ఇన్‌స్టాగ్రామ్: ‘నా వయసువారు చూడకూడని వీడియోలు ఉంటాయి అక్కడ’

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Reuters

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో మనలో చాలామంది పొద్దున్న లేవగానే ఫోన్ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేయడం ప్రారంభిస్తాం.

కానీ, ఇన్‌స్టాగ్రామ్ మన మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?

ఫేస్‌బుక్ విజిల్ బ్లోయర్ ఫ్రాన్సిస్ హాగెన్ కూడా దీనిపై హెచ్చరిస్తూ... మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల కంటే ఇన్‌స్టాగ్రామ్ మరింత ప్రమాదకరమైనదన్నారు.

ఫేస్‌బుక్ సొంతంగా జరిపిన అధ్యయనంలోనే ఈ విషయం తేలినట్లు బయటపడిన తరువాత హాగెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఇందులోని సంక్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడంలో నిబద్ధతను ఈ అధ్యయనం రుజువు చేసిందని ఇన్‌స్టాగ్రామ్ ఆ సమయంలో చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నేతలు సోషల్ మీడియాను నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో అయిదుగురితో మాట్లాడి, ఇన్‌స్టాగ్రామ్‌లో వారికి ఎదురైన అనుభవాలను తెలుసుకుంది.

డానీ

ఫొటో సోర్స్, dani

ఇన్‌స్టాగ్రామ్ అంటే ప్రేమ, ద్వేషం

డానీకి ఇన్‌స్టాగ్రామ్‌తో మిశ్రమ అనుభవాలు, అనుబంధం ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో ఆమెది ప్రేమ, ద్వేషాల అనుబంధం. సౌత్ వేల్స్‌కు చెందిన 29 ఏళ్ల డానీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగానే డబ్బు సంపాదిస్తారు. అదే ఆమె జీవనాధారం. ట్రాన్స్‌జెండర్‌లు ఒకరినొకరు కలుసుకోవడం కోసం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కమ్యూనిటీ ఏర్పాటుచేశారు.

అయితే, తన ఆహార్యం, తీరుపై ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వేధింపులను ఎదుర్కొంటున్నారు.

'నా జీవితంలో అతి గొప్ప వరం, అత్యంత దారుణమైన శాపం రెండూ కూడా ఇన్‌స్టాగ్రామే'' అంటారామె.

''మీరొక ట్రాన్స్‌జెండర్ అయినప్పుడు, మీ ఇన్‌స్టా అకౌంట్ పబ్లిక్ అయినప్పుడు దుర్భాషలు తప్పవు. కానీ, అందులో కొన్ని మనసుకు చాలా బాధ కలిగిస్తాయి''

'ద్వేషంతో చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను అపహాస్యం చేసేలా నా ఫొటోలను మార్చి పెట్టిన పోస్టులను కొందరు నాకు పంపించారు''

''ఇన్‌స్టాగ్రామ్ సామాజికంగా పోలికలు, శరీరాల పోలికలు, జీవన శైలి పోలికలు ఎక్కువ. అందుకే పిల్లలకు అది సరైంది కాదు'' అని ఫ్రాన్సెస్ హాగెన్ ఎంపీల జాయింట్ కమిటీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియా మీకు తెలియకుండానే మిమ్మల్ని తన బానిస చేసుకుంటోంది.. తెలుసా?

మద్యపాన వ్యసనం నుంచి బయటపడిన డానీ సోషల్ మీడియా ఎలా వ్యసనంగా మారుతుందో కూడా తెలుసుకోగలనన్నారు.

'కొన్నేళ్లుగా మత్తుకు దూరంగా ఉంటున్నాను. కానీ, వ్యసనాలకు బానిసయ్యే తరహా వ్యక్తిత్వం గలవారికి ఇన్‌స్టాగ్రామ్ సరైన వేదిక కాదు'' అన్నారు డానీ.

అయితే, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న సర్ నిక్ క్లెగ్ ఈ ప్లాట్ ఫాంను సమర్థించుకున్నారు. టీనేజ్ అమ్మాయిల్లో అత్యధికులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు నిక్.

హానికర స్థాయిలో ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకుంటే మధ్యమధ్యలో విరామాలు తీసుకునేందుకు వీలుగా 'టేక్ ఏ బ్రేక్' ఫీచర్ తీసుకొస్తోందని చెప్పారు.

Hannah

ఫొటో సోర్స్, Hannah

'వాళ్లను అన్‌ఫాలో చేసిన తరువాత నాలో మార్పు వచ్చింది'

హన్నా రోజుకు 6 నుంచి 10 గంటలు సోషల్ మీడియాలో గడుపుతారు. ఆమె టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచే తనకు సోషల్ మీడియా యాక్సెస్ ఉంది.

వెస్ట్ స్కాట్లాండ్ యూనివర్సిటీలో చదువుతున్న 24 ఏళ్ల హన్నాకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, స్నాప్ చాట్, టిక్ టాక్‌లలో ఖాతాలున్నాయి.

''నాకో చెడ్డ అలవాటు ఉంది. పొద్దున్న లేవగానే మొట్టమొదట నేను నా సోషల్ మీడియా ఖాతాల నోటిఫికేషన్లు అన్నీ చెక్ చేసుకుంటాను'' అని చెప్పారు హన్నా.

''నేను నిద్రపోవడానికి ముందు చేసే చివరి పని కూడా సోషల్ మీడియా నోటిఫికేషన్లు చెక్ చేయడమే. ఇక రోజంతా నేను సోషల్ మీడియాలోనే ఉంటాను'' అన్నారమె.

''నేను టిక్‌టాక్‌కు బానిసైపోయాను. గంటలు గంటలు టిక్‌టాక్‌లో అలా స్క్రోల్ చేస్తూ వీడియోలు చూసినా నాకు ఏమనిపించదు. నేను టైంవేస్ట్ చేస్తున్నానని నాకు తెలుసు. ఇందులోంచి బయటపడాలని కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాను''

ఇన్‌స్టాలో హన్నా కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లను ఫాలో అయ్యేవారు.. వారితో తనను పోల్చుకుంటూ తన శరీరాకృతి అలా లేనందుకు బాధపడేవారు.

''నా శరీరాకృతి వారిలా ఉండాలని అనుకుండేదాన్ని. ఒక నాజూకైన మోడల్‌‌లా ఊహించుకుంటూ అవాస్తవ అంచనాల్లో ఉండేదాన్ని. ఇదంతా నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని గ్రహించాను.

అంతకుముందు ఫాలో అయిన ఇన్‌ఫ్లూయర్స్ ఖాతాలను ఇప్పుడామె అన్‌ఫాలో చేశారు.

''అందరూ ఆరడుగుల ఎత్తుండే మోడల్స్ కారని.. నాజూకుగా ఉండరని అర్థం చేసుకున్నాను. ఆ తరువాత నాలాంటి శరీరాకృతి ఉన్నవారిని ఫాలో కావడం ప్రారంభించాను. ఇప్పుడు నా ఆత్మవిశ్వాసం పెరిగింది'' అన్నారామె.

ఇన్‌స్టాగ్రామ్‌లో హన్నా కూడా విద్వేష వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు.

''లావుగా ఉన్నానని.. బరువు తగ్గాలని సూచిస్తూ చాలామంది కామెంట్లు పెట్టేవారు. మరికొందరు భారీ సైజ్‌లో ఉన్నాననేవారు'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎదుర్కొన్న వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.

స్కార్లెట్, అనీసా

ఫొటో సోర్స్, Scarlet, anisa

'అక్కడంతా హానికర వాతావరణం'

నార్త్ లండన్‌లోని హార్న్సీ స్కూలులో చదువుతున్న స్కార్లెట్, అనీసాలు బీబీసీతో మాట్లాడారు. సోషల్ మీడియాతో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తమకు తెలుసని చెప్పారు వారు.

15 ఏళ్ల స్కార్లెట్ ఫేస్‌బుక్ తప్ప మిగతా అన్ని ప్రధాన సోషల్ మీడియా వాడుతారు. ఫేస్‌బుక్ తన వయసు వారి కోసం కాదన్నది ఆమె అభిప్రాయం. అందుకే ఆమె ఫేస్‌బుక్ వాడరు.

''ఎమ్మా చాంబర్లేన్ వంటి యూట్యూబర్లను ఫాలో అవుతుంటాను. ఫ్యాషన్ కంటెంట్ క్రియేట్ చేసేవారిని ఫాలో అవుతాను'' అన్నారు స్కార్లెట్.

''అందానికి అత్యున్నత కొలమానాలుగా చెప్పే లెక్కల ప్రకారం ఉండేవాళ్లను చూసినప్పుడు మాత్రం కొంత అభద్రత అనిపిస్తుంది. నేనిప్పుడిప్పుడే యుక్త వయసులోకి రావడంతో ఆ కొలమానాలలో కనిపించేవారిని చూసినప్పుడు న్యూనతకు లోనవుతాను. అందుకే అలాంటి చాలా అకౌంట్లను అన్ ఫాలో చేశాను'

మరోవైపు అనీసా కూడా నెగటివ్ కంటెంట్‌కు దూరంగా ఉండేందుకుగాను చాలా అకౌంట్లను అన్ ఫాలో చేశారు.

అయినా ఇప్పటికీ ఆమెకు ఇష్టం లేని కంటెంట్ ఆన్‌లైన్‌లో తనకు కనిపిస్తోంది.

''నేనో ముస్లింను. మాకు సరైన గుర్తింపు లేదని అనుకుంటాను. అలాంటి భావన కలిగించే కంటెంట్ చూసినప్పుడు ఆ అకౌంట్లను అన్‌ఫాలో చేస్తాను' అన్నారు అనీసా.

అయితే, సోషల్ మీడియాలో తాము ఎన్నో సందర్భాలను ఆస్వాదించామని.. స్నేహితులతో కలిసి వీడియోలు చేయడం ఇష్టమని వారు చెబుతున్నారు.

లీ

ఫొటో సోర్స్, leah

‘నా వయసు వారు చూడకూడని వీడియోలు అక్కడుంటాయి’

యువత అంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారని చెప్పడానికి లేదు. పదిహేనేళ్ల లీ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో లేరు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచేందుకు ఆమెకు తల్లి నుంచి అనుమతి దొరకలేదు.

''ఇన్‌స్టాలో అంతా నెగటివిటీ ఉంటుంది. అందుకే మా అమ్మ నిర్ణయం మేరకు నడుచుకుంటాను నేను'' అంటారు లీ.

'నా ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియాలో ఉండడంతో నాకూ అందులో ఉండాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. చెత్త ఫొటోలు, భయంకరమైన వీడియోలు కొందరు పంపిస్తుంటారని నా స్నేహితులు చెప్పారు. మా వయసు వారు చూడకూడనివి వస్తుంటాయి సోషల్ మీడియాలో. అందుకే వద్దంది అమ్మ'' అని చెప్పారు లీ.

పదమూడేళ్ల లోపు పిల్లల కోసం 'ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్' తీసుకురాలని ప్రయత్నించిన ఫేస్‌బుక్ గత సెప్టెంబరులో ఆ ఆలోచన వాయిదా వేసింది.

''తల్లిదండ్రులు, నిపుణులు, విధాననిర్ణేతలు, నియంత్రణ సంస్థల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అందుకు సమయం పడుతుంది'' అని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొసేరీ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఈమె చేసిన ఐదు సెకన్ల వీడియో భారత్, పాకిస్తాన్‌లను 'ఏకం' చేసింది!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)