ఇన్‌స్టాగ్రామ్: ‘ఇప్పుడు ఈ శరీరంపై నాకు ఏమాత్రం వ్యామోహం లేదు.. దృష్టంతా ఆరోగ్యంపైనే ’

ఇసబెల్లా ఫొటోలు.. 2019లో యాక్సిడెంట్ కావడానికి ముందు, ఆ తరువాత

ఫొటో సోర్స్, Isabella Russo

ఫొటో క్యాప్షన్, ఇసబెల్లాకు 2019లో యాక్సిడెంట్ కావడానికి ముందు, ఆ తరువాత

బ్రెజిల్‌కు చెందిన 28 ఏళ్ల ఇసబెల్లా రూసో నిత్యం తనను తాను విశాలమైన భుజాలు, దృఢమైన శరీరం గల మహిళగా చెప్పుకుంటుండేవారు.

కానీ కొన్నేళ్ల కిందట ఆమె అంతవరకు ఊహించుకున్న పరిపూర్ణమైన శరీరాకృతి సాధించడం కోసం నిజంగానే కసరత్తులు మొదలుపెట్టారు.

2015 నుంచి ఆమె పాటించే వివిధ రకాల ఆహార నియమాలను, శారీరక వ్యాయామాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

అతి తక్కువ కాలంలోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫ్లుయెన్సర్‌గా మారారు. ఆమె పోస్టుల కోసం కొన్ని వేల మంది ఎదురుచూసేవారు.

అయితే, అందరికీ ఆనందంగా కనిపిస్తున్నఈ పోస్టుల వెనుక ఎంతో బాధ కూడా ఉందంటారామె.

"బరువు పెరగకుండా ఉండేందుకు నిరంతరం నన్ను నేను ఒత్తిడికి గురి చేసుకుంటూ ఉండేదానిని. అందంగా కనిపించడం గురించే నిత్యం ఆలోచించేదాన్ని" అని ఆమె చెప్పారు.

రోజురోజుకీ ఆందోళన పెరగడం మొదలయింది. అది నెమ్మదిగా అనారోగ్యానికి దారి తీస్తున్నట్లు ఆమె గుర్తించారు.

"నేను ఆరోగ్యకరమైన జీవితం కంటే , నాజూగ్గా ఉండటం కోసమే ఎక్కువ ప్రయత్నిస్తున్నానని అర్ధం అయింది”, అని ఆమె అన్నారు.

ఇసబెల్లా

ఫొటో సోర్స్, Isabella Russo

ఫొటో క్యాప్షన్, ఇసబెల్లా రూసో

బలవంతపు ఆహార అలవాట్లు

రూసో చిన్నతనంలో సన్నగా, పొడవుగా ఉండేవారు. కానీ, తనకు భారీ తొడలు, పెద్ద పాదాలు, అర చేతులు ఉండేవన్న న్యూనతా భావంతో ఉండేవారు.

ఆమెకి 18 ఏళ్లప్పుడు అమెరికా వెళ్లారు. అక్కడ ఆమె చేరిన జిమ్‌లో అక్కడ అందరూ డైట్ గురించే మాట్లాడుకోవడం వినడంతో ఆమెలో న్యూనత మరింత ఎక్కువైంది.

మధ్యలో బలవంతంగా ఆహారం తినడం ప్రారంభించారామె.

"కొన్ని సార్లు అదుపు లేకుండా తినడంతో బరువు పెరిగాను. దాంతో బరువు తగ్గడానికి మళ్లీ కఠినమైన డైట్ చేయడం ప్రారంభించాను”, అని ఆమె చెప్పారు.

ఆహారం విషయంలో స్థిరత్వం లేకపోయినా 2015లో ఆమె ఊహలకు అనుగుణమైన పరిపూర్ణమైన శరీరాకృతిని పొందారు. దాంతో, ఆమె అనుభవాలను, పాటించిన డైట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఆమెకి ఫాలోవర్లు పెరగడం మొదలయింది.

"అందరూ నన్ను ప్రశంసించడాన్ని ఇష్టపడేదానిని. నేను పొందిన శరీరాకృతి సాధించటం కోసం చేసిన కష్టానికి తగిన బహుమతి లభించినట్లు భావించాను” అని ఆమె చెప్పారు.

"ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండటం ఎంత సున్నితమైన విషయమో అర్ధమయింది. చాలా మంది ఇతరులను ప్రభావితం చేసేవారిగా మారాలనుకుంటారు. కానీ, ఆ శరీరాకృతిని సంపాదించడం కోసం వారెంత కష్టపడ్డారో, ఎటువంటి మానసిక సంఘర్షణకు లోనయ్యారో పూర్తిగా నిజాలు చెప్పరు, అని ఆమె అన్నారు.

ఇసబెల్లా

ఫొటో సోర్స్, Isabella Russo

ఫాలోవర్లను కోల్పోతానేమోననే భయం

రూసో కూడా తను పాటించిన లైఫ్ స్టైల్ గురించి పూర్తిగా చెప్పలేనేమో అని అనుకున్నారు.

"చాలా సార్లు నేను నా సమస్యల గురించి, కఠినమైన డైట్ చేయడం మానేసిన రోజుల గురించి చెబితే ఫాలోవర్లు తగ్గిపోతారేమో అని భయపడ్డాను”, అని ఆమె చెప్పారు.

ఆమె ఆందోళన రోజు రోజుకీ పెరిగిపోవడం మొదలయింది.

రూసోకి రెండేళ్ల పాటు నెలసరి రాలేదు. కానీ, ఈ విషయం ఆమె డాక్టర్ తో చెప్పాలనుకోలేదు.

కానీ, 2019 లో జరిగిన ఒక స్కూటర్ ప్రమాదం ఆమెని తన శరీరం గురించి లోతుగా ఆలోచించేలా చేసింది.

ఆమె మోకాలిలో మూడు లిగ్మెంట్లు దెబ్బతిన్నాయి. "మొదటిసారి నా శరీరం 100 శాతం పని చేయకపోవడాన్ని గమనించాను", అని ఆమె చెప్పారు.

ఎవరి సహాయం లేకుండా నడవడానికి ఆమెకి కొన్ని నెలలు పట్టింది. గతంలోలా వ్యాయామం చేయడం కుదరకపోయినా తనని తాను కష్టపెట్టుకోకుండా ఆమె ఆరోగ్యంగా ఉండటం పట్ల ఆనందించడం మొదలు పెట్టారు.

"నేనెప్పుడూ ఆరోగ్యంగానే ఉన్నా ఆ విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని అర్ధమయింది. నేను ఉన్న దాని కంటే ఏదో భిన్నంగా అవ్వాలని ఆలోచించాను. ఈ స్వీయ అవగాహన రావడం పట్ల నేను ఆశ్చర్యానికి గురయ్యాను”, అని ఆమె అన్నారు.

హాని చేసే ఆహార అలవాట్లు

గత ఏడాది మే నెలలో, రూసోకి జరిగిన ప్రమాదం నుంచి కోలుకోవడానికి శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది. ఆ శస్త్ర చికిత్స తర్వాత ఆమె వయసుకి తగినట్లుగా ఆమె శరీరంలో ఎముకల పటిష్టత లేదని డాక్టర్ చెప్పారు.

" నేను వ్యాయామం చేయడం వలన ఇప్పుడు ఉన్న కంటే పటిష్టమైన ఎముకలు ఉండి ఉండాల్సిందని డాక్టర్ చెప్పారు. కానీ, అతిగా వ్యాయామం చేయడం వలన, కఠినమైన డైట్ పాటించడం వలన నా శరీరానికి బాగా హాని జరిగింది”, అని రుసో చెప్పారు.

ఆమె ఇప్పటికీ గతంలోలా వ్యాయామం చేయలేరు. కానీ, తేలికపాటి పనులు చేసుకోగలుగుతున్నందుకు ఆమె ఆనందంగా ఉన్నారు.

“ఇప్పుడు నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తగిన విధంగా కదిలేలా చేయడమే నా లక్ష్యం" అని ఆమె అన్నారు.

ఆమెకి ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె చాలా జాగ్రత్తగా అలోచించి ఆహారం తీసుకుంటున్నారు.

"నేను ఏది తినాలనుకుంటున్నానో అవన్నీ కడుపు నిండేవరకు తింటున్నాను, నాకు ఆరోగ్యకరమైన ఆహారం ఇష్టం. నాకు స్వీట్లు తినాలని ఉంటుంది. కానీ నన్ను నేను తినకుండా నియంత్రించుకోలేను. ఇప్పుడు ఆహారంతో నాకు ఆరోగ్యకరమైన సంబంధం ఉంది," అని ఆమె అన్నారు.

ఇసెబెల్లా

ఫొటో సోర్స్, Isabella Russo

ప్రజలకు సహాయం చేయాలని ఉంది.

ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ నిండా పరిపూర్ణమైన శరీరాకృతి సాధించడానికి సంబంధించిన పోస్టులు కాకుండా శరీరాన్ని సానుకూలంగా ఆమోదించుకోవడమెలాగో చెప్పే పోస్టులు ఉన్నాయి.

ఒక పోస్టులో , ఆమె ప్రమాదం నుంచి కోలుకోవడం గురించి రాస్తూ తన శరీరానికి క్షమాపణ చెప్పారు.

రూసో కొంత మంది ఫాలోవర్లను కోల్పోయారు. కానీ ఇప్పటికీ ఆమెకు 7,8000 ఫాలోవర్లు ఉన్నారు. “ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న సమాచారం ద్వారా నాలా ఆలోచిస్తున్న వారు నా అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం,” అని ఆమె అన్నారు.

ఇసబెల్లా

ఫొటో సోర్స్, Isabella Russo

గతంలో ఎన్నడూ లేనంతగా నేను నా శరీరంతో కలిసి ఆరోగ్యంగా జీవిస్తున్నానని అని ఆమె చెప్పారు.

"నన్ను నేను ఇప్పుడు బాగా అర్ధం చేసుకోగల్గుతున్నాను. నా శరీరం గురించి నేను ఇప్పటికీ జాగ్రత్త తీసుకుంటాను. అయితే, ఇప్పుడు గతంలోలా దాని మీద వ్యామోహం లేదు”, అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)