బంగ్లాదేశ్‌లో భారీగా పడిపోయిన వరి దిగుబడి.. దీని వల్ల భారత్‌కు మేలు జరుగుతుందా?

మోదీ, హసీనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శర్మ
    • హోదా, బీబీసీ హిందీ కోసం..

వరి ధాన్యంపై దిగుమతి సుంకాన్ని 62.5 నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్లు బంగ్లాదేశ్ ఆహార వ్యవహారాల శాఖ మంత్రి సధన్ చంద్ర మజుందార్ తెలిపారు.

దేశంలో వరి ధాన్యం నిల్వ, అందుబాటులను పెంచడంతోపాటు రికార్డు స్థాయికి పెరిగిన ధరలను తగ్గించడమే లక్ష్యంగా బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ నిర్ణయంతో భారత్‌కు భారీగా ప్రయోజనాలు చేకూరే అవకాశముంది. ప్రస్తుతం భారత్‌లో వరి దిగుబడులు అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా మంచి గిట్టుబాటు ధరకు వరి అందిస్తున్న భారత్... బంగ్లాదేశ్‌కు కూడా భారీగా వరిని ఎగుమతి చేసే అవకాశముంది.

మరోవైపు వరి దిగుమతులపై రెండు దేశాల ప్రభుత్వాలూ ఓ ఒప్పందం కుదుర్చుకునేందుకూ చర్చలు జరుపుతున్నాయి.

బంగ్లాదేశ్ వరి

ఫొటో సోర్స్, Sony Ramany/NurPhoto via Getty Images

వరదలతో అపార నష్టం

సాధారణంగా వరి ఉత్పత్తిలో మూడో స్థానంలో బంగ్లాదేశ్ ఉంటుంది. అయితే, నిల్వలు తగ్గిపోవడంతో స్థానిక మార్కెట్లలో ధరలు పెరగడంతో భారీగా వరిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

దీనికి ఇటీవల సంభవించిన వరదలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వరదల వల్ల చాలా పంట నష్టం సంభవించిందని వివరిస్తున్నారు.

వరి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. వీటి తర్వాత స్థానం బంగ్లాదేశ్‌దే.

బంగ్లాదేశ్‌లో ఏటా 36 మిలియన్ టన్నుల వరిని ఉత్పత్తి చేస్తారు.

బంగ్లాదేశ్ వరి

ఫొటో సోర్స్, DIPTENDU DUTTA/AFP via Getty Images

25 లక్షల టన్నుల దిగుమతికి ఒప్పందం

రాయిటర్స్ వార్తా సంస్థ వివరాల ప్రకారం.. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ద్వారా 1.5 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసేందుకు భారత్‌తో బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోంది.

గత మూడేళ్లలో రెండు ప్రభుత్వాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి.

ప్రపంచంలో అతిపెద్ద వరి ఎగుమతి దేశం భారతే. బంపర్ క్రాప్ రావడంతో ఈ సారి భారత్‌లో వరి నిల్వలు విపరీతంగా పెరిగాయి. దీంతో పరిమితికి మించి ఉండే నిల్వలను విక్రయించాలని భారత్ చూస్తోంది.

ఎగుమతుల విషయంలో ప్రధానంగా థాయిలాండ్, వియత్నాంల నుంచి భారత్‌కు పోటీ ఎదురవుతోంది. అయితే, ఆ రెండు దేశాల కంటే భారత్ భారీ రాయితీలకే బంగ్లాదేశ్‌కు వరిని అందించేందుకు ముందుకు వస్తోంది.

ఉప్పుడు బియ్యం టన్నుకు 407 డాలర్లు, సాధారణ బియ్యం టన్నుకు 417 డాలర్లకు భారత్ అందిస్తోందని వార్తలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్ వరి

ఫొటో సోర్స్, AFP

ఈ ధరలు థాయిలాండ్, వియత్నాం చెబుతున్న ధరల కంటే 33 శాతం వరకు తక్కువగా ఉన్నాయి.

మరోవైపు ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించేదుకు నాఫెడ్ సిద్ధంగా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

గత నెలలో 2.5 లక్షల టన్నుల ధాన్యం దిగుమతికి బంగ్లాదేశ్ ఐదు టెండర్లను ఆహ్వానించింది. వీటిలో భాగంగా లక్ష టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసేందుకు రెండు భారత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌కు చెందిన రీకా గ్లోబల్ ఇంపెక్స్ లిమిటెడ్ టన్నుకు 404.35 డాలర్లు చొప్పున 50,000 టన్నులు అందించేందుకు ఒక టెండర్ దక్కించుకుంది.

రెండో సంస్థ టన్నుకు 416 డాలర్లు చొప్పున 50,000 టన్నులు సరఫరా చేసేందుకు అంగీకారం కుదుర్చుకుంది.

మోదీ, హసీనా

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వాల మధ్య ఒప్పందం..

ఈ ఒప్పందాలతోపాటు నేరుగా ప్రభుత్వం నుంచి మరో 1.5 లక్షల టన్నుల వరి కొనుగోలుకు భారత్‌తో బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోంది.

వరిని దిగుమతి చేయాలనుకునే వారు జనవరి 10లోగా తమ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలని పత్రికా విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ ఆహార శాఖ మంత్రి సధన్ తెలిపారు.

‘‘బంగ్లాదేశ్‌లో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో పడిపోయింది. అందుకే ఈ స్థాయిలో వరిని దిగుమతి చేసుకుంటున్నారు’’అని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఏఐఆర్‌ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు.

‘‘అయితే ఇవన్నీ తాత్కాలిక పరిణామాలే. ఒకవేళ అక్కడ మళ్లీ పంట దిగుబడి బావుంటే.. దిగుమతులు పడిపోతాయి’’అని ఆయన వివరించారు.

‘‘ప్రభుత్వాల మధ్య ఒప్పందానికే బంగ్లాదేశ్ ఎక్కువ మొగ్గు చూపుతోంది. నాఫెడ్ లాంటి సంస్థల నుంచి దిగుమతిని వారు పరిశీలిస్తోంది. కానీ భారత్‌కు చెందిన చాలా ఎగుమతి సంస్థలు కూడా వరిని ఎగుమతి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎవరికి టెండర్లు దక్కుతాయో చూడాలి’’అని ఆయన అన్నారు.

హసీనా

ఫొటో సోర్స్, Reuters

50 శాతం పెరిగిన ధరలు

గతేడాదితో పోలిస్తే వరి ధరలు 47 శాతం వరకు పెరిగినట్లు ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (టీసీబీ) గణాంకాలు చెబుతున్నాయని ద ఢాకా ట్రైబ్యూన్ ఆఫ్ బంగ్లాదేశ్ తెలిపింది. మంచి బియ్యం ధరలు 19 శాతం వరకు పెరిగాయని పేర్కొంది.

మరోవైపు గతేడాదితో పోలిస్తే దిగుమతులు కూడా పది శాతం కంటే ఎక్కువగానే పడిపోయాయని బంగ్లాదేశ్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బీఆర్ఆర్ఐ) గణాంకాలు చెబుతున్నాయని ద ఢాకా ట్రైబ్యూన్ న్యూస్ తెలిపింది.

డిసెంబరు 17న బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో భారత ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశంలో కలిశారు. వరి ఎగుమతుల మధ్య రెండు దేశాలు ఒక అంగీకారం వచ్చేందుకు ఈ సమావేశం కీలకంగా మారిందని వార్తలు వచ్చాయి.

‘‘తమకు నిత్యవసర సరకులు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భారత్‌ దిగుమతి-ఎగుమతి విధానాల్లో ఎవైనా మార్పులు చేయాలని భావిస్తే.. ముందుగానే తెలియజేయాలని బంగ్లాదేశ్ కోరింది. భారత్ దీనిపై సానుకూలంగా స్పందించింది’’అని వర్చువల్ సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘గత కొన్నేళ్లుగా పొరుగునున్న దేశాలతో సంబంధాలపై భారత్ ఎక్కువ దృష్టి పెడుతూ వస్తోంది’’అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సౌత్ ఏసియాన్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ భరద్వాజ్ చెప్పారు.

ఇటీవల కాలంలో నేపాల్, మాల్దీవులు, శ్రీలంకల్లో విదేశాంగ శాఖ కార్యదర్శి పర్యటనలు ఈ కోవలోకే వస్తాయని ఆయన అన్నారు.

‘‘మరోవైపు మార్చి 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢాకాలో మోదీ పర్యటించబోతున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీల విషయంలో రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు దీని ద్వారా కొంతవరకు పరిష్కృతం అవుతాయి’’అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ వరి

రికార్డు స్థాయిలో ఎగుమతి

బాస్మతి యేతర వరి ఎగుమతులు భారత్‌లో ఈ సారి రికార్డు స్థాయిలో పెరగనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు 10 మిలియన్ టన్నుల వరకు ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 5 మిలియన్ టన్నులు, అంతకుముందు ఏడాది 80 లక్షల టన్నులుగా ఉన్నాయి.

గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 25 శాతం అధికంగా వరి దిగుబడులు వచ్చాయి. దీంతో నిల్వలు చాలావరకు పెరిగాయి.

‘‘అంతర్జాతీయంగా వరి ఎగుమతుల్లో థాయిలాండ్, వియత్నాంలకు భారత్ గట్టి పోటీ ఇస్తోంది. ఆ రెండు దేశాల కంటే దాదాపు టన్నుకు వంద డాలర్లు తక్కువకే వరిని ఎగుమతి చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఎగుమతులు పెరుగుతాయి’’అని వినోద్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)