చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల్లో సాయిధరమ్ తేజ్.. ఫొటో షేర్ చేసిన చిరు - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/chiranajeevikonidela
రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని, చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారని 'సాక్షి' కథనం తెలిపింది.
''మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం అనంతరం కోలుకున్న సాయిధరమ్ తేజ్.. మీడియాకు కన్పించలేదు.
అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న సాయిధరమ్.. అటు తర్వాత నివాసానికే పరిమితమయ్యాడు.
కాగా, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు వచ్చాడు.
దీనిపై చిరంజీవి ట్విట్టర్లో స్పందించారు. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
'మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్ వేదికగా ఫోటోను పోస్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నార''ని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
'గోదావరి జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు నీరివ్వలేం'
ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం ఉభయగోదావరి జిల్లాల్లో ఈ రబీలో పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని జలవనరులశాఖ అంచనాకు వచ్చిందని 'ఈనాడు' కథనం రాసింది.
''రెండు జిల్లాల్లో మొత్తం 8.96 లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కోత పెట్టవలసిందేనని లెక్కలు కట్టారు.
డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకు గోదావరి, సీలేరు, బలిమెల తదితర చోట్ల ఉన్న నీటిని లెక్కలు కట్టి- సీలేరు జలవిద్యుత్తు కేంద్రం అధికారులను సంప్రదించి ఈ అంచనాకు వచ్చారు.
పోలవరం నుంచి కూడా కొంత నీరు తీసుకోవచ్చని అంచనాలు వేసిన తర్వాతే 2.50 లక్షల ఎకరాల వరకు కోత పెట్టాలన్నది లెక్క. పోలవరంలో నీళ్లు నిల్వ ఉంచితే ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతుందనుకుంటే సాగు విస్తీర్ణాన్ని మరింత తగ్గించాల్సి వస్తుందన్నారు.
ఈ విషయాలన్నింటిపై జలవనరులశాఖ ప్రభుత్వానికి నివేదించింది. నీటిపారుదల సలహామండలి సమావేశం ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాల తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సాగుచేస్తే నీళ్లందక రైతులు పెట్టుబడులు కోల్పోయే పరిస్థితులు వస్తాయని జలవనరులశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితుల్లో రబీ పంటకు సీలేరు నీరు ఇవ్వలేమని జెన్ కో అధికారులు జలవనరులశాఖ అధికారులకు లేఖ రాశారు.ఏటా విద్యుదుత్పత్తి చేస్తూనే అదనంగా 15-20 టీఎంసీలు గోదావరి రబీ సాగుకు నీరు ఇచ్చే సీలేరు పరీవాహకం ఈసారి ఆసరాగా నిలబడలేకపోతోంది. జనవరి తర్వాత విద్యుదుత్పత్తి కష్టమేనని జెన్ కో అధికారులు అంటున్నారు. సీలేరు అండ లేకపోతే రబీ కష్టాలు ఎక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.
పోలవరంలో స్పిల్ వే నిర్మించి గేట్లు ఏర్పాటుచేసి ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణంతో నీటిని క్రస్ట్ స్థాయికి నిలబెడుతున్నారు. కేంద్ర జలసంఘం అంచనాలు, హైడ్రాలజీ లెక్కల ప్రకారం పోలవరంలో ఆ స్థాయికి 23 టీఎంసీల వరకు నిల్వ ఉంటుందని అంచనా.
ఆ నీటిని నిల్వ చేసి రబీ సాగుకు వినియోగించుకోవాలంటే 15 టీఎంసీల వరకు తీసుకోవచ్చని గోదావరి డెల్టా జలవనరులశాఖ లెక్కించింది. పోలవరం నీటిని తీసుకోవడం ఇదే తొలిసారి కాబట్టి లెక్కలను కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు.
ఈ విషయంలో ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రబీ అవసరాలకు నీటిని నిలబెట్టాలనే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే 25 నుంచి 30 టీఎంసీల మేర గోదావరి రబీసాగుకు కొరత ఏర్పడుతుందని అధికారులు లెక్కకడుతున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖైరతాబాద్ సదర్‌లో గంటపాటు దున్నపోతు బీభత్సం
భారీ దున్నపోతులతో హైదరాబాద్ నగరానికి మాత్రమే ప్రత్యేకమైన సదర్ వేడుకలలో అపశృతి చోటుచేసుకుందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సెంటర్‌లో సదర్ వేడుకలలో ప్రదర్శించేందుకు ఒక దున్నపోతు బీభత్సం సృష్టించింది.
వేడుకలు జరిగే ప్రాంతంలో దున్నపోతుకు అలంకరణం చేస్తుండగా హోరెత్తిన డీజేల మ్యూజిక్, భారీ శబ్దాల హారన్‌లకు బెదిరిపోయి జనంపైకి ఆ దున్న దూసుకెళ్లింది.
దున్నపోతుకున్న తాడు ఆ ప్రదేశంలో వున్న ఓ స్కూటీకి చిక్కుకుని చాలా దూరం ఈడ్చుకెళ్ళింది. ఆ దున్నపోతు దాడిలో ముగ్గురు వాహనదారులకు గాయాలై పలు వాహనాలు ధ్వంసమైయ్యాయి.
దాదాపు గంటసేపు ఈ బీభత్సం కొనసాగగా చివరకు దున్నపోతును అతికష్టంమీద నిర్వాహకులు పట్టుకోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. సదర్ ఉత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/koppula eshwar
బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితబంధు ఇచ్చే దమ్ముందా?: కొప్పుల ఈశ్వర్
రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయించాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారని 'నమస్తే తెలంగాణ' వార్తాకథనం రాసింది.
''తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్న పథకాన్ని అమలు చేయాలని కొత్తగా డిమాండ్ చేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి పిచ్చి ముదిరి పాకాన పడిందని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీజేపీ నేతలు కాదా? అని నిలదీశారు.
ఇప్పుడు ఏ అర్హతతో ఆ పథకం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దళితబంధుపై బీజేపీ డ్రామాలు ఆపాలని డిమాండ్‌చేశారు. గత ఏడేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దళితుల కోసం చేసిన ఒక్క పనైనా చెప్పగలరా అని నిలదీశారు.
శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో దళితుల కోసం ఏ చేస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలోనే మొదటిసారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన దళితబంధు పథకం సంపూర్ణంగా అమలై తీరుతుందని స్పష్టం చేశార''ని ఆ కథనంలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- అర్ధరాత్రి మాయమైన చిన్నారిని ఎలా గుర్తించారు, ఆ రహస్యాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదు?
- కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువు
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
- అర్ధరాత్రి మాయమైన చిన్నారిని ఎలా గుర్తించారు, ఆ రహస్యాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదు?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- వాయు కాలుష్యాన్ని అత్యధికంగా సృష్టిస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










