సూర్య 'జై భీమ్' తెర వెనుక అసలు కథ ఏంటి? రియల్ హీరో ఎవరు?

- రచయిత, ఎ.డి.బాలసుబ్రమణ్యమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరులార్ వర్గానికి చెందిన రాసకణ్ణు అనే వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో అతడిని కొట్టి చంపారు. ప్రస్తుతం సూర్య నటించిన జై భీమ్ చిత్రం ఆ ఘటన ఆధారంగానే తెరకెక్కింది.
ఇది 1993లో కడలూర్ జిల్లాలోని కమ్మాపురం పోలీస్ స్టేషన్లో జరిగింది.
జై భీమ్ సినిమాలో గిరిజన సముదాయానికి చెందిన రాసకణ్ణు అనే ఒక వ్యక్తిని చూపించారు. అతడిని పోలీస్ స్టేషన్లో అన్యాయంగా దొంగతనం కేసులో ఇరికిస్తారు. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చివరికి అతడిని చంపేస్తారు. దీనిపై సినిమా కథంతా నడుస్తుంది.
ఈ సినిమాలో హీరో చంద్రును ఒక లాయర్‌గా చూపించారు. ఆయన రాసకణ్ణుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. నిజ జీవితంలో ఆ సమయంలో చంద్రు లాయర్‌గా ఉన్నారు. తర్వాత ఆయన చెన్నై హైకోర్ట్ న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. చంద్రు ఆ సమయంలో డబ్బులు తీసుకోకుండానే ఈ కేసును వాదించారు.
ట్రయల్ కోర్టులో చిదంబరంకు చెందిన లాయర్ వెంకటరమణ ఈ కేసును వాదించారు. ఈ కేసులో న్యాయం కోసం మొదటి నుంచి చివరి వరకూ పోరాడిన వారిలో సీపీఎంకు చెందిన ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
నిజ జీవిత కథలో రాసకణ్ణు భార్య పేరు పార్వతి. ఈ ఘటన తర్వాత ఆమె మొట్టమొదట గ్రామంలోని ఒక సీపీఎం కార్యకర్తను కలిశారు. ఆయన ఆ ఘటనను వెంటనే పార్టీ యూనియన్ సెక్రటరీ ఆర్.రాజమోహన్ దృష్టికి తీసుకొచ్చారు. గోవిందన్, రాజమోహన్ ఇద్దరూ ఈ కేసులో పార్వతికి న్యాయం లభించేవరకూ ఆమెకు అండగా నిలిచి పోరాడారు.
అప్పట్లో పార్టీ కడలూర్ జిల్లా సెక్రటరీ, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి అయిన కె.బాలకృష్ణన్ నేతృత్వంలో ఈ కేసులో పోరాడారు.
జై భీమ్ కథ ఇప్పుడు అందరినీ ఆకట్టుకోవడంతో బీబీసీ దీని వెనుక అసలు నిజాలు ఏంటో తెలుసుకోడానికి రాజమోహన్‌ను సంప్రదించింది. అప్పట్లో ఏమేం జరిగాయి. ఈ కథకు మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
1993లో జరిగిన ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను ఆయన బీబీసీతో పంచుకున్నారు.
"అప్పట్లో నేను సీపీఎం యూనియన్ సెక్రటరీగా ఉండేవాడిని. కడలూర్ జిల్లాలోని కమ్మాపురం దగ్గర చపలనాథమ్ మా ఊరు. 1993 మార్చి 20న గోపాలపురంలో కథిరవేలు ఇంట్లో 40 తులాల నగలు చోరీ అయ్యాయి. ఆ తర్వాత కమ్మాపురం పోలీసులు వచ్చారు. ఆ ఇంట్లో పనిచేయడానికి వచ్చే రాసకణ్ణు మీద తమకు అనుమానం ఉందన్నారు కథిరవేలు కుటుంబ సభ్యులు" అని రాజమోహన్ చెప్పారు.
మార్చి 20న పార్వతి ఇంటికి వచ్చిన పోలీసులు భర్త ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమెను హింసించారు. సాయంత్రం 6 గంటలకు కమ్మాపురం స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు లాఠీతో కొట్టారు. భర్త గురించి, దొంగిలించిన నగలు గురించి వివరాలు రాబట్టాలనే తాము కొట్టామని చెప్పారు.
పోలీసులు మొదట రాసకణ్ణు భార్య పార్వతి, ఆమె అన్నరత్నంను అరెస్ట్ చేశారు. వారంతా ఆ రాత్రి ఆ పోలీస్ స్టేషన్లోనే గడిపారు. తర్వాత రోజు ఊళ్లో వాళ్లు రాసకణ్ణును పట్టుకుని అప్పగించడంతో సాయంత్రం నాలుగు గంటలకు పోలీసులు అతడిని తమతో తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, ugc
పార్వతి, ఆమె పిల్లల్ని విడుదల చేసిన పోలీసులు రేపు నీ భర్తకు మాంసాహారం తీసుకురావాలని చెప్పారు. తర్వాత రోజు ఆమె భర్తకు అన్నం తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ కిటికీలోంచి చూసినపుడు భర్తను నగ్నంగా కట్టేసి కొడుతుండడం చూసింది. ఎందుకు కొడుతున్నారని అడిగినప్పుడు ఆ విషయం బయట చెప్పద్దని పోలీసులు ఆమెను బెదిరించారు.
22వ తేది పార్వతి తన భర్తను చూడ్డానికి పోలీస్ స్టేషనుకు వెళ్లినప్పుడు, అప్పటికే అతడిని పోలీసులు దారుణంగా కొట్టుండడం అమె చూశారు. రాసకణ్ణు ముఖం అంతా రక్తం ఉంది. తను నీళ్లు కూడా సరిగా తాగలేకపోతున్నాడు.
రక్తం కారుతున్న భర్తను ఆమె నీడలోకి తీసుకెళ్లారు. అతడు దాదాపు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. అసలు నడిచే స్థితిలోనే లేడు. నేలపై పడిపోయి ఉన్నాడు. అతడు నటిస్తున్నాడని పోలీసులు మళ్లీ కాళ్లతో తంతూ కొట్టారు.
"పార్వతి అప్పుడు భర్త కోసం మాత్రలు కొనుక్కుని వెళ్లారు. కానీ, రాసకణ్ణు వాటిని మింగలేకపోయాడు. కానీ, అతడు తమ కస్టడీలోనే ఉంటాడని, నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చని పోలీసులు ఆమెతో అన్నారు" అని రాజమోహన్ చెప్పారు.
సాయంత్రం 3 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి బయల్దేరిన పార్వతి.. ఊరు చేరుకునేసరికి ఆరు అయ్యింది. అప్పటికే, మీ ఆయన 4.15కు పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడని ఊళ్లోవాళ్లు ఆమెకు చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK
"దాంతో, పార్వతి అదే ఊళ్లో ఉన్న వామపక్ష నేత గోవిందన్‌కు తన భర్త విషయం చెప్పారు. అప్పట్లో ఫోన్లు లేకపోవడంతో గోవిందన్ ఆ రాత్రే చపలనాథమ్ వచ్చారు. ఆయన నాకు జరిగినదంతా చెప్పారు" అన్నారు రాజమోహన్.
తర్వాత రోజు 1993 మార్చి 22న మీన్సురుట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం దొరికింది. దానిపై కొట్టిన గాయాలున్నాయి. కళ్లు ఉబ్బిపోయున్నాయి. పక్కటెముకలు విరిగున్నాయి. తలపై కూడా కొట్టిన గాయాలున్నాయి. ఆ మృతదేహాన్ని గుర్తు తెలియని మృతదేహంగా భావించారు.
"23న ఉదయం నేను, గోవిందన్, పార్వతి, రత్నం కమ్మాపురం పోలీస్ స్టేషన్ వెళ్లాం, అక్కడ లాకప్ రూమ్‌లో నేలమీద, గోడల మీదంతా రక్తం ఉంది. బ్లో టార్చ్ వెలిగించిన గుర్తులు ఉన్నాయి. అప్పుడే నాకు సందేహం వచ్చింది. కానీ, మేం రాసకణ్ణు కోసం గాలిస్తున్నామని వాళ్లు మాకు చెప్పారు" అని రాజమోహన్ కూడా చెప్పారు.
మేం తిరిగి వస్తున్నప్పుడు నేను కుమారమంగళంలో వ్యాన్ నంబర్ TAF1269ను అడ్డుకున్నాను, అందులో వస్తున్న పోలీసులతో మాట్లాడాను. వాళ్లు కూడా రాసకణ్ణు కోసం వెతుకుతున్నామని చెప్పారు. "ఏదైనా మాట్లాడాలంటే, స్టేషన్‌కు వచ్చి మాట్లాడండి.. ఇక్కడ కాదు.. మేం వెళ్తున్నాం" అన్నారు.
ఆ సమయంలో అక్కడ ఎస్ఐ ఆంటోనీ సామి, హెడ్ కానిస్టేబుల్ వీరాసామి, కానిస్టేబుల్ రామసామి ఉన్నారు. వాళ్లు రాసకణ్ణు శవాన్ని ఎక్కడో రోడ్డు మీద పడేసి తిరిగి వస్తుంటారు. కానీ ఆ సమయానికి మాకు దాని గురించి ఏం తెలీదు.

ఫొటో సోర్స్, ugc
"మేం వృద్దాచలం వెళ్లాం. మా పార్టీ జిల్లా కార్యదర్శి బాలకృష్ణన్‌కు జరిగిదని చెప్పాం. ఆయన అదంతా మా రాష్ట్ర నాయకులకు చెప్పారు. వారు మాకు కడలూరు వెళ్లమని చెప్పారు. అప్పటి డీఎస్పీ మమ్మల్ని అప్పట్లో ఎస్పీగా ఉన్న ఎస్.ఆర్.జాంగిడ్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికి రాసకణ్ణు చనిపోయిన విషయం తెలీదు. ఆయన రాసకణ్ణు గురించి వెతుకుతామని మాకు మాటిచ్చారు.
‘‘ఆ తర్వాత పోలీసుల బెదిరింపులకు భయపడి పార్వతిని మా ఇట్లోనే ఉంచుకున్నామని వృద్ధాచలం పోలీస్ స్టేషన్ సీఐకు చెప్పాం, ఆప్పుడు ఆయన నాతో రాజీ కుదర్చుకోవడం గురించి మాట్లాడారు. ఈ కేసును వదిలేయాలని, ఏదైనా డబ్బు ఇప్పిస్తానని చెప్పారు. దాంతో రాసకణ్ణును చంపేశారనే నా అనుమానం నిజమైంది" అని రాజమోహన్ చెప్పారు.
ఒక్క రూపాయి కూడా తీసుకోని లాయర్.. చంద్రు..
ఒక రోజు ఆమెకు చెన్నైలో ఉన్న ఒక లాయర్ గురించి తెలిసింది. ఆయన మానవ హక్కుల కేసులు వాదించడానికి ఒక్క రూపాయి కూడా తీసుకోడనే విషయం విన్నారు. ఆయన్ను సాయం కోరారు. ఆయనే జస్టిస్ చంద్రు. సూర్య నటించిన ఆ పాత్రను జస్టిస్ కె. చంద్రు ఆధారంగానే తెరకెక్కించారు.
"జిల్లా అధికారుల ద్వారా న్యాయం లభించకపోవడంతో మేం పార్టీ సూచనలతో చెన్నై వెళ్లాం. జి.రామకృష్ణ అప్పటి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్నారు. ఆయన మాకు ఒక లేఖ ఇచ్చి, వకీలు చంద్రును కలవమని చెప్పారు. మేం హైకోర్టు దగ్గర చంద్రు ఆఫీసులో ఆయన్న కలవడానికి వెళ్లాం" అని రాజమోహన్ బీబీసీకి వివరించారు.
ఆ సమయంలో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న చంద్రు పార్వతికి సాయం చేయాలని నిర్ణయించారు.
ఆయన దీనిపై హెబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చని చెప్పారు. ఫీజు గురించి అడిగినపుడు.. పోలీసులకు ఇలాంటి కేసులు పెడితే ఏమవుతుందో తెలియాలని, తనకు డబ్బులేం వద్దని చెప్పారు. టైపింగ్ ఖర్చులైనా తీసుకోవాలని మేం ఆయన్ను అడిగితే చంద్రు నిరాకరించారు. చిత్రహింసలు పెట్టినందువల్లే రాసకణ్ణు నేరం అంగీకరించేలా చేశారని ఆయన వాదించారు.
"తర్వాత మేం కేసుకు అవసరమైన పత్రాలు సేకరించాం. తర్వాత ఆ కేసులో ఎస్ఐ సహా పోలీసులందరూ చెన్నై వెళ్లారు. వకీలు చంద్రును కలిశారు. రాజమోహన్, గోవిందన్‌తో మేం రాజీకి వచ్చినట్లు వారికి అబద్ధాలు చెప్పారు. అది తెలీగానే మేం మళ్లీ చెన్నై వెళ్లి లాయర్ చంద్రును కలిశాం. పోలీసులు చెప్పిందంతా అబద్ధమని మేం కేసు నుంచి తప్పుకోమని ఆయనకు చెప్పాం" అని రాజమోహన్ తెలిపారు.

ఫొటో సోర్స్, G.RAMAKRISHNAN / FACEBOOK
కేసులో కొత్త మలుపు
పోలీసులు రాసకణ్ణు సోదరిని కూడా హింసించారు. ఆమె బట్టలు కూడా చించేశారని వాంగ్మూలంలో గుర్తించారు. అక్కడి నుంచే భర్త కోసం పార్వతి పోరాటం మొదలయ్యింది. భర్త కనిపించలేదని పోలీసులు చెబుతుండడంతో ఆమె ఎంతోమంది ఉన్నతాధికారులను కలిశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఒంటరి పోరాటం చేశారు.
తర్వాత ఈ కేసులో తిరుప్పనందల్ దగ్గర బందనల్లూరులో ఉంటున్న రాసకణ్ణు సోదరి అచ్చి, ఆమె కొడుకు కుల్లన్, గోవిందరాజ్ అనే మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాసకణ్ణును ఉంచిన గదికి పక్కనే ఉన్న మరో గదిలో వారిని దారుణంగా కొట్టారు.
ఆ విషయం పార్వతికి తెలీదు. రాసకణ్ణు చనిపోయాడనే విషయం ఆ ముగ్గురికి కూడా తెలీదు. వాళ్లకు కొన్ని నెలల తర్వాత మొదటిసారి రాసకణ్ణు గురించి, అతడిన కొట్టిన విషయం కూడా తెలిసింది. మార్చి 22న సాయంత్రం ఒక్క గోవిందరాజన్ మాత్రమే రాసకణ్ణు శవాన్ని ఒక వాహనంలోకి ఎక్కించడం చూశారు.
కానీ, ఆయనకు కూడా అప్పుడు రాసకణ్ణు సజీవంగా ఉన్నాడో లేదో తెలీదు. తర్వాత, పార్వతి మాకు అచ్చి, మిగతా వారు జైలు నుంచి వచ్చారని చెప్పింది. దాంతో మేం వాళ్ల ఊరికి వెళ్లాం. వాళ్లను కలిసి మాట్లాడాం. అప్పుడే పోలీసులు కొడుకు కళ్ల ముందే అచ్చిని నగ్నంగా చేసి కొట్టినట్లు మాకు చెప్పారు. పోలీసులు కొట్టడంతో కుల్లన్ చెయ్యి విరిగిందన్నారు. మేం అదంతా చంద్రుకు వివరించాం.
నైవేలీకి చెందిన డాక్టర్ రామచంద్రన్ పోలీసులు పిలవడంతో రాసకణ్ణుకు వైద్య చికిత్స చేశానని సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో రాసకణ్ణు జైలు నుంచి పారిపోయాడనేదానికి బలం లభించింది. ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రు హైకోర్టులో వాదనలు వినిపించారు.
న్యాయమూర్తి చంద్రుతో సీబీసీఐడీ దర్యాప్తు సరిపోతుందని చెప్పడంతో. ఐజీ పెరుమాళ్ స్వామి నేతృత్వంలో సీబీసీఐడీ దర్యాప్తు జరిపించడానికి చంద్రు అంగీకరించారు. చివరికి, సీబీసీఐడీ దర్యాప్తు అధికారి వెంకుశా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలను బయటకు తీశారు.

ఫొటో సోర్స్, K.BALAKRISHNAN / FB
పోలీస్ స్టేషన్లో కొట్టడం వల్ల రాసకణ్ణు చనిపోయాడని, అతడి బాడీని ఎస్ఐ ఆంటోనీ సామి, మిగతా వారు ఒక వాహనంలో తీసుకెళ్లారని వెంకూశా గుర్తించారు. మీన్‌చరుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరువళ్లూర్-జయంకోడమ్ రోడ్డుపై వారు అతడి శవాన్ని పడేశారని, కానీ, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన గుర్తు తెలియని శవంగా భావించిన మీన్‌చరుత్తి పోలీసులు దానిని దహనం చేశారని ఆయన భావించారు.
గుర్తు తెలియని మృతదేహంగా భావిస్తున్న ఒక ఫొటోను పార్వతి తన భర్తదే అని గుర్తు పట్టారు. రాసకణ్ణు మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కానీ రాసకణ్ణు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని నిరూపితం కాలేదు.
ఆ తర్వాత ఈ కేసులో ఎస్ఐ ఆంటోనీ సామి, నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ రామచంద్రన్ సహా 12 మందిని అరెస్ట్ చేశారు.
హింస, వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఎదుర్కున్న ఐదుగురు పోలీసు అధికారులను సెషన్స్ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించడంపై రాష్ట్రంలో కలకలం రేపింది. ఒక విచారణ కమిటీని నియమించిన తమిళనాడు ప్రభుత్వం సెషన్స్ కోర్ట్ తీర్పుకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది.
చిదంబరం నుంచి ఆర్.వెంకటరమణ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. ఆయన కింది కోర్టు కంటే బలంగా కేసు వాదించారు. కేసును మొదట కడలూరు కోర్టులో విచారించిన తర్వాత వృద్ధాచలం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు.
పార్వతికి లక్ష రూపాయలు పరిహారం.. చంద్రుకు రూ.5 వేలు
2006లో రాసకణ్ణు హత్యకు కారణమైన పోలీసుల అధికారులను హైకోర్టు దోషులుగా నిర్ధరించింది. పోలీసు డైరీని తారుమారు చేశారని, నకిలీ పత్రాలు సృష్టించారని రుజువైంది.
ఈ కేసులో దోషులుగా తేలిన ఎస్ఐ ఆంటోనీ సామి సహా ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. ఎస్.ఐ. సుబ్రమణి సహా ఇద్దరికి ఐదేళ్లు, డాక్టర్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది. కేసును సీబీసీఐడీ హైకోర్టుకు తీసుకెళ్లింది. దోషులందరికీ శిక్ష కూడా అక్కడే విధించారు.
ఈ కేసులో రాసకణ్ణు భార్య పార్వతికి లక్ష రూపాయలు, అచ్చీ, కుల్లన్‌కు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల పరిహారం లభించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ మీద సమర్థంగా వాదనలు వినిపించిన లాయర్ చంద్రుకు 5 వేల రూపాయలు చెల్లించాలని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది అని రాజమోహన్ చెప్పారు.
ఈ కేసులో మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని బీబీసీ రాజమోహన్‌ను అడిగింది.
హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ కోసం చెన్నై వెళ్లినపుడు మేం చాలా సాదాసీదా లాడ్జిలో ఉన్నాం. మేం ఎక్కువ రోజులు అందులోనే ఉండాల్సి వచ్చింది. నేను మొత్తం రూ.4,300 ఖర్చు పెట్టాను. ఒకానొక దశలో లాడ్జికి చెల్లించేందుకు మా దగ్గర డబ్బులు కూడా లేవు. మరోవైపు ఆకలితో అలమటిస్తున్నాం. దీంతో గోవిందన్ తన కుటుంబానికి చెందిన నగలను అమ్మేశాడు. ఆ డబ్బులతో మేం మా ఖర్చులు తీర్చుకున్నాం. తనకు పరిహారం లభించిన తర్వాత మా ఖర్చులకు అయిన డబ్బును పార్వతి మాకు ఇస్తానంది. కానీ, మేం ఆ డబ్బును తీసుకోలేదు. ఈ కేసులో తీర్పు వచ్చిన తర్వాత, 39 ఏళ్ల వయసులో గోవిందన్ పెళ్లి చేసుకున్నాడు’’ అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పార్వతి చెన్నై నగరంలో తన కొడుకులతో కలసి జీవిస్తోంది. ఆమెను సంప్రదించేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
జస్టిస్ చంద్రు ఈ కేసుకు కేంద్రంగా నిలిచారు. పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేయడానికి ఆయన కేరళ నుంచి కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. చంద్రు లాయర్‌గా మాత్రమే కాదు, ఒక దర్యాప్తు ఏజెన్సీ చేయాల్సిన పనిని కూడా చేశారు.
ఇవి కూడా చదవండి:
- జిన్‌పింగ్ సన్నిహితుడు ‘లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేశారు’ - చైనా టెన్నిస్ స్టార్ ఆరోపణ
- గర్భిణులు ఏం తినాలి, ఎంత బరువు ఉండాలి? అపోహలు, వాస్తవాలు
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- COP26: ‘ఈ సదస్సు విఫలమైంది... ఇదో రెండు వారాల వేడుక’ - గ్రెటా థన్‌బర్గ్
- శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?
- COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్ఞను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














