టీమిండియా కెప్టెన్లలో ఎవరు బెస్ట్? విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, అజారుద్దీన్, కపిల్ దేవ్?

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, facebook/virat.kohli/IndianCricketTeam/

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటి. 1932లో ప్రపంచ క్రికెట్‌ వేదికపైకి అడుగుపెట్టినప్పటి నుంచి తాజా ప్రపంచకప్ వరకు టీమిండియాకు ఎందరో మేటి కెప్టెన్లు దిశానిర్దేశనం చేశారు.

వారి సారథ్యంలో భారత్ ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు తన ఖాతాలో వేసుకుని క్రికెట్‌కు పర్యాయపదంగా మారిపోయింది.

భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు నుంచి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి వరకు ప్రతీ ఒక్కరూ దేశ క్రికెట్ ఎదుగుదలలో తమదైన పాత్ర పోషించారు. మధ్యలో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని లాంటి క్రికెటర్లు, కెప్టెన్‌గా దేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు చేర్చారు.

కాగా, విరాట్ కోహ్లి కెప్టెన్సీ సామర్థ్యం గురించి ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతూనే ఉండటం చూస్తున్నాం.

మాజీ కెప్టెన్ల ఘనతలతో పోలుస్తూ కోహ్లిని నిందించే వారుండగా, దూకుడైన నాయకుడిగా 33 ఏళ్ల కోహ్లికి పట్టం కట్టేవారికీ కొదువ లేదు. శుక్రవారం కోహ్లి తన 33వ జన్మదినాన్ని జరుపుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్లలో కోహ్లి స్థానమెక్కడో చూద్దాం.

విరాట్ కోహ్లీ, ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లీ, ధోనీ

టీ20 ఫార్మాట్‌లో....

సంప్రదాయ క్రికెట్‌కు భిన్నంగా దూకుడే మంత్రంగా పుట్టుకొచ్చింది టీ20 ఫార్మాట్.

క్రికెట్‌లో ఈ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్‌కు పూర్తిస్థాయిలో కేవలం ఇద్దరు మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు. అందులో మొదటి కెప్టెన్ ధోని కాగా, రెండో కెప్టెన్ విరాట్ కోహ్లి.

వీరిద్దరే కాకుండా, కెప్టెన్ల గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు వీరేంద్ర సెహ్వాగ్ (1 మ్యాచ్), సురేశ్ రైనా (3 మ్యాచ్‌లు), అజింక్యా రహానే (2 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ (19 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ (3 మ్యాచ్‌లు) కూడా సారథ్యం వహించారు.

2007 నుంచి 2016 మధ్య కాలంలో ధోని 72 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 41 మ్యాచ్‌ల్లో గెలుపొందిన భారత్ 28 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ లెక్కన టీ20 ఫార్మాట్‌లో ధోని విజయాల శాతం 59.28గా ఉంది.

2017 నుంచి కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి విజయాల శాతం 63.04గా ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో కోహ్లి సారథ్యంలో 48 మ్యాచ్‌లాడిన భారత్ 28 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 16 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 2 మ్యాచ్‌లు టై కాగా, మరో 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

వన్డే ఫార్మాట్‌లో...

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌కు ఇప్పటివరకు 25 మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇందులో చాలామంది తాత్కాలిక కెప్టెన్‌ హోదాలో కొన్ని మ్యాచ్‌లకు సారథ్యం వహించారు.

వన్డేల్లో అత్యధికంగా 200 మ్యాచ్‌లకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించగా... గుండప్ప విశ్వనాథ్ (1981), సయ్యద్ కీర్మాణి (1983), మోహిందర్ అమర్ నాథ్ (1984), అనిల్ కుంబ్లే (2002) అత్యల్పంగా కేవలం ఒక మ్యాచ్‌కు మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించారు.

కెరీర్‌లో 30కి పైగా మ్యాచ్‌లకు సారథ్యం వహించిన వారి గణాంకాలను పరిశీలిస్తే... సునీల్ గావస్కర్ (1980-1985) ఓవరాల్‌గా 37 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు. ఇందులో 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 21 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఆయన విజయాల శాతం 40గా ఉంది.

భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్ దేవ్ (1982-1987) విజయాల శాతం 54.16గా ఉంది. ఆయన సారథ్యం వహించిన 74 మ్యాచ్‌ల్లో భారత్ 39 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 33 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. రెండింటిలో ఫలితం తేలలేదు.

మొహమ్మద్ అజహరుద్దీన్ (1990-1999) 174 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇందులో 90 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొంది, 76 మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా ఆయన విజయాల శాతం 54.16.

73 మ్యాచ్‌ల్లో భారత్‌కు సారథ్యం వహించిన సచిన్ టెండూల్కర్ (1996-2000) 35.07 శాతం విజయవంతం కాగా... సౌరవ్ గంగూలీ (1999-2005) 146 మ్యాచ్‌ల్లో, రాహుల్ ద్రవిడ్ (2000-2007) 79 మ్యాచ్‌ల్లో వరుసగా 53.90 శాతం, 56 శాతం విజయవంతమయ్యారు.

కెప్టెన్‌ కూల్‌గా ప్రసిద్ధి చెందిన ధోని (2007-2018) సారథ్యంలో భారత్ 110 మ్యాచ్‌ల్లో గెలుపొంది 74 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

ధోని సక్సెస్ రేట్ 59.52గా ఉండగా... ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి ఖాతాలో వీరందరి కన్నా అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. కోహ్లి విజయాల శాతం అందరి కంటే ఎక్కువగా 70.43గా ఉంది. కోహ్లి సారథ్యంలో భారత్ 65 మ్యాచ్‌ల్లో గెలిచి, 27 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, రెండింటిలో ఫలితం తేలలేదు.

విరాట్ కోహ్లి

ఫొటో సోర్స్, CHRISTOPHER LEE

టెస్టు ఫార్మాట్‌లో....

1932లో తొలి టెస్టు ఆడిన నాటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు 33 మంది సారథ్యం వహించారు. సంప్రదాయక ఫార్మాట్‌లోనూ విరాట్ కోహ్లి కెప్టెన్సీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.

2014 నుంచి టెస్టు జట్టు బాధ్యతలు స్వీకరించిన కోహ్లి 65 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో 38 టెస్టుల్లో గెలుపొందిన భారత్, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 11 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. ఇందులో కోహ్లి విజయాల శాతం అందరి కంటే అత్యుత్తమంగా 58.46గా ఉంది.

ఈ క్రమంలో కోహ్లి తర్వాత, 45 సక్సెస్ రేట్‌తో మహేంద్ర సింగ్ ధోని రెండో అత్యధిక విజయ శాతం కలిగి ఉన్నాడు. 2008-2014 వరకు ధోని సారథ్యంలో 60 మ్యాచ్‌లు ఆడిన భారత్ 27 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయి 15 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది.

2000-20005 మధ్య కాలంలో గంగూలీ నేతృత్వంలో 49 టెస్టులు ఆడిన భారత్ 21 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆయన విజయాల శాతం 42.85గా ఉండగా... అజహరుద్దీన్ (1990-1999) విజయాల శాతం 29.78 మాత్రమే. ఆయన కెప్టెన్సీ వహించిన 47 మ్యాచ్‌ల్లో భారత్ 14 మ్యాచ్‌ల్లో గెలిచి 14 మ్యాచ్‌ల్లో ఓడింది. 19 మ్యాచ్‌ల్ని డ్రాగా ముగించింది.

40కి పైగా మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన వారిలో సునీల్ గావస్కర్ (47 మ్యాచ్‌లు) 19.14, మన్సూర్ అలీఖాన్ పటౌడీ (40 మ్యాచ్‌లు) 22.5 విజయశాతాన్ని కలిగి ఉన్నారు.

వీడియో క్యాప్షన్, కపిల్ దేవ్: ప్రపంచ‌కప్ అందుకున్నాక ఏం చేశారు.. ధోనీ, కోహ్లి గురించి ఏమన్నారు?

34 మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించిన కపిల్‌దేవ్ విజయాలశాతం 11.76 మాత్రమే.

అన్ని ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా కోహ్లి రాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా కోహ్లి గెలుచుకోలేకపోయాడు. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీల్లో కీలక దశలో జట్టును నడిపించలేకపోతున్నాడనే అపవాదును ఎదుర్కొంటున్నాడు.

మరోవైపు ఐపీఎల్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతని కెప్టెన్సీ అంశం ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటుంది.

తాజా టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ సెమీఫైనల్ చేరడమే అనుమానంగా మారింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్‌ గత మ్యాచ్‌లో అఫ్గాన్‌పై గెలుపొందింది. లీగ్ దశలో మిగతా 2 మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలుపొందడంతో పాటు ఇతర జట్ల ప్రదర్శనలపై భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి టోర్నీ. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలపాలనుకున్న అతని ఆశలు ఏదో పెద్ద అద్భుతం జరిగితే తప్ప నెరవేరేలా లేవు.

వీడియో క్యాప్షన్, ఆఫ్ఘన్ క్రికెట్ లేటెస్ట్ సెన్సేషన్ రాషీద్ ఖాన్ స్పెషల్ ఇంటర్వ్యూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)