COP26: గ్లాస్గో సదస్సులో కుదిరిన ఒప్పందంలోని 5 ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, Reuters
సుమారు రెండు వారాల చర్చల అనంతరం COP26 వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.
థర్మల్ విద్యుత్‌కు సంబంధించి పలు మార్పులను భారత్, చైనాలు చివరి నిమిషంలో కోరాయి.
గ్లాస్గోలో నిర్వహించిన ఈ సదస్సులో రూపొందించిన తుది ఒప్పందంపై 197 దేశాలు సంతకాలు చేశాయి.
భూతాపానికి ప్రధాన కారణం బొగ్గు వినియోగమేనని తేల్చిన సదస్సు రానున్న కాలంలో బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించే దిశగా పలు ప్రతిపాదనలు చేసింది.
బొగ్గును ఇంధన వనరుగా ఉపయోగించడం దశలవారీగా ఆపేయాలన్న ప్రతిపాదనపై భారత్, చైనాలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా చివర్లో దాన్ని మార్చి దశలవారీ తగ్గించే ప్రతిపాదనగా మార్చారు.
తమ పేదరిక నిర్మూలన లక్ష్యాలు, అభివృద్ధి అజెండాలను ఇంకా పూర్తిగా సాధించని వర్ధమాన దేశాలు బొగ్గు, శిలాజ ఇంధన సబ్సిడీలు ఆపేయడం ఎలా సాధ్యమవుతుందని భారత 'పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ' మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు.
వర్ధమాన దేశాలు 2025 నాటికి వాతావరణ లక్ష్యాలు చేరుకునేలా సహకరించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు అందించే నిధులు రెట్టింపు చేయాలని ఈ ఒప్పందంలో కోరారు.
కాగా, ఒప్పందంలో భాగంగా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లక్ష్యాలు సాధించే దిశగా కర్బన ఉద్గారాలు తగ్గించే చర్యలపై చర్చించేందుకు వచ్చే ఏడాది కూడా ప్రపంచ దేశాలు సమావేశం కానున్నాయి.
ప్రస్తుత ప్రతిపాదనలు కనుక అమలైతే భూతాపం 2.4 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి మాత్రమే పరిమితం చేయగలరు.
ఇవీ ప్రధానాంశాలు
* వాతావరణ మార్పుల నివారణ దిశగా చర్యలు చేపట్టేందుకు పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అందించే నిధులు రెట్టింపు కావాలి.
* 2030 నాటికి సాధించేలా దేశాలు విధించుకోవాల్సిన కర్బన ఉద్గార నివారణ లక్ష్యాలు వచ్చే ఏడాది నాటికి సమర్పించాలి.
* బొగ్గును ఇంధన వనరుగా ఉపయోగించడం తగ్గించడం, శిలాజ ఇంధనాలపై రాయితీలను తగ్గించడం
* వర్ధమాన దేశాలకు ఇస్తామన్న ఏడాదికి 10 వేల కోట్ల డాలర్ల కంటే ఇంకా ఎక్కువ ఇవ్వడం.
* ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల కలిగిన నష్టానికి పరిహారంగా డబ్బు ఇవ్వడమనే అంశంపై చర్చలు ఏర్పాటు చేయడం.

లోపాలేంటి..
ఒప్పందంలో ప్రధానం రెండు అంశాలు బలహీనంగా కనిపిస్తున్నాయి.
బొగ్గు వినియోగం దశలవారీగా ఆపేయడానికి బదులు తగ్గించడమనే ప్రతిపాదన బలహీనంగా ఉంది.
పేద దేశాలకు ధనిక దేశాలు అందించే సహాయం రెట్టింపు చేయాలన్న విషయంలోనూ కచ్చితమైన లక్ష్యాలేమీ పెట్టలేదు. పెంపుపై చర్చ మాత్రమే ఉంది.

సదస్సులో చేసిన ఇతర ప్రకటనలేంటి?
అమెరికా-చైనా సహకారం
వచ్చే దశాబ్దంలో వాతావరణ మార్పుల సమస్యలను ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటామని అమెరికా, చైనాలు ప్రతిజ్ఞ చేశాయి.
మీథేన్ ఉద్గారాలు, శుద్ధ ఇంధనాలకు మారడం, కర్బన ఉద్గారాల నియంత్రణ సహా అనేక అంశాలపై చర్యలు చేపడతామని, కలసి పనిచేస్తామని అమెరికా, చైనాలు సంయుక్త ప్రకటన చేశాయి.
అడవుల నరికివేత అరికట్టడం
2030 నాటికి అడవుల నరికివేతను అరికట్టేందుకు 100కి పైగా దేశాల నేతలు అంగీకరించారు. ప్రపంచంలోని 85 శాతానికి పైగా అడవులు వారి దేశాల్లోనే ఉన్నాయి.
కార్బన్ డై ఆక్సైడ్‌ను శోషించుకోవడంలో చెట్లు కీలకం కాబట్టి ఈ నేతల నిర్ణయం కీలకం.
మీథేన్ ఉద్గారాల నియంత్రణ
ప్రస్తుత మీథేన్ ఉద్గారాలలో 30 శాతానికిపైగా 2030 నాటికి తగ్గించే దిశగా చర్యలు చేపడతామని 100కి పైగా దేశాల నాయకులు ముందుకొచ్చారు.
అయితే, అధిక మీథేన్ ఉద్గారాలకు కారణమైన చైనా, రష్యా, భారత్‌లు దీనికి సమ్మతించలేదు.
బొగ్గు వినియోగం తగ్గించడానికి 40 దేశాల అంగీకారం
బొగ్గును ఎక్కువగా వినియోగించే పోలండ్, వియత్నాం, చిలీ సహా 40కిపైగా దేశాలు బొగ్గు వినియోగం తగ్గించడానికి అంగీకరించాయి.
భూతాపానికి బొగ్గు వినియోగమే ప్రధాన కారణమని తొలిసారి ఈ సదస్సులో ప్రపంచదేశాలు అంగీకరించాయి.
2019 నాటి లెక్కల ప్రకారం ప్రపంచ విద్యుదుత్పత్తిలో 37 శాతం వాటా థర్మల్ కేంద్రాలదే. బొగ్గుపై ఎక్కువగా ఆధారపడే అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, భారత్ వంటి ఇతర దేశాలు ఇంకా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు.
బొగ్గు వినియోగానికి సంబంధించి కాప్-26 ఒప్పందం పత్రంలో దశలవారీ నిర్మూలన అని ఉన్నచోట దశలవారీ తగ్గింపు అని మార్పించాయి భారత్, చైనాలు.
శుద్ధ ఇంధనాలకు ఆర్థిక సహకారం
శుద్ధ ఇంధన సాంకేతికతలకు సాయం చేయడానికి.. శిలాజ ఇంధనాలకు పూర్తిగా దూరం కావడానికి సిద్ధమైన దేశాలకు నేరుగా నిధులు అందించడానికి 450కిపై ఆర్థిక సంస్థలు అంగీకరించాయి.
ఇవి కూడా చదవండి:
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’
- శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











