కోవిడ్ చికిత్సకు తొలిసారిగా మాత్రలను ఆమోదించిన బ్రిటన్

ఫొటో సోర్స్, MERCK
- రచయిత, జిమ్ రీడ్,
- హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్
కోవిడ్ లక్షణాలున్న వారికి చికిత్స కోసం అభివృద్ధి చేసిన మాత్రలకు తొలిసారిగా బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.
కరోనా సోకి బలహీనంగా ఉన్న రోగులకు మోల్నుపిరవిర్ మాత్రలను రోజుకు రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది.
మొదటగా ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ మాత్ర, కరోనా రోగులపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో వారిని ఆసుపత్రిలో చేరవలసిన అవసరాన్ని నివారించడంతో పాటు లేదా మరణించే ప్రమాదాన్ని సగానికి తగ్గించింది.
అత్యంత బలహీనమైన, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇదొక దివ్య ఔషధం అని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ అన్నారు.
"ఈ రోజు మన దేశానికి చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే కోవిడ్ చికిత్సకు ఇంట్లోనే తీసుకునే యాంటీవైరల్ మాత్రను ఆమోదించిన మొదటి దేశం బ్రిటన్" అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, MSD
మాత్ర రూపంలో మొదటి చికిత్స
మోల్నుపిరవిర్‌ను అమెరికా ఔషధ కంపెనీలు మెర్క్, షార్ప్ అండ్ డోహ్మే(ఎమ్‌ఎస్‌డీ), రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్‌లు అభివృద్ధి చేశాయి. మొదటిసారిగా కోవిడ్‌కు నోటి ద్వారా అందించే యాంటీవైరల్ ఔషధం ఇది. దీనిని ఇంజెక్ట్ లేదా ఇంట్రావీనస్‌గా కాకుండా మాత్రగా తీసుకోవచ్చు.
మొదటి విడతలో 4,80,000 కరోనా రోగుల చికిత్సకు అవసరమయిన మాత్రలను కొనుగోలు చేయడానికి యూకే ఒప్పందం చేసుకుంది. ఇవి నవంబర్‌లో డెలివరీ అవుతాయని ఆశిస్తున్నారు.
ఈ మాత్రలను టీకాలు వేసుకున్న, వేసుకోని బ్రిటన్‌లకు అందిస్తారు. వీటి ప్రభావంపై జాతీయ అధ్యయనం తర్వాత అదనపు సమాచారాన్ని సేకరించి మరిన్ని మాత్రలకు ఆర్డర్ చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మాత్రలు అత్యంత ప్రభావవంతంగా ఉండాలంటే లక్షణాలు అభివృద్ధి చెందిన ఐదు రోజులలోపు అందించాలి.
మాత్రల రూపంలో అందించే ఈ చికిత్స వైరస్ ఉత్పత్తికి దోహదపడే ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. దాని జన్యు కోడ్‌లోకి లోపాలను ప్రవేశపెడుతుంది. అది వైరస్ వృద్ధిని నిరోధించి, శరీరంలో వైరస్ స్థాయిలను తగ్గేలా చేసి వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్‌లపై కూడా ఈ విధానం ప్రభావవంతంగా పని చేస్తుందని మెర్క్ పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS
కొద్దిపాటి కోవిడ్ ఉన్నవారు.. స్థూలకాయం, వృద్ధాప్యం, మధుమేహం లేదా గుండె జబ్బులువంటి సమస్యలతో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులకు ఈ మాత్రలను ఉపయోగించడానికి యూకే రెగ్యులేటర్ ఎమ్‌హెచ్‌ఆర్‌ఏ ఆమోదం తెలిపింది.
ఇది "కోవిడ్-19 అరికట్టడానికి మనకు అందుబాటులోకి వచ్చిన మరొక చికిత్సా విధానం" అని ఎమ్‌హెచ్‌ఆర్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైన్ అన్నారు.
"కరోనా వ్యాధికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆమోదించిన మాత్ర రూపంలోని యాంటీవైరల్ ఇది. దీనిని ఇంజక్షన్ రూపంలో కాకుండా నోటి ద్వారా తీసుకోవచ్చు" అని ఆమె చెప్పారు.
"ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కోవిడ్-19 తీవ్రమైన దశకు చేరుకోక ముందే, ఆసుపత్రికి వెళ్లకుండానే ఈ విధానంలో చికిత్స తీసుకోవచ్చు."
కరోనా మహమ్మారితో రాబోయే కొన్ని నెలలు కష్టతరంగా ఉండనున్నట్టు ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ జోనాథన్ వాన్-టామ్ బుధవారం హెచ్చరించారు. కోవిడ్ కేసులు అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ, మరణాలు పెరుగుతున్నాయన్నారు. వృద్ధులకు ఈ కరోనా ఇన్‌ఫెక్షన్‌లు మరింతగా సోకే అవకాశం ఉందనే సంకేతాలు ఉన్నాయని ఆయన అన్నారు.
యూకేలో బుధవారం 41,229 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, REUTERS
మోల్నుపిరవిర్ ఔషధంపై క్లినికల్ ట్రయిల్స్
కోవిడ్ సోకిన 775 మందిపై మోల్నుపిరావిర్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
- మందు ఇచ్చిన వారిలో 7.3% మంది ఆసుపత్రి పాలయ్యారు.
- ప్లాసిబో లేదా డమ్మీ పిల్ ఇచ్చిన 14.1% మంది రోగులతో పోల్చారు.
- మోల్నుపిరావిర్ ఇచ్చిన వారిలో మరణాలు సంభవించలేదు. ట్రయల్స్‌లో ప్లేసిబో ఇచ్చిన ఎనిమిది మంది రోగులు తరువాత కోవిడ్‌తో మరణించారు.
కరోనా లక్షణాలు అభివృద్ధి చెందిన వెంటనే మోల్నుపిరావిర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ట్రయల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి.
మునుపటి అధ్యయనాల్లో నిరాశాజనక ఫలితాలు రావడంతో తీవ్రమైన కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన రోగులపై ట్రయల్స్ నిలిపివేశారు.
కోవిడ్ లక్షణాలు ప్రారంభమైన ఐదు రోజులలోపు ఔషధాన్ని "సాధ్యమైనంత త్వరగా" ఉపయోగించాలని ఎమ్‌హెచ్‌ఆర్‌ఏ సిఫార్సు చేసింది.
"ఇవే ఫలితాలు యూకే జనాభాపై పునరావృతమైతే, ఆసుపత్రిలో చేరాల్సిన కేసుల సంఖ్యను సగానికి తగ్గించవచ్చు. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది" అని లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ పెన్నీ వార్డ్ అన్నారు.
మాత్రల కోసం చేసుకున్న ఒప్పందం విలువ ఎంత అనేది బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించలేదు. కానీ, అమెరికా ప్రభుత్వం దాదాపుగా 1.2 బిలియన్లు డాలర్లు లేదా ప్రతి రోగికు దాదాపు 700డాలర్ల ఖర్చుతో 1.7 మిలియన్ల రోగులకు ఔషధాలను ముందస్తుగా కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఇతర దేశాలు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి.
కోవిడ్ చికిత్సకు మాత్రలపై ట్రయల్ ఫలితాలను నివేదించిన మొదటి కంపెనీ మెర్క్. అయితే ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ఫైజర్ రెండు వేర్వేరు యాంటీవైరల్ మాత్రల ట్రయల్స్‌ను ప్రారంభించింది. స్విస్ కంపెనీ రోచె కూడా ఇవే మందులపై పరిశోధనలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









