్పుడు అక్కడ ఉపాధ్యాయులు పని చేసేటప్పుడు దారాస్‌ ధరించకుండా ఉండాలని, యూరప్ లేదా ఉత్తర అమెరికా నుండి స్మార్ట్ డ్రెస్ కల్చర్‌ను అవలంభించాలని సూచనలిచ్చేవారు. ఏదేమైనా, చాలా మంది మారిటానియన్లు తమ సాంప్రదాయ దరా, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను వదిలివేయలేకపోయారు.

daraa

ఫొటో సోర్స్, juan martinez

సంచార వారసత్వం పట్ల గర్వంగా ఉంది

సహారా చుట్టు పక్కల ఉన్న చాలా నగరాల్లో సాంప్రదాయ వస్త్రధారణ అంశాలు మసకబారిపోయినప్పటికీ, పురుషులు గర్వంగా నౌక్‌చాట్‌లో నీలి రంగు దరా ధరిస్తారు. వారు మారిటానియన్ సంస్కృతిలో అంతర్భాగంగా మారారు. స్మార్ట్ సూట్ ధరించిన వ్యాపారవేత్తలు కూడా బ్లేజర్‌కు బదులుగా మార్పులు చేసిన దరాలు ధరిస్తున్నారు.

"ఇది సౌకర్యవంతంగా ఉంటుంది, శుభ్రం చేయడం సులభం, చక్కగా కనిపిస్తుంది" అని జెడిడో చిరునవ్వుతో అన్నారు.

రాబోయే తరాలకు చాలా సహారన్ దేశాలు ఇప్పుడు ఫ్యాషన్ పోకడల కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తుండగా, మారిటానియా, మార్పుకు చాలా దూరంలో ఉంది. యువతరం కూడా వారి సంప్రదాయాల గురించి గర్వపడుతోంది. వారు క్రమం తప్పకుండా ధారాస్ ధరిస్తున్నారు.

ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ఈ సంప్రదాయ దుస్తులు కనిపించే సూచనలు కూడా ఉన్నాయి. ఇటీవల, సహారాన్ టాగెల్‌మస్ట్‌లు యూరోప్‌లో అధునాతన స్కార్ఫ్‌లకు ప్రేరణగా నిలిచాయి. ఈ సంవత్సరం, లగ్జరీ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ వాలెంటినో 2021 కలెక్షన్ రూపకల్పనలో, సంప్రదాయ సహారన్ దరా నుండి ప్రేరణ పొందింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)