తమిళనాడు: ‘కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారని’ ఇద్దరు దళితుల హత్య

దాడిలో గాయపడ్డ ఓ దళితుడు

దళితులు తమ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారని ఆగ్రహించిన అగ్ర కులస్తులు ఒక దళిత బస్తీపై దాడిచేసి ఇద్దరిని హతమార్చిన ఘటన తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగింది. ఈ కేసులో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు.

తిరుప్పాకడి సమీపంలోని కచ్చనాథం గ్రామం మీద ఈ నెల 28వ తేదీ రాత్రి జరిగిన ఈ దాడిలో షన్ముగం, ఆర్ముగం అనే ఇద్దరు దళితులు చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అంతకు రెండు రోజుల ముందు మే 26వ తేదీన ఆలయం వద్ద జరిగిన ఒక గొడవ ఈ దాడికి కారణంగా చెప్తున్నారు.

‘‘దళితులైన దేవేంద్రన్, ప్రభాకరన్‌లు ఆలయం వద్ద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉండగా.. అటువైపు వచ్చిన చంద్రకుమార్, ఆయన కుమారులు ఇద్దరు వారితో గొడవకు దిగారు’’ అని దాడి అనంతరం కచ్చనాథం గ్రామాన్ని సందర్శించిన ‘ఎవిడెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చెప్పారు.

ఆ గొడవలో స్థానికంగా ఆధిపత్యం ఉన్న కులస్థులు కొందరు తమను కులం పేరుతో దూషించారని దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన చంద్రకుమార్, ఆయన కుమారులు తమ అనుచరులను, సమీప గ్రామాల వారిని కొందరిని వెంటబెట్టుకుని వెళ్లి 28వ తేదీ (సోమవారం) రాత్రి దళిత బస్తీపై దాడి చేశారని పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో ఆర్ముగం అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన షన్ముగనాథన్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచారు.

తమిళనాడులో కుల వివక్ష అధికంగా కనిపించే.. వివక్షా పూరిత దాడులు ఎక్కువగా నమోదయ్యే జిల్లా శివగంగై.

ఈ దాడిలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ. 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)