ఫేస్‌బుక్- మెటావర్స్: నేను పదేళ్ల నుంచి ఒరిజినల్ మెటావర్స్ సెకండ్ లైఫ్‌‌లో జీవిస్తున్నా.. ఇక్కడ ఏం జరుగుతోందంటే..

సెకండ్ లైఫ్

ఫొటో సోర్స్, Linden Lab

    • రచయిత, జో టిడి
    • హోదా, బీబీసీ సైబర్ రిపోర్టర్

వర్చువల్ ప్రపంచం సెకండ్ లైఫ్‌లో నేను తొలిసారి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. ఇప్పుడు దిగ్గజ టెక్ కంపెనీలన్నీ ఆ ప్రపంచాన్ని నిర్మించడానికి పోటీపడుతున్నాయి. దాన్ని మెటావర్స్‌ అని పిలుస్తున్నారు.

1990లో 'స్నో క్రాష్' అనే ఒక సైన్స్ ఫిక్షన్ నవలలో మెటావర్స్ అనే పదం ఉపయోగించారు. ఇది ఇంటర్నెట్‌కు వర్చువల్ రియాలిటీ వారసుడిగా పని చేసింది. ఇందులో చాలామంది ప్రజలు తమ వర్చువల్ ప్రపంచంలో జీవించారు.

2000ల చివర్లో సెకండ్ లైఫ్‌ పీక్‌కు చేరింది. లక్షలాది మంది యూజర్లు పెరిగారు. జనం గంటల తరబడి వర్చువల్ ప్రపంచంలో డిజిటల్ జీవితం గడుపుతున్నారన్న వార్తలు హెడ్‌లైన్లలో నిలిచాయి.

ఆ తర్వాత ఇది మెల్లిగా కనుమరుగవుతుందని నేను అనుకున్నాను. కానీ నేను ఊహించింది తప్పు.

ఈ వేదిక చిన్నది. కానీ విశ్వసనీయ, వృద్ధికి అవకాశం ఉన్న కమ్యూనిటీ పెరుగుతోంది. వీరిని 'రెసిడెంట్స్' అని వాళ్లు తమను తాము పిలుచుకుంటారు. అందులోకి లాగిన్ అయి సరికొత్త అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. మెటావర్స్ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతోంది.

ఇక విజువల్స్ పరంగా చూస్తే మరీ అంత అద్భుతంగా ఏమీ ఉండదు.

ఇది రాబ్‌లాక్స్‌ గేమ్‌ను పోలి ఉంటుంది. అద్భుతమైన ఇమ్మెర్సీవ్ పరిసరాలతో నిర్మించిన బ్లాక్‌బస్టర్ వీడియో గేమ్‌లా ఉండదు. ఒక సాదాసీదా వర్చువల్‌ ప్రపంచంలా ఉంటుంది.

ఇక్కడ ఒక తేడా ఏంటంటే.. మార్క్ జుకర్‌బర్గ్ చెప్పిన మెటావర్స్ మాదిరిగా సెకండ్ లైఫ్ అనేది ఒక గేమ్ కాదు. ఇందులో గేమ్ చాలెంజ్‌లు ఏమీ ఉండవు. అన్వేషణలు, కథాంశాలు కూడా ఉండవు. సరదాగా కాసేపు గడిపే ఒక ప్రదేశం ఇది.

సెకండ్ లైఫ్

ఫొటో సోర్స్, Linden Lab

నేను రీ అనే ఒక రెసిడెంట్‌ను కలిశాను.

సముద్రం పక్కనే ఉన్న ఒక విచిత్రమైన 1960ల నాటి స్కాట్లాండ్ మత్య్సకార గ్రామంలోకి టెలిపోర్ట్ అయిన తర్వాత మా ఇద్దరి అవతార్‌లు అక్కడ తారసపడ్డాయి.

మెటావర్స్ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత గత నాలుగు నెలలుగా ఈ సెకండ్‌ లైఫ్‌లో గడుపుతున్నానని రీ నాతో చెప్పారు.

జుకర్‌బర్గ్ చెప్పిన మెటావర్స్‌ వర్షన్ రీకి పెద్దగా నచ్చలేదు.

అంతా నియంత్రించాలని వాళ్లు అనుకుంటున్నారు. కానీ ప్రజలకే ఆ బాధ్యత ఇవ్వాలి. అది పూర్తి ఓపెన్‌గా ఉండాలని ఆయన చెప్పారు.

మెటా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్‌ తన ప్రణాళికలను ప్రకటిస్తున్నప్పుడు ఇలాంటి ఆందోళనలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

"ఇది భవిష్యత్తు. ఇది ఒక కంపెనీ చేతిలో ఉండదు. అది మనందరి చేతిలో తయారవుతుంది" అని తన ఫేస్‌బుక్ కనెక్ట్ కీనోట్‌లో జుకర్‌బర్గ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్‌లో మీ సమాచారం ఏమవుతుంది?

మైక్రోసాఫ్ట్, ఎపిక్ గేమ్స్, రాబ్‌లాక్స్‌ చివరికి నైక్ వంటి ఇతర భారీ టెక్ సంస్థలు కూడా ఏదో ఒక రూపంలో ఈ మెటావర్స్ ప్రపంచంలో అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించాయి.

వర్చువల్ రెసిడెంట్ రీ మాదిరిగానే లిండెన్ ల్యాబ్‌ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆన్య కనెవ్‌స్కీ కూడా మెటావర్స్‌పై ‌గుత్తాధిపత్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ లైఫ్‌ వర్చువల్ గేమ్‌ను తయారు చేసింది లిండెన్ ల్యాబే.

ఆన్య 2003 నుంచి ఈ రంగంలో ఉన్నారు. ఈ రంగంలో వచ్చిన మార్పులను దగ్గరి నుంచి చూశారు. ఆన్‌లైన్‌ జీవితం గురించి ఇప్పుడు పెద్ద పెద్ద టెక్ కంపెనీలు మాట్లాడటం గురించి ఆమె ఆసక్తిగా గమనించారు.

ఇప్పుడు ఈ వర్చువల్ ప్రపంచం స్వభావం గురించి చెబుతున్న మాటలు వింటుంటే నాకు కాస్త ఆందోళనగా ఉందని ఆమె అన్నారు.

"ఈ రంగంలోకి పెద్ద సంస్థలు, భారీ టెక్ కంపెనీలు రావడమనేది.. దీనికి మీరు యజమానులు కాదని ప్రజలకు సంకేతాలు ఇస్తున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలను మరెవరో పెట్టబోతున్నారు. ఈ షోను నడిపించబోతున్నారు. జనం కేవలం వినియోగదారులు మాత్రమేననేలా సంకేతాలు ఇస్తున్నారు" అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

సెకండ్ లైఫ్

ఫొటో సోర్స్, Linden Lab

సెకండ్ లైఫ్‌ అనేది రాబ్‌లాక్స్‌ గేమ్‌లాగే ఉంటుంది. రాబ్‌లాక్స్‌ గేమ్‌లో యూజర్లు తమ పరిసరాలను నిర్మించుకోవచ్చు. ఆడుకునేందుకు ఇతరులను అక్కడికి ఆహ్వానించొచ్చు. కానీ రాబ్‌లాక్స్‌తో పోలిస్తే సెకండ్‌ లైఫ్‌లో యూజర్లు తక్కువగా ఉంటారు.

ఏకకాలంలో గరిష్టంగా 55 లక్షల మంది యూజర్లు ఆడిన రికార్డ్ రాబ్‌లాక్స్‌ పేరు మీద ఉంది. కానీ సెకండ్ లైఫ్‌లో ఏకకాలంలో ఆడే యూజర్ల సంఖ్య 90వేలే.

తన మెటావర్స్‌లో యూజర్ల కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇస్తామని మార్క్ జుకర్‌బర్గ్ చెబుతున్నారు. కానీ ఆయన దగ్గర డిజిటల్ రెసిడెంట్ ఇంకా ఒక్కరు కూడా లేరు.

ఆయన వర్చువల్ ప్రపంచాన్ని నిర్మించడానికి యూరప్ వ్యాప్తంగా పది వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఆయన చెప్పారు.

అయితే, యూజర్లకు ఎక్కువ నియంత్రణ ఇచ్చే ఉద్దేశం వాళ్లకు లేదని కొందరు వాదిస్తున్నారు. మెటావర్స్ అనేది కమ్యూనిటీలే పూర్తిగా నిర్మించాలని వారు చెబుతున్నారు.

మెటావర్స్‌ను నిర్మించడానికి బయలుదేరడమనేది నిజానికి మెటావర్స్‌ను ముగించడానికి ఉత్తమమైన మార్గం కాదని మెటాకు చెందిన వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ విభాగమైన ఓకులస్ కన్సల్టింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాన్ కార్‌మాక్ అభిప్రాయపడ్డారు.

ఒక అప్లికేషన్ అన్నింటిని స్వాధీనం చేసుకునే స్థాయికి చేరుతుందని అనుకోవడం లేదు. ఒక ప్లేయర్, ఒక కంపెనీ దీని కోసం అన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటుందని నేను భావించడం లేదు అని ఆయన చెప్పినట్లు Ars Technica వెబ్‌సైట్ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేని ఎన్నో దారుణాలను అక్కడ చూడాల్సి ఉంటుంది!

జుకర్‌బర్గ్, ఇతర కంపెనీలు సెకండ్ లైఫ్‌ కథ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.

సెకండ్ లైఫ్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దీనిపై మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చాయి. హైప్రొఫైల్ వర్చువల్ అల్లర్లు, ఇన్- గేమ్ కరెన్సీలో మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీములు, చైల్డ్ గ్రూమింగ్ సమస్యలతో వ్యతిరేక వార్తలు వచ్చాయి.

ఒక వారం పాటు చేసిన ఈ అన్వేషణలో.. మోడరేషన్‌లో సెకండ్ లైఫ్ ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను నేను చూశాను. మెటావర్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు మరింత పెరుగుతాయి.

పోర్న్, డ్రగ్స్ వంటి కొన్ని ప్రత్యేక కీ వర్డ్స్ సాయంతో ఈవెంట్స్ లేదా ప్రదేశాల గురించి సెర్చ్ చేయడాన్ని బ్లాక్ చేశారు.

అయితే, సెక్స్ అని సెర్చ్ చేసినప్పుడు నన్ను వర్చువల్ స్ట్రిప్ క్లబ్‌లోకి తీసుకెళ్లింది. అక్కడ డిజిటల్ ల్యాప్ డాన్సులు ఉన్నాయి. ఇన్ వరల్డ్ మనీతో వాటిని చూడొచ్చు.

వర్చువల్ ప్రపంచంలో వ్యవహారాలను చక్కబెట్టే విధానం అత్యంత సంక్లిష్టమైనదని కనెవ్‌స్కీ అన్నారు.

కొన్ని పనులను ఆటోమెటిక్ యంత్రాలకు అప్పగించొచ్చు. కానీ మనిషి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయి. తప్పించుకునే మనస్తత్వం, మంచి డ్రెస్సులు, అద్భుతమైన అవతార్‌లు మాత్రమే ఇందులో ఉండవు అని ఆమె అన్నారు.

ఇక తిరిగి సెకండ్ లైఫ్ దగ్గరికి వస్తే.. నేను లాగాఫ్ చెయ్యడానికి ముందు రీని ఒక ప్రశ్న అడిగాను. మళ్లీ మళ్లీ వర్చువల్ ప్రపంచంలోకి ఎందుకు వస్తున్నారని అడిగాను.

నా కళ్లతో కలలు కనడం నాకిష్టమని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)