కెన్యా: 'నేను డబ్బు ఇవ్వకపోతే, వాళ్లు వచ్చి నా కిడ్నీ తీసుకుపోతారు'

ఫొటో సోర్స్, AFP
మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా అప్పులు ఇస్తున్న వాళ్లు, వాటిని వసూలు చేసుకోవడానికి ఎలాంటి దుర్మార్గమైన వ్యూహాలను అమలు చేస్తున్నారన్నది కెన్యా బ్రాడ్‌కాస్టర్ వైహిగా మవారా దృష్టికి వచ్చింది. ఆఫ్రికన్ జర్నలిస్టుల లేఖల సిరీస్‌లో వైహిగా ఈ వివరాలు వెల్లడి చేశారు.
గత వారం రోజులుగా ఆయన ఫోను ఆగకుండా మోగుతూనే ఉంది. అప్పులు వసూలు చేసుకునే వారి నుంచి ఆయనకు ఆగకుండా అలా కాల్స్ వస్తున్నాయి. చర్చి సభ్యులలో ఒకరైన మహిళ అప్పు తీసుకుని ఆయనను గ్యారంటీగా నామినేట్ చేసినట్లు వారు చెబుతున్నారు.
తొలుత పాస్టర్ ఇదంతా సరదాగా ఆట పట్టించడానికి చేస్తున్నారని భావించారు. కానీ, వరుస ఫోన్ కాల్స్ వేధింపులతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఫోన్ సంభాషణల తీవ్రత రోజు రోజుకూ పెరిగింది.

ఫొటో సోర్స్, AFP
ప్రారంభంలో కాల్ చేసిన వారు మర్యాదగా మాట్లాడేవారు. నెల ముందు ఆమె అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చూడాలని పాస్టర్‌తో సున్నితంగా చెప్పేవారు.
కానీ, ఆ తర్వాత రికవరీ ఏజెంట్లు మరింత దూకుడుగా వ్యహరించడం ప్రారంభించారు. అప్పు చెల్లించాలని సదరు మహిళకు చెప్పలేకపోతున్నారని, నిజం మాట్లాడలేని నకిలీ పాస్టర్ అంటూ అవహేళన చేశారు. వరుస కాల్స్‌తో ఫోన్‌ను పేలిపోయేలా చేస్తామని హెచ్చరించారు.
ఈ వ్యవహారంలో కలగజేసుకోవడానికి ప్రయత్నించినందుకు పాస్టర్ భార్యను సైతం పరుష పదజాలంతో దూషించారు.
రికవరీ ఏజెంట్ల డిమాండ్లను తీర్చలేని పాస్టర్ చాలా రోజుల పాటు ఫోన్‌ను వాడకుండా పక్కనబెట్టారు.
#Debtofshame హ్యాష్‌ట్యాగ్‌తో రుణదాతల వేధింపులకు గురైన చాలా మంది కెన్యా ప్రజలు ముందుకు వచ్చి తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తీసుకున్న అప్పు చెల్లించకపోతే, కిడ్నీ తీసుకుపోవడానికి వస్తామని వారు హెచ్చరించారని ఓ ట్విటర్ యూజర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
మరో మహిళ, తాను 2 వేల కెన్యా షిల్లింగ్స్‌ను అప్పుగా తీసుకున్నానని, 10 రోజుల తర్వాత వాళ్లు తన పీక మీద కూర్చున్నంత పని చేశారని, వాళ్ల ఒత్తిళ్లకు నిద్ర కూడా పట్టేది కాదని వాపోయారు. తనను అన్ని రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఓ రికవరీ ఏజెంట్, తాను అప్పు ఇచ్చే యాప్ సంస్థలో పని చేసినప్పుడు, తన యజమాని రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించేవాడని దాంతో వారు చెప్పిందల్లా చేసేవాడినని పేర్కొన్నారు.
'డబ్బును ఎలా రికవరీ చేశారనే దాని గురించి యాజమాన్యం పట్టించుకోదు. డబ్బును రికవరీ చేయడంపై మాత్రమే ఆసక్తి చూపుతారు. నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేక ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టాను' అని ఆయన వివరించారు.
అప్పు ఇచ్చే డిజిటల్ యాప్‌ల ద్వారా కెన్యా ప్రజలు రుణాలు తీసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి తనఖా లేకుండా అతి సులువుగా, వేగంగా డబ్బును యాప్స్ ద్వారా మాత్రమే తీసుకోగలరు.
భౌతికంగా కస్టమర్లను కలవకుండా, వారి రుణ యోగ్యతను అంచనా వేయడానికి రుణదాతలు వినియోగదారుల తిరిగి చెల్లింపు అలవాట్లను తీసుకుంటారనే అనుమానాలున్నాయి.
వాస్తవానికి, ఆఫ్రికా ఖండంలో మొబైల్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్లు ఎక్కువగా లేకపోతే ఈ సమాచారం రుణదాతలకు చేరేది కాదు.
గత దశాబ్ద కాలంలో మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు ఆఫ్రికాలో డబ్బు సేవలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
ఇటీవల పాశ్చాత్య, ఆసియా మార్కెట్లలో కొన్ని భారీ వెంచర్ క్యాపిటల్ గ్రూపుల మద్దతుతో ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల దృష్టి ఆఫ్రికా మీద పడింది.
ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నవారికి రుణ సౌకర్యం సేవలు లేనందున, ఈ ఖాళీని అప్పు ఇచ్చే యాప్స్ భర్తీ చేస్తున్నాయి. ఆఫ్రికా మార్కెట్లోకి వీటి ప్రవేశమే ఓ సంచలనం. వీటిపై ఎలాంటి నియంత్రణా లేకపోవడం వల్ల, అనైతిక మార్గాల ద్వారా వ్యాపారం నిర్వహించడంతో అమాయక యువత వీరి వలలో చిక్కుకుంటున్నారు. వారు డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు వారిని తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
కెన్యా ప్రజలు ఈ రుణాలను త్వరగా స్వీకరిస్తుండగా, కొందరు తమపై తీవ్ర వడ్డీ విధిస్తున్నారని వాపోతున్నారు.
సగటున బ్యాంకు ఇచ్చే రుణంపై వడ్డీ ఏడాదికి 12 శాతం నుంచి 14 శాతం మధ్య ఉంటుంది. అదే మొబైల్ యాప్ రుణం చెల్లించే సమయాన్ని బట్టి సంవత్సరానికి 75 శాతం నుంచి 395 శాతం మధ్య ఉంటోంది.
చైనాకు చెందిన ఓ యాప్ ఆధారిత రుణ సంస్ధ గూగుల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 30 రోజుల్లోగా రుణ చెల్లింపు చేయాలని పేర్కొంది. ఈ యాప్ ను హోస్ట్ చేస్తున్న గూగుల్ మాత్రం రుణ చెల్లింపునకు కనీస గడువు 60 రోజులుగా పేర్కొంది.
కానీ, కెన్యా డిజిటల్ రుణదాతల సంఘం ఛైర్మన్, కెవిన్ ముటిసో అప్పులిచ్చే యాప్‌లను వెనకేసుకొస్తున్నారు. అప్పు ఇచ్చి మాటలనడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ తరహా అప్పులిచ్చే పద్దతి చిన్న తరహా వ్యాపారులకు ఉపయోగపడుతుందని తెలిపారు.
అప్పులిచ్చే యాప్‌లు లేకపోయి ఉంటే కోవిడ్ -19 కారణంగా అమలు చేసిన కఠిన లాక్‌డౌన్‌నుంచి చాలా మంది కెన్యా ప్రజలు బయటపడలేక పోయేవారని ఆయన చెప్పారు.
ఈ మొబైల్ రుణాల ద్వారా ప్రజలు ఆహారం, ఇంటి అద్దె, రవాణా ఖర్చులు, పాఠశాల ఫీజులను కూడా చెల్లించుకోగలిగారని వివరించారు.
దోపిడీ చేసే రుణ దాతలను అరికట్టడానికి సరైన నియంత్రణ అవసరమని కొందరు భావిస్తున్నారు. కరోనా వైరస్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు, పెట్టుబడులకు ఊతమిచ్చే రుణదాతలను నియంత్రణలతో కట్టడి చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ఇంకొందరు వాదిస్తున్నారు.
వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని నిరోధించడానికి 2019లో కెన్యా డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వంటి చట్టాలను రూపొందించింది. అయినా భారీ స్థాయిలోని అప్పులిచ్చే యాప్‌లకు ఈ సమాచారాన్ని అందకుండా చేయడం దాదాపు అసాధ్యంగా మారింది.
ఇక రానున్న కాలంలో యాప్‌ల ద్వారా తనఖాలతో అప్పు ఇచ్చే సదుపాయాలు కూడా అందుబాటులోకి రావొచ్చనే అభిప్రాయాన్ని నిశితంగా మార్కెట్‌ను గమనిస్తున్న కొందరు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









