బోత్స్వానాలో దొరికింది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రమా?

బోత్స్వానాలో దొరికి వజ్రం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బోత్స్వానాలో దొరికిన వజ్రం

బోత్స్వానాలో ప్రదర్శనకు పెట్టిన ఒక వజ్రం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం కావచ్చని భావిస్తున్నారు.

1,098 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని వెలికితీసిన సంస్థ, రెండు వారాల తర్వాత దానిని దేశ అధ్యక్షుడు మోక్వీజీ మసిసీకి చూపించింది.

2015లో బోత్స్వానాలోనే దొరికిన ప్రపంచంలోని రెండో అతిపెద్ద వజ్రం కంటే ఇది కాస్త చిన్నగా ఉంది.

ఆఫ్రికాలోని బోత్స్వానా ప్రపంచంలోనే అత్యధికంగా వజ్రాలు ఉత్పత్తి చేసే దేశం.

"డెబ్‌స్వానా 50 ఏళ్ల వజ్రాల వెలికితీత చరిత్రలో దొరికిన అతిపెద్ద వజ్రం ఇదే" అని ఆ సంస్థ యాక్టింగ్ ఎండీ లినెట్టె ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పారు.

"మా ప్రాథమిక విశ్లేషణలో ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద నాణ్యమైన వజ్రం కావచ్చని తెలిసింది" అని లినెట్టె అన్నారు.

బోత్స్వానాలో దొరికి వజ్రం

ఫొటో సోర్స్, AFP

బోత్స్వానా ప్రభుత్వం, అంతర్జాతీయ వజ్రాల సంస్థ డిబీర్స్ సంయుక్త వెంచర్ డెబ్‌స్వానా. వజ్రాల అమ్మకాల ద్వారా ఈ సంస్థకు వచ్చే ఆదాయంలో 80 శాతం డివిడెంట్లు, రాయల్టీలు, పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తోంది.

మహమ్మారితో గత ఏడాది వజ్రాల అమ్మకాలు మందగించిన సమయంలో ఈ భారీ వజ్రం దొరికింది. అందుకే, ఈ వజ్రం బోత్స్వానాకు సరైన సమయంలో లభించలేదని ఆ దేశ ఖనిజ శాఖా మంత్రి లిఫోకో మోగీ చెప్పారు.

ఇప్పటివరకూ లభించిన వజ్రాల్లో అతిపెద్దది 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. 3,106 క్యారెట్ల ఈ వజ్రం పేరు 'కుల్లినన్'. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం 'లెసెడీ లా రోనా; 2015లో బోత్స్వానాలోనే దొరికింది. ఇది 1,109 క్యారట్ల వజ్రం.

బోత్స్వానాలో కొత్తగా దొరికిన వజ్రాన్ని జ్వానెంగ్ గనిలో వెలికితీశారు. దీనికి ఇంకా పేరు పెట్టాల్సి ఉంది.

ఈ అరుదైన, అసాధారణమైన వజ్రాన్ని డిబీర్స్ ద్వారా అమ్మాలా లేక ప్రభుత్వ వజ్రాల సంస్థ ఒకవాంగో ద్వారా విక్రయించాలా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)